సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాస్పత్రులకు ఆధునిక వైద్య ఉపకరణాలు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్తగా వంద రకాల పరికరాలను సర్జికల్ జాబితాలో చేర్చారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఏటా లక్షలాది శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. కొత్త కొత్త వైద్య పద్ధతులు వస్తున్న నేపథ్యంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి సమీక్ష నిర్వహించి ఆధునిక ఉపకరణాలను అందుబాటులోకి తీసుకురావాలి. కానీ 2014 తర్వాత అప్పటి ప్రభుత్వం దీని గురించి అసలు పట్టించుకోలేదు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు.. స్పెషాలిటీ వైద్యులు సర్జికల్ జాబితాపై కసరత్తు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.
తాజాగా నిర్వహించిన సమీక్షలో శస్త్రచికిత్సలకు అవసరమైన 390 రకాల సర్జికల్ ఉపకరణాలతో జాబితా తయారు చేశారు. ఇందులో 100 రకాలు కొత్తగా చేర్చినవే. ప్రైవేటు ఆస్పత్రుల్లోని పరికరాల కంటే ఇవి అత్యుత్తమమైనవని వైద్యులు, అధికారులు పేర్కొన్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో చైనా నుంచి వచ్చిన నాసిరకం పరికరాలు వాడుతుంటారని వివరించారు. ప్రభుత్వ రేటు కాంట్రాక్టులో ఉన్నవన్నీ అమెరికా ఔషధ నియంత్రణతో పాటు డబ్ల్యూహెచ్‌వో నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉన్నవేనని తెలిపారు. జనరల్ సర్జరీ, గ్యాస్ట్రిక్, ప్రసవాల్లో వాడే పరికరాల్లో ఆధునికమైనవి ఎక్కువగా వచ్చాయని చెప్పారు. గతంలో శస్త్రచికిత్సలు చేసేటప్పుడు శరీరంపై కోతలు ఎక్కువగా పెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు చిన్న గాటుతో చికిత్స చేసే ల్యాప్రోస్కోపిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి వైద్య ఉపకరణాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.
రేటు ఎక్కువైతే పునఃసమీక్ష..
మొత్తం 390 రకాల పరికరాల్లో.. రేటు ఎక్కువగా ఉన్న వాటి విషయంలో పునఃసమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. మొదటిసారిగా సర్జికల్ ఉపకరణాలను అన్ని బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న స్పెషాలిటీ వైద్యుల అభిప్రాయాలు తీసుకుని మరీ నిర్ధారించారు. ఆధునిక వైద్య పరికరాలు గతంలోని రేటు కాంట్రాక్టులో లేకపోవడంతో.. ఆస్పత్రుల్లో లోకల్ పర్చేజీ కింద ఎక్కువ రేటు చెల్లించి కొనుగోలు చేసేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తే మరింత రేటు తగ్గుతుందని పలువురు వైద్యులు అభిప్రాయపడ్డారు. ఏటా లక్షలాదిమంది సర్జరీ చేయించుకునేందుకు ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నారని, ఆధునిక వైద్యపరికరాలుంటే రక్తస్రావం తక్కువగా ఉండటం, త్వరగా గాయాలు మానడం, ఇన్ఫెక్షన్లు తగ్గడం వంటి ఉపయోగాలుంటాయని వైద్యులు చెప్పారు.
అందరి అభిప్రాయాలతోనే..
ఆధునిక వైద్య పరికరాల కొనుగోలుపై స్పెషాలిటీ వైద్యులు కసరత్తు చేశాకే నిర్ధారణకు వచ్చాం. బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యుల అభిప్రాయాలు తీసుకున్నాం. అందరి అభిప్రాయాల మేరకే ఉపకరణాల జాబితా తయారు చేశాం. సర్జికల్ బడ్జెట్ కొంత పెంచాల్సి ఉంది. దీని కోసం ప్రయత్నిస్తున్నాం.
– డా.రాఘవేంద్రరావు, వైద్య విద్యా సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment