Rua Childrens Hospital
-
‘రుయా’ ఘటనపై సర్కారు సీరియస్
తిరుపతి తుడా/సాక్షి అమరావతి/పెనగలూరు: అంతిమ సంస్కారానికి తీసుకెళ్లాల్సిన ఓ బాలుడి మృతదేహాన్ని డబ్బు కోసం అక్కడి ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు శృతిమించి వ్యవహరించారు. దీంతో మృతదేహాన్ని బాలుడి కుటుంబ సభ్యులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం కొండూరు పంచాయతీకి చెందిన జాషువా (10) కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతుంటే రెండ్రోజుల క్రితం రుయా చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకొచ్చారు. వ్యాధి తీవ్రం కావడంతో సోమవారం రాత్రి మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని సొంత గ్రామానికి తరలించేందుకు ఆస్పత్రి వెలుపల ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు రూ.20వేలు డిమాండ్ చేశారు. అంత చెల్లించలేమని కుటుంబీకులు వేడుకున్నా వాళ్లు కనికరించలేదు. దీంతో చిన్నారి మృతదేహాన్ని 15కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి అక్కడ నుంచి మరో అంబులెన్స్‌లో తక్కువ రేటుతో గ్రామానికి తరలించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటన వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిమిషాల వ్యవధిలో తీవ్రంగా స్పందించింది. పూర్తిస్థాయి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డిని ఆదేశించింది. అలాగే, తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి, డీఎస్పీ మురళీకృష్ణ, డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరిలను విచారణకు ఆదేశించారు. మరోవైపు.. రుయాలో పర్యటించిన అధికారుల బృందం, అంబులెన్స్‌ల దందాను నిర్ధారించింది. అధిక ధరలతో రోగులను వేధిస్తున్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలను సేకరించి జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఆయన ఈ నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించడంతో కలెక్టర్ శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సీఎస్ఆర్ఎంఓ సస్పెన్షన్.. నిజానికి.. రుయా పరిధిలో మృతదేహాలను గౌరవప్రదంగా తరలించేందుకు ప్రభుత్వం నాలుగు మహాప్రస్థానం వాహనాలను అందుబాటులో ఉంచింది. సకాలంలో వీటిని ఉచితంగా పంపించాల్సి వుంది. అయితే, ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులతో కుమ్మక్కైన కొంతమంది అధికారులు, సిబ్బంది మహాప్రస్థానం వాహనాలను సరైన పద్ధతిలో నిర్వహించడంలేదు. ఫలితంగా ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. దీంతో మహాప్రస్థానం వాహనాలను పర్యవేక్షిస్తున్న సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ సరస్వతిదేవిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి నిర్లక్ష్యాన్ని కూడా గుర్తించి ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసు జారీచేశారు. అలాగే, రుయా ఘటనలో మరో అంబులెన్స్‌ను అడ్డుకుని వివాదానికి కారకులైన రుయా అంబులెన్స్ అసోసియేషన్ మాఫియాలో నలుగురిపై క్రిమినల్ కేసులకు ఆదేశించారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు ప్రభుత్వాసుపత్రుల్లో మృతదేహాల తరలింపునకు ప్రైవేటు అంబులెన్స్‌లపై మానిటరింగ్ కోసం రవాణా, పోలీసు, రెవెన్యూ, వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. కిలోమీటర్ చొప్పున ధర నిర్ణయించడం, ఆన్లైన్ విధానాన్ని తీసుకురావడం, ఎక్కడి నుంచైనా అంబులెన్స్‌లు అనుమతించేందుకు వీలుగా కమిటీ విధి విధానాలను రూపొందించనుంది. రాత్రిపూటా వాహనాలు: మంత్రి రజని ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చామని, ఆర్ఎంఓను సస్పెండ్ చేశామన్నారు. ఈ అమానవీయ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. మహా ప్రస్థానం వాహనాలను రాత్రిపూట కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. అలాగే, మృతదేహాలను తరలించేందుకు ప్రీ పెయిడ్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరించారు. మంత్రి రోజా కూడా మాట్లాడుతూ.. చిన్నారి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్సు మాఫియా నిర్దయగా ప్రవర్తించడం దారుణమన్నారు. పేదలను ఇబ్బంది పెట్టే ఘటనలను ప్రభుత్వం సహించేది లేదన్నారు. దుస్థితికి నిదర్శనం: చంద్రబాబు రాష్ట్రంలోని ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల దుస్థితికి రుయా ఆస్పత్రి ఘటన నిదర్శనమని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. చిన్నారి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన ఘటన తన హృదయాన్ని దహించివేసిందని మంగళవారం ట్వీట్ చేశారు. కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటుచేయమని చిన్నారి తండ్రి అధికారులను వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. -
రుయాలో పసివేదన
►రుయా చిన్నపిల్లల ఆస్పత్రికి బాలారిష్టాలు ►చిన్నారుల ప్రాణాలకు భరోసా ఇవ్వలేని వైద్యులు ►నామమాత్రంగా అత్యవసర వైద్య సేవలు ►ఖరీదైన మందులు బయట కొనుగోలు చేయాల్సిందే వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగుకు చెందిన హుస్సేన్‌బీ. హుస్సేన్ బాషాలకు రెండేళ్ల క్రితం వివా హం జరిగింది. హుస్సేన్‌బీ నాలుగు రోజుల క్రితం ఓ పాపకు జన్మనిచ్చింది. పాప పుట్టిన గంటల వ్యవధిలోనే అనారోగ్యం బారిన పడింది. దంపతులు హుటాహుటిన రుయా చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడి వైద్యులు పరిశీలించి వెన్ను ఆపరేషన్ చేయాలని నిర్ధారించి నవజాత శిశువు (ఎన్ఐసీయు) విభాగంలో చేర్చారు. మూడు రోజులు గడిచినా వైద్యులు ఆపరేషన్ చేయలేదు. గురువారం దంపతులను వైద్యులు పిలిపించి ‘మీ పాపను తీసుకెళ్ళండి.. పాపకు ఆపరేషన్ చేస్తే బతకడం కష్టం’ అని తేల్చేశారు. చిన్నారి ప్రాణాలకు భరోసా ఇవ్వాల్సిన వైద్యులే పొమ్మనేసరికి బరువెక్కిన గుండెతో ఆ దంపతులు అక్కడి నుంచి స్వగ్రామానికి బయలుదేరి వెళ్లారు. ఇదీ ఒక్క హుస్సేన్‌బీ, హుస్సేన్ బాషా దంపతుల సమస్య మాత్రమే కాదు.. అత్యవసర వైద్యం కోసం వస్తున్న చిన్నారుల తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్య. – తిరుపతి (అలిపిరి) తిరుపతి (అలిపిరి) : చిన్నారుల ప్రాణాలకు భరోసా ఇవ్వాల్సిన వైద్యులు చాకచక్యంగా తప్పుకుంటున్నారు. ప్రాణం పోయాల్సిన డాక్టర్లు మొహం చాటేస్తున్నారు. ఫలితంగా పిల్లల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. ఇది శ్రీ వేంకటేశ్వర రామ్‌నారాయణ రుయా ఆస్పతిలో రాయలసీమలోనే అత్యంత ఖరీదైన పరికరాలతో ప్రారంభమైన చిన్నపిల్లల ఆస్పత్రి దుస్థితి. ఆస్పత్రి ప్రారంభంలో మెరుగైన వైద్య సేవలు అందించినా క్రమంగా కనుమరుగవుతున్నాయి. 10 మంది వైద్యుల బృందం ఉన్నా.. చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించలేకపోతున్నారు. ఖరీదైన మందులను చిన్నారుల తల్లిదండ్రులు బయట కొనుగోలు చేయాల్సివస్తోంది. అత్యవసర వైద్య సేవలు చిన్నారుల ప్రాణాలకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. కొంత కాలంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా చిన్నపిల్లల ఆస్పత్రిని బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్యం దైన్యంగా మారుతోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన నిరుపేదలు వారి చిన్నారులకు మెరుగైన వైద్యం అందుతుందన్న నమ్మకంతో వ్యయ ప్రయాసలకోర్చి రుయా ఆస్పత్రికి వస్తుంటారు. అయితే ఇక్కడ పేరుకు తగ్గట్టుగా మెరుగైన వైద్యం అందడం లేదు. అత్యవసర విభాగం మొదలుకుని.. అన్ని విభాగాల్లో సేవలు నామమాత్రంగా ఉంటున్నాయి. చిన్నారుల శస్త్రచికిత్సలకు ఉపయోగించే ఖరీదైన పరికరాలు మరమ్మతులకు గురైనా బాగుచేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విభాగాధిపతితో పాటు ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక అసోసియేట్ ఫ్రొఫెసరు, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మొత్తం పది మంది ఉన్నారు. వీరితో పాటు పీజీ డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు. పటిష్టమైన వైద్య బృందం ఉన్నా చిన్నారుల ప్రాణాలకు భరోసా ఇవ్వలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఉన్నాయి. రేడియాలజీ మొదలుకుని శస్త్ర చికిత్స పరికరాల వరకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. అత్యవసరం నామమాత్రం అత్యవసర వైద్యం కోసం వచ్చే చిన్నారులకు నామమాత్రంగా వైద్య సేవలు అందుతున్నాయి. చిన్నారి వైద్యం సేవలకు స్పందించేంత వరకు వైద్యం అందిస్తున్నారు. కాస్త విషమించగానే తల్లిదండ్రులను పిలిపించి మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే విమర్శలున్నాయి. మందులు బయట కొనుగోలు చేయాల్సిందే అత్యవసర పరిస్థితుల్లో ఖరీదైన మందులు ఆస్పత్రి మందుల కేంద్రంలో అందుబాటులో లేవు. పేదలు ఖరీదైన మందులను బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మందులు కొని వాటి తాలూకు బిల్లులను జతచేస్తే ఎన్టిఆర్ వైద్యసేవ కింద నిధులు మంజూరవుతాయని వైద్యులు చెప్పడం ఆశ్చర్యం. నిరుపేదలు ఆస్పత్రికి వస్తే ఖరీదైన మందులు ఎలా కొనగలరన్న కనీస ఆలోచన కూడా వైద్యులకు లేకపోవడం విస్మయానికి గురిచేయక మానదు. వైఎస్సార్ ఆశయాలకు తూట్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో 2007లో అప్పటి కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అనతి కాలంలోనే వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. రాయసీమలోనే ఖరీదైన పరికరాలతో చిన్నారులకు వైద్య సేవలు అందించే ఆస్పత్రిగా గుర్తింపు తెచ్చుకుంది. సహాయ కేంద్రం ఎక్కడ ? రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో చిన్నారుల వైద్యం కోసం వచ్చే తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం ఇచ్చేందుకు కనీసం సహాయ కేంద్రాలు లేవు. చిన్నారులకు అత్యవసర వైద్యం కోసం వచ్చే తల్లిదండ్రులకు ఓపీ మొదలుకుని అసిస్టెంట్ ప్రొఫెసర్ గది. ఎన్ఐసీయూ విభాగాల వరకు కనీసం పది మందిని అడిగి తెలుసుకోవాల్సి వస్తోంది.