99.90, 98.74, 98.88.. ఇవేమీ పరీక్షల్లో మార్కులు కాదు! | TGSLSA: Record number of cases are resolved every year | Sakshi
Sakshi News home page

99.90, 98.74, 98.88.. ఇవేమీ పరీక్షల్లో మార్కులు కాదు!

Published Fri, Nov 8 2024 8:34 AM | Last Updated on Fri, Nov 8 2024 8:43 AM

TGSLSA: Record number of cases are resolved every year
  • జాతీయ లోక్‌ అదాలత్‌ తొలి స్థానంలో టీజీఎస్‌ఎల్‌ఎస్‌ఏ
  • ప్రతీ యేటా రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారం
  • బాధితులకు çపరిహారం అందజేయడంలోనూ అగ్రగామి
  • 9న జాతీయ న్యాయసేవల ప్రాధికారిక దినోత్సవం

సాక్షి, హైదరాబాద్‌: 99.90, 98.74, 98.88.. ఇవి పదో తరగతి ఫలితాలో, ఇంటర్‌ ఫలితాలో కాదు. జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (టీజీఎస్‌ ఎల్‌ఎస్‌ఏ) సాధించిన రికార్డులు. వరుసగా ఒకటి, రెండో, మూడో జాతీయ లోక్‌ అదాలత్‌లలో దేశ వ్యాప్తంగా కేసుల పరిష్కారంలో నంబర్‌ వన్‌గా నిలిచింది. తెలంగాణకన్నా పెద్ద రాష్ట్రాలున్నా ఏటా రికార్డు స్థాయిలో కేసులను పరిష్కరిస్తూ మన్ననలు పొందుతోంది. కక్షిదారులకు పరిహారం చెల్లింపుల్లోనూ అగ్రగామిగా సేవలందిస్తోంది. 

ప్రజలకు ఉచిత న్యాయం, సత్వర న్యాయమే ధ్యేయంగా పనిచేస్తోంది. న్యాయస్థానాలకు ప్రత్యామ్నాయ పరిష్కార వేదికగా ఎదుగుతోంది. భవిష్యత్‌లో నూటికి నూరు శాతం కేసుల పరిష్కారమే కాకుండా.. గ్రామీణ ప్రజల వద్దకు చేరుకునేందుకు టీజీఎస్‌ ఎల్‌ఎస్‌ఏ ప్యాట్రన్‌ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, టీజీఎస్‌ ఎల్‌ఎస్‌ఏ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ నేతృత్వంలో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నెల 9న జాతీయ న్యాయ సేవల ప్రాధికారిక దినోత్సోవం సందర్భంగా ప్రత్యేక కథనం..

భారం లేకుండా పరిష్కారం
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏటా నాలుగుసార్లు జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తారు. ఈ ఏడాది సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌న్‌జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఆధ్వర్యంలో అదాలత్‌లు నిర్వహించారు. న్యాయపరమైన భారాన్ని తగ్గించి, కక్షిదారులకు సత్వర న్యాయం అందజేయడమే అదాలత్‌ల లక్ష్యం. ఇక్కడ ప్రీ లిటిగేషన్‌(ఇంకా కోర్టులో కేసు వేయనివి), పెండింగ్‌ (సివిల్, రాజీ పడదగిన క్రిమినల్‌) కేసులను కూడా పరిష్కరిస్తారు. వ్యాజ్యాలను సామరస్య పూర్వకంగా పరిష్కారించుకోవడానికి అదాలత్‌ ఓ చక్కని వేదిక. కోర్టుల్లో నమోదు కాని కేసులు, క్రిమినల్‌ కాంపౌండబుల్‌ నేరాలు, ట్రాఫిక్‌ చలా¯Œనాలు, రెవెన్యూ కేసులు, బ్యాంక్‌ రికవరీ కేసులు, మోటార్‌ ప్రమాద క్లెయిమ్‌లు, చెక్‌ బౌన్స్‌ కేసులతో సహా కోర్టుల ముందు పెండింగ్‌లో ఉన్న పలు కేసులు, కార్మిక, వివాహ వివాదాలు (విడాకుల కేసులు మినహా), భూ సేకరణ కేసులు, వినియోగదారుల విషయాలను పరిష్కరిస్తుంది.

ఆశ్రయించండి ఇలా.. 
ఉచిత, సత్వర న్యాయం కోసం మండల న్యాయ సేవాధికార సంఘం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలకు, హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. 040–23446723 లేదా టోల్‌ఫ్రీ నంబర్‌ 15100ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోగాని, వ్యక్తిగతంగాగానీ న్యాయ సాయం కోరవచ్చు.

ప్రత్యామ్నాయ పరిష్కార వేదిక 
లోక్‌ అదాలత్‌లలో కక్షిదారుల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందిస్తున్నాం. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికగా ఎదిగేందుకు చర్యలు చేపట్టాం. ప్రచార మాధ్య మాల ద్వారా అదాలత్‌పై విస్తృత మైన అవగాహన కల్పిస్తున్నాం. అలాగే జిల్లా, మండల స్థాయిల్లో లోక్‌ అదాలత్‌లను ఇంకా బలోపేతం చేస్తున్నాం. మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు మెరుగుపర్చ డానికి అథారిటీ ప్యాట్ర¯న్‌న్‌చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌న్‌జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ కృషి చేస్తున్నారు. వారి నేతృత్వం, సూచనలతో పెద్ద మొత్తంలో కేసుల పరిష్కారం సాధ్యమైంది. న్యాయమూర్తులు, లీగల్‌ సర్వీసెస్‌ సంస్థల సహకారంతో భవిష్యత్‌లో 100 శాతం కేసులు పరిష్కరిస్తాం. 
– సీహెచ్‌ పంచాక్షరి, సభ్యకార్యదర్శి, టీజీఎస్‌ఎల్‌ఎస్‌ఏ


ఉచిత న్యాయం ఎవరు కోరవచ్చు?
న్యాయసేవాధికార చట్టం 1987లోని సెక్షన్‌ 12 ప్రకారం.. ఎస్టీ, ఎస్సీ, మానవ అక్రమ రవాణా బాధితులు, మహిళలు, పిల్లలు, అంగవైకల్య బాధితులు, విపత్తు బాధితులు, జాతి వైషమ్యాలతో హింసకు గురైనవారు, కులం పేరుతో వేధింపులకు గురైన వారు అథారిటీ నుంచి ఉచిత న్యాయ సాయం పొందవచ్చు

లోక్‌ అదాలత్‌లలోని ప్రత్యేక సేవలు 
న్యాయవాదిని నియమించుకోలేని అర్హులైన వారికి న్యాయవాదిని ఏర్పాటు చేస్తుంది. 
పిటిషన్లు, అప్పీల్‌ వేసేందుకు ప్యానల్‌ లాయర్లు అందుబాటులో ఉంటారు. 
న్యాయపరమైన అంశాలపై సలహాలు, సూచలనలు కూడా ఇస్తారు. 
తీర్పులు, ఉత్తర్వులతో పాటు ఇతర అవసరమైన పత్రాలను ఉచితంగా అందిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement