అధిక వినియోగంతో ఆరోగ్యానికి ముప్పు
గుండె సంబంధిత వ్యాధులు రావచ్చు.. కాలేయ వైఫల్యానికి దారితీసే అవకాశం
ఏపీ సెంట్రల్ డెస్క్: పారాసెటమాల్.. ఈ ట్యాబ్‌లెట్ గురించి తెలియని వారుండరు. కరోనా తరువాత దీనికి మరింత గుర్తింపు వచ్చింది. జ్వరం రాగానే చాలామంది డాక్టర్‌ను సంప్రదించకుండానే వేసుకునే మందు బిళ్ల ఇది. అదీ కాకుండా నొప్పులకు కూడా పనిచేస్తుందని తెలిసిన తరువాత దీని వినియోగం మరింత పెరిగింది.
ఇదిలా ఉంటే.. చిన్న, చిన్న నొప్పులకు కూడా ఈ ట్యాబ్లెట్‌ను జనం విస్తృతంగా వాడేస్తున్నారు. ఇలా వినియోగించడం ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతిగా వినియోగిస్తే కాలేయానికి హాని చేస్తుందని, కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పారాసెటమాల్ విషపూరితంగా మారితే ఎక్కువ శాతం స్త్రీలే ముప్పు ఎదుర్కొంటున్నారు.
కాలేయానికి హాని:
పారాసెటమాల్‌ను అధిక మోతాదులో వినియోగిస్తే కాలేయానికి తీవ్ర హాని చేస్తుంది. ఈ మందును తీసుకున్నప్పుడు కాలేయం దీన్ని సమర్ధంగా ప్రాసెస్ చేయలేకపోతుంది. ఆ సమయంలో వచ్చే విషపూరిత ఉత్పత్తుల వల్ల కాలేయ కణాలు దెబ్బతింటాయి. కొన్ని పరిస్థితుల్లో కాలేయ వైఫల్యానికి దారి తీసే అవకాశం ఉంటుంది. వికారం, వాంతులు, కడుపునొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కిడ్నీ సమస్యలు:
దీర్ఘకాలం పాటు అధిక మోతాదులో పారాసెటమాల్ తీసుకోవడం వల్ల కిడ్నీలకు కూడా హాని కలుగుతుంది. పనితీరు దెబ్బతింటుంది. మూత్రవిసర్జనలో మార్పులు, కాళ్లవాపు, అలసట, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి.
గుండె సంబంధిత సమస్యలు:
ఎక్కువమంది పారాసెటమాల్ ను నిర్లక్ష్యంగా వాడటం వల్ల గుండెపోటు, రక్తనాళాల కుదింపు/రక్తప్రవాహం మార్పు వంటి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరికొంతమందికి అలెర్జీ సమస్యలు రావచ్చు. చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖం, పెదవులు, నాలుక వాపు వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.
అతి వినియోగం.. అనర్ధదాయకం
పారాసెటమాల్ టాబ్లెట్‌ను డోస్‌కు మించి అతిగా వినియోగించకూడదు. అలా చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పేగుపూత, కాలేయం దెబ్బతినడం, కామెర్లు, కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఒక్కో సందర్భంలో గుండె సంబంధిత వ్యాధులకూ దారి తీయవచ్చు. – డాక్టర్ జె. నాగరాజు, డిప్యూటీ సివిల్ సర్జన్, ఏరియా ఆస్పత్రి, నరసరావుపేట.
Comments
Please login to add a commentAdd a comment