జీవనశైలి మార్పు, దురలవాట్ల కారణంగా పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు
బీపీ, షుగర్ సమస్యలపట్ల నిర్లక్ష్యంతో తీవ్ర అనర్థాలు
మెదడు సంబంధిత వ్యాధుల బారిన యువత, మధ్య వయస్సు వారు..
ఆరోగ్యశ్రీ కింద న్యూరో, న్యూరో సర్జరీలో 2019–20లో 26 వేల మందికి చికిత్స
2023–24 నాటికి 40 వేలు దాటిన కేసులు
సాక్షి, అమరావతి: ఆధునిక జీవనశైలి, దురలవాట్ల కారణంగా మెదడు సంబంధిత జబ్బుల బారినపడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారిలో వయోభారం, బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడం తదితర కారణాలతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుండేది. అయితే, ప్రస్తుతం నమోదవుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో 25–30 శాతం కేసుల్లో బాధితుల వయస్సు 20–45 ఏళ్ల లోపే ఉంటోందని వైద్యులు చెబుతున్నారు.
ఢిల్లీ ఎయిమ్స్ న్యూరాలజీ విభాగం వెల్లడించిన ఒక నివేదిక ప్రకారం ఏడాది కాలంలో 300 మంది స్ట్రోక్‌తో అడ్మిట్ కాగా.. 25 శాతం మంది 21–45 ఏళ్ల వయస్సు వారేనని తేలింది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటిమంది ఈ స్ట్రోక్ బారినపడుతుండగా, వీరిలో సగం మంది మృత్యువాత పడుతున్నారు. మిగిలిన వారు శాశ్వత వికలాంగులుగా మిగిలిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇటీవల వెల్లడించింది.
దురలవాట్లతో చేటు..
ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు మెదడుకు చేటుచేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ అలవాట్లను మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ కొందరిలో మాత్రం మార్పు రావడంలేదు. బ్రిటీష్ మెడికల్ జర్నల్ 2021లో వెల్లడించిన ఒక అధ్యయనం ప్రకారం.. ధూమపానం, మద్యపానం అలవాట్లున్న వ్యక్తులు బ్రెయిన్ స్ట్రోక్ బారినపడటానికి 80 శాతం ఎక్కువ అవకాశాలున్నాయి. గుండె జబ్బులకు దారితీసే ప్రధాన కారకాల్లో ధూమపానం ఒకటి.
గుండెపోటు కేసుల్లో 25 శాతం వరకూ ఇదే ప్రధాన కారణంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే, పొగాకులోని నికోటిన్, విషతుల్యాలు రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీస్తాయి. దీంతో రక్తనాళ గోడల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి పూడిక ఏర్పడుతుంది. పూడిక చిట్లిపోతే హఠాత్తుగా రక్తం గడ్డకట్టి నాళం పూర్తిగా మూసుకుపోవచ్చు. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. అదే విధంగా మెదడు రక్తనాళాల్లో పూడికలతో స్ట్రోక్ సంభవిస్తుంది.
ఏటా కేసుల పెరుగుదల..
బ్రెయిన్ స్ట్రోక్, ఇతర న్యూరో సంబంధిత కేసులు ఏటా పెరుగుతున్నాయి. ఇందుకు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద అందించిన చికిత్సలే నిదర్శనంగా ఉంటున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద న్యూరో, న్యూరో సర్జరీ విభాగాల్లో చికిత్స పొందిన రోగుల సంఖ్య గడిచిన ఐదేళ్లలో ఏటా వృద్ధి చెందుతూ వచ్చింది. 2019–20లో 26,023 మంది చికిత్స పొందారు. 2022–23 నాటికి ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. ఆ ఏడాది 40 వేల మందికి ప్రభుత్వం ఉచితంగా చికిత్సలు అందించింది. ఇక 2023–24లోను చికిత్స పొందిన వారి సంఖ్య 40 వేలు దాటింది.
యువతలో బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణాలు..
⇒ బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడం.. ఊబకాయం ఉండటం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారిలో 25 శాతం మంది బీపీ, షుగర్‌తో బాధపడుతున్నారు.
⇒ కొందరిలో బీపీ, షుగర్ సమస్యలు ఉన్నప్పటికీ సంబంధిత లక్షణాలు లేకపోవడంతో బయటకు తెలీడంలేదు. కానీ లోలోపల జరగాల్సిన నష్టం జరుగుతోంది.
⇒ మహిళలు నెలసరిని వాయిదా వేయడం, అధిక రక్తస్రావాన్ని నియంత్రించుకోవడం కోసం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా మందులు వాడటం..
⇒ ఊబకాయం కూడా బ్రెయిన్ స్ట్రోక్‌కు దారి తీస్తోంది.
⇒ శారీరక శ్రమ లేకపోవడం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
⇒ రోజుకు 45 నిమిషాలు నడవాలి, ఇతర వ్యాయామాలు చేయాలి.
⇒ ఆహారంలో 25 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, 25 శాతం పిండి పదార్థాలు, 20 శాతం ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్‌ను పూర్తిగా నియంత్రించాలి.
⇒ శరీర బరువును నియంత్రించుకోవాలి. బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉంటే తరుచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
⇒ తీవ్ర ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలి. ఆరు గంటలు నిద్రపోవాలి.
జీవనశైలి మార్పుపై దృష్టిపెట్టాలి..
గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ మధ్య కాలంలో యంగ్ ఏజ్ స్ట్రోక్ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సాధారణంగా 55 ఏళ్లు పైబడిన వారిలోనే స్ట్రోక్ ఎక్కువగా వస్తుంది. అయితే, ప్రస్తుతం అందుకు భిన్నంగా కేసులు వస్తున్నాయి. 25 ఏళ్లు, అంతకంటే చిన్న వయస్సు వాళ్లు బ్రెయిన్ స్ట్రోక్ బారినపడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆధునిక జీవనశైలి. యువతలో కొందరు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు అలవాటుపడుతున్నారు. ఇది కొందరిలో వ్యసనంగా మారుతోంది.
ఇలాంటి వారిలో ఐదేళ్ల అనంతరం స్ట్రోక్ రావడానికి అవకాశముంది. ఈ క్రమంలో ప్రజలు జీవనశైలి మార్పు చేసుకోవడంతో పాటు బీపీ, షుగర్, ఊబకాయం నియంత్రించుకోవడంపై దృష్టిపెట్టాలి. మరోవైపు.. స్ట్రోక్ బాధితులను గోల్డెన్ హవర్‌లో ఆస్పత్రికి తీసుకొస్తే ప్రాణాపాయం నుంచి రక్షించడానికి ఆస్కారం ఉంటుంది.
– డాక్టర్ ఎన్. వెంకటసుందరాచారి, న్యూరాలజిస్ట్, మచిలీపట్నం వైద్య కళాశాల ప్రిన్సిపాల్
Comments
Please login to add a commentAdd a comment