భారత యువ క్రికెటర్ గొంగడి త్రిష(Gongadi Trisha)కు తెలంగాణ సర్కారు భారీ నజరానా ప్రకటించింది. అండర్-19 టీ20 ప్రపంచకప్-2025లో సత్తా చాటిన ఈ ఆల్‌రౌండర్‌కు కోటి రూపాయల నజరానా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) బుధవారం ప్రకటించారు. భవిష్యత్తులో త్రిష మరింత గొప్పగా రాణించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
వారికి పది లక్షల చొప్పున
త్రిషకు కోటి రూపాయల బహుమతిని ప్రకటించడంతో పాటు భారత జట్టు సభ్యురాలు, తెలంగాణకు చెందిన ధృతి కేసరికి 10 లక్షల రూపాయల నజరానాను ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా.. జట్టు హెడ్ కోచ్ నౌషీన్ అల్ ఖదీర్, ట్రైనర్ షాలినికి 10 లక్షల చొప్పున బహుమతిని ప్రకటించారు.
కాగా ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళల అండర్–19 వరల్డ్ కప్(ICC U19 Women's World Cup)లో త్రిష అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. తన ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించింది ఈ యువ తార. ఈ మెగా ఈవెంట్లో ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగిన త్రిష.. టోర్నమెంట్ చరిత్రలోనే తొలి శతకంతో సత్తా చాటి ప్రపంచ రికార్డుతో మెరిసింది.
లీగ్ దశలో భాగంగా స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం 53 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుంది. త్రిష ఇన్నింగ్స్‌లో పన్నెండు ఫోర్లతో పాటు.. నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం. ఇక టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించిన త్రిష మొత్తంగా 309 పరుగులు చేసింది.
అంతేకాదు.. ఈ లెగ్‌స్పిన్నర్ ఏడు వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇక సౌతాఫ్రికాతో ఫైనల్లో 33 బంతుల్లో 44 పరుగులతో అజేయంగా నిలిచిన గొంగడి త్రిష.. మూడు వికెట్లతో మెరిసి భారత్ వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవడంలో కీలకంగా మారింది. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా త్రిష సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ద టోర్నీ'లో నూ ఈ తెలుగుతేజానికి చోటు దక్కడం మరో విశేషం.
భద్రాద్రి అమ్మాయి
కాగా తెలంగాణలోని భద్రాద్రికి చెందిన త్రిషకు చిన్ననాటి నుంచే క్రికెట్ మీద మక్కువ. త్రిష ఈ స్థాయికి చేరడంలో ఆమె తండ్రి రామిరెడ్డిది ప్రధాన పాత్ర. కుమార్తె కోసం ఆయన ఎన్నో కష్టనష్టాలకోర్చి.. తన గారాలపట్టిని క్రికెటర్‌గా తీర్చిదిద్దారు. అందుకే తాను సాధించిన ప్రతి గొప్ప విజయానికి తండ్రికే అంకితం చేస్తుంది ఈ బంగారుతల్లి.
ఘన స్వాగతం
మలేషియాలో ఐసీసీ టోర్నీ గించుకున్న త్రిష మంగళవారమే హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అరశనపల్లి జగన్‌మోహన్ రావు ఘన స్వాగతం పలికారు. త్రిషతో పాటు భారత జట్టులో సభ్యురాలైన కేసరి ధృతి, టీమ్ హెడ్ కోచ్ నూషీన్ అల్ ఖదీర్, ట్రెయినర్ షాలిని కూడా నగరానికి చేరుకున్నారు.
ఈ నలుగురినీ జగన్‌మోహన్ రావు సన్మానించారు. 19 ఏళ్ల త్రిష తన అద్భుత ఆటతీరుతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసిందని ఆయన ప్రశంసించారు. త్రిష, ధృతిలను ఆదర్శంగా తీసుకొని మరింత మంది అమ్మాయిలు అంతర్జాతీయస్థాయికి ఎదగాలని జగన్‌మోహన్ రావు ఆకాంక్షించారు.
హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి వీరికి నగదు బహుమతిని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. హెడ్ కోచ్‌గా నూషీన్ అల్ ఖదీర్‌కు, ప్లేయర్‌గా త్రిషకు ఇది వరుసగా రెండో వరల్డ్‌కప్ టైటిల్ కావడం విశేషం.
2023లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి అండర్–19 టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు భారత మాజీ స్పిన్నర్ నూషీన్ హెడ్ కోచ్‌గా వ్యవహరించగా... త్రిష సభ్యురాలిగా ఉంది. 2025లోనూ నూషీన్ హెడ్ కోచ్‌గా కొనసాగగా... నిలకడగా రాణించిన త్రిష ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డును సాధించింది. కేసరి ధృతి కూడా విజేత జట్టులో సభ్యురాలిగా ఉన్నా ఆమెకు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు.
అండర్ -19 మహిళల T20 ప్రపంచ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిష గారికి ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి @revanth_anumula గారు కోటి రూపాయలు నజరానా ప్రకటించారు. మలేషియాలో జరిగిన మహిళ అండర్ -19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన… pic.twitter.com/0lXZyJpMMg
— Telangana CMO (@TelanganaCMO) February 5, 2025
Comments
Please login to add a commentAdd a comment