
విద్యార్థి వీసాలు 41% తిరస్కరణ 2014తో పోలిస్తే రెట్టింపు
భారత విద్యార్థుల వీసాల తిరస్కరణ 34%
వర్సిటీలో సీటు వచ్చినా అనుమతించని అధికారులు.. కారణాలు కూడా చెప్పకుండానే తిరస్కరణ
కన్సల్టెన్సీల తప్పులతో విద్యార్థులకు కష్టాలు.. అప్రమత్తంగా ఉండాలని ఎన్‌ఆర్‌ఐల సూచన
సాక్షి, హైదరాబాద్: భారతీయ విద్యార్థుల్లో చాలామందికి అమెరికాలో చదవటం ఒక కల. అప్పులు చేసైనా ఆ కలను నెరవేర్చుకునేందుకు కష్టపడుతుంటారు. కానీ, ఇప్పుడు ఆ కల చెదురుతోంది. అగ్రరాజ్యం విదేశీ విద్యార్థుల వీసాలకు భారీగా కత్తెరేస్తోంది. ఈ ఏడాది ఏకంగా 41 శాతం వీసాలను తిరస్కరించింది. వీటిలో భారత విద్యార్థుల వీసాలే 38 శాతం ఉన్నాయి. వీసాల తిరస్కరణకు కారణాలు కూడా చెప్పడం లేదని విద్యార్థులు అంటున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ పరిస్థితి ఏర్పడిందని కన్సల్టెన్సీలు అంటున్నాయి. అమెరికా కాన్సులేట్ మాత్రం సరైన పత్రాలు లేకపోవడమే వీసాల తిరస్కరణకు కారణమంటోంది.
కొంప ముంచుతున్న కన్సల్టెన్సీలు
కన్సల్టెన్సీల తప్పుల వల్లే వీసాలు తిరస్కరణకు గురవుతున్నాయనే విమర్శలున్నాయి. వక్రమార్గంలో బ్యాంకు లావాదేవీల రుజువులు ఇవ్వడం, స్వదేశంలో విద్య పూర్తయిన తర్వాత ఉగ్యోగం చేసినట్లు నకిలీ పత్రాలు సమర్పించటం వంటివి వీసాల తిరస్కరణకు కారణమవుతున్నాయి. విద్యార్థి బ్యాంకు లావాదేవీలను అమెరికా అధికారులు ఈ మధ్య నిశితంగా పరిశీలిస్తున్నారు. అప్పటికప్పుడు ఖాతాలో డబ్బులు వేయడాన్ని తప్పుడు పత్రాల సృష్టిగానే భావిస్తున్నారు. దీంతో తిరస్కరణలు పెరుగుతున్నాయి.
వీసా తిరస్కరణ కారణాలు ఇవీ..
⇒ అమెరికాలో విద్య కోసం వెళ్లేవాళ్లు ఉద్యోగం చేయడం నిషేధం. చదువు పూర్తయ్యే వరకు సొంత ఆర్థిక వనరులుండాలి. వీటిని నిరూపించే పత్రాల సమర్పణలో విఫలమవుతున్నారు.
⇒ భాష లేదా కమ్యూనికేషన్ నైపుణ్యాలు నిరూపించే పరీక్షలో ఫెయిల్ అవుతున్నారు.
⇒ ఇండియాలో చేసిన కోర్సు వేరు. అమెకన్ వర్సిటీలో చేయాలనుకుంటున్న కోర్సు వేరుగా ఉంటున్నాయి. ఇలా ఎంచుకోవడానికి గల కారణాలపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.
⇒ అమెరికాలో ఎంఎస్‌కు పునాదిగా భావించే ఇక్కడి ఇంజనీరింగ్ కోర్సులో కీలకమైన సబ్జెక్టులు పదేపదే బ్యాక్‌లాగ్ ఉండటమూ తిరస్కరణకు కారణమే.

విద్యార్థుల్లో ఎఫ్–1 ఫీవర్
అమెరికన్ వర్సిటీలు ఏటా రెండుసార్లు ప్రవేశాలు కల్పిస్తాయి. ఆగస్టు–డిసెంబర్ మధ్య ఒక సెమిస్టర్, జనవరి–మే మధ్య మరో సెమిస్టర్ ఉంటుంది. భారతవిద్యార్థులు ఆగస్టు–డిసెంబర్ మధ్య సెమిస్టర్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. విదేశీ విద్యార్థులకు ఎఫ్–1 వీసా ఇస్తారు. అయితే, అమెరికా కాన్సులేట్ ప్రకారం 2023– 24లో ఎఫ్–1 వీసాలను భారీగా తగ్గించారు. 2024లో తొలి 9 నెలల్లోనే భారతీయ విద్యార్థి వీసాలను 38 శాతం మేర తిరస్కరించింది. 2023లో భారత విద్యార్థులకు 1.03 లక్షల వీసాలు బ్యూరో ఆఫ్ కాన్సులేట్ అఫైర్స్ నెలవారీ నివేదిక పేర్కొంది. భారత్ నుంచి విదేశాలకు 7 లక్షల మంది వెళుతుండగా వారిలో 3 లక్షల మంది అమెరికాకే వెళ్తున్నారు.
సహేతుక కారణాలు ఉండటం లేదు
విద్యార్థి వీసాలను తిరస్కరించేప్పుడు కాన్సులేట్ సరైన కారణాలు చూపించడం లేదు. ఆర్థిక వనరులపై పదేపదే వాకబు చేస్తున్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత వీసా ఇంటర్వ్యూల్లో గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. దీంతో కొంతమంది విద్యార్థులు కంగారు పడుతున్నారు. దీన్ని కూడా సాకుగానే భావిస్తున్నారు. – వినీత్ బాత్రా, కన్సల్టెంట్ సంస్థ ఎండీ, ఢిల్లీ.
విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి
వీసా విధానం గతంలో మాదిరిగా సరళంగా లేదు. కన్సల్టెన్సీలను నమ్ముకుని మోస పోవద్దు. తప్పుడు పత్రాలపై వీసా వచ్చిన తర్వాత కూడా విచారణ ఉంటుంది. అడ్డదారుల్లో వెళ్లొద్దు. – వాసుదేవరెడ్డి, ప్రవాస భారతీయుడు, అమెరికా.
భయపెట్టేలా ఇంటర్వ్యూ
అమెరికా వర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది. వీసా ఇంటర్వ్యూకు వెళ్తే సివిల్స్ మాదిరి ప్రశ్నలు వేశారు. ఆర్థిక మూలాలు అడిగారు. కోర్సులో మార్కుల గురించి ప్రశ్నించారు. అమెరికాలో ఎక్కడ ఉండేది? ఎంత రెంటు, జీవన వ్యయం అవుతుందనే ప్రశ్నలూ వేశారు. కాస్తా తడబాటు వచ్చింది. అంతే, సారీ అంటూ పంపారు. – శృతి పల్లవి, హైదరాబాద్ విద్యార్థి,