
విదేశీ విద్యార్థులకు నరకం చూపుతున్న ట్రంప్
గాజా మద్దతుదారులను ఇప్పటికే బహిష్కరిస్తున్న వైనం
వాషింగ్టన్: దేశం నుంచి బలవంతంగానైనా పంపేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్నాక ఆపడం ఎవరితరం కాదనే వాస్తవం ఇప్పుడు అమెరికాలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. విదేశీ విద్యార్థులు ఏ చిన్న పొరపాటు అనుకోకుండా చేసినా ప్రభుత్వం వారిపై ‘వీసా రద్దు’ కత్తి దింపుతోంది. వెంటనే వీసా గడువును ముగించేసి స్వదేశానికి వెళ్లాలని ఆదేశాలిస్తోంది. చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘన ఉదంతాన్ని సైతం వీసా రద్దుకు సాకుగా చూపుతోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఏ నిమిషంలో వీసా రద్దు ఈ–మెయిల్ వస్తుందోనన్న భయంతో అక్కడి విదేశీ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
పారిపోయిన, జాడ దొరకని ఉగ్రవాదిని అత్యవసరంగా వెతికిన చందంగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ వ్యవహరిస్తోంది. దీనిపై ఎంతటి విమర్శలు వెల్లువెత్తుతున్నా విదేశీ విద్యార్థుల బహిష్కరణ పర్వానికి ప్రభుత్వం తెరదించట్లేదు. దీంతో ఇప్పటికే గాజా అనుకూల ర్యాలీలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారు, ఆ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేసినా, షేర్ చేసిన, అనుకూలంగా స్పందించిన విదేశీ విద్యార్థుల కంటిపై కనుకులేకుండా పోయింది. ఏ నిమిషంలో వీసా రద్దవుతుందోనన్న ఆందోళన సంబంధిత విదేశీ విద్యార్థుల్లో ఎక్కువైంది. సంబంధిత వివరాలను అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థ ఒక నివేదిక వెల్లడించింది.
మా విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి
తమ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో చాలా మంది వీసాలు హఠాత్తుగా రద్దయ్యాయని అమెరికాలోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలు తాజాగా వెల్లడించాయి. ఇలా వీసా రద్దును ఎదుర్కొన్న వారిలో భారతీయ విద్యార్థులూ ఉన్నారు. అయితే పాలస్తీనా అనుకూల ఘటనలతో ఎలాంటి సంబంధం లేని విద్యార్థులకు సైతం వీసా రద్దు ఈ–మెయిల్స్ రావడం గమనార్హం. ఇలాంటి విద్యార్థులను అమెరికాలో గతంలో చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘన ఉదంతాలను సాకుగా చూపి దేశ బహిష్కరణ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇంకొంత మంది విద్యార్థులకు వీసా ఎందుకు రద్దు చేస్తున్నామని కనీస కారణాన్ని కూడా ఇమిగ్రేషన్ అధికారులు పేర్కొనకపోవడం దారుణమని కాలేజీల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.

డేటాబేస్ చూశాకే మాకూ తెలిసొచి్చంది
అసలు ఎవరెవరి వీసాలు రద్దయ్యాయని వివరాలు సైతం ఇమిగ్రేషన్ అధికారులు స్పష్టంగా పేర్కొనట్లేరు. దీనిపై హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, మిషిగన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్‌ఏంజెలెస్, ఒహాయో స్టేట్ వర్సిటీల అధికారులు స్పందించారు. ‘‘ మా కాలేజీల్లోని కొందరు విద్యార్థుల వీసాలు సైతం రద్దయ్యాయి. అమెరికావ్యాప్తంగా స్టూడెంట్ వీసాల గడువును అకస్మాత్తుగా కుదిస్తున్న నేపథ్యంలో ఫెడరల్ ఇమిగ్రేషన్ డేటాబేస్‌ను యథాలాపంగా చెక్‌చేశాం. అందులో మా కాలేజీల విద్యార్థుల పేర్లు కూడా కనిపించడంతో ఆశ్చర్యపోయాం.
ఎందుకు రద్దుచేశారని తెల్సుకునేందుకు ప్రయత్నిస్తే ఇమిగ్రేషన్ విభాగం నుంచి సరైన స్పందన కరువైంది’’ అని ప్రముఖ వర్సిటీల అధికారులు వెల్లడించారు. భారతీయ విద్యార్థులు ఎలాంటి గాజా, పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొనకపోయినా కొందరి వీసాల గడువును ప్రభుత్వం పూర్తిగా ముగించేసి స్వదేశానికి వెళ్లిపోవాలని సందేశాలు పంపించింది. అమెరికా వ్యతిరేక భావజాలమున్న విద్యార్థులను ఏరివేసేందుకు ప్రభుత్వం సామాజిక మాధ్యమాల ఖాతాలను జల్లెడ పడుతోందని యాక్సికోస్ అనే సంస్థ వెల్లడించింది. హమాస్ అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక పోస్టులు పెట్టినా, అలాంటి పోస్ట్‌లను లైక్‌చేసినా, షేర్ చేసినా అలాంటి వారిని గుర్తించే పనిలో ప్రభుత్వం మునిగిపోయిందని యాక్సికోస్ నివేదించింది.