నూతనంగా నిర్మించిన ఏరియా ఆçస్పత్రి ముఖద్వారం
భద్రాచలం : భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలో ఆధునిక హంగులతో నిర్మించిన నూతన భవనాలు నిరుపయోగంగా మిగిలాయి. నాలుగు రాష్ట్రాల కూడలిలో ఉన్న ఈ ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో రూ.18.14 కోట్లతో నిర్మించిన ఈ భవనాలను గత ఏడాది జూలైలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కానీ ఇప్పటికీ ఆస్పత్రి తాళాలే తెరుచుకోలేదు. దీంతో ఇవి నిధులు ఖర్చు చేయడానికే తప్ప మరెందుకూ పనికి రావనే భావన వ్యక్తమవుతోంది. ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న 100 పడకలకు తోడు మరో వంద పడకలు మంజూరైన నేపథ్యంలో నూతన భవనాలు నిర్మించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీసగఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రధానంగా గిరిజనులకు వైద్య సేవలు అందించటంలో పెద్ద దిక్కుగా ఉంది. ప్రస్తుతం ఇక్కడికి నిత్యం 450 – 550 మంది రోగులు వస్తుంటారు. 150 – 200 మంది ఇన్‌పేషెంట్‌లుగా సేవలు పొందుతున్నారు. నెలకు 350 – 450 వరకు కాన్పులు జరుగుతాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్ కోటిరెడ్డి, ఇతర సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ మెరుగైన వైద్య సేవలందిస్తూ రాష్ట్రంలోనే ఉత్తమ ఆస్పత్రిగా ఖ్యాతి గడిచింది.
ప్రత్యేక సౌకర్యాలున్నా.. ప్రయోజనం సున్నా
కార్పోరేట్‌కు ధీటుగా రోగులకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ఆప్పత్రి భవనాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్ ప్లోర్‌లో గర్భణీ పరీక్షలు, యాక్సిటెండ్ విభాగం, క్యాజువాలటీ, చిన్నపిల్లల విభాగంల కోసం తగిన సౌకర్యాలను కల్పించారు. మొదటి అంతస్తులో క్లినిక్, పేథాలజీ, డెంటల్, ఈఎన్‌టీ, ఇన్‌పేషెంట్, ఆపరేషన్స్ విభాగం, ఐసీయూ విభాగాల కోసం, రెండో అంతస్తులో పరిపాలనకు ప్రత్యేక గదులు, డబ్బులు చెల్లించి అద్దెకు ఉండే రోగుల కోసమని 15 గదులు(స్పెషల్‌రూమ్స్) సిద్దం చేశారు. బర్నింగ్ కేసుల కోసమని 6 గదులను నిర్మించారు.
ప్రసవాలు ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో లేబర్ రూమ్‌లో తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసమని 6 గదులు కేటాయించగా, ప్రతీ గదిలోనూ అటాచ్డ్ బాత్‌రూమ్స్, ఏసీ సౌకర్యం ఏర్పాటు చేశారు. కొత్త ఆసుపత్రిలో దాదాపుగా అన్ని వార్డులు, గదుల్లో కూడా ఏసీలను అమర్చారు. కానీ వీటిని వినియోగంలోకి తీసుకురాకపోవటంతో ప్రసుత్తం ఉన్న పాత ఆసుపత్రి భవనాల్లోనే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డయాలసిస్ యూనిట్ మంజూరైంది. దీనికి సంబంధించిన అన్ని రకాల పరికరాలు కూడా వచ్చాయి. కానీ దీనిని ప్రస్తుతం ఉపయోగపడటంలేదు. ఆసుపత్రి ప్రాంగణంలో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి.
వైద్యులు, సిబ్బంది భర్తీ కోసం ఎదురుచూపులు..
100 పడకల ఆస్పత్రి నుంచి 200కు అప్‌గ్రేడ్ చేశారు. ఈ లెక్కన వైద్యులు, సిబ్బందిని కూడా అదనంగా నియమించాలి. 40 మంది వైద్యులు, 30 మంది స్టాఫ్ నర్సులు, సుమారు 100 మంది పారామెడికల్ సిబ్బందిని కేటాయించాలి. కానీ ఈ పోస్టులను భర్తీ చేయలేదు. స్పెషలిస్టు వైద్య నిపుణుల కొరత కూడా ఉంది. నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణ కొరవడింది. రెండు హెడ్ నర్సు పోస్టులూ ఖాళీనే.
200 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌గా అయినందున ఆ స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమిస్తేనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందనేది అక్షర సత్యం. వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ శివప్రసాద్ శుక్రవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రి పరిశీలన కోసం వస్తున్నందున, ఈ సమస్యలపై దృష్టి సారించాలని ఏజెన్సీ ప్రాంత వాసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment