area hospital
-
రోజంతా ఆ తల్లి నరకయాతన!
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) : పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది.. నొప్పులతో నరక యాతన అనుభవిస్తున్నా.. పాపం ఆ తల్లికి కనీసం ఆస్పత్రిలో వీల్ చైర్ కూడా ఇవ్వలేదు. ఉదయం నుంచి ఆస్పత్రి బయటే ఉంచేశారు. అర్ధరాత్రి వరకూ అదే పరిస్థితి.. ఆ తర్వాత నొప్పులు తీవ్ర మయ్యాయి. ఓ వైపు రక్త స్రావం.. మరో వైపు బిడ్డ తల కూడా బయటికి వచ్చింది.. అయినా సరే ఆస్పత్రి సిబ్బంది కరగలేదు. ఇక చేసేది లేక బయటికి వచ్చిన బిడ్డ తలతోనే ఆ గర్భిణిని తల్లి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఏరియా ఆస్పత్రిలో జరిగిన అమానవీయ ఘటన ఇది. సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చిం ది. ప్రాధేయపడ్డా ఫలితం లేదుఅనపర్తికి చెందిన నిండు గర్భిణి వినీత సుఖ ప్రసవం కోసం సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం అనపర్తి ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆమెకు కనీసం వీల్ చైర్ కూడా సిబ్బంది ఏర్పాటు చేయలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆస్పత్రి బయటే ఉంచేశారు. ప్రసూతి వేదన అనుభవిస్తున్న కూతురి బాధను తట్టుకోలేని ఆమె తల్లి.. ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. ఆ రోజు అర్ధరాత్రి వరకూ ఆ గర్భిణి వైద్య సాయం కోసం ఎదురుచూసింది. అదే రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమెకు నొప్పులొచ్చాయి.నొప్పుల సంగతి ఆస్పత్రి సిబ్బందికి తెలియపరచగా.. మత్తు ఇచ్చే డాక్టర్లు లేరంటూ సమాధానం చెప్పారు. అప్పటికే రక్తస్రావం అధికంగా అవడంతో పాటు శిశువు తల బయటికొచ్చి నరకయాతన అనుభవిస్తున్నా.. ఆమె బాధను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆస్పత్రికి వచ్చిన జనం ఈ ఘటన చూసి చలించిపోయారు. దీంతో బయటికి వచ్చిన శిశువు తలతో ఉన్న తన కూతురిని బాధితురాలి తల్లి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. ఈ విషయం తెలుసుకున్న బొమ్మూరుకు చెందిన సామాజిక కార్యకర్త దివిలి ప్రభాకరరావు డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణికి సోమవారం ఫిర్యాదు చేశారు. -
పురుడు పోసిన ఎమ్మెల్యే..
భద్రాచలం అర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పురిటినొప్పులతో ఇబ్బంది పడుతున్న గర్భిణికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పురుడుపోసి ప్రశంసలు అందుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రేగుబల్లికి చెందిన భీమనబోయిన స్వప్నకు పురిటినొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు సోమవారం ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు.కాగా, మంగళవారం స్వప్నకు పురిటినొప్పులు తీవ్రం కాగా, డ్యూటీ డాక్టర్ (ఈఎన్టీ) పరీక్షించి వెంటనే ప్రసవం చేయాలని నిర్ధారించారు. కానీ ఆ సమయానికి ఆస్పత్రిలో గైనిక్ వైద్యులు లేకపోవడంతో స్వతహాగా వైద్యుడైన ఎమ్మెల్యే వెంకట్రావుకు సమాచారం అందింది. దీంతో ఆయన సిజేరియన్ ద్వారా స్వప్నకు ప్రసవం చేయడంతో 3.2 కేజీల మగ శిశువుకు జన్మనిచ్చింది. -
లంచం అడిగిన డాక్టర్‌పై అక్కడికక్కడే సస్పెన్షన్ వేటు
గచ్చిబౌలి (హైదరాబాద్): కొండాపూర్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్‌కు అవసరమైన ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం లంచం అడిగిన డాక్టర్‌ను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో మంత్రి ఆస్పత్రికి వచ్చారు. కాగా డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్లో గెజిటెడ్ సిగ్నేచర్ కోసం సెక్యూరిటీ గార్డు ద్వారా సంప్రదిస్తే డాక్టర్ డబ్బు లు అడిగాడని ఓ వ్యక్తి మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డును పిలిచిన హరీశ్, తమ సంభాషణను వీడియో తీయాల్సిందిగా అధికారులను ఆదేశించి.. ఏ డాక్టర్, ఎంత అడిగాడంటూ నిలదీశారు. మూర్తి (పీవీఎస్ఎన్ మూర్తి) అనే డాక్టర్ రూ.500 అడిగాడని సెక్యూరిటీ గార్డు చెప్పడంతో అక్కడికక్కడే ఆ డాక్టర్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాధారణ ప్రసవాలు పెంచాలి తనిఖీల్లో భాగంగా అవుట్ పేషెంట్ విభాగంతో పాటు అన్ని వార్డుల్లో హరీశ్ కలియతిరిగారు. అందుతున్న వైద్య సేవలను రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రసూతి విభాగంలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. మందులు, స్కానింగ్‌తో పాటు ఇతర పరీక్షలు బయటకు రాయవద్దని ఆర్ఎంఓ డాక్టర్ విజయకుమారిని ఆదేశించారు. 60 శాతానికి పైగా సాధారణ డెలి వరీలు కావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఖ్య మరింత పెంచాలని సూచించారు. గైనకాలజీ వార్డులో ప్రతిరోజూ స్కానింగ్‌లు చేయాలని ఆదేశిస్తూ మరో రెండు అల్ట్రా సౌండ్ మెషీన్లు అందజేస్తామని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మంత్రి తనిఖీలు నిర్వహించారు. -
Harish Rao: లంచం అడిగిన వైద్యుడు.. మంత్రి రియాక్షన్ ఇది
హైదరాబాద్: ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం లంచం అడిగిన ఓ వైద్యుడిపై నేరుగా వెళ్లి మరీ చర్యలు తీసుకున్నారు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. సోమవారం ఉదయం కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం డాక్టర్ లంచం డిమాండ్ చేస్తున్నారని కొందరు బాధితులు మంత్రి హరీష్‌రావుకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆకస్మికంగా ఆస్పత్రి తనిఖీలకు వెళ్లిన ఆయన.. వివరాలు తెలుసుకుని సదరు డాక్టర్‌పై అక్కడికక్కడే సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని సిబ్బంది హెచ్చరించారు. అనంతరం ఆస్పత్రి అంతా పరిశీలించి.. పేషెంట్లతో మాట్లాడారు. మంత్రి @trsharish గారు కొండాపూర్ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక సందర్శన. pic.twitter.com/pVfy3Dm1ce — Office of Minister for Health, Telangana (@TelanganaHealth) May 23, 2022 -
ఏరియా ఆసుపత్రిలో దారుణం
సాక్షి, వనస్థలిపురం(హైదరాబాద్): నగరంలోని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో సోమవారం ఓ శిశువు మృతి కలకలం రేపింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చిన్నారి చనిపోయాడంటూ బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గుల మండలం నల్లచెరువుకు చెందిన ఊట శేఖర్, ప్రసన్న దంపతులు మీర్‌పేటలో నివాసం ఉంటున్నారు. ప్రసన్న మొదటి కాన్పు నిమిత్తం మూడు రోజుల కిందట వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో చేరింది. సోమవారం ఉదయం 6 గంటలకు ప్రసవమై మగ శిశువు జన్మించాడు. బాలుడిని డ్యూటీలో ఉన్న డాక్టర్ విజయలక్ష్మి తలకిందులుగా చేసి వీపుపై తడుతుండగా కిందపడి చనిపోయినట్లు అక్కడే ఉన్న బాలుని అమ్మమ్మ మార్తమ్మ పేర్కొన్నారు. చదవండి: పసికందును అమ్మకానికి పెట్టిన తల్లి! అయితే చిన్నారి మృతి చెందిన విషయం చెప్పకుండా వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్ళాలని డాక్టర్ తమపై ఒత్తిడి తెచ్చినట్లు బంధువులు ఆరోపించారు. కాగా వైద్యురాలు విజయలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిప్రియ మాట్లాడుతూ బాబు కిందపడలేదన్నారు. నెలలు నిండకపోవడం, బలహీనంగా ఉండి, చలనం లేకపోవడంతోనే నీలోఫర్‌కు రిఫర్ చేశామని చెప్పారు. చదవండి: పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణకు కొత్త విధానం బాలుని తలపై గాయం ఉందని, డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందడంతో పోలీసులు చేరు కుని ఘర్షణ నివారించారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని మీర్‌పేట కార్పొరేటర్ రాజ్‌కుమార్, తదితరులు డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న వైద్యురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బంధువులు తెలిపారు. -
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో భట్టి పర్యటన
సాక్షి, భద్రాచలం: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. బాధితులకు వైద్య సేవలు అందించే విషయంలో సీఎం కేసీఆర్ చేతులెత్తేశారని అన్నారు. సీఎల్పీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రభుత్వ ఆస్పత్రుల సందర్శన కార్యక్రమాన్ని బుధవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రి నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీపీఈ కిట్లు ధరించి, కరోనా నిబంధనలు పాటిస్తూ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డును పరిశీలించి, అందిస్తున్న వైద్య సేవల గురించి సూపరింటెండెంట్ చావా యుగంధర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. కరోనా బారిన పడిన వారు ఉంటే ఉంటారు.. పోతే పోతారు అన్న చందంగా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో తాము పలు సూచనలు చేసినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా వైద్య పోస్టులను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. మూడు రాష్ట్రాలకు తలమానికంగా ఉన్న భద్రాద్రి ఏరియా ఆస్పత్రిలో కనీసం 1/3 వంతు మంది సిబ్బంది కూడా లేరని అన్నారు. ఇక్కడ మొత్తం 205 మంది పని చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 61 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలకు మెరుగైన వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఇదే ఆస్పత్రిలో పనిచేసే డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఈ ప్రాంత మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని, అలాంటి వారికే దిక్కు లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ఈ ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది కొరత గురించి గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని, అయినా సర్కారు పెడచెవిన పెట్టిందని విమర్శించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్య, ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ఐసోలేషన్ ఆవరణలో వైద్యుల చిందులు
బెల్లంపల్లి: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొందరు వైద్యులు బాధ్యతారహితంగా వ్యవహరించారు. ఏకంగా ఐసోలేషన్ కేంద్రం ఆవరణలో సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి మరీ చిందులేశారు. వివరాలు.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలోని కరోనా వైరస్ అనుమానితులను అబ్జర్వేషన్లో ఉంచడానికి ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలను పురస్కరించుకొని మంగళవారం ఏరియా ఆస్పత్రి ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వైద్యులు, సిబ్బంది ఐసోలేషన్ కేంద్రం ఆవరణలో పాటలు, నృత్యాలతో హోరెత్తించారు. ఈ వ్యవహారాన్ని కొందరు సెల్ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ అయింది. మనస్పర్ధలే కారణమా?: సింగరేణి ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నృత్యాలు చేసిన విషయాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగానే సెల్ఫోన్లలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీని వెనుక కుట్ర దాగి ఉన్నట్లు సిబ్బంది అనుమానిస్తున్నారు. ఇటీవల నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏరియా ఆస్పత్రిలో కేక్ కట్ చేయడానికి ఓ ప్రజా ప్రతినిధి వెళ్లినట్లు సమాచారం. ఐసోలేషన్ వార్డు ఏర్పా టు చేసినందువల్ల వేడుకలు నిర్వహించరాదని ఓ వైద్యుడు నిరాకరించినట్లు తెలిసింది. దీంతో సదరు ప్రజాప్రతినిధి నర్సుల వేడుకల్లో పాల్గొనకుండానే వెనుదిరిగినట్లు సమాచారం. దీన్ని కొందరు సిబ్బంది అవమానకరంగా భావించడంతోనే వైద్యులు, సిబ్బందిలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు. -
24 వేళ్లతో శిశువు జననం
విజయనగరం, పార్వతీపురంటౌన్: పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో 24 వేళ్లతో శిశువు జన్మించింది. మండలంలోని మరికి గ్రామానికి చెందిన బి.లావణ్య మొదటి కాన్పులో 24వేళ్లతో ఉన్న శిశివుకు జన్మనిచ్చిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.వాగ్దేవి తెలిపారు.చేతులు, కాళ్లకు ఆరు చొప్పున వేళ్లు ఉన్నాయన్నారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారన్నారు. జన్యుపరమైన కారణాలవల్ల ఇటువంటి అరుదుగా జరుగుతాయని తెలిపారు. లావణ్య ఆడపడుచుకు కూడా ఇలాగే 24 వేళ్ల ఉన్నాయని తెలిపారు. -
ప్రభుత్వాస్పత్రిలో స్టాఫ్‌నర్స్ ఆత్మహత్య
పాలకొండ రూరల్: శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ వంద పడకల ఏరియా ఆసుపత్రిలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్న కాకర్ల హేమలత (32) గురువారం ఆసుపత్రిలోని డ్యూటీ రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం 4:30 గంటలకు తన డ్యూటీ రూమ్‌కు వెళ్లిన ఆమె గంట వరకు బయటకు రాలేదు. ఈ క్రమంలో హేమలత కుటుంబసభ్యులు ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు. దీంతో వారు సహచర సిబ్బందికి ఫోన్ చేశారు. సహచరులు డ్యూటీ రూమ్ కిటికీ నుంచి చూడగా హేమలత ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించిందని, అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉన్నట్లు తెలిసింది. అయితే దీన్ని పోలీసులు ధృవీకరించలేదు. -
బాపట్ల ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సస్పెన్షన్
సాక్షి, బాపట్ల: బాపట్లలోని పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలలో అరకోటి రూపాయలకు పైగా జరిగిన నిధుల స్కామ్‌లో ఎట్టకేలకు జిల్లా యంత్రాంగం చర్యలకు పూనుకుంది. ‘సాక్షి’ దినపత్రికలో గత రెండు నెలలుగా ప్రచురించిన వివిధ కథనాలకు స్పందించిన జిల్లా యంత్రాంగం ఆడిట్ నిర్వహించేందుకు ముందుకు రాగా ఒక్కొక్కటిగా తవ్వేకొద్దీ ఆవినీతి బయటపడింది. రెండు నెలలుగా జిల్లా ఆడిట్, రాష్ట్ర అడిట్ అధికారులు నిర్వహించిన రెండేళ్ల ఆడిట్లో రూ.50,19,820 నిధులు స్వాహా అయ్యాయని ఏరియా వైద్యశాలల జిల్లా కో ఆర్డినేటర్ ప్రసన్నకుమార్ ప్రకటించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన గత సూపరింటెండెంట్ డాక్టర్ ఆశీర్వాదాన్ని సస్పెండ్ చేయగా, కాంట్రాక్టు ఉద్యోగులు సుబ్రహ్మణ్యస్వామి, చిరంజీవిలను విధుల నుంచి తొలగించారు. వీరి ముగ్గురిపై బాపట్ల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక ఏరియా వైద్యశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏరియా వైద్యశాలల జిల్లా కో ఆర్డినేటర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ బాపట్ల ఏరియా వైద్యశాలలో రెండేళ్లుగా ఆడిట్ నిర్వహించకపోవటంతో అభివృద్ధి నిధులు, స్పెషల్ రూముల అద్దెలు, పలు షాపుల అద్దెలు, ఆపరేషన్లు, గర్భిణులకు ఇవ్వాల్సిన చెక్కులు, కాంట్రాక్టు ఉద్యోగులకు అత్యధికంగా వేతనాలు చెల్లించేందుకు పలు అకౌంట్ల సృష్టికి నిధులను దారిమళ్లించినట్లు గుర్తించామన్నారు. అభివృద్ధి కమిటీ, సూపరింటెండెంట్ ఉమ్మడిగా చెక్కులను డ్రా చేయించి సొంత ఖాతాల్లో నిధులు జమ చేసుకోవటంతో రాష్ట్ర ఆడిట్, జిల్లా ఆడిట్ విభాగాలతో పరిశీలన చేయించి పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేయించామని చెప్పారు. ఈ పరిశీలన రెండు నెలలుగా జరుగుతుండగా మొత్తం రూ.50,19,820 నిధుల గోల్మాల్ జరిగినట్లు నిర్ధారించామని చెప్పారు. నోటీసులు జారీ.. గత రెండేళ్లుగా బాపట్లలో సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ ఆశీర్వాదాన్ని సస్పెండ్ చేసి, నోటీసులు జారీ చేశామని జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్నకుమార్ చెప్పారు. జిల్లా కోఆర్డినేటర్‌తో పాటు ప్రస్తుత సూపరింటెండెంట్ డాక్టర్ రసూల్ శుక్రవారం బాపట్ల టౌన్ పోలీసు స్టేషన్లో ఎస్ఐ హజరత్తయ్యకు లిఖిత పూర్వకంగా ఈమేరకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ ఆశీర్వాదంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు సుబ్రమణ్యస్వామి, చిరంజీవిపై కూడా ఫిర్యాదు చేశారు. ఈవిషయంపై ఎస్ఐ హజరత్తయ్య మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. బాపట్ల ఏరియా వైద్యశాలలో నిధుల దుర్వినియోగం తీరు చూస్తే ఇంకా లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని, అంతర్గత ఆడిట్లు కూడా నిర్వహించి ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉంటే చర్యలు తీసుకుంటామని ప్రసన్నకుమార్ తెలిపారు. ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. -
ప్రాణం ఉండగానే పాడి కట్టేందుకు ఏర్పాట్లు
-
మెడాల్.. పరీక్షలు నిల్
తణుకు అర్బన్: తణుకు ఏరియా ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న ప్రైవేటు వైద్య పరీక్షల సంస్థ మెడాల్ వారం రోజులుగా మూతపడింది. దీంతో ఆస్పత్రికి వచ్చే పేద రోగులు వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఆస్పత్రిలోని ల్యాబ్ కొన్ని పరీక్షలకే పరిమితం చేసి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మెడాల్ సంస్థచే 48 రకాల ఖరీదైన వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకువచ్చారు. కాని సంస్థకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వేతనాల బకాయిలు అందకపోవడంతో సేవలు నిలిచిపోయాయి. థైరాయిడ్, ప్లేట్లెట్స్ కౌంట్, లివర్ ఫంక్షన్, లిపిడ్ ప్రొఫైల్, క్యాన్సర్ నిర్ధారణ వంటి పరీక్షలు అందుబాటులో ఉన్న ఈ సేవలు నిలిచిపోవడంతో రోగులు ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లి డబ్బులు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. మూడు నెలలుగా వేతనాల్లేవ్ మెడాల్ సంస్థ ఆధ్వర్యంలో స్థానికంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థ వైద్యపరీక్షలను నిలిపివేసింది. తమకు రావాల్సిన మొత్తాన్ని మెడాల్ సంస్థ చెల్లించలేదని ప్రభుత్వం నుంచి వారికి బిల్లులు రాకపోవడంతో తమకు కూడా నిలిపివేశారని మెడాల్ అనుబంధ సంస్థ అయిన ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకులు చెబుతున్నారు. వైద్యపరీక్షలు చేస్తున్న సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో సిబ్బంది కూడా విధులకు హాజరుకావట్లేదని తెలుస్తోంది. నిత్యం 500 మందికి పైగా.. తణుకు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యవర్గాలు అందిస్తున్న నాణ్యమైన వైద్యసేవల కారణంగా ఇటీవల కాలంలో నిత్యం 500కు పైగా రోగులు, గర్భిణులు వైద్యసేవల కోసం వస్తున్నారు. ఇందులో 70 శాతం మందికి వివిధ పరీక్షలు వైద్యులు రాస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులు అల్లాడుతున్నారు. ప్రైవేట్ ల్యాబ్‌ల్లో వైద్య పరీక్షలు చేయించుకుని తమ జేబులు గుల్లచేసుకుంటున్నామని వాపోతున్నారు. ప్రైవేటు ల్యాబ్‌కు వెళ్లాల్సిందే.. మా నాన్నకు ఆరోగ్యం సరిగాలేదని వైద్యులు కొన్నిరకాల పరీక్షలు చే యించుకోమన్నారు. ఆస్పత్రిలో మెడాల్ వైద్యపరీక్షలు నిలిచిపోవడంతో ప్రైవేట్ ల్యాబ్‌లో చేయించాల్సి వచ్చింది. ఆస్పత్రిలో ఈ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలి.– బి.సాయి కమార్, తణుకు వారం రోజులుగా నిలిచిపోయాయి ఆస్పత్రిలో అందుబాటులో ఉండే మెడాల్ వైద్య పరీక్షలు వారం రోజులుగా నిలిచిపోయాయి. ఒక రోజు స్ట్రైక్ చేస్తున్నామని చెప్పారు కాని ఇప్పటివరకు విధుల్లోకి రాలేదు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వైద్య పరీక్షలు మాత్రమే బయటికి రాస్తున్నాం.– డాక్టర్ వెలగల అరుణ, తణుకు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
మందుబాబుల అడ్డాగా ఏరియా ఆసుపత్రి
సాక్షి, హైదరాబాద్ : మలక్‌పేట ఏరియా ఆసుపత్రి మందుబాబుల అడ్డాగా మారింది. రాత్రి అయితే చాలు ఆసుపత్రి ప్రాంగణంలో మందుబాబులు దర్శనమిస్తున్నారు. రాత్రుళ్లు ఏరియా ఆసుపత్రి బార్‌ను తలిపించేలా మారుతోంది. ఆసుపత్రి ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. సీసీ కెమరాలు ఉన్నా సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో సెక్యూరిటీ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది కలిసి పార్టీలు చేస్తున్నట్లు సమాచారం. వీళ్లకు మద్దతుగా పార్కింగ్ సిబ్బంది తోడు అవ్వటంతో అర్ధరాత్రి అవ్వగానే ఆసుపత్రిలా కాకుండా మలక్‌పేట ఏరియా బార్లా కనిపిస్తోంది. -
కుప్పం ఏరియా ఆస్పత్రిలో దయనీయ పరిస్థితులు
-
లేనిది ఉన్నట్టు.. అంతా కనికట్టు
జంగారెడ్డిగూడెం : ఒక్కసారిగా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యపరికరాలు వచ్చేశాయి. ఆయా విభాగాల్లో వైద్యపరికరాలు ఏర్పాటు చేసేశారు. ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా కనిపించేలా ముస్తాబు చేశారు. దీంతో ప్రజలు, రోగులు ఆహా ఏరియా ఆసుపత్రికి అన్ని సదుపాయాలు, వైద్యపరికరాలు వచ్చేశాయి అనుకున్నారు. మూడు రోజుల పాటు వైద్యసేవలు కూడా వైద్యులు అలాగే అందించారు. వైద్యులు సిబ్బంది ఠంచన్‌గా విధులకు హాజరయ్యారు. రోగులంతా ఓహో అనుకున్నారు. ఇదంతా నాలుగు రోజుల క్రితం మాట. అయితే శుక్రవారం ఏరియా ఆసుపత్రికి వచ్చిన రోగులకు షాక్ ఎదురైంది. సినిమా సెట్టింగ్‌లు మాదిరిగా ప్యాకప్ చెప్పినట్లు ఏరియా ఆసుపత్రికి వచ్చిన వైద్య పరికరాలు ప్యాక్ చేసి తరలిస్తున్నారు. ఏం జరుగుతుందో రోగులకు అర్థం కాలేదు. ఇంతకీ వైద్యపరికరాలన్నీ ఏలూరు ఆసుపత్రివట. మూడు రోజుల పాటు ఇక్కడ ఉంచి వాటిని శుక్రవారం ప్యాక్ చేసి తిరిగి ఏలూరు ఆసుపత్రికి తరలించేశారు. దీనికి కారణం ఏమిటంటే ఏరియా ఆసుపత్రి పనితీరుపై గ్రేడింగ్ ఇచ్చేందుకు ముగ్గురు వైద్యులతో కూడిన వైద్యబృందం వచ్చింది. మంగళ, బుధ, గురువారాల్లో కేంద్ర బృందంలోని వైద్యులు డాక్టర్ మినీ మోలా, డాక్టర్ బీఎన్ వ్యాస్, డాక్టర్ అర్చన వర్మలు ఇక్కడే మకాం చేసి ఏరియా ఆసుపత్రి ప్రతి అంగుళం పరిశీలించి, వైద్యులు, వైద్యపరికరాలు, రోగులకు అందుతున్న వైద్యసేవలు, సిబ్బంది పనితీరు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ బృందం వస్తున్న సందర్భంగానే ఏరియా ఆసుపత్రిలో లేని వైద్యపరికరాలన్నీ తీసుకువచ్చి హడావుడిగా ఆయా విభాగాల్లో అమర్చారు. హృద్రోగ విభాగం, స్కానింగ్ ఇలా అన్ని విభాగాల్లో అధునాతన పరికరాలు ఏర్పాటు చేసి కేంద్ర బృందానికి ఇక్కడ అన్నీ ఉన్నట్లు సినీమాయ చేశారు. గురువారం సాయంత్రం కేంద్ర బృందం వెళ్లిపోయింది. దీంతో శుక్రవారం ఉదయం ప్యాకప్ చెప్పేశారు. ఏలూరు నుంచి వచ్చిన పరికరాలను ప్యాక్ చేసి లారీలో ఏలూరుకు తరలించేశారు. చివరకు కేంద్ర బృందాన్ని కూడా మన వైద్యాధికారులు, వైద్యులు తమ నైపుణ్యంతో లేనిది ఉన్నట్టుగా చూపి మహా మాయ చేశారు. శుక్రవారం ఆసుపత్రికి వచ్చిన రోగులు ఈ తతంగం చూసి మరో శంకర్‌దాదా సినిమాలో హీరో తన తండ్రి వస్తున్నాడని తెలియగానే ఇంటిని ఆసుపత్రిగా మార్చి చేసిన మాయను, మరోసారి ఇక్కడ చూస్తున్నట్లుగా ఫీలయ్యారు. -
మృగాళ్ల దాష్టీకం
నెల్లూరు , గూడూరు: మతిస్థిమితంలేని యువతిని కొందరు మృగాళ్లు తల్లిని చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా తమ కామవాంఛ తీర్చుకుని గర్భవతిని చేశారు. పురిటి నొప్పులతో అల్లాడుతుండగా గూడూరు ఏరియా ఆస్పత్రి సీమాంక్ సెంటర్లో స్థానికులు చేర్చారు. ఆమె ఆడబిడ్డను ప్రసవించింది. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. గూడూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఈ నెల 7వ తేదీన పురిటి నొప్పులు పడుతూ కింద పడి అల్లాడుతున్న ఓ యువతిని అక్కడే పండ్లు అమ్ముకునే ఓ మహిళ చూసింది. ఆమె ఆ పరిసరాల్లో ఎంత సేపు చూసినా కూడా ఆ యువతి వద్దకు ఎవరూ రాకపోవడంతో ఆమె దగ్గరకు వెళ్లి చూడగా, ఆ యువతి నిండు గర్భిణిగా గుర్తించి ఆటోలో స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద వదిలేసి వెళ్లిపోయింది. ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది ఆ యువతిని స్ట్రెక్చర్‌పై తీసుకెళ్లి సీమాంక్లో చేర్పించారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యులు ఆమెకు పురుడు పోశారు. మృగాళ్ల కామవాంఛకు బలైన ఆ యువతి ఆడ బిడ్డను ప్రసవించింది. అప్పటి నుంచి ఆస్పత్రి వైద్యులు, సిస్టర్లు ఆమె వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించగా, తన పేరు నాగమణి, తండ్రి పేరు రమణయ్య, తల్లి లక్ష్మమ్మగా చెబుతోంది. తాను కోట, గూడూరులోనూ భిక్షమెత్తుకుని జీవనం సాగిస్తుంటానని కొంత సేపు చెబుతోంది. కొంత సేపు ఏమీ చెప్పుకుండానే మౌనంగా అమాయక చూపులు చూస్తూ ఉంటుంది. ఆస్పత్రి సిబ్బంది 1వ పట్టణ పోలీసులకు ఇవ్వడంతో వారు వచ్చి విచారించి వెళ్లారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ ఆమె కోసం ఎవరూ రాలేదు. ఐసీడీఎస్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వగా, వారు వచ్చి తమతో రావాలని కూడా చెప్పగా, తాను రానని, మా అవ్వ వస్తోందని మీతో రానని చెబుతుందని ఆస్పత్రి సిబ్బంది అంటున్నారు. -
పేద రోగులకు కష్టం.. నష్టం
మార్కాపురం: పశ్చిమ ప్రకాశంలో ఏకైక 100 పడకల వైద్యశాలగా ఉన్న మార్కాపురంలోని ఏరియా వైద్యశాలలో గత 10 రోజుల నుంచి ఎక్స్‌రే యూనిట్ చెడిపోయింది. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఏరియా వైద్యశాలకు గిద్దలూరు నుంచి పుల్లలచెరువు వరకు ఉన్న 12 మండలాల్లోని రోగుల వైద్యసేవల నిమిత్తం ఆసుపత్రికి వస్తుంటారు. ప్రధానంగా నల్లమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరిగినా, ఇతరత్రా రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారిని చికిత్స నిమిత్తం కచ్చితంగా ఎక్సరే తీయాలి. రోజుకు 400 నుంచి 450 మంది వరకు రోగులు ఓపీ విభాగంలో చికిత్స పొందుతారు. వీరిలో ప్రతి రోజూ 60 నుంచి 70 మంది వరకు ఎక్స్‌రే తీయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాళ్లు, చేతులు విరిగిన వారికి, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి, రోడ్డు ప్రమాద బాధితులకు మెడనొప్పి, పంటి నొప్పితో బాధపడుతున్న వారికి చికిత్స చేయాలంటే ఎక్స్‌రే అవసరం. అయితే ఎక్స్‌రే ప్లాంట్ లేకపోవటంతో వైద్యశాలలోని వైద్యులు రోగులకు బయట ఎక్స్‌రే తీయించుకోమని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రోగులకు ఆర్థిక భారం తప్పటం లేదు. కొన్ని రకాల చికిత్సలకు కచ్చితంగా ఎక్స్‌రే ఆధారంగానే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో రోగులు 150 నుంచి 200 రూపాయలు చెల్లించి బయట తీయించుకుంటున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లాం: వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎక్స్‌రే ప్లాంట్ చెడిపోయిన విషయాన్ని వైద్య విధాన పరిషత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో బాగు చేయించి రోగులకు సేవలు అందించేందుకు ప్రయత్నిస్తాం.- చక్కా మాలకొండ నరసింహారావు -
టెక్కలి ఆస్పత్రిలో ఉద్రిక్తత
టెక్కలి రూరల్/నందిగాం : టెక్కలి ఏరియా ఆస్పత్రిలో ప్రసూతి వైద్యురాలు శార్వాణీ చేసిన శస్త్రచికిత్స వికటించి బాలింత మృతి చెందిందంటూ మృతురాలి బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేశారు. శనివారం ఉదయం నుంచి ఆస్పత్రి ఎదు ట ధర్నా చేశారు. అనంతరం రహదారిపై బైఠాయించడంతో సుమారు 5 గంటల పాటు ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. ఉద్రి క్తత తారా స్థాయికి చేరుకునే లోపు ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని అధికారులు, డా క్టర్లు, సంఘం నాయకులతో, మృతురాలి బం ధువులతో చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతురాలి బం ధువులు కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. మందస మండలం సువర్ణపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి తారకరావుకు నందిగాం మండలం పాలవలస గ్రామానికి చెందిన గుర్రల వాసు కుమార్తె లక్ష్మి(24)కి సుమారు ఐదేళ్ల కిందట వివాహమయింది. వీరికి మూడేళ్ల కుమారుడు రుత్విక్ ఉన్నాడు. అయితే లక్ష్మి రెండో కాన్పు నిమిత్తం తన అత్తవారింటి నుంచి కన్నవారింటికి పాలవలస వచ్చింది. గురువారం ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ శార్వాణీ అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి శుక్రవారం ఉదయం 11 గంటలకు శస్త్రచికిత్స చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది లక్ష్మి. అనంతరం డాక్టర్ ఈమెకు కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స కూడా పూర్తిచేసి తల్లీ పిల్లలు బాగున్నారని భావించి ప్రసూతి విభాగానికి తరలించా రు. వారిని వార్డుకు తరలించే క్రమంలో అక్కడే ఉన్న కిందిస్థాయి సిబ్బంది శస్త్రచికిత్స ఖర్చులు నిమిత్తం రూ. 2100 తీసుకున్నట్టు లక్ష్మి అన్నయ్య గుర్రాల గణపతి తెలిపారు. అయితే అక్కడికి కొంత సమయం తర్వాత సాయంత్రం 4 గంటలకు లక్ష్మికి బ్లీడింగ్(రక్తం) అవుతుందని తన సోదరుడు గుర్రాల గణపతి నర్సులకు చెప్పగా, వారు మీరు మాకు చెప్పడం ఏమిటి... ముందు మీరు బయటకు నడవండి.. మీరు ఇక్కడ ఉండకూడదు అని తూలనాడారు. దీంతో అతడు బయటకు వచ్చేశాడు. ఆమెకు ఏమి అవ్వదు మాకు తెలుసు అని చెబుతూ రక్తాన్ని గుడ్డతో తుడిచేశారు. బ్లీడింగ్ మరీ ఎక్కువవడంతో డాక్టర్ శార్వాణీకి సమాచారం ఇవ్వడంతో ఆమె లక్ష్మికి బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి మందులు ఇచ్చారు. తర్వాత ఆస్పత్రిలో ఏబీ పాజిటివ్ రక్తం లేకపోవడం, లక్ష్మి బీపీ డౌన్ అవ్వడంతో సాయంత్రం 7 గంటల సమయంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చేరిన తర్వాత లక్ష్మి మృతి చెందింది. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, భర్త తారకరావు, సోదరుడు గణపతి టెక్కలి ఆస్పత్రి సిబ్బంది తీరుపై మండిపడ్డారు. టెక్కలి ఆస్పత్రిలోని నర్సులు, వైద్యులు కలిసే లక్ష్మిని చంపేశారని, పిల్లలను అనాథలను చేశారని వాపోయారు. మృతదేహాన్ని పట్టుకుని టెక్కలి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అర్ధరాత్రి 12 గంటలు దాటింది తెల్లవారి ఫిర్యాదు ఇవ్వండి అని పోలీసులు అనడంతో వారు వెళ్లిపోయారు. అయితే శనివారం ఉదయం నుంచే మృతురాలి కన్నవారు ఊరు పాలవలస, అత్తవారి ఊరు సువర్ణపురం గ్రామస్తులు, నాయకులు తదితరులతో కలిసి ఆస్పత్రి గేటు ముందు ధర్నాకు దిగారు. సుమారు గంటపాటు రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో టెక్కలి సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సురేష్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రించారు. అనంతరం టెక్కలి ఆర్డీఓ వెంకటేశ్వరరావు, తాహసీల్దార్ ఆర్.అప్పలరాజు, ఆస్పత్రి సూపరింటెండెంట్ కణితి కేశవరావు, జనసేన నాయకుడు యాదవ్, దళిత ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ చల్ల రామారా>వు, దళిత మహాసభ జిల్లా అధ్యక్షులు బొకర నారాయణరావు, కేఎన్పీఎస్ నాయకులు బెలమర ప్రభాకరరావు, ఈశ్వరరావు కలిసి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. నిర్లక్ష్యంగా వైద్యం అందించి లక్ష్మి మృతికి కారణమైనందుకు వైద్యులు, వైద్య సిబ్బందిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అధికారులు సుదీర్ఘంగా చర్చలు జరిపి చివరకు సమస్యను పరిష్కరించారు. టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద జ రుగుతున్న ఆం దోళనను తెలుసుకున్న కాశీబుగ్గ డీఎస్పీ రాఘవ ఘటనా స్థలానికి చేరుకుని అధికారులు, బాధితుల నుంచి సమాచారం అడిగితెలుసుకున్నారు. బాధితులకు అందించే సౌకర్యాలు మృతురాలు లక్ష్మికి చెందిన ఇద్దరు పిల్లలకు అంగన్వాడీ కేంద్రం ద్వారా పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించేవిధంగా చర్యలు తీసుకుంటాం. పిల్లలు పేరు మీద నందిగాం మండల కేంద్రంలో రెండు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ స్థలం ఎక్కడైన గుర్తించినట్టు అయితే ఎకరా పొలం, చంద్రన్న బీమా ఉంటే వచ్చేలా కృషిచేస్తాం. ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆర్థిక సహాయం వచ్చేలా కృషి చేస్తామని అధికారులు తెలిపారు. అదేవిధంగా తక్షణ సహా యం కింద బాధిత కుటుం బానికి రూ. 40 వేలు ఆర్థిక సహాయం చేశారు. -
మంత్రి ఇలాకాలో మృత్యు ఘోష!
టెక్కలి : టెక్కలి ఏరియా ఆస్పత్రి తరచూ వివాదాల్లోకి వెళ్తోంది. వైద్యం కోసం వచ్చేవారిలో ఎవరో ఒకరు.. ఏదో ఒక కారణంతో చనిపోతున్నారు. దీనికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగుతున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతిని ధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆస్పత్రిలోనే తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం టెక్కలి భూలోకమాతవీధికి చెందిన ఓ యువకుడు ద్విచక్ర వాహనం ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా వైద్యం కోసం ఏరియా ఆస్పత్రిని ఆశ్రయించారు. చికిత్స అనంతరం యువకుడు మృతి చెందాడు. దీనికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ యువకుడి మృతదేహంతో భూలోకమాతవీధికి చెందిన ప్రజలు ఏరియా ఆస్పత్రిని ముట్టడించారు. పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అక్కడకు కొద్ది రోజుల తరువాత ఆంజేయపురం గ్రామానికి చెందిన ఓ మహిళ ఇదే ఆస్పత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందింది. అప్పట్లో గ్రామస్తులు ఆస్పత్రి సిబ్బంది తీరుపై నిరసన చేపట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో స్థానిక ఆదిఆంధ్రావీధికి చెందిన ఓ యువకుడు అనారోగ్యం బారిన పడడంతో ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం అతను మృతి చెందాడు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా యువకుడు చనిపోయాడంటూ ఆదిఆంధ్రావీధికి చెందిన వారంతా మృతదేహంతో ఏరియా ఆస్పత్రి ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తాజాగా నందిగాం మండలం పాలవలస గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి అనే బాలింత మృతి చెందడంపై, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆస్పత్రి ఎదుట నిరసన చేశారు. ఇదంతా కేవలం ఏడాది కాలంలో చోటు చేసుకున్న సంఘటనలు. గతంలో ఇటువంటి సంఘటనలు అనేకంగా జరిగిన దాఖలాలు ఉన్నాయి. అయితే మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గ కేంద్రమైన టెక్కలిలో ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యపు మరణాలు జరుగుతుండడంపై తాత స్థాయిలో మంత్రి వైఫల్యాన్ని ప్రజలు ఎండ గడుతున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై పెల్లుబికుతున్న విమర్శలు ఏరియా ఆస్పత్రిలో కొంతమంది వైద్య సిబ్బంది అనుసరిస్తున్న తీరు, నిర్లక్ష్యంపై తారస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిండమే కాకుండా అత్యవసర సమయంలో అందుబాటులో ఉండడం లేదంటూ ఆరోపణలున్నాయి. రాత్రి వేళల్లో ఆస్పత్రిలో విధుల్లో ఉండాల్సిన సిబ్బంది కొన్ని సమయాల్లో అందుబాటులో ఉండడం లేదు. అంతేకాకుండా వార్డుల్లో ఉన్న రోగుల పట్ల కూడా సిబ్బంది కసురుకోవడం పరిపాటిగా మారిందంటూ రోగులు చెబుతున్నారు. అలాగే ప్రసూతి విభాగంతో పాటు ఇతర విభాగాల్లో ఆపరేషన్లకు డబ్బులు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏదైనా సంఘటన జరిగినపుడు ఉన్నతాధికారులు రావడం, ఇరువర్గాలను కూర్చోబెట్టడం సామరస్యంగా రాజీలు చేయడం పరిపాటిగా మారిందం టూ బహిరంగంగా విమర్శలు ఉన్నాయి. తాజాగా శనివారం జరిగిన బాలింత మృతి విషయంలో ఆపరేషన్‌కు ముందు ఆపరేషన్ థియేటర్ దగ్గర ఉన్న సిబ్బంది 2100 రూపాయలు తీసుకున్నారని మృతురాలి సోదరుడు ఉన్నతాధికారుల వద్ద రోదిస్తూ చెప్పడం గమనించదగ్గ విషయం. మంత్రి ఏం చేస్తున్నారు? ఏరియా ఆస్పత్రిలో తరచూ నిర్లక్ష్యపు మరణాలు జరుగుతున్నప్పటికీ మంత్రి ఏం చేస్తున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హడావుడిగా ఆస్పత్రిని సందర్శించడం ఆ తరువాత ఆస్పత్రిలో వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయో కనీసం దృష్టి సారించడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆస్పత్రిలో వైద్య సేవలపై ప్రజలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరో వైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై తీసుకునే క్రమశిక్షణ చర్యలు కూడా సన్నగిల్లడంతో, ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణి తీరు మారడం లేదంటూ బాధితులు చెబుతున్నారు. మంత్రి మాటలు.. నా నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తా. – పలు బహిరంగ సభల్లో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివి. వాస్తవం ఇలా.. మంత్రి ఇలాకాలోని వంద పడకల ఏరియా ఆస్పత్రిలో కొద్ది రోజులుగా మరణ ఘోష వినిపిస్తోంది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి కూడా బాలింత చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె చనిపోయిందంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. ఆపరేషన్‌కు రూ.2,100 తీసుకున్నారు మా చెల్లి లక్ష్మిని కాన్పు కోసం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాం. ఆపరేషన్ కోసం థియేటర్ వద్దకు తీసుకువెళ్లాం. అక్కడ సిబ్బంది మా దగ్గర 2,100 తీసుకున్నారు. ఆపరేషన్ తరువాత పట్టించుకోకపోవడంతో మా చెల్లి మృతి చెందింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వలనే ఈ ఘోరం జరిగింది. –గుర్రాల గణపతి, పాలవలస, నందిగాం మండలం. సరిగ్గా పట్టించుకోవడం లేదు జ్వరం, నీరసంతో వారం కిందట ఆస్పత్రిలో చేరాను. ఇక్కడ సరిగ్గా పట్టించుకోవడం లేదు. నర్సులకు అడిగితే ఏవో మాత్రలు ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఆ మాత్రలు వేసుకున్న తరువాత కడుపులో మంటతో నరకాన్ని చూస్తున్నాను. నర్సులకు అడిగితే కసిరేస్తున్నారు. –బొచ్చ రాము, రోగి, భగవాన్‌పురం, టెక్కలి మండలం. ప్రజా రోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గ కేంద్రమైన టెక్కలిలో ప్రజారోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏరియా ఆస్పత్రిలో వరుసగా నిర్లక్ష్యపు మరణాలు సంభవిస్తుంటే మంత్రి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇదేనా ప్రజలకు అందజేసే మెరుగైన వైద్యం. కమీషన్ల వైపే కాకుండా ప్రజల ఆరోగ్యంపై మంత్రి దృష్టి పెడితే మంచిది. ఏరియా ఆస్పత్రిలో జరుగుతున్న సంఘటనలతో ప్రజలు ఆస్పత్రికి రావాలంటే భయపడుతున్నారు. ఈ సంఘటనలపై ప్రజలకు మంత్రి సమాధానం చెప్పాలి. –పేరాడ తిలక్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, టెక్కలి. -
వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి!
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): వైద్యులు సకాలంలో స్పందించకపోవడం వల్లే శిశువు చనిపోయిందంటూ బాలింత బంధువులు ఆరోపించారు. వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలంటూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాడేపల్లిగూడేనికి చెందిన షేక్ పరహానా గర్భిణి కావడంలో తొమ్మిది నెలలుగా స్థానిక ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతోంది. పరీక్షలు చేయించడంతో పాటు మందులు వాడింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పరిహానాకు కడుపులో నొప్పిగా ఉండటంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటివరకూ ఆమెకు వైద్యం చేసిన వైద్యురాలు ఆసమయంలో అందుబాటులో లేరు. వైద్యురాలి సూచన మేరకు సిబ్బంది ఆస్పత్రిలో చేర్చుకున్నారు. ఆరోజు, తర్వాత రోజు ఆదివారం ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది గర్భిణి పరహానాను పట్టించుకోలేదు. సోమవారం వైద్యురాలు వచ్చిన తర్వాత పరీక్షించి ఆపరేషన్ చేయాలని చెప్పారని, అవసరమైతే మరో రోజు కూడా ఆగవచ్చని అన్నారని బంధువులు అంటున్నారు. తాము ఆపరేషన్ చేసేం దుకు అంగీకరించగా సోమవారం ఉద యం ఆపరేషన్ చేయగా మృత శిశువు జన్మించిందని వాపోయారు. ఆస్పత్రిలో వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతోనే ఇలా జరిగిందని ఆరోపించారు. దీనిపై ఏరియా ఆస్పత్రి సూపరిం టెండెంట్ శివప్రసాద్ స్పందిస్తూ పరహానాకు వైద్యసేవలు అందించామన్నారు. అన్ని వివరాలను జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శంకరరావుకు తెలియజేశామన్నారు. డాక్టర్ల్ల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయిందని బాధితురాలి బంధువులు నిరసన వ్యక్తం చేయడంతో పాటు, వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. -
అమ్మో... ఎన్నాళ్లీ నరకం
పెద్దాపురం: ‘‘ఇవెక్కడి వైద్యసేవలు.. మంత్రి గారేమో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగుపరిచాం అంటారు.. ఇక్కడ చూస్తే వైద్యులు అందుబాటులో ఉండరు.. కనీసం పట్టించుకునే వారే కనిపించరు. ఇలాగేనా సేవలందించేంది’’ అంటూ పలువురు హోంమంత్రి నియోజకవర్గంలోని పెద్దాపురం ఏరియా ఆసుపత్రి వైద్యులను నిలదీశారు. వివరాల్లోకి వెళితే.. సామర్లకోట నుంచి ప్రత్తిపాడు ప్రయాణికులతో వెళుతున్న ఆటోను పెద్దాపురం జి.రాగంపేట గ్రామంలో ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు టైరు పంక్చరై అదుపుతప్పి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిలో పెద్దాపురానికి చుందిన అడబాల వీర సత్యవేణి, ముక్కొల్లుకు చెందిన భార్యభర్తలు పద్మరాజు, సీతాయ్యమ్మ , రాయవరం మండలం వెదురుపాకకు చెందిన పెదిరెడ్డి కామేశ్వరరావు, పిఠాపురం మండలం విరవ గ్రామానికి చెందిన సీకోటి అప్పలరాజు, సామర్లకోటకు చెందిన సీహెచ్ ప్రభావతిలకు తీవ్ర గాయాలు కాగా, విరవకు చెందిన సీకోటి అప్పారావు, మరో ఇరువురుకి స్పల్ప గాయాలయ్యాయి. క్షతగ్రాతులందరినీ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. దీంతో వారి బంధువులు తీవ్ర నిరసనకు దిగారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైద్యులు రవికాంత్‌కు ఫోన్‌చేసి.. ‘‘ఇదెక్కడి వైద్యసేవలు.. మంత్రి గారేమో ఆసుపత్రి వైద్య సేవలు మెరుగుపరిచాం అంటారు.. ఇలాగేనా సేవలందేది? అంటూ వైద్యులపై మండిపడ్డారు. దీంతో ఆయన అందుబాటులో అతిరాత్రం వద్ద ఉన్న వైద్యురాలు సుదీప్తిని ఆసుపత్రికి పంపించగా ఆమె ప్రాథమిక చికిత్స చేసి అనంతరం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సిబ్బంది అందుబాటులో లేక.. క్షతగాత్రులను తరలించేందుకు ఆసుపత్రిలో సరైన వాహనం అందుబాటులో లేక పోవడంతో సుమారు మూడు గంటలకు పైగా క్షతగాత్రులు ఆసుపత్రిలోనే ఉండిపోయారు. అనంతరం వచ్చిన 108లో తమ పేషెంట్‌ను తీసుకువెళ్ళాలంటూ 108 సిబ్బందిపై బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 108లో ఇద్దరిని మాత్రమే తీసుకువెళ్లే వీలుందని సిబ్బంది చెబుతున్నా ఇరు వర్గాలవారు మొండిగా వ్యవహరించడంతో అరగంట పాటు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది సముదాయించి తీవ్ర గాయాల పాలైన ముగ్గురిని ముందుగా కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భద్రాచలం ఆసుపత్రిలో ‘అంబులెన్స్’ దందా
భద్రాచలం: భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల దందా రోజు రోజుకూ పెరుగుతోంది. మృతదేహం తరలింపు పేరుతో ఆసుపత్రి ప్రాంగణంలోని మార్చురీ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.టేకులపల్లికి చెందిన జ్యోతి, ఈ నెల 6న ఆత్మహత్యకు యత్నించింది. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో శనివారం సాయంత్రం మృతిచెందింది. పోస్ట్‌మార్టం అనంతరం ఆదివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు బంధువులు సిద్దమయ్యారు. ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేదు. ఆసుపత్రి బయట ఉన్న ఓ అంబులెన్స్ నిర్వాహకులు లోపలికి వచ్చారు. తమది కూడా ఆసుపత్రికి సంబంధించినదేనని, ఐదువేల రూపాయలు ఇస్తే మృతదేహాన్ని తరలిస్తామని చెప్పారు. ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ అయినట్టయితే డబ్బులు ఎందుకు అడుగుతారని మృతురాలి కుటుంబీకులకు అనుమానం వచ్చింది. వచ్చిన వారిని ఇదే విషయం అడిగి నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, ఆ ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు పరారయ్యారు. ఆస్పత్రి అధికారు లే వేరే అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి మృతదేహాన్ని టేకులపల్లి తరలించారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రి ముందున్న ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు తరచూ ఇలాగే రోగులను మోసగిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. భద్రాచలం పట్టణంలోని బస్టాండ్ ఎదురుగాగల ఓ ఆసుపత్రితో కమీషన్ ఒప్పందాలు చేసుకుని, ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగానే సేవలు అందుతాయని రోగులను మభ్యపెట్టి అక్కడికి తరలిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. వీటిపై ఆస్పత్రి అధికారులు దృష్టి సారించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడి మృతి
టెక్కలి/టెక్కలిరూరల్: డివిజన్ కేంద్రమైన టెక్కలిలో.. మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గ కేంద్రంలో 110 పడకల ఏరియా ఆస్పత్రి వద్ద ఆదివారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వైద్యం అందజేయడంతోనే స్థానిక ఆదిఆంధ్రావీధికి చెందిన యువకుడు సంకిలి తిరుపతిరావు(27) మృతిచెందాడని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. తిరుపతిరావుకు కడుపునొప్పి, తలనొప్పి రావడంతో భార్య పుష్పతో పాటు స్థానికులు ఆయనని శనివారం టెక్కలి ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యురాలు జ్యోతి వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో, శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. ‘108’లో రిమ్స్‌కు తరలించగా, తిరుపతిరావు మృతిచెందారు. టెక్కలి ఏరియా ఆస్పత్రిలో వైద్యురాలు జ్యోతి సక్రమంగా వైద్యసాయం అందజేయలేదని, మరో వైద్యుడు లక్ష్మణరావుకు సమాచారమిచ్చినా స్పందించలేదని మృతుని కుటుంబసభ్యులతో పాటు వీధి ప్రజలంతా అర్ధరాత్రి ఒంటి గంట సమయం నుంచి 2 గంటల వరకు ఏరియా ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సురేష్‌బాబు అక్కడికి చేరుకుని వారిని వారించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన వీరు.. ఆదివారం ఉదయం మళ్లీ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. లోపలికి ప్రవేశించి వైద్యురాలు జ్యోతిని నిలదీస్తూ ఫర్నీచర్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం గేటు వద్ద బైఠాయించి జ్యోతి, సూపరింటెండెంట్ కె.కేశవరావుపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకుడు తమ్మన్నగారి కిరణ్, యు.శంకర్, శ్యామలరావు, వార్డు సభ్యుడు దోని బుజ్జి, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతుగా నిలిచి ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తిరుపతిరావు కుటుంబానికి రూ. 5 లక్షలు ఆర్థికసాయంతో పాటు ఆయన పిల్లలకు వసతి గృహంలో సీట్లు వచ్చేలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ సంఘటనపై వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయ కర్త పేరాడ తిలక్ ఆరా తీశారు. వైద్యురాలు జ్యోతి మాట్లాడుతూ తిరుపతిరావును అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తీసుకువచ్చారని, వైద్యం అందించాక పరిస్థితి విషమించిందని తెలిపారు. టెక్కలి సీఐ కె.భవానీప్రసాద్, పలాస సీఐ తాతారావు, ఎస్ఐ లు సురేష్‌బాబు, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
తాళం తెరవలే..!
భద్రాచలం : భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలో ఆధునిక హంగులతో నిర్మించిన నూతన భవనాలు నిరుపయోగంగా మిగిలాయి. నాలుగు రాష్ట్రాల కూడలిలో ఉన్న ఈ ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో రూ.18.14 కోట్లతో నిర్మించిన ఈ భవనాలను గత ఏడాది జూలైలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కానీ ఇప్పటికీ ఆస్పత్రి తాళాలే తెరుచుకోలేదు. దీంతో ఇవి నిధులు ఖర్చు చేయడానికే తప్ప మరెందుకూ పనికి రావనే భావన వ్యక్తమవుతోంది. ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న 100 పడకలకు తోడు మరో వంద పడకలు మంజూరైన నేపథ్యంలో నూతన భవనాలు నిర్మించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీసగఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రధానంగా గిరిజనులకు వైద్య సేవలు అందించటంలో పెద్ద దిక్కుగా ఉంది. ప్రస్తుతం ఇక్కడికి నిత్యం 450 – 550 మంది రోగులు వస్తుంటారు. 150 – 200 మంది ఇన్పేషెంట్లుగా సేవలు పొందుతున్నారు. నెలకు 350 – 450 వరకు కాన్పులు జరుగుతాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్ కోటిరెడ్డి, ఇతర సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ మెరుగైన వైద్య సేవలందిస్తూ రాష్ట్రంలోనే ఉత్తమ ఆస్పత్రిగా ఖ్యాతి గడిచింది. ప్రత్యేక సౌకర్యాలున్నా.. ప్రయోజనం సున్నా కార్పోరేట్‌కు ధీటుగా రోగులకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ఆప్పత్రి భవనాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్ ప్లోర్లో గర్భణీ పరీక్షలు, యాక్సిటెండ్ విభాగం, క్యాజువాలటీ, చిన్నపిల్లల విభాగంల కోసం తగిన సౌకర్యాలను కల్పించారు. మొదటి అంతస్తులో క్లినిక్, పేథాలజీ, డెంటల్, ఈఎన్టీ, ఇన్‌పేషెంట్, ఆపరేషన్స్ విభాగం, ఐసీయూ విభాగాల కోసం, రెండో అంతస్తులో పరిపాలనకు ప్రత్యేక గదులు, డబ్బులు చెల్లించి అద్దెకు ఉండే రోగుల కోసమని 15 గదులు(స్పెషల్రూమ్స్) సిద్దం చేశారు. బర్నింగ్ కేసుల కోసమని 6 గదులను నిర్మించారు. ప్రసవాలు ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో లేబర్ రూమ్‌లో తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసమని 6 గదులు కేటాయించగా, ప్రతీ గదిలోనూ అటాచ్డ్ బాత్రూమ్స్, ఏసీ సౌకర్యం ఏర్పాటు చేశారు. కొత్త ఆసుపత్రిలో దాదాపుగా అన్ని వార్డులు, గదుల్లో కూడా ఏసీలను అమర్చారు. కానీ వీటిని వినియోగంలోకి తీసుకురాకపోవటంతో ప్రసుత్తం ఉన్న పాత ఆసుపత్రి భవనాల్లోనే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డయాలసిస్ యూనిట్ మంజూరైంది. దీనికి సంబంధించిన అన్ని రకాల పరికరాలు కూడా వచ్చాయి. కానీ దీనిని ప్రస్తుతం ఉపయోగపడటంలేదు. ఆసుపత్రి ప్రాంగణంలో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. వైద్యులు, సిబ్బంది భర్తీ కోసం ఎదురుచూపులు.. 100 పడకల ఆస్పత్రి నుంచి 200కు అప్‌గ్రేడ్ చేశారు. ఈ లెక్కన వైద్యులు, సిబ్బందిని కూడా అదనంగా నియమించాలి. 40 మంది వైద్యులు, 30 మంది స్టాఫ్ నర్సులు, సుమారు 100 మంది పారామెడికల్ సిబ్బందిని కేటాయించాలి. కానీ ఈ పోస్టులను భర్తీ చేయలేదు. స్పెషలిస్టు వైద్య నిపుణుల కొరత కూడా ఉంది. నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణ కొరవడింది. రెండు హెడ్ నర్సు పోస్టులూ ఖాళీనే. 200 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌గా అయినందున ఆ స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమిస్తేనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందనేది అక్షర సత్యం. వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ శివప్రసాద్ శుక్రవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రి పరిశీలన కోసం వస్తున్నందున, ఈ సమస్యలపై దృష్టి సారించాలని ఏజెన్సీ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
కాన్పు సమయంలో శిశువు మృతి
కావలిరూరల్: కాన్పు సమయంలో శిశువు మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చోటుచేసుకుంది. శిశువు కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన సన్నగిరి శివప్రసాద్ భార్య కావ్య కాన్పుకోసం బిట్రగుంటలోని పుట్టింటికి వచ్చింది. మంగళవారం ఉదయం ఆమెకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. రాత్రి 9.51 గంటలకు ఆమెకు సహజ ప్రసవం ద్వారా మగ శిశువు జన్మించాడు. అయితే కాసేపటికి శిశువు మరణించాడు. దీంతో కావ్యతోబాటు ఆమె కుటుంబసభ్యులు తీరని ఆవేదనకు గురయ్యారు. కాన్పు సమయంలో డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ అక్కడ లేరు. కాల్ ఆన్ డ్యూటీలో ఉన్న చిన్న పిల్లల వైద్యనిపుణులు అర్ధగంట తర్వాత ఆస్పత్రికి రాగా, డ్యూటీ డాక్టర్ మరో పావు గంట తర్వాత చేరుకున్నారు. శిశువు మృతిచెందాడని వారు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సుబ్బారావు, చైర్మన్ గుత్తికొండ కిషోర్‌బాబు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. డాక్టర్లు సకాలంలో స్పందించలేదు ఇక్కడ కాన్పులు బాగా జరుగుతున్నాయంటే తీసుకువచ్చాం. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ అందుబాటులో లేరు. సిబ్బందే కాన్పు చేశారు. వారు ఫోన్ చేయగా చిన్నపిల్లల డాక్టర్ అర్ధగంటకు వచ్చారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు.– దరిశి సుధీర్, కావ్య సోదరుడు పూర్తి స్థాయిలో విచారిస్తాం కాన్పు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మా సిబ్బంది తీసుకున్నారు. డాక్టర్లు అందుబాటులో లేరనే విషయంపై విచారిస్తున్నాం. కాన్పు సమయంలో గర్భంలో మలం కలసిపోయి శిశువు ముక్కులు, నోట్లోకి వెళ్లి చనిపోయి ఉంటాడని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారిస్తాం. – డాక్టర్ కె.సుబ్బారావు, ప్రభుత్వ ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ అధికారులకు ఫిర్యాదు చేస్తాం శిశువు మృతి చెందాడనే విషయం తెలియగానే కమిటీ సభ్యులతో కలసి ఇక్కడికి చేరుకున్నాం. డాక్టర్లు అందుబాటులో లేరనే ఆరోపణలపై ఆరా తీస్తున్నాం. ఈ ఘటనలో ఎలాంటి పొరపాట్లు ఉన్నా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తాం. – గుత్తికొండ కిషోర్‌బాబు, ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చెర్మన్