Health tests
-
చెడు అలవాట్లతో 'మెదడుకు చేటు'..
సాక్షి, అమరావతి: ఆధునిక జీవనశైలి, దురలవాట్ల కారణంగా మెదడు సంబంధిత జబ్బుల బారినపడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారిలో వయోభారం, బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడం తదితర కారణాలతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుండేది. అయితే, ప్రస్తుతం నమోదవుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో 25–30 శాతం కేసుల్లో బాధితుల వయస్సు 20–45 ఏళ్ల లోపే ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ న్యూరాలజీ విభాగం వెల్లడించిన ఒక నివేదిక ప్రకారం ఏడాది కాలంలో 300 మంది స్ట్రోక్‌తో అడ్మిట్ కాగా.. 25 శాతం మంది 21–45 ఏళ్ల వయస్సు వారేనని తేలింది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటిమంది ఈ స్ట్రోక్ బారినపడుతుండగా, వీరిలో సగం మంది మృత్యువాత పడుతున్నారు. మిగిలిన వారు శాశ్వత వికలాంగులుగా మిగిలిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల వెల్లడించింది. దురలవాట్లతో చేటు..ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు మెదడుకు చేటుచేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ అలవాట్లను మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ కొందరిలో మాత్రం మార్పు రావడంలేదు. బ్రిటీష్ మెడికల్ జర్నల్ 2021లో వెల్లడించిన ఒక అధ్యయనం ప్రకారం.. ధూమపానం, మద్యపానం అలవాట్లున్న వ్యక్తులు బ్రెయిన్ స్ట్రోక్ బారినపడటానికి 80 శాతం ఎక్కువ అవకాశాలున్నాయి. గుండె జబ్బులకు దారితీసే ప్రధాన కారకాల్లో ధూమపానం ఒకటి. గుండెపోటు కేసుల్లో 25 శాతం వరకూ ఇదే ప్రధాన కారణంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే, పొగాకులోని నికోటిన్, విషతుల్యాలు రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీస్తాయి. దీంతో రక్తనాళ గోడల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి పూడిక ఏర్పడుతుంది. పూడిక చిట్లిపోతే హఠాత్తుగా రక్తం గడ్డకట్టి నాళం పూర్తిగా మూసుకుపోవచ్చు. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. అదే విధంగా మెదడు రక్తనాళాల్లో పూడికలతో స్ట్రోక్ సంభవిస్తుంది. ఏటా కేసుల పెరుగుదల..బ్రెయిన్ స్ట్రోక్, ఇతర న్యూరో సంబంధిత కేసులు ఏటా పెరుగుతున్నాయి. ఇందుకు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద అందించిన చికిత్సలే నిదర్శనంగా ఉంటున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద న్యూరో, న్యూరో సర్జరీ విభాగాల్లో చికిత్స పొందిన రోగుల సంఖ్య గడిచిన ఐదేళ్లలో ఏటా వృద్ధి చెందుతూ వచ్చింది. 2019–20లో 26,023 మంది చికిత్స పొందారు. 2022–23 నాటికి ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. ఆ ఏడాది 40 వేల మందికి ప్రభుత్వం ఉచితంగా చికిత్సలు అందించింది. ఇక 2023–24లోను చికిత్స పొందిన వారి సంఖ్య 40 వేలు దాటింది. యువతలో బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణాలు..⇒ బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడం.. ఊబకాయం ఉండటం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారిలో 25 శాతం మంది బీపీ, షుగర్‌తో బాధపడుతున్నారు.⇒ కొందరిలో బీపీ, షుగర్ సమస్యలు ఉన్నప్పటికీ సంబంధిత లక్షణాలు లేకపోవడంతో బయటకు తెలీడంలేదు. కానీ లోలోపల జరగాల్సిన నష్టం జరుగుతోంది.⇒ మహిళలు నెలసరిని వాయిదా వేయడం, అధిక రక్తస్రావాన్ని నియంత్రించుకోవడం కోసం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా మందులు వాడటం..⇒ ఊబకాయం కూడా బ్రెయిన్ స్ట్రోక్‌కు దారి తీస్తోంది. ⇒ శారీరక శ్రమ లేకపోవడం.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..⇒ రోజుకు 45 నిమిషాలు నడవాలి, ఇతర వ్యాయామాలు చేయాలి.⇒ ఆహారంలో 25 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, 25 శాతం పిండి పదార్థాలు, 20 శాతం ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్‌ను పూర్తిగా నియంత్రించాలి.⇒ శరీర బరువును నియంత్రించుకోవాలి. బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉంటే తరుచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.⇒ తీవ్ర ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలి. ఆరు గంటలు నిద్రపోవాలి.జీవనశైలి మార్పుపై దృష్టిపెట్టాలి..గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ మధ్య కాలంలో యంగ్ ఏజ్ స్ట్రోక్ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సాధారణంగా 55 ఏళ్లు పైబడిన వారిలోనే స్ట్రోక్ ఎక్కువగా వస్తుంది. అయితే, ప్రస్తుతం అందుకు భిన్నంగా కేసులు వస్తున్నాయి. 25 ఏళ్లు, అంతకంటే చిన్న వయస్సు వాళ్లు బ్రెయిన్ స్ట్రోక్ బారినపడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆధునిక జీవనశైలి. యువతలో కొందరు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు అలవాటుపడుతున్నారు. ఇది కొందరిలో వ్యసనంగా మారుతోంది. ఇలాంటి వారిలో ఐదేళ్ల అనంతరం స్ట్రోక్ రావడానికి అవకాశముంది. ఈ క్రమంలో ప్రజలు జీవనశైలి మార్పు చేసుకోవడంతో పాటు బీపీ, షుగర్, ఊబకాయం నియంత్రించుకోవడంపై దృష్టిపెట్టాలి. మరోవైపు.. స్ట్రోక్ బాధితులను గోల్డెన్ హవర్లో ఆస్పత్రికి తీసుకొస్తే ప్రాణాపాయం నుంచి రక్షించడానికి ఆస్కారం ఉంటుంది. – డాక్టర్ ఎన్. వెంకటసుందరాచారి, న్యూరాలజిస్ట్, మచిలీపట్నం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ -
తల్లీ బిడ్డలకు ఆరోగ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: రక్త హీనతను పూర్తి స్థాయిలో అరికట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు గర్భిణిలు, బాలింతలు, పిల్లలకు ప్రతి నెలా హిమోగ్లోబిన్ పరీక్షలు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జీవన శైలిలో మార్పుల కారణంగా వస్తున్న వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యాయామాల ఆవశ్యకతను వివరిస్తూ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం ప్రతి నెలా ఒకసారి క్యాంపు నిర్వహించేలా చూడాలన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ.. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి రక్తహీనత, పౌష్టికాహార లోపం బాధితులను గుర్తిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వారందరికీ పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మందులు ఇచ్చే బాధ్యతను ఆరోగ్యశాఖ తీసుకుంటుందని, పౌష్టికాహారం బాధ్యతను మహిళా, శిశు సంక్షేమ శాఖ చేపట్టాలని నిర్దేశించారు. ఈ విషయంలో ఆయా సచివాలయాల పరిధిలో వైద్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. తద్వారా గ్రామ స్థాయిలో రక్త హీనతను పూర్తిస్థాయిలో నివారించగలుగుతామన్నారు. తగ్గిందో లేదో పర్యవేక్షించాలి పౌష్టికాహారాన్ని తీసుకున్నాక బాధితుల్లో రక్తహీనత తగ్గుతోందా లేదా? అనే అంశంపై కూడా దృష్టి పెట్టాలి. ఇచ్చిన పౌష్టికాహారాన్ని వారు తీసుకుంటున్నారా? లేదా? అనే విషయాన్ని నిర్థారించుకోవాలి. సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారాన్ని అందిస్తున్న సమయంలోనే గర్భిణిలు, పిల్లలకు టీకాలు అందించారా? లేదా? అనే అంశాలను కూడా పర్యవేక్షించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఒకవేళ టీకాలు మిస్ అయితే వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సంబంధిత గ్రామానికి చెందిన ఏఎన్ఎం ఆ సమయంలో అక్కడే ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. యాప్‌లో వివరాలు నమోదు పిల్లలు తమ వయసుకు తగ్గట్టుగా బరువు ఉన్నారా? లేదా? అన్నదానిపై కూడా అక్కడే పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఎవరైనా పిల్లల్లో పౌష్టికాహారం లోపం ఉంటే వారిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు అయ్యేలా చూడాలన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించిన వెంటనే ఆ వివరాలను మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది దృష్టికి తెచ్చి పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. ఈ విషయంలో సచివాలయాల వారీగా వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. డ్రై రేషన్‌పై ప్రత్యేక దృష్టి వైఎస్సార్ సంపూర్ణ పోషణ అమలుపై సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమాన్ని అత్యంత నిశితంగా పర్యవేక్షించాలని నిర్దేశించారు. అంగన్వాడీలలో సూపర్ వైజరీ వ్యవస్ధ ఎలా పని చేస్తోందన్న దానిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, ఇందుకోసం బలమైన ఎస్‌వోపీని రూపొందించాలని సూచించారు. డ్రై రేషన్ పంపిణీపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఇప్పుడు అమలవుతున్న విధానంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, రేషన్ నాణ్యత విషయంలో ఎక్కడా లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. సమీక్షలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ అహ్మద్ బాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతుల కల్పన) కమిషనర్ కాటమనేని భాస్కర్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనర్ ఎం.జానకి, పౌరసరఫరాలశాఖ ఎండీ జి.వీరపాండియన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో ఆరోగ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలు విద్యార్థులకు మేలు చేస్తున్నాయి. విద్యార్థులకు ప్రతి వారం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు వారి ఆరోగ్య సమస్యల్ని గుర్తించి సత్వర చికిత్సను అందిస్తున్నారు. పేద పిల్లలు కావడంతో పోషకాహారం అందక రక్తహీనత వంటి సమస్యలతో బాధపడే వారిని గుర్తించి చికిత్సను అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ 185 గురుకులాల్లో విద్యార్థులకు ఎనీమియా, పోషకాహార లోపానికి సంబంధించిన వైద్య పరీక్షలు పూర్తి చేశారు. మరోవైపు విద్యార్థుల్లో పోషకాహార లోపం తలెత్తకుండా పోషక విలువతో కూడిన ప్రత్యేక మెనూను అమలు చేస్తున్నారు. దృష్టిలోపంతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. వైఎస్సార్ కంటి వెలుగు బృందాలతో ఇప్పటివరకు 91 గురుకులాల్లో నేత్ర పరీక్షలు నిర్వహించారు. వారిలో కంటి సమస్యలున్న వారిని గుర్తించి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. మిగిలిన గురుకులాల్లోనూ నేత్ర పరీక్షలను కొనసాగిస్తున్నారు. దంత సమస్యలను గుర్తించేందుకు ఇప్పటివరకూ 68 గురుకులాల్లో పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. మిగిలిన వాటిలోనూ దంత పరీక్షలు కొనసాగుతున్నాయి. కౌమార దశలోని బాలికలకు సమాజంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలపై అవగాహన కల్పించేలా ‘వాయిస్ ఫర్ గరల్స్ సంస్థ’ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాలకు చెందిన 800 మంది బాలికలకు ఇప్పటికే ఈ శిక్షణ పూర్తి చేశారు. విద్యార్థులలో మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి వీలుగా బోధన, బోధనేతర సిబ్బందికి ముంబైకి చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. గురుకులాల్లో విద్యతోపాటు వైద్యం.. పోషకాహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో గురుకులాల్లో చదివే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. పేద పిల్లల పెద్ద చదువులకు వారధిగా నిలుస్తున్న అంబేడ్కర్ గురుకులాల్లో విద్యతోపాటు వైద్యం, పోషకాహారం అందించేలా ప్రత్యేక దృష్టి సారించాం. ప్రధానంగా నేత్ర, దంత, పోషకాహార లోపం, రక్తహీనత, మానసిక వైద్య సేవలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆడ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారికి తగిన అవగాహన కల్పించి చైతన్యం తెచ్చేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
ఆర్టీసీ సిబ్బందిని కాపాడిన ఓ నిర్ణయం.. 280 మందికిపైగా తప్పిన ప్రాణాపాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)లో ఏటా మరణాలు అధికంగా నమోదవుతుండటాన్ని గుర్తించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వాటి నివారణ దిశగా తీసుకున్న ఓ నిర్ణయం ఏకంగా 280 మందికిపైగా సిబ్బందికి ప్రాణాపాయం తప్పించింది. మరే ప్రభుత్వ విభాగంలో లేనట్లుగా రెండు నెలల క్రితం ఆర్టీసీలో ‘హెల్త్ చాలెంజ్’ పేరుతో ఉద్యోగులకు 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 287 మంది తీవ్రమైన హృద్రోగ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తేలింది. రోజువారీ విధులకు హాజరవుతున్నప్పటికీ వారి గుండె పనితీరు బాగోలేదని, వారి పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. వెంటనే వారికి అత్యవసర వైద్య చికిత్సలు ప్రారంభించారు. సరిగ్గా మందులు వాడని ఇద్దరు మాత్రం మృత్యువాత పడగా మిగతా వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటంతో అపాయం నుంచి బయటపడ్డారు. ఇందులో డ్రైవర్లే ఎక్కువ మంది ఉన్నందున, వేల మంది ప్రయాణికులను గమ్యానికి చేర్చే డ్రైవర్లు ప్రమాదం నుంచి బయటపడటం ద్వారా పరోక్షంగా ప్రయాణికులకు కూడా ప్రమాదం తప్పినట్టయింది. ఆ మరణాలు అలాంటివే... ఆర్టీసీలో గత ఆర్థిక సంవత్సరం దాదాపు 225 మంది చనిపోయారు. ఇందులో 60 శాతం మంది గుండె సంబంధిత సమస్యలతోనే ప్రాణాలు వదిలారు. ఏటా సగటున ఆర్టీసీలో 200 మంది వరకు చనిపోతున్నారు. నాలుగేళ్ల క్రితం వరకు ఆ సంఖ్య గరిష్టంగా 180 ఉండగా ఆ తర్వాత అది క్రమంగా 200 దాటుతూ వస్తోంది. అప్పటివరకు డ్యూటీ చేసిన వారు ఉన్నట్టుండి నేలకూలుతున్నారు. తీవ్ర పని ఒత్తిడిలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు, ఇతర ఫీల్డ్ సిబ్బంది ఎక్కువగా చనిపోతున్నారు. దీన్ని గుర్తించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ఏకంగా 48 వేల మంది ఉద్యోగులకు డిపోలవారీగా ఓ ప్రైవేటు సంస్థ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించారు. హైబీపీతో బాధపడుతూ సరైన వైద్యం తీసుకోకపోవడం, మందులు సరిగ్గా వాడకపోవడంతో పరిస్థితి క్రిటికల్‌గా మారిన వారు, క్రిటికల్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నవారు, సమస్య ఇప్పుడిప్పుడే పెరుగుతున్నవారు, కొత్తగా ఆ సమస్య పరిధిలోకి వచ్చినవారు ఇలా ఏబీసీడీఈ అంటూ జాబితాలు రూపొందిస్తున్నారు. అందులో క్రిటికల్ ఈసీజీ జాబితాలో 287 మంది చేరారు. శరీరంలో సమస్య తీవ్రంగా ఉన్నట్టు ఆ ఉద్యోగులకు కూడా తెలియదు. రోజువారీ విధులకు హాజరవుతున్నారు. వారికి సంబంధించి కొందరి మెడికల్ హిస్టరీ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఉంది. కానీ దాన్ని ఫాలో అవుతున్నవారు లేరు. వారి పరిస్థితి అంత బాగోలేదని రిపోర్టులు స్పష్టం చేయటంతో వెంటనే నిమ్స్‌లో ఓ డాక్టర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. వారిలో సమస్య తీవ్రత దృష్ట్యా 60 మందికి యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. తీవ్ర సమస్య ఉన్న 25 మందికి వెంటనే స్టెంట్లు వేయించారు. ఇక 10 మంది మరింత క్రిటికల్‌గా ఉన్నట్లు తేల్చి అందులో ఇద్దరికి నిమ్స్‌లోనే తాజాగా ఓపెన్‌హార్ట్ సర్జరీ నిర్వహించారు. మరో ఇద్దరికి సర్జరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా వారికి తగిన చికిత్సలు అందిస్తున్నారు. మందులు వేసుకోకుండా నిర్లక్ష్యం.. ఇద్దరి మృతి.. ప్రమాదకరంగా ఉన్నవారిలో ఇద్దరు డ్రైవర్లు సరిగా మందులు వేసుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఇటీవల ఆ ఇద్దరు మృతి చెందారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎండీ సజ్జనార్ వెంటనే మిగతావారు మందులు సరిగా వేసుకునేలా చూడాల్సిన బాధ్యతను డిపో మేనేజర్లకు అప్పగించారు. ఇందుకోసం యాప్ ద్వారా అలర్ట్ మెసేజ్‌లు డీఎంలకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. వారికి చికిత్స అందిస్తున్న వైద్య కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు మందులు వాడుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే వెంటనే డీఎంకు మెసేజ్ వెళ్తుంది. ఆ మేరకు డీఎంలు వారితో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి మందులు వాడేలా చర్యలు తీసుకుంటారు. ఫలితంగా మిగతావారి ఆరోగ్యం కుదుటపడుతోంది. త్వరలో వీరంతా తిరిగి విధుల్లోకి వచ్చే పరిస్థితి తేనున్నట్టు వైద్యులు భరోసా ఇస్తున్నారు. నిమ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు.. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి, జిల్లాల్లోని డిస్పెన్సరీల్లో సిబ్బందికి చికిత్సలందిస్తున్నారు. నిమ్స్‌లోనూ వారికి ప్రత్యేకంగా బెడ్లు, ఓ డాక్టర్‌ను ఏర్పాటు చేశారు. స్టెంట్లు వేయడం, ఓపెన్ హార్ట్ సర్జరీలను నిమ్స్‌లో నిర్వహిస్తున్నారు. -
అందరికీ ఆరోగ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: మారుతున్న ఆహార అలవాట్లతో 40 ఏళ్లు నిండకుండానే జీవనశైలి జబ్బులు చుట్టుముడుతున్నాయి. వ్యాధి ముదిరిపోయే వరకు గుర్తించకపోవడంతో ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ముప్పుగా పరిణమించిన అసాంక్రమిక వ్యాధుల (ఎన్సీడీ) కట్టడిలో భాగంగా సార్వత్రిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మధుమేహం, రక్తపోటు, బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) సహా పలు రకాల స్క్రీనింగ్ పరీక్షలను ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి చేపడుతున్నారు. సగానికిపైగా స్క్రీనింగ్ పూర్తి రాష్ట్రవ్యాప్తంగా 4,66,67,774 మందికి స్క్రీనింగ్ చేపట్టాల్సి ఉండగా ఇప్పటికే 2,67,69,033 మందికి పూర్తయ్యింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 74.48% అనకాపల్లిలో 67.24%, నంద్యాలలో 66.72 శాతం జనాభాకు స్క్రీనింగ్ చేశారు. బీపీలో కోనసీమ టాప్ ఇప్పటివరకూ నిర్వహించిన సర్వేలో 11,92,104 మంది రక్తపోటుతో బాధ పడుతున్నట్టు గుర్తించారు. 8,93,904 మందికి మధుమేహం ఉన్నట్టు తేలింది. కోనసీమ జిల్లాలో అత్యధికంగా 99,376 మంది బీపీ బాధితులున్నారు. పశ్చిమ గోదావరిలో 81,072, ఏలూరులో 77,048, కాకినాడలో 75,640 మందికి హైపర్‌టెన్షన్ ఉన్నట్టు వెల్లడైంది. మధుమేహం బా«ధితులు అత్యధికంగా గుంటూరు జిల్లాలో 65,772 మంది ఉన్నారు. కోనసీమలో 63,012, కృష్ణాలో 61,935 మంది షుగర్‌తో బాధపడుతున్నారు. స్క్రీనింగ్ వివరాలతో ఐడీలు ఎన్సీడీ సర్వేలో గుర్తించిన అసాంక్రమిక వ్యా«ధుల బాధితులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వీరి కోసం పీహెచ్‌సీల్లో ఎన్సీడీ క్లినిక్‌లను సైతం వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది. ఎన్సీడీ స్క్రీనింగ్‌తో పాటు ప్రజలకు డిజిటల్ ఆరోగ్య ఐడీని ఆరోగ్య కార్యకర్తలు సిద్ధం చేస్తున్నారు. స్క్రీనింగ్‌లో వెల్లడైన ఆరోగ్య వివరాలను ఐడీ ద్వారా ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. చికిత్స కోసం ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ నమోదు చేయగానే సంబంధిత వ్యక్తి ఆరోగ్య చరిత్ర అంతా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ఆరోగ్య చరిత్రను పరిగణలోకి తీసుకుని వైద్యులు వేగంగా సరైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టారు. -
అరుదైన ప్రయోగం.. స్పేస్‌లోకి టిక్‌టాక్ స్టార్
కాలిఫోర్నియా: అమెరికన్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ అరుదైన ప్రయోగానికి రెడీ అయ్యింది. ఫ్లోరిడాకు చెందిన కెల్లీ గెరార్డియా అనే ఫేమస్ టిక్‌టాక్ స్టార్‌ను స్పేస్‌లోకి పంపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే రకరకాల పరీక్షల కోసమే ఈ స్పేస్ ఆపరేషన్ నిర్వహించబోతున్నట్లు వర్జిన్ గెలాక్టిక్ వెల్లడించింది. కొత్త హెల్త్‌కేర్ టెక్నాలజీని ఆమెపై ప్రయోగించడం ద్వారా వాటి సానుకూలతపై ఓ స్పష్టతకు వస్తామని ఒక ప్రకటనలో వర్జిన్ గెలాక్టిక్ పేర్కొంది. కాగా, గెరార్డియాకు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో బాగానే ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆమె బయోఆస్ట్రోనాటిక్స్ రీసెర్చర్ కావడం విశేషం. ఈ విషయాన్ని వర్జిన్ గెలాక్టిక్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 32 ఏళ్ల కెల్లీ.. పాపులర్ సైన్స్ కమ్యూనికేటర్ అని తెలిపింది. ఇక స్పేస్‌షిప్‌లో గాల్లో తేలియాడుతూనే కెల్లీ, ఆరోగ్యపరమైన ప్రతీ ప్రయోగంలో పాలుపంచుకోబోతున్నట్లు తెలిపింది. అయితే ఆమె ప్రాణాలకు వచ్చే హాని ఏం ఉండదని వర్జిన్ గెలాక్టిక్ పేర్కొంది. ఇక ఈ స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగం ద్వారా బయోమానిటరింగ్(లాంఛ్, వెయిట్‌లెస్‌నెస్, రీ ఎంట్రీ) కెపాసిటీని పరీక్షించబోతున్నట్లు సమాచారం. తద్వారా రాబోయే రోజుల్లో మానవ సహిత వర్జిన్ గెలాక్టిక్ స్పేస్‌షిప్ ప్రయోగాల సాధ్యాసాధ్యాలపై మరో అడుగు ముందుకు వేయనుంది. ఇక ఈ ప్రయోగంపై గెరార్డియా స్పందిస్తూ.. ‘తన ప్రయత్నం మరికొందరు యువ రీసెర్చర్లను ముందుకు తీసుకొస్తుందని’ ఆశాభావం వ్యక్తం చేసింది. బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్, అమెరికా రిటైర్డ్ ఏరోస్పేస్ ఇంజినీర్ బర్ట్ రూటన్ కలిసి స్థాపించిన వర్జిన్ గెలాక్టిక్.. వచ్చే ఏడాది నుంచి కమర్షియల్ సబ్-ఆర్బిటల్ ఫ్లైట్స్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలో ఏడాదికి 400 ట్రిప్పులను లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ఈ కంపెనీ తరపున ఇటీవలె రాకెట్ తరహా విమానం వీఎంఎన్ ఈవ్ ద్వారా ఇద్దరు పైలైట్లు స్పేస్‌లోకి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక వర్జిన్ గెలాక్టిక్ నుంచి స్పేస్‌లోకి వెళ్లేందుకు సెలబ్రిటీలతో సహా 600 మంది ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకోవడం విశేషం. -
ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల సమస్య తీరేదెప్పుడో?
సాక్షి, డెంకాడ(శ్రీకాకుళం): గ్రామస్థాయిలో వైద్య సేవలకు కేంద్రాలుగా ఉండే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత గూడు కరువైంది. అద్దె కొంపల్లో చాలీ చాలని స్థలంలో కేంద్రాలను నడుపుతున్నారు. కొన్నింటికి సొంత భవనాలు ఉన్నా అవి శిథిలావస్థకు చేరాయి. దీంతో గ్రామీణప్రాంతీయులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు. ముఖ్యంగా గర్భిణులు బాలింతలకు వైద్య సేవలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గర్భిణులు, బాలింతలకు ప్రతీ వారం వైద్య పరీక్షలు చేసే సమయంలో, చంటి పిల్లలకు వ్యాకిన్ వేసే సమయంలో అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల భవనాలు నిర్మించి చాలా కాలం కావటంతో అవి శిథిల దశకు చేరుకున్నాయి. గ్రామాలు పీహెచ్‌సీలకు దూరంగా ఉంటాయి. దీంతో గ్రామస్థాయిలో రోగులకు వైద్య సేవలు అందించేందుకు ఉండాల్సిన వసతి కూడా కరువైంది. వైద్య సిబ్బందికి కూడా అవస్థలు తప్పటం లేదు. డెంకాడ మండలం అక్కివరం, జొన్నాడ గ్రామాల్లో సబ్సెటర్ సెంటర్లకు సొంత భవనాలు ఉన్నాయి. వీటిలో జొన్నాడలో ఉన్న సబ్‌సెంటర్ భవనం శిథిల దశకు చేరింది. పూసపాటిరేగ మండలంలో ఉన్న రెండు భవనాలు కూడా పాడయ్యాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులకు నివేదించాం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత భవనాలు లేనివాటి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. ఆయా సబ్‌సెంటర్ల వారీగా వివరాలు ఇచ్చాం. దీనికి సంబంధించి స్థలం చూపితే మంజూరు చేస్తామంటున్నారు. – డాక్టర్ సత్యవాణి, డెంకాడ పీహెచ్సీ పంచాయతీ భవనంలోనే విధులు జొన్నాడలో సబ్‌సెంటర్ భవనం శిథిల దశకు చేరింది. పంచాయతీ భవనంలోనే వాక్సిన్లు వేస్తున్నారు. పంచాయతీ కార్యాలయంలో సా ధారణ పాలనాపరమైన పనులు ఉంటాయి. దీంతో ప్రజలు వస్తుంటారు. దీంతో గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. – కె.రమణి, జొన్నాడ -
వైద్యరంగంలో అద్భుతానికి భారత్ వేదిక
న్యూఢిల్లీ: బ్రెయిన్ డెడ్ రోగులు తిరిగి ప్రాణం పోసుకున్న సందర్భాలు ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేవు. అలాంటి రోగులపై వైద్య పరీక్షలు నిర్వహించడం పలు దేశాల్లో చట్ట విరుద్ధం, అనైతికం కూడా. అలాంటి రోగుల చచ్చిన మెదళ్లపై తాను ప్రయోగాలు నిర్వహించడమే కాకుండా, వారికి తిరిగి ప్రాణం పోస్తానని చెబుతున్నారు ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌కు చెందిన డాక్టర్ హిమాంషు బన్సల్. తనను తాను ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఇసాక్ న్యూటన్తో పోల్చుకునే డాక్టర్ బన్సల్ స్వతహాగా ఆర్థోపెడీషియన్. తన రివిటలైఫ్ సెన్సైస్ కంపెనీ తర ఫున వైద్య రంగంతో వినూత్న ప్రయోగాలు నిర్వహించడం ఆయనకు అలవాటే. బ్రెయిన్ డెడ్‌కు పునర్ ప్రాణంపోసే తన ప్రాజెక్టుకు డాక్టర్ బన్సల్ ‘రీ ఎనిమా ప్రాజెక్ట్’ అని పేరుకూడాపెట్టారు. ఈ ప్రాజెక్టు గురించి విన్న తోటి డాక్టర్లే నవ్వుతున్నారు. కొందరు ఇది వృధా ప్రయాస అని వాదిస్తుండగా, ఇది అనైతికమని మరికొందరు వాదిస్తున్నారు. ఈ ప్రాజెక్టు గురించి ఎన్ని విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా డాక్టర్ బన్సల్ తన ప్రయోగానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విషయంలో అమెరికాలోని బయోటెక్ సంస్థ బయోక్వార్క్తో ఒప్పందం కూడా చేసుకున్నారు. జన్యు కణాల చికిత్స, లేజర్ చికిత్సలతోపాటు నరాల్లో ఉత్ప్రేరణ కల్పించడం ద్వారా చచ్చిన మెదడుకు ప్రాణం తెప్పించేందుకు కృషి చేస్తున్నానని డాక్టర్ బన్సల్ తెలిపారు. బ్రెయిన్ డెడ్ రోగులపై ఇలాంటి ప్రయోగాలు నిర్వహించడం అమెరికాలో చట్ట విరుద్ధమే కాకుండా, అనైతికమని, భారత్‌లో ఇలాంటి ప్రయోగం నిర్వహించేందుకు తాము ముందుకు రావడానికి ఇదో కారణం కాగా, భారత్‌లో వైద్య ఖర్చులు తక్కువవడం మరో కారణమని అమెరికా బయోక్వార్క్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఒక్క రోగిపై ఈ ప్రయోగానికి అమెరికాలో ఆరేడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, అదే భారత్‌లోనైతే అందులో పదోవంతు ఖర్చు అవుతుందని వారు అంటున్నారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో బ్రెయిన్ డెడ్ రోగులు ఎక్కువగా ఉంటున్నారని, అందుకనే తన ప్రయోగానికి ఆ ఊరును ఎన్నుకున్నానని డాక్టర్ బన్సల్ తెలిపారు. తన ప్రయోగానికి ‘డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ అనుమతి ఉందని ఆయన చెబుతున్నారు. కేవలం డ్రగ్స్‌పై ప్రయోగాలకు మాత్రమే అనుమతి మంజూరుచేసే అధికారం కలిగిన ఈ సంస్థ డాక్టర్ బన్సల్ ప్రయోగానికి ఎలా అనుమతి ఇచ్చిందో అర్థంకాని విషయం. ఇదే విషయమై భారత వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్‌ను సంప్రదించగా తమకు ఇలాంటి ప్రయోగాలపై నియంత్రణాధికారాలు లేవని అన్నారు. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)యే ఏవైనా చర్యలు తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. తమకూ తగిన రెగ్యులేటరీ అధికారాలు లేవని ఇటీవల వైద్య కళాశాలల కేసు విషయంలోనే సుప్రీం కోర్టుకు విన్నవించుకున్న ఎంసీఐ ఈ విషయంలో చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం లేదు. ‘ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు. నేను బతికున్న మనుషులపై ప్రయోగాలు చేయడం లేదు. శ్మశానానికి వెళుతున్న బ్రెయిన్ డెడ్ రోగులపైనే ప్రయోగాలు చేస్తానంటున్నాను. మహా అంటే వారు శ్మశానానికి వెళ్లడం 15 రోజులు ఆలస్యం అవుతుంది. ప్రయోగం సక్సెస్ అయితే వైద్య చరిత్రలోనే అదో అద్భుతం అవుతుంది’ అని బన్సల్ వ్యాఖ్యానించారు. -
'బాబూ.. ఎందుకు ఈ నాటకాలు'
గుంటూరు: పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో వాదించిన మీకు చట్టంలో ఆ హామీ పెట్టారా లేదా అని చూసుకునే బాధ్యత లేదా అని బీజేపీ నేత వెంకయ్యనాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఒక వేళ చట్టంలో పెట్టకపోయినా.. నాటి వాదనల ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదా అని నిలదీశారు. నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరహార దీక్షకు మొత్తం రాష్ట్రం నుంచి మద్దతు లభిస్తోందని చెప్పారు. ప్రజల మద్దతుతోనే ప్రత్యేక హోదా ఆయన సాధిస్తారని చెప్పారు. ప్రజలంతా జగన్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం మాత్రం చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా, కబోది ముందు నాట్యం చేసినట్లుగా ఉందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాపై ఆరోపణలు చేస్తోందని, లక్ష కోట్లు పంపించామని చెప్తుందని అన్నారు. ఒక వేళ నిజంగానే లక్ష కోట్లు ఇస్తే ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతోపాటు వాటి వ్యయాల గురించి తెలియజేయాలని డిమాండ్ చేశారు. హుద్ హుద్ తుఫానుకు కేంద్రం సాయం అందిస్తే ఆ లెక్కలు ఇప్పటి వరకు చెప్పలేదని బీజేపీ నేత పురందేశ్వరి అంటున్నారని, ఆ వివరాలు కూడా తెలియజేయాలని కోరారు. ఈ లెక్కలు గట్టిగా కేంద్రం అడుగుతుందనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను కోరడం లేదా అని నిలదీశారు. ఇలా, బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దీక్ష కొనసాగిస్తే ఆరోగ్యం విషమిస్తుంది
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు. వైఎస్ జగన్ దీక్ష ఐదో రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం వైఎస్ జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మరోసారి 11 గంటల సమయంలో పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వైఎస్ జగన్ కేజిన్నర బరువు తగ్గి బాగా నీరసించిపోయారన్నారు. షుగర్ లెవల్స్ మరింత పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీక్ష కొనసాగిస్తే ఆరోగ్యం విషమించే ప్రమాదం ఉందని చెప్పారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తున్న నేపథ్యంలో ఇక నుంచి ప్రతి నాలుగు గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు వైద్యులు తెలిపారు. -
అద్దెగూడుల్లో అంగన్వాడీ కేంద్రాలు
♦ సొంత భవనాలు లేక అవస్థలు ♦ చిన్నారులకు ఆట స్థలం కరువు ♦ పట్టించుకోని అధికారులు పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పలు అంగన్వాడీ కేంద్రాలు ఇరుకు గదులు, అద్దె భవనాలతో కునారిల్లుతున్నాయి. మధ్యాహ్న భోజన సమయంలో గర్భిణులు, చిన్నారులు వచ్చినప్పుడు చిన్న చిన్న గదుల్లో కేంద్రాల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. అంతేగాక సాయంత్రం పూట పిల్లలు ఆడుకునేందుకు తగినంత ఖాళీ స్థలం లేక ఉన్న గదుల్లోనే ఆటలాడుకోవాల్సిన పరిస్థితి. మార్కాపురం : ప్రధానంగా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య పరీక్షలు, పోషణ, ఆరోగ్య విద్య, పోషకాహారంపై అవగాహన కల్పించడం, బాలింతలకు ఆరోగ్య పరీక్షలు, పోషకాహారం పంపిణీ, మూడేళ్ల లోపు పిల్లలకు పెరుగుదల పర్యవేక్షణ, పిల్లల తల్లులకు కౌన్సెలింగ్, పోషకాహారం పంపిణీలు చేపడుతున్నాయి. మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం పట్టణం, రూరల్, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాల్లో 357అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు 11వేల మంది చిన్నారులు కేంద్రాలకు వస్తున్నారు. మార్కాపురం పట్టణంలో 80కేంద్రాల్లో సుమారు వెయ్యి మంది చిన్నారులు, రూరల్‌లో 77కేంద్రాల్లో 3,900మంది చిన్నారులు ఉన్నారు. మార్కాపురం రూరల్ ప్రాజెక్టు పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గంలోని మార్కాపురం, పెద్దారవీడు, పెద్దదోర్నాల మండలాల్లో 201 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు గూడేల్లో 24మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 225అంగన్వాడీ కేంద్రాల్లో 74కేంద్రాలకు మాత్రమే భవనాలు ఉండగా 151అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవు. కొన్ని గ్రామాల్లో చిన్న గదుల్లో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. సొంత భవనాలు లేవు.. మార్కాపురం మండలంలోని కొట్టాలపల్లె, చింతగుంట్ల, నికరంపల్లె, మొద్దులపల్లె, రాయవరం, కందివారిపల్లె, పెద్దారవీడు మండల ంలోని దేవరాజుగట్టు, రామాయపాలెం, కలనూతల, పెద్దదోర్నాల మండలంలోని రామచంద్రకోట, అగ్రహారం, కటకానిపల్లె, హసనాబాద్, తదితర గ్రామాల్లోని పలు అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవు. ప్రతి నెల ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు రూ.750లు అద్దె చెల్లిస్తుంది. అయితే గ్రామాల్లో సరైన వసతులతో కూడిన భవనాలు లేవు. మార్కాపురం పట్టణంలోని పలు కేంద్రాలకు కూడా సొంత భవనాలు లేవు. చిన్న చిన్న గదుల్లో కేంద్రాలు నడుస్తున్నాయి. మధ్యాహ్న భోజన సమయంలో గర్భిణులు, చిన్నారులు వచ్చినప్పుడు చిన్న చిన్న గదుల్లో కేంద్రాల నిర్వహణ కష్టంగా మారింది. సాయంత్రం వేళల్లో పిల్లలు ఆడుకునేందుకు తగినంత ఖాళీ స్థలం కూడా లేదు. స్థలం ఇస్తే భవనాలు నిర్మించుకుంటాం - రమీజాభాను, రూరల్ సీడీపీవో అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం స్థలం ఇస్తే సొంత భవనాలు కట్టుకుంటాం. స్థలాలు కావాలని ఆయా మండలాల తహశీల్దార్లకు వినతి పత్రాలు అందించాం. చింతగుంట్ల అంగన్వాడీ కేంద్రంలో 40మంది చిన్నారులు ఉండగా, చిన్న రేకులషెడ్ మాత్రమే ఉంది. కొన్ని గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చిన స్థలాలు పలువురు ఆక్రమించారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదు. -
ఐజీఐలో ఆరోగ్య పరీక్షలు జరపాలి: బీజేపీ
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ విమానాశ్రయం (ఐజీఐ)లో దిగే ఆరోగ్య పరీక్షలు జరిగేవిధంగా చూడాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ... లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కోరారు. ఆఫ్రికాలో ఈ వ్యాధి విజృంభించిన నేపథ్యంలో తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరృకు ఆయన ఎల్జీకి ఓ లేఖ రాశారు. వర్షాకాలం అయినందువల్ల నగరవాసులకు అంటువ్యాధులు సోకకుండా తగు చర్యలు తీసుకోవాలంటూ ఆయా కార్పొరేషన్లను ఆదేశించాలని కూడా సదరు లేఖలో కోరారు. అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ చేయాలన్నారు. లేకపోతే నగరవాసులు అంటువ్యాధులబారినపడే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇదిలాఉంచితే ఎబోలా వ్యాధిబారినపడి నగరానికి వచ్చిన ముగ్గురు నైజీరియన్లకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ రూం (ఎన్సీడీసీ)లో పరీక్షలు చేశారు. అనంతరం రాంమనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఎన్సీడీసీ పేర్కొంది. ఇదిలాఉండగా నైజీరియా వెళ్లి తిరిగి వచ్చిన 32 ఏళ్ల చత్తీస్‌గఢ్ వాసికి కూడా పరీక్షలు చేశామని సదరు ప్రకనటలో ఎన్సీడీసీ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,127 మంది ఈ వ్యాధిబారినపడగా అందులో 1,145 మంది చ నిపోయారు.