నాతవరం, న్యూస్‌లైన్ : జిల్లేడుపూడివాసులను జ్వరాలు పీడిస్తున్నాయి. 25 రోజులుగా మంచానపడి అల్లాడిపోతున్నారు. గ్రామంలోని 1870 మందికి 600కుపైగా జ్వరాలతో బాధపడుతున్నారు. శుక్రవారం విలేకరులు గ్రామాన్ని పరిశీలించినప్పుడు పరిస్థితి దయనీయంగా ఉంది.ప్రతి ఇంటా మూలుగుతున్నవారు కనిపించారు. గ్రామంలో ప్రస్తుతం కె.రాము , కుమారి, రాంబాబు, ఎల్.రమణ , కె.తులసి, పి.సత్యవతి, గౌరి, ఎస్.సత్యవతి, ఎస్.మోహన్, ఎస్.కుమారి, లాలం మావుళ్లమ్మ , కె.రమణ, కె.వెంకటరమణ, యల్లయ్యమ్మ, నాగరాజుల పరిస్థితి దయనీయంగా ఉంది.
మరికొందరి పరిస్థితి ఇలాగే ఉంది. 25 రోజులుగా కనీసం వైద్యసేవలకు నోచుకోలేదు. నాలుగుడబ్బులున్నవారు నర్సీపట్నం, తుని ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్సలు పొందుతున్నారు. మరి కొందరు 108లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వెళుతున్నారు. పరిస్థితిని పది రోజుల క్రితం సర్పంచ్ లాలం లోవ వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా చర్యలు శూన్యం. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రూ.14 వేలయినా జ్వరాలు తగ్గలేదు
అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నాం. రూ.14 వేలు ఖర్చుచేస్తే ఇంటిలో ఇద్దరికి జ్వరాలు తగ్గుముఖం పట్టగా మరో ముగ్గురికి తీవ్రంగా ఉంది.
- రమణ, జిల్లేడుపూడి
వైద్య శిబిరం నిర్వహించాలి
గ్రామంలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించి ఉన్నతాధికారులు యుద్ధప్రాతిపదికన వైద్యశిబిరం నిర్వహించాలి. ప్రత్యేక వైద్య సిబ్బందిని నియమించి జ్వరాలు తగ్గేవరకు పర్యవేక్షణ చేపట్టాలి.
- కొరుపోలు నూకరాజు, జిల్లేడుపూడి.
ఊరంతా జ్వరాలు
Published Sat, Sep 21 2013 3:44 AM | Last Updated on Wed, Jun 13 2018 8:02 PM
Advertisement
Advertisement