ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల పంట పండింది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో భారత్‌కు చెందిన విద్యార్థులకు అమెరికా రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసింది. యూఎస్‌లో ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తు చేసుకున్న భారతీయ విద్యార్థులకు 90,000 కంటే ఎక్కువ వీసాలు జారీ చేసినట్లు భారత్‌లోని యూఎస్ మిషన్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ప్రకటించింది.
నాలుగింట ఒకటి
ప్రపంచవ్యాప్తంగా అమెరికా జారీ చేసిన ప్రతి నాలుగు స్టూడెంట్ వీసాలలో ఒకటి భారతీయ విద్యార్థులకే జారీ చేసినట్లు యూఎస్ మిషన్ పేర్కొంది. అలాగే తమ ఉన్నత విద్య లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి యునైటెడ్ స్టేట్స్‌ను ఎంచుకున్న విద్యార్థులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుత సెషన్ కోసం స్టూడెంట్ వీసా దరఖాస్తులు ముగిసిన నేపథ్యంలో యూఎస్ మిషన్ ఈ గణాంకాలను విడుదల చేసింది.
చైనాను అధిగమించిన భారత్
2022లో యునైటెడ్ స్టేట్స్‌లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులతో ప్రపంచంలోని అగ్ర దేశంగా భారత్ చైనాను అధిగమించింది. 2020లో దాదాపు 2,07,000 మంది అంతర్జాతీయ భారతీయ విద్యార్థులు యూఎస్‌లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తాజా నివేదిక హైలైట్ చేసింది. భారత్ నుంచి విద్యార్థులను ఆకర్షించడానికి విదేశీ విశ్వవిద్యాలయాలు అందించే సులభతరమైన అప్లికేషన్ ఫార్మాలిటీలు, ఆర్థిక సహాయం, స్కాలర్‌షిప్‌లు ఈ పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
ఫ్రాన్స్ కూడా..
ఇంతకుముందు ఫ్రాన్స్ కూడా భారత్ నుంచి సుమారు 30,000 మంది విద్యార్థులను ఉన్నత చదువుల కోసం తమ దేశానికి స్వాగతించాలన్న లక్ష్యాన్ని వ్యక్తం చేసింది. 2030 నాటికి భారతీయ విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఆ దేశం ప్రయత్నాలు చేస్తోంది. విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడం, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం , రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక స్నేహాన్ని పెంపొందించడం ద్వారానే ఈ లక్ష్యం సాధ్యమవుతుంది.
The U.S. Mission in India is pleased to announce that we issued a record number – over 90,000 – of student visas this Summer/ in June, July, and August. This summer almost one in four student visas worldwide was issued right here in India! Congratulations and best wishes to all…
— U.S. Embassy India (@USAndIndia) September 25, 2023
Comments
Please login to add a commentAdd a comment