
మార్షల్స్‌తో 33 మంది బీఆర్‌ఎస్ సభ్యులు బలవంతంగా బయటకు
3 గంటల వ్యవధిలో 4 పర్యాయాలు సభ వాయిదా
రసాభాసగా బల్దియా కౌన్సిల్ సమావేశం
రూ.8440 కోట్లతో 2025–26 బడ్జెట్‌కు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎసీ చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా అసెంబ్లీ తరహాలో మార్షల్స్‌తో సభ్యులను బలవంతంగా బయటకు పంపించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల మధ్య జరిగిన వివాదంతో సభాధ్యక్ష స్థానంలోని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సభలో ఉన్న బీఆర్‌ఎస్ కార్పొరేటర్లందరినీ బయటకు పంపించాల్సిందిగా మార్షల్స్‌ను ఆదేశించారు. దాంతో వారు కార్పొరేటర్లను బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. అనంతరం రామ్‌గోపాల్‌పేట పీఎస్‌కు తరలించి, సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. దాదాపు మూడు గంటల వ్యవధిలో సభ నాలుగుసార్లు వాయిదా పడింది.
ఆరంభం నుంచే..
సమావేశం ఆరంభం నుంచే రసాభాస చోటు చేసుకుంది. ఉదయం 10.35 గంటలకు సభ ప్రారంభం కాగా 10.40 గంటలకు బడ్జెట్‌పై చర్చ ప్రారంభిద్దామని మేయర్ అన్నారు. తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టాలని బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళం చెలరేగడంతో 10.50 గంటలకు మేయర్ సభను వాయిదా వేశారు. ఈ సమయంలోనూ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ జూటా అంటూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. తిరిగి సభ ప్రారంభమయ్యాక సైతం గందరగోళం ఆగలేదు. ఎలాంటి చర్చ లేకుండానే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) రూ. 8440 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించినట్లు (డీమ్డ్ టూ అప్రూవ్ అంటూ) మేయర్ ప్రకటించారు.
పరిస్థితి అదుపు తప్పిందిలా..
బీఆర్‌ఎస్ సభ్యుల చేతుల్లోని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న ప్లకార్డుల్ని కాంగ్రెస్ సభ్యులు బాబా ఫసియుద్దీన్, సీఎన్‌రెడ్డి తదితరులు చించివేశారు. బడ్జెట్ ప్రతులను బీఆర్‌ఎస్ వారు మేయర్ పోడియంపైకి విసిరారు. పోడియం వద్దకు వెళ్లకుండా కాంగ్రెస్ సభ్యులు వారికి అడ్డు నిల్చున్నారు. కాంగ్రెస్ డౌన్‌డౌన్ అంటూ బీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. రెండు పార్టీల మధ్య తోపులాట పెరిగి పరిస్థితి అదుపు తప్పింది. ఒక దశలో బాహాబాహీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు సింధు, శాంతి, పద్మా వెంకట్‌రెడ్డి, విజయ్‌కుమార్‌గౌడ్‌లను బయటకు పంపించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు ప్రారంభిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు.
దీంతో బయటకు పంపిన తమ సభ్యులను లోనికి తీసుకురావాల్సిందేనని, లేనిదే తాము చర్చలో పాల్గొనమని బీఆర్‌ఎస్ సభ్యులు మన్నె కవితారెడ్డి తదితరులు పట్టుబట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. బీఆర్‌ఎస్ సభ్యులందరినీ బయటకు తీసుకెళ్లాల్సిందిగా మేయర్ ఆదేశించడంతో 33 మంది సభ్యులను మార్షల్స్ బలవంతంగా ఎత్తుకెళ్లారు. బయటకెళ్లిన వారు నిరసన ప్రదర్శనకు దిగగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి రామ్‌గోపాల్‌పేట పీఎస్‌కు తరలించారు. బీఆర్‌ఎస్ బలంతోనే మేయర్‌గా ఎన్నికైన విజయలక్ష్మి తమనే బయటకు పంపించడం దారుణమని ఆ పార్టీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకా..
కాంగ్రెస్ వాళ్లు కేటీఆర్ 420 అంటూ, బీఆర్‌ఎస్ వాళ్లు సీఎం రేవంత్‌రెడ్డి 420 అంటూ ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ప్లకార్డులు పట్టుకొచ్చారు. సభ ప్రారంభానికి ముందు బీజేపీ సభ్యులు శ్రవణ్, తదితరులు తమకు బడ్జెట్ కేటాయించడం లేదంటూ, మేయర్ ఎంట్రన్స్ వద్ద యాచకుల మాదిరిగా చిప్పలు పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. బాబా ఫసి యుద్దీన్ భారత్ జోడో యాత్ర టీషర్ట్ వేసుకొని రావడంపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
70 శాతం ఆదాయం అధికారులకే..
ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్, సంబంధిత అధికారులు బదులిచ్చారు. వీధిదీపాల సమస్యలు త్వరలో తీరుతాయని, చెత్త సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలున్నాయని డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి తెలిపారు. మేయర్‌తో కలిసి అన్నిడివిజన్లలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. బల్దియాలో అనసరంగా ఎందరో అధికారులున్నారని, 70 శాతం జీహెచ్‌ఎంసీ ఆదాయం వారి జీతభత్యాలకే పోతుండగా, వారి ద్వారా ఒరుగుతున్నదేమీ లేదని కాంగ్రెస్ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ జీహెచ్‌ఎంసీ తీరును ఎండగట్టారు. అవసరమైన పారిశుధ్యం వంటి పనులకు మాత్రం సిబ్బంది లేరన్నారు. సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఇలంబర్తి హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ చర్య దుర్మార్గం: కేటీఆర్
జీహెచ్‌ఎసీ పాలకమండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్ లను అరెస్టు చేయడం దుర్మార్గమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచి్చన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటెస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే : మంత్రి పొన్నం
జీహెచ్‌ఎఎంసీ బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమేనని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుకు బీఆర్‌ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలన్నారు. బడ్జెట్‌ను అడ్డుకోవడం హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నట్టేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment