రోగులతో మాట్లాడుతున్న హరీశ్
గచ్చిబౌలి (హైదరాబాద్): కొండాపూర్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్‌కు అవసరమైన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం లంచం అడిగిన డాక్టర్‌ను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో మంత్రి ఆస్పత్రికి వచ్చారు. కాగా డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లో గెజిటెడ్ సిగ్నేచర్ కోసం సెక్యూరిటీ గార్డు ద్వారా సంప్రదిస్తే డాక్టర్ డబ్బు లు అడిగాడని ఓ వ్యక్తి మంత్రికి ఫిర్యాదు చేశారు.
దీంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డును పిలిచిన హరీశ్, తమ సంభాషణను వీడియో తీయాల్సిందిగా అధికారులను ఆదేశించి.. ఏ డాక్టర్, ఎంత అడిగాడంటూ నిలదీశారు. మూర్తి (పీవీఎస్‌ఎన్ మూర్తి) అనే డాక్టర్ రూ.500 అడిగాడని సెక్యూరిటీ గార్డు చెప్పడంతో అక్కడికక్కడే ఆ డాక్టర్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సాధారణ ప్రసవాలు పెంచాలి
తనిఖీల్లో భాగంగా అవుట్ పేషెంట్ విభాగంతో పాటు అన్ని వార్డుల్లో హరీశ్ కలియతిరిగారు. అందుతున్న వైద్య సేవలను రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రసూతి విభాగంలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. మందులు, స్కానింగ్‌తో పాటు ఇతర పరీక్షలు బయటకు రాయవద్దని ఆర్‌ఎంఓ డాక్టర్ విజయకుమారిని ఆదేశించారు.
60 శాతానికి పైగా సాధారణ డెలి వరీలు కావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఖ్య మరింత పెంచాలని సూచించారు. గైనకాలజీ వార్డులో ప్రతిరోజూ స్కానింగ్‌లు చేయాలని ఆదేశిస్తూ మరో రెండు అల్ట్రా సౌండ్ మెషీన్లు అందజేస్తామని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మంత్రి తనిఖీలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment