భద్రాచలం: భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల దందా రోజు రోజుకూ పెరుగుతోంది. మృతదేహం తరలింపు పేరుతో ఆసుపత్రి ప్రాంగణంలోని మార్చురీ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.టేకులపల్లికి చెందిన జ్యోతి, ఈ నెల 6న ఆత్మహత్యకు యత్నించింది. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో శనివారం సాయంత్రం మృతిచెందింది. పోస్ట్‌మార్టం అనంతరం ఆదివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు బంధువులు సిద్దమయ్యారు. ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేదు. ఆసుపత్రి బయట ఉన్న ఓ అంబులెన్స్ నిర్వాహకులు లోపలికి వచ్చారు. తమది కూడా ఆసుపత్రికి సంబంధించినదేనని, ఐదువేల రూపాయలు ఇస్తే మృతదేహాన్ని తరలిస్తామని చెప్పారు.
ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ అయినట్టయితే డబ్బులు ఎందుకు అడుగుతారని మృతురాలి కుటుంబీకులకు అనుమానం వచ్చింది. వచ్చిన వారిని ఇదే విషయం అడిగి నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, ఆ ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు పరారయ్యారు. ఆస్పత్రి అధికారు లే వేరే అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి మృతదేహాన్ని టేకులపల్లి తరలించారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రి ముందున్న ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు తరచూ ఇలాగే రోగులను మోసగిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. భద్రాచలం పట్టణంలోని బస్టాండ్ ఎదురుగాగల ఓ ఆసుపత్రితో కమీషన్ ఒప్పందాలు చేసుకుని, ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగానే సేవలు అందుతాయని రోగులను మభ్యపెట్టి అక్కడికి తరలిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. వీటిపై ఆస్పత్రి అధికారులు దృష్టి సారించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment