Brain Strokes
-
చెడు అలవాట్లతో 'మెదడుకు చేటు'..
సాక్షి, అమరావతి: ఆధునిక జీవనశైలి, దురలవాట్ల కారణంగా మెదడు సంబంధిత జబ్బుల బారినపడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారిలో వయోభారం, బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడం తదితర కారణాలతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుండేది. అయితే, ప్రస్తుతం నమోదవుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో 25–30 శాతం కేసుల్లో బాధితుల వయస్సు 20–45 ఏళ్ల లోపే ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ న్యూరాలజీ విభాగం వెల్లడించిన ఒక నివేదిక ప్రకారం ఏడాది కాలంలో 300 మంది స్ట్రోక్‌తో అడ్మిట్ కాగా.. 25 శాతం మంది 21–45 ఏళ్ల వయస్సు వారేనని తేలింది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటిమంది ఈ స్ట్రోక్ బారినపడుతుండగా, వీరిలో సగం మంది మృత్యువాత పడుతున్నారు. మిగిలిన వారు శాశ్వత వికలాంగులుగా మిగిలిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల వెల్లడించింది. దురలవాట్లతో చేటు..ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు మెదడుకు చేటుచేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ అలవాట్లను మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ కొందరిలో మాత్రం మార్పు రావడంలేదు. బ్రిటీష్ మెడికల్ జర్నల్ 2021లో వెల్లడించిన ఒక అధ్యయనం ప్రకారం.. ధూమపానం, మద్యపానం అలవాట్లున్న వ్యక్తులు బ్రెయిన్ స్ట్రోక్ బారినపడటానికి 80 శాతం ఎక్కువ అవకాశాలున్నాయి. గుండె జబ్బులకు దారితీసే ప్రధాన కారకాల్లో ధూమపానం ఒకటి. గుండెపోటు కేసుల్లో 25 శాతం వరకూ ఇదే ప్రధాన కారణంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే, పొగాకులోని నికోటిన్, విషతుల్యాలు రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీస్తాయి. దీంతో రక్తనాళ గోడల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి పూడిక ఏర్పడుతుంది. పూడిక చిట్లిపోతే హఠాత్తుగా రక్తం గడ్డకట్టి నాళం పూర్తిగా మూసుకుపోవచ్చు. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. అదే విధంగా మెదడు రక్తనాళాల్లో పూడికలతో స్ట్రోక్ సంభవిస్తుంది. ఏటా కేసుల పెరుగుదల..బ్రెయిన్ స్ట్రోక్, ఇతర న్యూరో సంబంధిత కేసులు ఏటా పెరుగుతున్నాయి. ఇందుకు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద అందించిన చికిత్సలే నిదర్శనంగా ఉంటున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద న్యూరో, న్యూరో సర్జరీ విభాగాల్లో చికిత్స పొందిన రోగుల సంఖ్య గడిచిన ఐదేళ్లలో ఏటా వృద్ధి చెందుతూ వచ్చింది. 2019–20లో 26,023 మంది చికిత్స పొందారు. 2022–23 నాటికి ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. ఆ ఏడాది 40 వేల మందికి ప్రభుత్వం ఉచితంగా చికిత్సలు అందించింది. ఇక 2023–24లోను చికిత్స పొందిన వారి సంఖ్య 40 వేలు దాటింది. యువతలో బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణాలు..⇒ బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడం.. ఊబకాయం ఉండటం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారిలో 25 శాతం మంది బీపీ, షుగర్‌తో బాధపడుతున్నారు.⇒ కొందరిలో బీపీ, షుగర్ సమస్యలు ఉన్నప్పటికీ సంబంధిత లక్షణాలు లేకపోవడంతో బయటకు తెలీడంలేదు. కానీ లోలోపల జరగాల్సిన నష్టం జరుగుతోంది.⇒ మహిళలు నెలసరిని వాయిదా వేయడం, అధిక రక్తస్రావాన్ని నియంత్రించుకోవడం కోసం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా మందులు వాడటం..⇒ ఊబకాయం కూడా బ్రెయిన్ స్ట్రోక్‌కు దారి తీస్తోంది. ⇒ శారీరక శ్రమ లేకపోవడం.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..⇒ రోజుకు 45 నిమిషాలు నడవాలి, ఇతర వ్యాయామాలు చేయాలి.⇒ ఆహారంలో 25 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, 25 శాతం పిండి పదార్థాలు, 20 శాతం ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్‌ను పూర్తిగా నియంత్రించాలి.⇒ శరీర బరువును నియంత్రించుకోవాలి. బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉంటే తరుచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.⇒ తీవ్ర ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలి. ఆరు గంటలు నిద్రపోవాలి.జీవనశైలి మార్పుపై దృష్టిపెట్టాలి..గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ మధ్య కాలంలో యంగ్ ఏజ్ స్ట్రోక్ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సాధారణంగా 55 ఏళ్లు పైబడిన వారిలోనే స్ట్రోక్ ఎక్కువగా వస్తుంది. అయితే, ప్రస్తుతం అందుకు భిన్నంగా కేసులు వస్తున్నాయి. 25 ఏళ్లు, అంతకంటే చిన్న వయస్సు వాళ్లు బ్రెయిన్ స్ట్రోక్ బారినపడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆధునిక జీవనశైలి. యువతలో కొందరు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు అలవాటుపడుతున్నారు. ఇది కొందరిలో వ్యసనంగా మారుతోంది. ఇలాంటి వారిలో ఐదేళ్ల అనంతరం స్ట్రోక్ రావడానికి అవకాశముంది. ఈ క్రమంలో ప్రజలు జీవనశైలి మార్పు చేసుకోవడంతో పాటు బీపీ, షుగర్, ఊబకాయం నియంత్రించుకోవడంపై దృష్టిపెట్టాలి. మరోవైపు.. స్ట్రోక్ బాధితులను గోల్డెన్ హవర్లో ఆస్పత్రికి తీసుకొస్తే ప్రాణాపాయం నుంచి రక్షించడానికి ఆస్కారం ఉంటుంది. – డాక్టర్ ఎన్. వెంకటసుందరాచారి, న్యూరాలజిస్ట్, మచిలీపట్నం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ -
బ్రెయిన్ స్ట్రోక్..నెల రోజుల ముందుగానే ఇలా గుర్తించవచ్చు
ఈ మధ్యకాలంలో చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా చనిపోతున్నారన్న వార్తలు తరచు వింటున్నాం. ఈ నేపథ్యంలో బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమస్య రాకముందే దీని గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి పరిస్థితి నుంచి బయటపడొచ్చు. ఇంతకీ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది? దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు చూద్దాం. మెదడు కణాలకు ఆక్సిజన్ అవసరం. ఈ ఆక్సిజన్ రక్తం ద్వారా అందుతుంది. మెదడు కణాలకు రక్తం సరఫరా నిలిచిపోవడంతో వచ్చే ప్రమాదమే బ్రెయిన్ స్ట్రోక్. ఈ వ్యాధిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అయితే కొన్నిసార్లు సమస్యను ముందే పసిగడితే ప్రమాదం నుంచి బయటపడొచ్చంటున్నారు వైద్య నిపుణులు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలపై అవగాహన ఏర్పరచుకుంటే ప్రాణాపాయం నుంచి గట్టెక్కవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ ఎన్ని రకాలు? బ్రెయిన్ స్ట్రోక్‌ను సాధారణంగా ఐస్కీమిక్ స్ట్రోక్, హీమోరజిక్ స్ట్రోక్, ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్‌లుగా మూడు రకాలుగా గుర్తించవచ్చు. ఐస్కీమిక్ స్ట్రోక్: ఇది మెదడుకు దారితీసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయిన సందర్భాల్లో వచ్చే స్ట్రోక్‌ని ఐస్కీమిక్ స్ట్రోక్‌గా పిలుస్తారు. హీమోర్హజిక్ స్ట్రోక్: మెదడు రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కలిగే స్ట్రోక్ ఇది. రక్తస్రావం జరగడంతో మెదడులోని కణాలు దెబ్బతింటాయి. ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్: ఉన్నట్టుండి రక్త సరఫరా ఆగిపోతుంది. మళ్ళీ దానంతట అదే తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ స్థితినే ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్ అంటారు. ఒకరకంగా దీన్ని బ్రెయిన్ స్ట్రోక్‌కి హెచ్చరికగా భావించవచ్చు. ఈ లక్షణాన్ని నిర్దిష్ఠ కాలంలో గుర్తించి, చికిత్స అందిస్తే బ్రెయిన్ స్ట్రోక్‌ను అడ్డుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ►ఏ రకమైన స్ట్రోక్ వచ్చినా ముందుగా తలనొప్పి వస్తుంది. హెమరేజిక్ స్ట్రోక్ సాధారణ లక్షణం తలనొప్పి.కరోటిడ్ ఆర్టరీ నుండి స్ట్రోక్ మొదలవుతుంది. ఆ సమయంలో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ముఖం ఓ వైపుకి వంగిపోవవడం,రెండు చేతులు పైకి ఎత్తకపోవడం,ఓ చేయి తిమ్మిరి, బలహీనంగా మారడం, నడవలేకపోవడం వంటివి దీని లక్షణాలు. ►అలాగే శ్వాసలో సమస్య ఏర్పడుతుంది. ఛాతీనొప్పి, శ్వాసలో సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని జాగ్రత్తపడాలి. ► ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఒక సర్వే ప్రకారం.. 10శాతం మంది మహిళలలకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయని గుర్తించారు. మహిళల్లో స్ట్రోక్ వచ్చే ముందు మార్పులు.. ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంటుంది. మహిళల్లో స్ట్రోక్ వచ్చే ముందు వారి ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చని నిపుణులు అంటున్నారు. ఉన్నట్టుండి కొన్ని విషయాలు మర్చిపోవడం, వ్యక్తిత్వంలో మార్పులు తెలుస్తుంటాయి. అంతేకాకుండా వికారం, వాంతులు, మెదడులో కొన్ని భాగాల్లో వచ్చిన సమస్యల కారణంగా వాంతులు, వికారంగా ఉండటం వంటివి కనిపిస్తాయి. ఇక చూపులో సమస్యతో పాటు భ్రమ పడుతున్నట్లు కూడా అనిపిస్తుంటుందట. ఈ స్ట్రోక్ వచ్చే ముందు అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల మెదడులో రక్త గడ్డ కట్టే ప్రమాదం ఉంది. దురదృష్టవశాత్తు గర్భస్రావాలు జరుగుతుంటాయి. అది స్ట్రోక్ రిస్క్ ను పెరిగేలా చేస్తుంది. అడ్రినల్ గ్రంథుల్లో ఉత్పత్తి అయ్యే డీహెచ్ఈఏ హార్మోన్ వెంటనే తగ్గిపోతుంది. దాని వల్ల ఈస్ట్రోజన్లు, ఆండ్రోజన్స్ తగ్గిపోతుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గల కారణాలు అధిక రక్తపోటు,డయాబెటిస్,అధిక కొలెస్ట్రాల్,ధూమపానం, మధ్యపానం, వ్యాయామం చేయకపోవడం, ఊబకాయం, వీటితో పాటు ఎక్కువగా ఆందోళన చెందడం, గుండె వ్యాధులు, అధిక ప్లాస్మా లిపిడ్స్ వంటివి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు. ముందుగానే సమస్యను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. కానీ జన్యు సంబంధిత కారణాలు, వృద్ధాప్యం,ఇంతకుముందే బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడటం వంటివి స్ట్రోక్ ముప్పును శాశ్వతంగా కలిగిస్తాయి. వీటి నుంచి మనం తప్పించుకోలేం. చికిత్స ఇలా.. పైన వివరించిన లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. బీపీ, షుగర్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండటమే కాకుండా బరువును అదుపులో ఉంచుకోవాలి. స్ట్రోక్ నుంచి నెల ముందే కాపాడొచ్చు బ్రెయిన్ స్ట్రోక్‌కు నెల ముందు వచ్చే లక్షణాలను పసిగడితే ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చు. ముఖం, చేతులు, కాళ్లు మొద్దుబారడం వంటివి సాధారణ లక్షణాలే అయినా, బ్రెయిన్ స్ట్రోక్‌కు ముందు ఇలా జరుగుతుంది. ముఖం, చేతులు, కాళ్లు ఒక వైపు మాత్రమే మొద్దుబారడం కూడా జరగుతుంది. కంటి చూపులో తేడా వస్తుంది. కళ్లు మసకబారడం లాంటివి జరుగుతుందని యూకేలో 1300మందిపై ఇటీవలె జరిపిన ఓ సర్వేలో వెల్లడైంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన చాలామంది ఆడవాళ్లలో కనిపించిన మరో లక్షణం తలనొప్పి. ఒక్కో సమయంలో స్పృహ కూడా కోల్పోయి పడిపోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు అంటున్నారు. - డాక్టర్ నవీన్ రోయ్,ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఫోన్ -9703706660 -
ట్రైగ్లిజరైడ్స్ పెరగనివ్వకండి..! పెరిగితే..?
కొవ్వులు పెరగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని అంటుంటాం. అలాగే ట్రైగ్లిజరైడ్స్ పెరగడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే కొవ్వుల్లాగే ఇవీ హానికరం. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉండే కండిషన్‌ను ‘హైపర్ ట్రైగ్లిజరైడెమియా’ అంటారు. ఇవి పెరగడం వల్ల గుండె జబ్బులు పెరిగే ముప్పు ఉంటుంది. అలాగే డయాబెటిస్ వంటి జబ్బులు ఉన్న సందర్భాల్లోనూ ట్రైగ్లిజరైడ్స్ మోతాదులు పెరగడం వల్ల కూడా గుండెకూ, మెదడుకూ హాని కలగజేసే అవకాశం ఉంది. ఈ కింద జాగ్రత్తలు తీసుకోండి... ట్రైగ్లిజరైడ్స్‌ను అదుపులో ఉంచుకోండి. కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా... అంటే ఆహార నియమాలు, వ్యాయామం చేయడం వంటివి పాటించడం ద్వారా రక్తంలో వాటి పాళ్లను తగ్గించుకోవచ్చు. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు బాగా తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్‌లో పీచుట్రైగ్లిజరైడ్స్ను అదుపు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకే వాటిని తరచూ తీసుకోవడం మంచిది. అయితే అందులోనూ జీడిపప్పు వంటి కొవ్వులు ఒకింత ఎక్కువగా ఉండే నట్స్ కంటే కొవ్వు తక్కువగా ఉండే బాదం వంటివి మేలు చేస్తాయి. భోజనానికి మందుగా వెజిటబుల్ సలాడ్స్, భోజనంలో భాగంగా తేలిగ్గా ఉడికించిన కాయగూరలు తీసుకోవడం కూడా మంచిది. వీటిలోని పీచుపదార్థాలూ ట్రైగ్లిజరైడ్స్‌ను నియంత్రిస్తాయి. పీచు ఎక్కువగా ఉండేలా... పొట్టుతీయని తృణధాన్యాలు (అంటే... దంపుడు బియ్యం, మెుక్కజొన్న, పొట్టుతీయని రాగులు, గోధువులు, ఓట్స్ వంటి ధాన్యాలు), పొట్టుతీయని పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలు (స్ప్రౌట్స్) తీసుకోవాలి. ఆహారంలో వెన్న, నెయ్యి వంటి శాచ్యురేటెడ్ ఫ్యాట్‌ను, కొలెస్ట్రాల్ ఉండే ఆహారాన్ని బాగా తగ్గించాలి. అంటే కేవలం రుచికోసం చాలా కొద్దిగా మాత్రమే తీసుకోవాలి. అలాగే వూంసాహారం (వేటమాంసం, రొయ్యలు, చికెన్ స్కిన్ వంటివి) చాలా పరిమితంగా తీసుకోవాలి. వేపుడు పదార్థాలను తగ్గించాలి. స్వీట్స్, బేకరీ ఐటమ్స్ బాగా తగ్గించాలి. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉన్నవారు దాన్ని సాధారణ స్థాయికి తెచ్చుకునేలా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అంటే తీసుకునే క్యాలరీల (క్యాలరీ ఇన్‌టేక్)ను తగ్గించుకోవాలి. ఆల్కహాల్ పూర్తిగా వూనేయాలి. ∙పొగతాగడం పూర్తిగా వూనేయాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రవు / వాకింగ్ వంటి వ్యాయావూలు చేయాలి. వారంలో కనీసం వుూడుసార్లు చేపలు తీసుకోవడం మంచిది. అయితే వాటిని కేవలం ఉడికించి వండాలి. లేదా గ్రిల్ చేసినవి తీసుకోవచ్చు. కానీ డీప్ ఫ్రై చేసినవి వద్దు. -
ఆకుకూరలతో ఆ రిస్క్‌కు దూరం
వాషింగ్టన్ : సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహార ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తరచూ ఆకుకూరలు తీసుకునేవారికి స్ర్టోక్ రిస్క్ 64 శాతం తక్కువగా ఉంటుందని తాజా అథ్యయనం వెల్లడించింది. అధిక రక్తపోటు కలిగిన వారిలో ఇంట్రాసెరిబ్రల్ హెమరేజ్ ముప్పు అధికంగా ఉన్న క్రమంలో వీరిలో తాజా ఆకుకూరలు అధికంగా తీసుకునేవారికి స్ర్టోక్ ముప్పు 64 శాతం తక్కువగా ఉన్నట్టు ఈ అథ్యయనంలో తేలింది. 682 మంది రోగుల రికార్డులను విశ్లేషించిన మీదట పరిశోధకులు ఈ విషయం పసిగట్టారు. మెదడులో రక్తస్రావాన్ని (బ్లీడింగ్ స్ర్టోక్స్) తాజా ఆకుకూరలు తీసుకోవడం ద్వారా అడ్డుకోవచ్చని ఈ పరిశోధన వెల్లడించింది. స్ర్టోక్స్లో 32 శాతం బ్లీడింగ్ స్ర్టోక్స్ కాగా వీటిలో 93 శాతం అధిక రక్తపోటు దీనికి మూల కారణంగా పరిశోధకులు గుర్తించారు. ఇక డయాబెటిస్ రోగులకు స్ర్టోక్ ముప్పు 2.3 రెట్లు అధికమని, ఒత్తిడికి గురయ్యేవారికి 2.2 రెట్లు అధికమని తేల్చారు. కొలెస్ర్టాల్ లెవెల్స్ అధికంగా ఉండే వారికి స్ర్టోక్ ముప్పు 1.6 రెట్లు, పొగాకు సేవించేవారికి 10 రెట్లు స్ట్రోక్ ముప్పు అధికమని పరిశోధనలో పేర్కొన్నారు. -
ఆ... గంట అమూల్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు) : బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైనప్పుడు మొదటి గంట ఎంతో అమూల్యమని, ఆ సమయంలో కనీసం నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరితో ఎలాంటి వైకల్యం కలగకుండా చికిత్సలు అందుబాటులోకి వచ్చినట్లు సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ శశాంక్ తెలిపారు. ప్రపంచ పక్షవాత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వాస్పత్రి న్యూరాలజీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ శశాంక్ మాట్లాడుతూ ఒకప్పుడు పక్షవాతానికి గురైతే నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి రావడంతో వైకల్యాలకు గురికాకుండా చూడవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.చక్రధర్ మాట్లాడుతూ పక్షవాతం లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. మెదడులో ఏ భాగానికి రక్త ప్రసరణ ఆగిపోతుందో ఆ భాగం నియంత్రణలో ఉండే అవయవాలు పట్టు తప్పుతాయన్నారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎ.శ్రీనివాసులు మాట్లాడుతూ పక్షవాతం వచ్చిన రోగికి తొలుత సీటీ స్కాన్ చేసి, రక్తనాళాల్లో గడ్డలు కారణంగా స్ట్రోక్ వచ్చిందా. రక్తనాళాలు చిట్లడం వల్ల వచ్చిందో గర్తించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. రక్తపోటు అదుపులో పెట్టుకోవాలి.... జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కంచర్ల సుధాకర్ మాట్లాడుతూ పక్షవాతం రావడానికి ప్రధాన కారణాలు రక్తపోటును అదుపులో పెట్టుకోక పోవడం, రక్తంలో గ్లూకోజ్ అదుపులో లేకపోవడం, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, ఆల్కాహాల్ అధిక మోతాదులో తీసుకోవడం, గుండెవ్యాధులు కలిగి ఉండటం, ముఖ్యకారణాలుగా పేర్కొన్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ ఎస్.బాబూలాల్, డాక్టర్ ఎవీ రావు, సర్జరీ విభాగాధిపతి డాక్టర్ కె.శివశంకర్‌రావు, డిప్యూటీ ఆర్ఎంవో డాక్టర్ నరసింహనాయక్, నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి, మెడికల్ పీజీలు, నర్శింగ్ విద్యార్ధినిలు పాల్గొన్నారు. ర్యాలీ రామవరప్పాడు రింగ్ వరకూ కొనసాగింది. -
బ్రెయిన్ స్ట్రోక్స్‌పై హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో పలువురు జనరల్ ఫిజీషియన్లు, న్యూరాలజిస్ట్లు, న్యూరో సర్జన్లతో స్ట్రోక్స్ (మెదడు, నరాలు) సంబంధిత వ్యాధులపై అవగాహన కోసం అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఆసక్తి ఉన్న వైద్యులందరూ రావచ్చునని ఐఎస్సీడీఎస్ (ఇంటర్నేషనల్ స్ట్రోక్ అండ్ సెరెబ్రొవాస్క్యులర్ సింపోజియం) కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ నబీల్ ఎ హెరియల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లల్లో మెదడు సంబంధిత బాధితుల సంఖ్య ఏటికేటికీ గణనీయంగా పెరుగుతోందని, నిపుణులైన వైద్యులు దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే వైద్యులు ఈ నెల 14న ఉదయం తమ పేరు నమోదుచేసుకుని పాల్గొనవచ్చునన్నారు.