
ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మృతదేహాల తరలింపునకు వాహనాలు కరువు
సగం మృతదేహాలను మాత్రమే ఇళ్లకు చేరుస్తున్న మహాప్రస్థానం వాహనాలు
మిగిలినవాటికి ప్రైవేటు అంబులెన్స్‌లే దిక్కు.. రూ.వేలల్లో డ్రైవర్ల డిమాండ్
53 వాహనాలు సమకూరుస్తున్నామని ప్రకటనలతో కూటమి ప్రభుత్వం కాలక్షేపం
సాక్షి, అమరావతి: ఓవైపు అయినవారిని కోల్పోయి పుట్టెడు దుఃఖం.. మరోవైపు వారి మృతదేహాల తరలింపు భారం.. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల దోపిడీ..! ప్రమాదాలకు గురై, అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించినవారి మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు బంధువులు ఎదుర్కొంటున్న కష్టం ఇది. ప్రైవేట్ ఆసుపత్రులలో సొంత డబ్బుతో చికిత్స చేయించుకునే స్థోమత లేకనే ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న పేద, మధ్య తరగతికి ఇబ్బందులు పరిపాటిగా మారాయి.
మందులు, వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు మృతదేహాలను తరలించే వాహనాల కొరత కూడా అధికంగా ఉంటోంది. ప్రైవేటు అంబులెన్స్ వారు చెప్పిందే ధర..! వారు అడిగినంత ఇవ్వకపోయినా, మరో వాహనంలో తరలింపునకు ప్రయతి్నంచినా అడ్డుకుని గొడవకు సైతం దిగుతున్నారు. వీరితో ఆసుపత్రుల్లోని కొందరు సిబ్బంది సైతం చేతులు కలిపి.. వార్డుల్లో ఎవరైనా మృతి చెందితే సమాచారం చేరవేస్తున్నారు. అంబులెన్స్ నిర్వాహకులు నేరుగా వార్డుల్లోకి వెళ్లి మరీ బాధిత కుటుంబ సభ్యులతో బేరాలకు దిగుతున్నారు.
జిల్లాల పరిధిలో అయితే 50 కిలోమీటర్ల వరకు అంబులెన్స్ అద్దె, డ్రైవర్ బేటా/బత్తా, డీజిల్‌కు రూ.5 వేల నుంచి రూ.7 వేల మేర వసూలు చేస్తున్నారు. 50 నుంచి 100 కి.మీ.కు రూ.10 వేలపైన, వంద కి.మీ. పైగా ఉన్న దూరానికి రూ.15 వేల నుంచి రూ.20 వేలు అంతకంటే ఎక్కువ కూడా ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.
సగం మంది సొంత ఖర్చుతోనే..
పెద్ద ఆసుపత్రుల్లో నమోదైన మరణాల్లో మృతదేహాలను ఉచితంగా స్వస్థలాలకు చేరవేసే మహాప్రస్థానం వాహనాలకు తీవ్ర కొరత ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 17 చోట్ల 54 వాహనాలు ఉండగా సగం మృతదేహాలను మాత్రమే ప్రభుత్వం ఉచితంగా తరలిస్తోంది. మిగిలిన సగంవాటికి ప్రైవేట్ అంబులెన్స్‌లను ఆశ్రయించక తప్పడం లేదు. గత ఏడాది ఏప్రిల్–ఆగస్టు మధ్య 17 చోట్ల 25,094 మరణాలు నమోదవగా, 13 వేల కేసుల్లోనే మహాప్రస్థానం వాహనాల్లో మృతదేహాలను తరలించారు.
నంద్యాల, విజయనగరం, మచిలీపట్నంలో కేవలం ఒక్కటి చొప్పునే వాహనాలు ఉన్నాయి. వైఎస్సార్, ఏలూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, నెల్లూరుల్లో రెండేసి వాహనాలే ఉన్నాయి. అప్పటికే ఇవి మృతదేహాల తరలింపునకు వెళ్తే తిరిగి వచ్చేదాక ఎదురుచూడాల్సి ఉంటోంది.
గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, కాకినాడ వంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో రోజువారీ మరణాలకు, అందుబాటులో ఉన్న వాహనాలకు పొంతన లేదు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్యే మృతదేహాలను తరలించాలనే నిబంధనలున్నాయి. రాత్రివేళ చనిపోతే.. మృతదేహాలను మార్చురీల్లో భద్రపరిచి, మరుసటి ఉదయం తరలించాల్సి వస్తోంది. అప్పటికి మృతుల సంఖ్య పెరిగి వాహనాలకు తీవ్ర డిమాండ్ నెలకొంటోంది.
ప్రకటనలతో కాలక్షేపం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వ ఆసుపత్రులకు మహాప్రస్థానం వాహనాలు సమకూరుస్తున్నామంటూ పలుసార్లు మంత్రి సత్యకుమార్ ప్రకటనలు చేశారు. డిసెంబరులో 53 వాహనాలకు సీఎం ఆమోదం తెలిపారని వెల్లడించారు. కానీ, అంబులెన్స్‌లు అందుబాటులోకివచ్చిన దాఖలాలు లేవు. కాగా, ప్రభుత్వం సమకూరుస్తామని చెబుతున్న వాహనాలు ప్రస్తుత అవసరాలకు సరిపోవని, ఇంకా పెంచాలని ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment