వజ్రోత్సవాల సందర్భంగా సుప్రీంకోర్టు నిర్ణయం
సామరస్యంగా పరిష్కరిస్తే ఎనలేని తృప్తి: సీజేఐ
న్యూఢిల్లీ: వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి, తద్వారా పెండింగ్ భారాన్ని తగ్గించుకునేందుకు సుప్రీంకోర్టు సోమవారం ప్రత్యేక లోక్ అదాలత్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టులోని మొదటి ఏడు ధర్మాసనాలు మధ్యాహ్నం 2 గంటలకు కేసులను విచారిస్తాయి. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల సంబరాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వెల్లడించారు.
ప్రత్యేక లోక్ అదాలత్ వారం పాటు కొనసాగుతుందని తెలిపారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న కక్షిదారులు, లాయర్లు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడంలో కక్షిదారులకు సాయపడితే కలిగే తృప్తి వెల కట్టలేనిదని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారంలో లోక్ అదాలత్‌ల ప్రాధాన్యతకు సంబంధించి స్వీయానుభవాన్ని ఉదాహరించారు.
‘‘నా ముందుకు ఒక విడాకుల కేసు వచి్చంది. భార్య నుంచి విడాకులు కోరుతూ భర్త కింది కోర్టుకు వెళ్లాడు. అతడి నుంచి పరిహారం, పాప సంరక్షణ హక్కులు కోరుతూ భార్య కూడా కోర్టుకెక్కింది. వారితో సామరస్యపూర్వకంగా మాట్లాడిన మీదట మనసు మార్చుకున్నారు. కలిసుండేందుకు ఒప్పుకున్నారు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తామని చెబుతూ కేసులు వెనక్కు తీసుకున్నారు’’ అని వివరించారు. ఇలా లోక్ అదాలత్‌లు ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి! పైగా సోమవారం జరిగిన విచారణల కవరేజీ కోసం మీడియాను కోర్టు రూముల లోపలికి అనుమతించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment