అద్దెగూడుల్లో అంగన్‌వాడీ కేంద్రాలు
♦ సొంత భవనాలు లేక అవస్థలు
♦ చిన్నారులకు ఆట స్థలం కరువు
♦ పట్టించుకోని అధికారులు
పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పలు అంగన్‌వాడీ కేంద్రాలు ఇరుకు గదులు, అద్దె భవనాలతో కునారిల్లుతున్నాయి. మధ్యాహ్న భోజన సమయంలో గర్భిణులు, చిన్నారులు వచ్చినప్పుడు చిన్న చిన్న గదుల్లో కేంద్రాల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. అంతేగాక సాయంత్రం పూట పిల్లలు ఆడుకునేందుకు తగినంత ఖాళీ స్థలం లేక ఉన్న గదుల్లోనే ఆటలాడుకోవాల్సిన పరిస్థితి.
మార్కాపురం : ప్రధానంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య పరీక్షలు, పోషణ, ఆరోగ్య విద్య, పోషకాహారంపై అవగాహన కల్పించడం, బాలింతలకు ఆరోగ్య పరీక్షలు, పోషకాహారం పంపిణీ, మూడేళ్ల లోపు పిల్లలకు పెరుగుదల పర్యవేక్షణ, పిల్లల తల్లులకు కౌన్సెలింగ్, పోషకాహారం పంపిణీలు చేపడుతున్నాయి. మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం పట్టణం, రూరల్, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాల్లో 357అంగన్‌వాడీ కేంద్రాల్లో సుమారు 11వేల మంది చిన్నారులు కేంద్రాలకు వస్తున్నారు. మార్కాపురం పట్టణంలో 80కేంద్రాల్లో సుమారు వెయ్యి మంది చిన్నారులు, రూరల్‌లో 77కేంద్రాల్లో 3,900మంది చిన్నారులు ఉన్నారు.
మార్కాపురం రూరల్ ప్రాజెక్టు పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గంలోని మార్కాపురం, పెద్దారవీడు, పెద్దదోర్నాల మండలాల్లో 201 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు గూడేల్లో 24మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 225అంగన్‌వాడీ కేంద్రాల్లో 74కేంద్రాలకు మాత్రమే భవనాలు ఉండగా 151అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవు. కొన్ని గ్రామాల్లో చిన్న గదుల్లో అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు.
సొంత భవనాలు లేవు..
మార్కాపురం మండలంలోని కొట్టాలపల్లె, చింతగుంట్ల, నికరంపల్లె, మొద్దులపల్లె, రాయవరం, కందివారిపల్లె, పెద్దారవీడు మండల ంలోని దేవరాజుగట్టు, రామాయపాలెం, కలనూతల, పెద్దదోర్నాల మండలంలోని రామచంద్రకోట, అగ్రహారం, కటకానిపల్లె, హసనాబాద్, తదితర గ్రామాల్లోని పలు అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవు. ప్రతి నెల ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.750లు అద్దె చెల్లిస్తుంది. అయితే గ్రామాల్లో సరైన వసతులతో కూడిన భవనాలు లేవు. మార్కాపురం పట్టణంలోని పలు కేంద్రాలకు కూడా సొంత భవనాలు లేవు. చిన్న చిన్న గదుల్లో కేంద్రాలు నడుస్తున్నాయి. మధ్యాహ్న భోజన సమయంలో గర్భిణులు, చిన్నారులు వచ్చినప్పుడు చిన్న చిన్న గదుల్లో కేంద్రాల నిర్వహణ కష్టంగా మారింది. సాయంత్రం వేళల్లో పిల్లలు ఆడుకునేందుకు తగినంత ఖాళీ స్థలం కూడా లేదు.
స్థలం ఇస్తే భవనాలు నిర్మించుకుంటాం - రమీజాభాను, రూరల్ సీడీపీవో
అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం స్థలం ఇస్తే సొంత భవనాలు కట్టుకుంటాం. స్థలాలు కావాలని ఆయా మండలాల తహశీల్దార్లకు వినతి పత్రాలు అందించాం. చింతగుంట్ల అంగన్‌వాడీ కేంద్రంలో 40మంది చిన్నారులు ఉండగా, చిన్న రేకులషెడ్ మాత్రమే ఉంది. కొన్ని గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు ఇచ్చిన స్థలాలు పలువురు ఆక్రమించారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదు.