గుంటూరు: పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో వాదించిన మీకు చట్టంలో ఆ హామీ పెట్టారా లేదా అని చూసుకునే బాధ్యత లేదా అని బీజేపీ నేత వెంకయ్యనాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఒక వేళ చట్టంలో పెట్టకపోయినా.. నాటి వాదనల ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదా అని నిలదీశారు. నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరహార దీక్షకు మొత్తం రాష్ట్రం నుంచి మద్దతు లభిస్తోందని చెప్పారు. ప్రజల మద్దతుతోనే ప్రత్యేక హోదా ఆయన సాధిస్తారని చెప్పారు.
ప్రజలంతా జగన్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం మాత్రం చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా, కబోది ముందు నాట్యం చేసినట్లుగా ఉందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాపై ఆరోపణలు చేస్తోందని, లక్ష కోట్లు పంపించామని చెప్తుందని అన్నారు. ఒక వేళ నిజంగానే లక్ష కోట్లు ఇస్తే ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతోపాటు వాటి వ్యయాల గురించి తెలియజేయాలని డిమాండ్ చేశారు.
హుద్ హుద్ తుఫానుకు కేంద్రం సాయం అందిస్తే ఆ లెక్కలు ఇప్పటి వరకు చెప్పలేదని బీజేపీ నేత పురందేశ్వరి అంటున్నారని, ఆ వివరాలు కూడా తెలియజేయాలని కోరారు. ఈ లెక్కలు గట్టిగా కేంద్రం అడుగుతుందనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను కోరడం లేదా అని నిలదీశారు. ఇలా, బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'బాబూ.. ఎందుకు ఈ నాటకాలు'
Published Sun, Oct 11 2015 11:16 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement