రుయా ఆసుపత్రి మార్చురీ వద్దే నిలిపిన ప్రైవేట్ అంబులెన్స్‌లు
తిరుపతి తుడా/సాక్షి అమరావతి/పెనగలూరు: అంతిమ సంస్కారానికి తీసుకెళ్లాల్సిన ఓ బాలుడి మృతదేహాన్ని డబ్బు కోసం అక్కడి ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు శృతిమించి వ్యవహరించారు. దీంతో మృతదేహాన్ని బాలుడి కుటుంబ సభ్యులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం కొండూరు పంచాయతీకి చెందిన జాషువా (10) కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతుంటే రెండ్రోజుల క్రితం రుయా చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకొచ్చారు. వ్యాధి తీవ్రం కావడంతో సోమవారం రాత్రి మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని సొంత గ్రామానికి తరలించేందుకు ఆస్పత్రి వెలుపల ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు రూ.20వేలు డిమాండ్ చేశారు.
అంత చెల్లించలేమని కుటుంబీకులు వేడుకున్నా వాళ్లు కనికరించలేదు. దీంతో చిన్నారి మృతదేహాన్ని 15కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి అక్కడ నుంచి మరో అంబులెన్స్‌లో తక్కువ రేటుతో గ్రామానికి తరలించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటన వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిమిషాల వ్యవధిలో తీవ్రంగా స్పందించింది. పూర్తిస్థాయి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డిని ఆదేశించింది. అలాగే, తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి, డీఎస్పీ మురళీకృష్ణ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీహరిలను విచారణకు ఆదేశించారు. మరోవైపు.. రుయాలో పర్యటించిన అధికారుల బృందం, అంబులెన్స్‌ల దందాను నిర్ధారించింది. అధిక ధరలతో రోగులను వేధిస్తున్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలను సేకరించి జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఆయన ఈ నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించడంతో కలెక్టర్ శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
సీఎస్‌ఆర్‌ఎంఓ సస్పెన్షన్..
నిజానికి.. రుయా పరిధిలో మృతదేహాలను గౌరవప్రదంగా తరలించేందుకు ప్రభుత్వం నాలుగు మహాప్రస్థానం వాహనాలను అందుబాటులో ఉంచింది. సకాలంలో వీటిని ఉచితంగా పంపించాల్సి వుంది. అయితే, ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులతో కుమ్మక్కైన కొంతమంది అధికారులు, సిబ్బంది మహాప్రస్థానం వాహనాలను సరైన పద్ధతిలో నిర్వహించడంలేదు. ఫలితంగా ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. దీంతో మహాప్రస్థానం వాహనాలను పర్యవేక్షిస్తున్న సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ సరస్వతిదేవిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి నిర్లక్ష్యాన్ని కూడా గుర్తించి ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసు జారీచేశారు. అలాగే, రుయా ఘటనలో మరో అంబులెన్స్‌ను అడ్డుకుని వివాదానికి కారకులైన రుయా అంబులెన్స్ అసోసియేషన్ మాఫియాలో నలుగురిపై క్రిమినల్ కేసులకు ఆదేశించారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.
ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ప్రభుత్వాసుపత్రుల్లో మృతదేహాల తరలింపునకు ప్రైవేటు అంబులెన్స్‌లపై మానిటరింగ్ కోసం రవాణా, పోలీసు, రెవెన్యూ, వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. కిలోమీటర్ చొప్పున ధర నిర్ణయించడం, ఆన్‌లైన్ విధానాన్ని తీసుకురావడం, ఎక్కడి నుంచైనా అంబులెన్స్‌లు అనుమతించేందుకు వీలుగా కమిటీ విధి విధానాలను రూపొందించనుంది.
రాత్రిపూటా వాహనాలు: మంత్రి రజని
ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చామని, ఆర్‌ఎంఓను సస్పెండ్ చేశామన్నారు. ఈ అమానవీయ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. మహా ప్రస్థానం వాహనాలను రాత్రిపూట కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. అలాగే, మృతదేహాలను తరలించేందుకు ప్రీ పెయిడ్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరించారు. మంత్రి రోజా కూడా మాట్లాడుతూ.. చిన్నారి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్సు మాఫియా నిర్దయగా ప్రవర్తించడం దారుణమన్నారు. పేదలను ఇబ్బంది పెట్టే ఘటనలను ప్రభుత్వం సహించేది లేదన్నారు.
దుస్థితికి నిదర్శనం: చంద్రబాబు
రాష్ట్రంలోని ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల దుస్థితికి రుయా ఆస్పత్రి ఘటన నిదర్శనమని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. చిన్నారి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన ఘటన తన హృదయాన్ని దహించివేసిందని మంగళవారం ట్వీట్ చేశారు. కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటుచేయమని చిన్నారి తండ్రి అధికారులను వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment