Private Ambulance
-
‘రుయా’ ఘటనపై సర్కారు సీరియస్
తిరుపతి తుడా/సాక్షి అమరావతి/పెనగలూరు: అంతిమ సంస్కారానికి తీసుకెళ్లాల్సిన ఓ బాలుడి మృతదేహాన్ని డబ్బు కోసం అక్కడి ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు శృతిమించి వ్యవహరించారు. దీంతో మృతదేహాన్ని బాలుడి కుటుంబ సభ్యులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం కొండూరు పంచాయతీకి చెందిన జాషువా (10) కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతుంటే రెండ్రోజుల క్రితం రుయా చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకొచ్చారు. వ్యాధి తీవ్రం కావడంతో సోమవారం రాత్రి మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని సొంత గ్రామానికి తరలించేందుకు ఆస్పత్రి వెలుపల ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు రూ.20వేలు డిమాండ్ చేశారు. అంత చెల్లించలేమని కుటుంబీకులు వేడుకున్నా వాళ్లు కనికరించలేదు. దీంతో చిన్నారి మృతదేహాన్ని 15కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి అక్కడ నుంచి మరో అంబులెన్స్‌లో తక్కువ రేటుతో గ్రామానికి తరలించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటన వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిమిషాల వ్యవధిలో తీవ్రంగా స్పందించింది. పూర్తిస్థాయి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డిని ఆదేశించింది. అలాగే, తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి, డీఎస్పీ మురళీకృష్ణ, డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరిలను విచారణకు ఆదేశించారు. మరోవైపు.. రుయాలో పర్యటించిన అధికారుల బృందం, అంబులెన్స్‌ల దందాను నిర్ధారించింది. అధిక ధరలతో రోగులను వేధిస్తున్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలను సేకరించి జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఆయన ఈ నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించడంతో కలెక్టర్ శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సీఎస్ఆర్ఎంఓ సస్పెన్షన్.. నిజానికి.. రుయా పరిధిలో మృతదేహాలను గౌరవప్రదంగా తరలించేందుకు ప్రభుత్వం నాలుగు మహాప్రస్థానం వాహనాలను అందుబాటులో ఉంచింది. సకాలంలో వీటిని ఉచితంగా పంపించాల్సి వుంది. అయితే, ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులతో కుమ్మక్కైన కొంతమంది అధికారులు, సిబ్బంది మహాప్రస్థానం వాహనాలను సరైన పద్ధతిలో నిర్వహించడంలేదు. ఫలితంగా ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. దీంతో మహాప్రస్థానం వాహనాలను పర్యవేక్షిస్తున్న సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ సరస్వతిదేవిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి నిర్లక్ష్యాన్ని కూడా గుర్తించి ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసు జారీచేశారు. అలాగే, రుయా ఘటనలో మరో అంబులెన్స్‌ను అడ్డుకుని వివాదానికి కారకులైన రుయా అంబులెన్స్ అసోసియేషన్ మాఫియాలో నలుగురిపై క్రిమినల్ కేసులకు ఆదేశించారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు ప్రభుత్వాసుపత్రుల్లో మృతదేహాల తరలింపునకు ప్రైవేటు అంబులెన్స్‌లపై మానిటరింగ్ కోసం రవాణా, పోలీసు, రెవెన్యూ, వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. కిలోమీటర్ చొప్పున ధర నిర్ణయించడం, ఆన్లైన్ విధానాన్ని తీసుకురావడం, ఎక్కడి నుంచైనా అంబులెన్స్‌లు అనుమతించేందుకు వీలుగా కమిటీ విధి విధానాలను రూపొందించనుంది. రాత్రిపూటా వాహనాలు: మంత్రి రజని ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చామని, ఆర్ఎంఓను సస్పెండ్ చేశామన్నారు. ఈ అమానవీయ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. మహా ప్రస్థానం వాహనాలను రాత్రిపూట కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. అలాగే, మృతదేహాలను తరలించేందుకు ప్రీ పెయిడ్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరించారు. మంత్రి రోజా కూడా మాట్లాడుతూ.. చిన్నారి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్సు మాఫియా నిర్దయగా ప్రవర్తించడం దారుణమన్నారు. పేదలను ఇబ్బంది పెట్టే ఘటనలను ప్రభుత్వం సహించేది లేదన్నారు. దుస్థితికి నిదర్శనం: చంద్రబాబు రాష్ట్రంలోని ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల దుస్థితికి రుయా ఆస్పత్రి ఘటన నిదర్శనమని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. చిన్నారి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన ఘటన తన హృదయాన్ని దహించివేసిందని మంగళవారం ట్వీట్ చేశారు. కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటుచేయమని చిన్నారి తండ్రి అధికారులను వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. -
ధర్మాసుపత్రిలో దాష్టీకం: డాక్టర్లు ప్రాక్టీసుకు.. పేషెంట్లు ప్రయివేటుకు..
కొత్తపల్లి మండలం చింతకుంటకు చెందిన రాజనర్సుకు ప్రమాదంలో కుడికాలు విరిగింది. నిరుపేద కుటుంబం కావడంతో వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి ఆటోలో రాగానే అక్కడే కాచుకుని కూర్చున్న అంబులెన్స్ నిర్వాహకులు రాజనర్సు బంధువులను అడ్డగించి ‘ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు.. ఇక్కడ వైద్యులు లేరు. ఉన్నా వైద్యం సరిగా చేయక ప్రాణాల మీదకు తెస్తారని’ భయబ్రాంతులకు గురిచేసి వారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇలా వచ్చిన పేషెంట్లను వచ్చినట్లు ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తూ అంబులెన్స్‌ల నిర్వాహకులు కమీషన్లు దండుకుంటున్నారు. సాక్షి, కరీంనగర్: జిల్లా ఆస్పత్రిలో కమీషన్ల కాసులవర్షం కురుస్తోంది. ఆసుపత్రికి వచ్చే రోగులకు పైసా ఖర్చు లేకుండా వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తుంటే... కొంతమంది కమీషన్లకు కక్కుర్తిపడి పేద రోగులకు ప్రభుత్వ వైద్యం అందకుండా చేస్తున్నారు. ఆస్పత్రి వైద్యులు మధ్యాహ్నానికే ‘ప్రయివేటు’ ప్రాక్టీసుకు వెళ్లిపోగా.. అదనుచూసి అంబులెన్స్ డ్రైవర్లు ఆస్పత్రి ఆవరణలో తిష్ట వేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారిని ప్రైవేటు ఆసుపత్రులకు పంపుతున్నారు. ఆస్పత్రిలో వైద్యం చేసేందుకు డాక్టర్లు లేదని, ఉన్నా పట్టించుకోరని, తీరా ప్రాణాల మీదకు వచ్చాక ఎక్కడికి పోతారని పేషెంట్ల బంధువులను భయబ్రాంతులకు గురిచేసి ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తూ కమీషన్లు దండుకుంటున్నారు. అవసరమైతే ఉచితంగా అంబులెన్స్ సేవలు అందిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు ఈ దందా యథేచ్చగా సాగుతుండగా.. ఈ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం కొసమెరుపు. చదవండి: (దారుణం: కుల బహిష్కరణ.. మాట్లాడితే రూ.50వేల జరిమానా) ప్రభుత్వాసుపత్రి సిబ్బంది అండతో: ప్రైవేటు అంబులెన్స్‌లను ప్రభుత్వాసుత్రి కంపౌండ్ వెలుపలే ఉంచాలి. కానీ గత కొద్ది రోజులుగా ప్రభుత్వాసుపత్రి సిబ్బంది అండదండలతో కంపౌండ్‌లో అడ్డా పెట్టి అంబులెన్స్‌లకు సీరియల్ నంబర్లు కూడా కేటాయిస్తున్నారు. పేషెంట్ల బంధువులు ద్విచక్రవాహనాలపై వస్తే దూరంగా పార్కింగ్ చేయిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది ప్రైవేటు ఆంబులెన్స్‌లకు మాత్రం ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేసుకునేందుకు స్థలాలు చూపిస్తున్నారు. దగ్గరుండి పేషెంట్లను అంబులెన్స్‌లలో ప్రైవేటుకు తరలిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ: అంబులెన్స్‌ల ద్వారా పేషెంట్లను తీసుకువచ్చే వారికి 30 నుంచి 50 శాతం వరకు కమీషన్లు ఇస్తున్నారు. కమీషన్లు ఇచ్చేందుకు పేషెంట్లను నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా వైద్యం పొందాల్సిన పేషెంట్లను ప్రైవేటు ఆసుపత్రులకు పంపుతున్న వారిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. సెక్యూరిటీ, పీఆర్వోలకు చెప్పాం. ప్రైవేటు ఆంబులెన్స్‌లు కంపౌండ్లోపల పార్కింగ్‌లో పెట్టకూడదని సెక్యూరిటీకి, పీఆర్వోలకు చెప్పాం. ఎవరూ కంపౌండ్ లోపల ప్రైవేటు ఆంబులెన్స్‌లు పెట్టకుండా చర్యలు చేపడతాం. – డాక్టర్ జ్యోతి, జిల్లా ఆసుపత్రి ఆర్ఎంవో -
భద్రాచలం ఆసుపత్రిలో ‘అంబులెన్స్’ దందా
భద్రాచలం: భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల దందా రోజు రోజుకూ పెరుగుతోంది. మృతదేహం తరలింపు పేరుతో ఆసుపత్రి ప్రాంగణంలోని మార్చురీ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.టేకులపల్లికి చెందిన జ్యోతి, ఈ నెల 6న ఆత్మహత్యకు యత్నించింది. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో శనివారం సాయంత్రం మృతిచెందింది. పోస్ట్‌మార్టం అనంతరం ఆదివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు బంధువులు సిద్దమయ్యారు. ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేదు. ఆసుపత్రి బయట ఉన్న ఓ అంబులెన్స్ నిర్వాహకులు లోపలికి వచ్చారు. తమది కూడా ఆసుపత్రికి సంబంధించినదేనని, ఐదువేల రూపాయలు ఇస్తే మృతదేహాన్ని తరలిస్తామని చెప్పారు. ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ అయినట్టయితే డబ్బులు ఎందుకు అడుగుతారని మృతురాలి కుటుంబీకులకు అనుమానం వచ్చింది. వచ్చిన వారిని ఇదే విషయం అడిగి నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, ఆ ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు పరారయ్యారు. ఆస్పత్రి అధికారు లే వేరే అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి మృతదేహాన్ని టేకులపల్లి తరలించారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రి ముందున్న ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు తరచూ ఇలాగే రోగులను మోసగిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. భద్రాచలం పట్టణంలోని బస్టాండ్ ఎదురుగాగల ఓ ఆసుపత్రితో కమీషన్ ఒప్పందాలు చేసుకుని, ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగానే సేవలు అందుతాయని రోగులను మభ్యపెట్టి అక్కడికి తరలిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. వీటిపై ఆస్పత్రి అధికారులు దృష్టి సారించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. -
వెంటాడిన మృత్యువు
- పాముకాటుకు గురైన మహిళ.. - ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌ను ఢీకొన్న డీసీఎం - డ్రైవర్‌తో పాటు రోగి దుర్మరణం - ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు మొయినాబాద్: మృత్యువు వెంటాడింది..పాముకాటుకు గురైన మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో అంబులెన్స్‌ను ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొంది. దీంతో డ్రైవర్‌తో పాటు మహిళ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటన మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి బస్‌స్టేజీ సమీపంలోని సిలువగుట్ట దగ్గర ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. క్షతగాత్రులు, సీఐ రవిచంద్ర కథనం ప్రకారం.. ధారూరు మండలం ధోర్నాల్ గ్రామానికి చెందిన బిస్మిల్లాబీ(25) శనివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటువేసింది. దీంతో కుటుంబీకులు వెంటనే ఆమెను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి హైదరాబాద్ తరలించాలని సూచించారు. కాగా కుటుంబీకులు ఆమెను వికారాబాద్‌లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం మధ్యాహ్నం బిస్మిల్లాబీ పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ అంబులెన్స్‌లో ఉస్మానియాకు బయలుదేరారు. మార్గంమధ్యలో హైదరాబాద్-బీజాపూర్ అంతర్రాష్ట రహదారిపై మండల పరిధిలోని కనకమామిడి బస్‌స్టేజీ సమీపంలోని సిలువగుట్ట వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న డీసీఎం అతివేగంతో అంబులెన్స్‌ను ఢీకొట్టింది. అనంతరం డీసీఎం కొంతదూరం దూసుకెళ్లి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొంది. దీంతో అంబులెన్స్ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ సోహెల్(22), పాము కాటుకు గురైన బిస్మిల్లాబీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అంబులెన్స్‌లో ఉన్న బిస్మిల్లాబీ భర్త సాదిక్, అక్క నూర్జహాన్, చెల్లెలు శభానా, అన్న మహబూబ్, ఆస్పత్రి సిబ్బంది యాదగిరి తీవ్రంగా గాయపడ్డారు. మృతురాలి బంధువు ఇర్ఫాన్పాషా స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న సీఐ రవిచంద్ర సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్‌లోనే ఇరుక్కుపోయిన డ్రైవర్ సోహెల్ మృతదేహాన్ని పోలీసులు అతికష్టం మీద బయటకు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే డీసీఎం డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో సాధిక్ పరిస్థితి విషమంగా ఉంది. అంబులెన్స్ డ్రైవర్ సోహెల్ వికారాబాద్ వాసి. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల హాహాకారాలు... వికారాబాద్ నుంచి బయలుదేరిన గంటలోపే అంబులెన్స్ వాహనం ప్రమాదానికి గురైంది. సంఘటనా స్థలంలో క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. మహబూబ్, నూర్జహాన్, శభానాల తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. యాదగిరి నడుము విరిగింది. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యంతోనే.. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యంతోనే రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. రోడ్డుకు ఎడమ వైపు నుంచి వెళ్లాల్సిన డీసీఎం కుడివైపు నుంచి వచ్చి ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌ను ఢీకొట్టినట్లు సంఘటన స్థలంలో ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. డీసీఎం వాహనం వేగంగా ఉండడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. ధోర్నాల్లో విషాదఛాయలు ధారూరు: రోడ్డు ప్రమాదంలో బిస్మిల్లాబీ మృతితో మండల పరిధిలోని ధోర్నాల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన జానిమియా, మౌలాన్‌బీ దంపతుల కూతురు బిస్మిల్లాబీని అదే గ్రామానికి చెందిన సయ్యద్ సాధిక్ ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు. శనివారం అర్ధరాత్రి ఇంట్లో బిస్మిల్లాబీని పాముకాటు వేసింది. కుటుంబీకులు ఆమెను వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు హైదరాబాద్ తరలించాలని చెప్పినా కుటుంబీకులు స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించాక బిస్మిల్లాబీని అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోని కనకమామిడి గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొంది. ప్రమాదంలో ఆమెతో పాటు అంబులెన్స్ డ్రైవర్ కూడా మృతిచెందాడు. కుటుం బీకులు తీవ్రంగా గాయపడ్డారు. అందరితో కలుపుగోలుగా ఉండే బిస్మిల్లాబీ మృతితో ధోర్నాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మృత్యు శకటం
ఆగిఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేటు అంబులెన్స్ తండ్రి, ఇద్దరు కుమారుల దుర్మరణం అంబులెన్స్ డ్రైవర్‌కు తీవ్రగాయాలు డ్రైవర్ నిద్రమత్తు మూడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. అనారోగ్యంతో ఉన్న కొడుకును ప్రైవేటు అంబులెన్స్‌లో హైదరాబాద్ నుంచి ఒంగోలుకు తీసుకొస్తుండగా.. మార్గమధ్యంలో ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టడంతో తండ్రితో సహా ఇద్దరు కుమారులు దుర్మరణం చెందారు. ఈ ఘటన మండలంలోని కొంగపాడు డొంక వద్ద మేదరమెట్ల-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. అద్దంకి,పొన్నలూరు మండలం పెద వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కసుకుర్తి మాలకొండయ్య, రెండో కుమారుడు మధు హైదరాబాద్‌లో మోటారుబైక్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. మధు కాళ్లు, చేతులు, తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ క్రమంలో మధు తండ్రి మాలకొండయ్య, అన్న మాల్యాద్రిలు అతనికి హైదరాబాద్‌లోని రెమిడి వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నారు. అయితే అక్కడ వైద్య ఖర్చులు భరించలేక.. ఒంగోలులో వైద్యం చేయించేందుకు సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ప్రైవేటు అంబులెన్స్‌లో మధుని తీసుకొని ఒంగోలు బయలుదేరారు. అంబులెన్స్ వాహనం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు అద్దంకి సమీపంలోని కొంగపాడు డొంక వద్దకు చేరుకోగానే డ్రైవర్ నల్గొండ జిల్లా పంపల్లికి చెందిన జే వెంకటేశ్వర్లు నిద్రలోకి జారుకున్నాడు. అదే సమయంలో హైదరాబాద్ వెళ్తూ రోడ్డు మార్జిన్లో నిలిపి ఉన్న లోడ్ లారీని అంబులెన్స్ అదుపు తప్పి ఢీకొంది. ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న మధు తండ్రి మాలకొండయ్య (65), అన్న మాల్యాద్రి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలైన మధును, అంబులెన్స్ డ్రైవర్ వెంకటేశ్వర్లును లారీడ్రైవర్ సురేష్‌గౌడ్ అం దించిన సమాచారం మేరకు 108 వాహనంలో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ మధు (30) మృతిచెందాడు. ఈ ఘటనపై మాలకొండయ్య సోదరుడు కోటయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శోకసంద్రంలో పెదవెంకన్నపాలెం పెదవెంకన్నపాలెం(పొన్నలూరు),న్యూస్‌లైన్: గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతితో పెదవెంకన్నపాలెం శోకసంద్రమైంది. అద్దంకి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కసుకుర్తి మాలకొండయ్య, ఆయన ఇద్దరు కుమారులు చనిపోవడంతో మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం ఒంగోలు రిమ్స్ నుంచి మంగళవారం రాత్రి గ్రామానికి తరలించారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. మాలకొండయ్యకు భార్య ఉంది. పెద్దకుమారుడు మాల్యాద్రికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్నకుమారుడు మధుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం కావడంతో పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం అంతులేని విషాదంలో మునిగిపోయింది. మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. -
ప్రైవేట్ అంబులెన్స్‌లదే
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్:జిల్లా కేంద్రాస్పత్రిలో ప్రైవేటు అంబులెన్స్‌ల హ వా కొనసాగుతోంది. దీంతో పేదల జేబులు గుళ్ల అవుతున్నాయి. రోగులకు ప్రైవేట్ అంబులెన్స్‌లకు మధ్య ఆస్పత్రిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు దళారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇం దుకు 30 శాతం వరకు కమీషన్‌ను పొందుతున్నారని పలువురు చెబుతున్నారు. ప్రభుత్వ అంబులెన్స్‌ను ఎవరైనా అడిగితే పనిచేయడం లేదని ఆస్పత్రి సిబ్బం ది సమాధానం ఇస్తున్నారు. దీంతో ప్రైవేట్ అంబులెన్స్‌ను రోగులు ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు ఉద్యోగులు తక్కువ ధరకు అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని రోగి బంధువులను నమ్మించి నిర్వాహకుల సెల్ నంబర్లను రోగుల బంధువుల కు ఇచ్చి దగ్గర ఉండి ఫోన్ చేయిస్తున్నారు. అలాగే రోగిని ఎక్కించే వరకూ సిబ్బంది అక్కడే ఉంటున్నారు. అత్యవసర విభాగంలో రోగులను ప్రతిరోజూ కేజీహెచ్‌కు తరలిస్తుంటారు. అయితే ఏ రోగిని రిఫర్ చేస్తున్న విషయాన్ని తెలుసుకుని కొందరు ఉద్యోగులు అంబులెన్స్ నిర్వాహకులకు సమాచారం ఇస్తున్నారు. విశాఖపట్నం వెళ్లడానికి రోగి వద్ద రూ.1000 నుంచి రూ.1200 వరకు తీసుకుంటున్నారు. ప్రభుత్వ అంబులెన్సులో రోగులకు తరలిస్తే ఎటువంటి చార్జీలుండవు. ఇదే విషయాన్ని ఆస్పత్రి సూపరింటిండెంట్ సీతారామరాజు వద్ద ప్రస్తావించగా ప్రైవేటు అంబులెన్స్‌కు సహకరిస్తున్న విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటానన్నారు.