బీజింగ్: కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో చైనా నుంచి వందల మంది భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా ఇక్కడే ఉండిపోయారు. తాజాగా వీసాలపై నిరీక్షణకు తెరదించుతూ భారత విద్యార్థులకు చైనా శుభవార్త అందించింది. దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి చైనాకు వెళ్లేందుకు వీసాలు జారీ చేసే ప్రణాళిక చేస్తున్న ప్రకటించింది. స్టూడెంట్ వీసాలతో పాటు బిజినెస్ వంటి వివిధ కేటగిరీల వీసాలు సైతం జారీ చేయనున్నట్లు డ్రాగన్ విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది.
‘భారత విద్యార్థులకు శుభాకాంక్షలు. మీ సహనం విలువైనదని రుజువైంది. నేను నిజంగా మీ ఉత్సాహాన్ని, సంతోషాన్ని పంచుకోగలను. తిరిగి చైనాకు వచ్చేందుకు స్వాగతం.’ అంటూ ట్వీట్ చేశారు చైనా విదేశాంగ శాఖ ఆసియా వ్యవహారాల కౌన్సెలర్ జి రోంగ్. భారత విద్యార్థులు, వ్యాపారవేత్తలు, కుటుంబాలకు వర్కింగ్ వీసాల జారీపై న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ వివరణాత్మక ప్రకటనను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ ప్రకటన ప్రకారం చైనాలో ఉన్నత విద్య చదవాలనుకుంటున్న కొత్త విద్యార్థులు, చైనా నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులకు ఎక్స్1 వీసాలు జారీ చేయనున్నారు. కొత్తగా వెళ్లే విద్యార్థులు ఒరిజినల్ అడ్మిషన్ లెటర్‌ను అందించాల్సి ఉంటుంది. మిగిలిన వారు చైనా యూనివర్సిటీల నుంచి అనుమతి పత్రాలను అందించాలి.
చైనాలో కరోనా ఆంక్షలతో స్వదేశానికి తిరిగి వచ్చి సుమారు 23వేల మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. రెండేళ్లుగా తిరిగి వెళ్లేందుకు వీసాల కోసం నిరీక్షిస్తున్నారు. చైనాకు తిరిగి వచ్చే విద్యార్థుల వివరాలను అందించాలని ఇటీవలే చైనా కోరింది. దీంతో వందల మంది విద్యార్థుల జాబితాను చైనాకు అందించింది భారత్. సుమారు 1000 మంది పాత విద్యార్థులు చైనాకు తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు.. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన రాకపోకలు లేకపోవటం విద్యార్థులకు ఇబ్బంది కలిగించనుంది. కొద్ది వారాల క్రితం శ్రీలంక, పాకిస్థాన్, రష్యా సహా పలు దేశాలకు చెందిన విద్యార్థులు చార్టెడ్ ఫ్లైట్స్ ద్వారా చైనాకు చేరుకున్నారు.
ఇదీ చదవండి: తైవాన్‌లో అమెరికా గవర్నర్ పర్యటన.. చైనా ఎలా స్పందిస్తుందో?
Comments
Please login to add a commentAdd a comment