Student Visa
-
యూకే స్టూడెంట్ వీసా.. మరింత భారం!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో భారత విద్యార్థులకు యూఎస్ వీసాలు కష్టమేనన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ స్టూడెంట్స్ ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాల్లో ఉన్నత చదువులకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులకు బ్రిటన్ చేదువార్త చెప్పింది. స్టూడెంట్ వీసా కావాలంటే మునుపటి కన్నా ఎక్కువ సొమ్ములు చూపించాలని అంటోంది.ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులు ఇక నుంచి అధిక నిధులు సమకూర్చుకోవాల్చిందే. యూకే స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు.. మెయింటెనెన్స్ మనీగా చూపించాల్సిన మొత్తాన్ని బ్రిటన్ 11.17 శాతం పెంచేసింది. 2025, జనవరి నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇక నుంచి విద్యార్థి వీసా దరఖాస్తుదారులు తమ బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.14.4 లక్షలు (13,347 పౌండ్లు) మెయింటెనెన్స్ మనీగా చూపించాల్సి ఉంటుంది. 28 రోజుల పాటు వారి బ్యాంక్ ఖాతాలో ఈ నగదు ఉండాలి. ఇప్పటివరకు ఈ మొత్తం రూ. 12.9 లక్షలు (12,006 పౌండ్లు)గా ఉంది. బ్రిటన్‌లో పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘మెయింటెనెన్స్ మనీ’ కూడా పెంచినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.లండన్‌లో వెలుపల చదవాలనుకున్న విద్యార్థులకు కూడా మెయింటెనెన్స్ మనీ 11.05 శాతం వరకు పెరిగింది. లండన్‌లో కాకుండా ఇతర ప్రాంతాల్లోని యూనివర్సిటీల్లో చదివేందుకు విదేశీ విద్యార్థులు ఇప్పటివరకు 9,207 పౌండ్లు మెయింటెనెన్స్ మనీగా చూపించేవారు. ఇక నుంచి ఈ మొత్తం 10,224 పౌండ్లకు పెరుగుతుంది. 2025, జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని బ్రిటీష్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ పేర్కొంది.యూకే స్టూడెంట్ వీసాల నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో బ్రిటన్ వెళ్లాలనుకునే భారత విద్యార్థులు మరిన్ని నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తమ ఆర్థిక వ్యవహారాలను మరింత సూక్ష్మంగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. నిర్వహణ ఖర్చుల భారం నుంచి ఉపశమనం పొందాలంటే స్కాలర్షిప్లు సంపాదించాలని సలహాయిస్తున్నారు. విదేశాల్లో చదువు పూర్తైన తర్వాత బాగా సెటిలయితే తాము పెట్టిన పెట్టుబడి సద్వినియోగం అయినట్టేనని కెరీర్ మొజాయిక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మనీషా జవేరీ పేర్కొన్నారు.చదవండి: హెచ్1బీ వీసా రగడలో అనూహ్య పరిణామాలు!విదేశాల్లో ఉన్నత చదువు కోసం స్టూడెంట్ వీసా పొందేందుకు కొంత మొత్తాన్ని తమ బ్యాంకు ఖాతాలో చూపించాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు, నిర్వహణ ఖర్చుల కోసం తగినంత డబ్బును వారి బ్యాంక్ ఖాతాలో చూపించాలి. లండన్‌లో చదవాలకునే విదేశీ విద్యార్థులు 20 వేల పౌండ్లు ‘మెయింటెనెన్స్ మనీ’ అవసరమవుతుంది. ఒకవేళ వీసా అప్లై చేయడానికి ముందే 5 వేల పౌండ్లు చెల్లిస్తే.. మిగతా 15 వేల పౌండ్లు బ్యాంకు ఖాతాలో 28 రోజుల పాటు ఉండాలి. -
ట్రూడో సర్కార్ కీలక నిర్ణయం.. కెనడా వెళ్లే విద్యార్థులకు ఝలక్
ఒట్టావా: కెనడాలోని జస్టిన్ ట్రూడో సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులకు షాకిస్తూ 2025లో స్టడీ పర్మిట్లను తగ్గించేందుకు సిద్ధమైంది. తమ దేశంలో తాత్కాలిక నివాసితుల రాకపోకలను తగ్గించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. కెనడాలో వలసల నియంత్రణకు జస్టిన్ ట్రూడో సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్స్, వర్కర్ల పని అనుమతుల విషయంలో మరిన్ని ఆంక్షలు విధించేలా ప్లాన్ చేసింది. 2025లో కొత్త అంతర్జాతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లు 10 శాతం మేర తగ్గించబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2024లో జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న 4,85,000 నుంచి 10 శాతం తగ్గితే కేవలం 4,37,000 మందికి మాత్రమే స్టడీ పర్మిట్లు అందుతాయని స్పష్టం చేసింది. ఇక, 2025లో జారీ చేసే స్టడీ పర్మిట్ల సంఖ్య 2026లో కూడా ఎలాంటి మార్పులు ఉండదని ప్రకటించారు. అంతకుముందు.. 2023లో ఈ సంఖ్య 5,09,390గా ఉండగా.. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 1,75,920 స్టడీ పర్మిట్లను జారీ చేశారు. 📢 New Temporary Residence Cuts in Canada! 🇨🇦The Government of Canada has announced key changes to strengthen temporary residence programs and maintain sustainable immigration levels. Here's what you need to know:Reduction in Study Permits: 10% reduction in study permits for…— Seyi Obasi - Work, Live & Study In Canada🇳🇬🇨🇦 (@SeyiSpeaks) September 18, 2024 మరోవైపు..కెనడా జనాభా 2024 మొదటి త్రైమాసికంలో 41 మిలియన్లకు పైగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో తాత్కాలిక నివాసితులలో భారీ పెరుగుదల కనిపించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, దేశీయంగా పెరుగుతున్న ఇళ్ల కొరత, నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టడంలో భాగంగానే ఇలా షరతులు విధించినట్టు తెలుస్తోంది.ఇది కూడా చదవండి: Lebanon: లెబనాన్‌లో మళ్లీ పేలుళ్లు.. 32 మంది మృతి -
రెడీ స్టడి గో
⇒ వచ్చే నెల నుంచే పలు దేశాల్లో అడ్మిషన్ల ప్రక్రియలు ప్రారంభం⇒ సరైన అవగాహనతో ముందుకెళితే సమస్యలు రాకుండా ఉంటాయంటున్న నిపుణులు⇒ విదేశీ విద్యకు అర్హతలు, అవకాశాలపై సూచనలివీ ఒకప్పుడు విదేశాల్లో చదువుకోవాలంటే అంత సులువైన విషయం కాదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. వరంగల్, కరీంనగర్, నల్లగొండ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా విదేశీ విద్య వైపు చూస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది.వారంతా విదేశాలకు వెళ్లే ముందు హైదరాబాద్‌కే చేరుతున్నారు. ఇక్కడున్న కన్సల్టెన్సీలను సంప్రదించి విదేశీ విద్య కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వచ్చే నెలలోనే కొత్తగా అడ్మిషన్ల ప్రక్రియలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో సరైన అవగాహనతో ముందుకెళితే.. సులువుగా విదేశీ విద్య పూర్తి చేసుకోవచ్చని, మంచి జాబ్ కూడా సంపాదించవచ్చని నిపుణులు చెప్తున్నారు. అసలు విదేశీ విద్యకు అర్హతలు, తీసుకో వాల్సిన జాగ్రత్తలేమిటో స్పష్టంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు.అవకాశం, అవగాహన పెరగడంతో..విదేశాల్లో విద్య అంటే ఒకప్పుడు చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమన్న భావన ఉండేది. దానికితోడు పెద్దగా అవగాహన లేకపోవడంతో.. విదేశాలకు వెళ్లడం ఎందుకులేనన్న పరిస్థితి ఉండేది. కానీ పెరిగిన అవకాశాలు, అవగాహన, ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారితో సులువుగా అనుసంధానమయ్యే వీలు వంటివి.. విదేశాలకు వెళ్లి చదువుకునేవారి సంఖ్య పెరిగేందుకు దారితీస్తోంది. పాస్‌పోర్టు జారీ విధానం సులభతరం కావడం, విదేశాల వీసాలు సులువుగా దొరుకుతుండటం, స్కాలర్ షిప్‌లతో అవకాశాలూ పెరిగాయి. మరోవైపు స్థానికంగా విద్య కోసం ఖర్చులు కూడా బాగా పెరిగిన నేపథ్యంలో.. మరింత అదనంగా ఖర్చు చేస్తే విదేశాల్లో చదువుకోవచ్చని, అక్కడే ఉద్యోగమూ సంపాదించవచ్చని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు.స్టూడెంట్ వీసా తీసుకుని..⇒ స్టూడెంట్ వీసా ఉంటే ఆ దేశంలోసంబంధిత కోర్సు పూర్తయ్యేంత వరకు ఉండి చదువుకునేందుకు అనుమతిఉంటుంది. తర్వాత కూడా రెండేళ్ల పాటు వర్క్ పర్మిట్ మీద ఉండేందుకు అనుమతిస్తారు.ఆ రెండేళ్లలోగా సరైన ఉద్యోగం పొందలేకపోతే.. స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.⇒ స్టూడెంట్ వీసా కోసం ఏ దేశానికి వెళ్లాలనుకుంటే ఆ దేశానికి చెందిన కాన్సులేట్ కార్యాలయం లేదా రాయబార కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్ ద్వారా వీసా అప్లికేషన్ వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.⇒ విద్యార్థులకు అమెరికా అయితే ఎఫ్, ఎం, జే వీసాలు ఇస్తుంది. యూకే అయితే టైర్–4 వీసాలు జారీ చేస్తుంది. కెనడా స్టడీ పర్మిట్స్ పేరిట ఇస్తుంది.హైదరాబాద్ నుంచే ఎక్కువఅమెరికాకు గతేడాది 75,000 మంది ఇండియా నుంచి వెళ్తే..అందులో హైదరాబాద్ నుంచే 22,500 మంది ఉన్నట్టు అంచనా. ఇక కెనడాకు మొత్తం 1.3 లక్షల మంది వెళ్లగా.. దాదాపు 35,000 మంది హైదరాబాద్ మీదుగా వెళ్లారని.. ఇందులో సిటీవారే ఎక్కువని ఓపెన్ డోర్ సంస్థ నివేదిక చెబుతోంది. మిగతా దేశాలకు కూడా హైదరాబాద్ నుంచి వెళ్లిన విద్యార్థులే ఎక్కువని పేర్కొంటోంది.ఏమేం అర్హతలు ఉండాలి?⇒ చదువుకున్న కాలేజీ నుంచి కండక్ట్ సర్టిఫికెట్ ఉండాలి.⇒ సరైన పాస్‌పోర్టు ఉండాలి. ⇒ ఆదాయ వనరులు సరిగ్గా ఉండాలి⇒ ఆంగ్లంలో నైపుణ్యం ఉండాలి (ఐఈఎల్‌ఈఎస్, టోఫెల్లో మంచి స్కోర్ కలిగి ఉండాలి)⇒ మెడికల్, పోలీస్ క్లియరెన్స్ ఉండాలి.⇒ టోఫెల్, ఐఈఎల్టీఎస్, డుయో లింగో, ఎస్ఏటీ, జీఆర్ఈ వంటి పరీక్షల్లో స్కోరును బట్టి యూనివర్సిటీలు అడ్మిషన్లు ఇస్తుంటాయి. ఒక్కో దేశంలోని ఒక్కో యూనివర్సిటీ ఒక్కో పరీక్షలో స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటుంది.⇒ వీసా కోసం అప్లికేషన్ చేసుకున్న తర్వాత కాన్సులర్ అధికారితో ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు దరఖాస్తులో అందజేసిన వివరాలు సరైనవేనా, కాదా అనే విషయాన్ని ఇంటర్వ్యూలో రూఢి చేసుకుంటారు. అక్కడికి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? చదువు అయిపోయాక ఏం చేయాలనుకుంటున్నారనే విషయాలపై సమగ్రంగా ప్రశ్నలు అడుగుతారు.వీసాలు రిజెక్ట్ అవుతుంటాయి.. ఎందుకు? ⇒విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నవారికి ఒక్కోసారి వీసా రిజెక్ట్అవుతుంటుంది. ఇందుకు కారణాలు చాలానే ఉంటాయి.⇒ ఆదాయ వనరులకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడం⇒ డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోవడం.⇒ చదువు పూర్తయ్యాక తిరిగి స్వదేశం వెళతామని రుజువు చేయలేకపోవడం⇒ చదువులో మంచి మార్కులు లేకపోవడం ళీఏదైనా తప్పులు లేదా ఫ్రాడ్ చేయడంవిదేశాల్లో స్కాలర్షిప్ పొందడమెలా?విదేశాలకు చదువు కోసం వెళ్తున్న అందరికీ అక్కడి వర్సిటీల్లోఫీజులు చెల్లించే స్తోమత ఉండకపోవచ్చు. అందువల్ల కాస్త ఆర్థిక భారంతగ్గించుకునేందుకు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది.కొన్ని జాగ్రత్తలు పాటిస్తే స్కాలర్షిప్ పొందడం కూడా సులువే..1. విదేశాల్లో వర్సిటీలు మాత్రమే కాకుండా వేరే సంస్థలు కూడా స్కాలర్షిప్స్ ఇస్తుంటాయి. అందుకే యూనివర్సిటీ వెబ్సైట్లతోపాటు స్కాలర్షిప్లు అందించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వెబ్సైట్లను కూడా తరచూ చూస్తుండాలి.2. విదేశాలకు వెళ్లాలనుకోవడానికి ఏడాది ముందే స్కాలర్‌షిప్‌ల గురించి వెతుకుతుండాలి. ముందుగా స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలి.3. చాలా స్కాలర్షిప్ టెస్టుల కోసం అడ్మిషన్ లెటర్ అవసరం ఉండదు. అందుకే అడ్మిషన్ లెటర్ వచ్చాక దరఖాస్తు చేసుకోవాలనుకోవడం సరికాదు.4. పూర్తి స్థాయి స్కాలర్షిప్ కాకుండా కొంతమేరకే వస్తే మాత్రం వేరే స్కాలర్‌షిప్‌ల కోసం కూడా వెతకాలి. ఒకటికన్నా ఎక్కువ స్కాలర్షిప్లు పొందే అవకాశం కూడా ఉంటుంది.5. మెరిట్ ఉన్న విద్యార్థులకే స్కాలర్షిప్ వస్తుందనుకోవడం పొరపాటు. స్పోర్ట్స్, ఇతర నైపుణ్యాల ఆధారంగా కూడా స్కాలర్షిప్ ఆఫర్ చేసే సంస్థలు చాలా ఉంటాయి. వాటిని గుర్తించాలి.టోఫెల్లో అక్రమాలతో ఇబ్బంది..గతేడాది టోఫెల్ పరీక్షలో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. టోఫెల్, జీఆర్ఈలో మార్కులు ఎక్కువ వచ్చేలా చేస్తామంటూ విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వల వేసిన గుట్టు రట్టయింది. అలాంటి వారిని నమ్మి పరీక్షలు రాయిస్తే.. తీరా విదేశాలకు వెళ్లాక అది ఫేక్ అని తేలితే చిక్కులు తప్పవు. ఆ విద్యార్థులను భారత్‌కు తిప్పిపంపడమేగాక.. భవిష్యత్తులో మళ్లీ విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించే ప్రమాదం ఉంటుంది. స్టూడెంట్ ఎక్సే్ఛంజ్ ప్రోగ్రామ్స్‌తో వెళ్లొచ్చుభారత విద్యార్థులు విదేశాల్లోని అవకాశాలు అందిపుచ్చుకునేలా.. ఆయా దేశాల్లోని సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. వాటిద్వారా మన విద్యార్థులు విదేశాల్లోని వర్సిటీల్లో కొంతకాలం చదువుకొనేందుకు అవకాశం ఉంటుంది. ‘సెమిస్టర్ ఎట్ సీ, రోటరీ యూత్ ఎక్సే్ఛంజ్ , ఎరామస్ ప్లస్, ఫుల్ బ్రైట్ నెహ్రూ ఎక్సే్ఛంజ్ ప్రోగ్రామ్, యూత్ ఫర్ అండర్ స్టాండింగ్’ వంటి కార్యక్రమాల ద్వారా విదేశాల్లోని విద్యార్థులతో కలసి చదువుకుని, అక్కడి స్థితిగతులను అర్థం చేసుకునే వెసులుబాటు ఉంటుంది.ఉద్యోగ అనుభవంతో వెళ్తే మేలు..విదేశాల్లో చదువుతోపాటు అక్కడే స్థిరపడాలనుకునే వారు డిగ్రీ అయిపోయాక ఇక్కడ కనీసం రెండేళ్లపాటు ఏదైనా ఉద్యోగం చేసిఉంటే మంచిది. దీనివల్ల విదేశాల్లో ఎంఎస్ అయ్యాక.. ఇక్కడి అనుభవంతో అక్కడ ఉద్యోగం సులువుగా పొంది, స్థిరపడేందుకు అవకాశాలు మెండుగాఉంటాయి. ఏ దేశంలో త్వరగా సెటిల్ కాగలమో ముందుగానే తెలుసుకుని వెళ్తే బాగుంటుంది. ఐర్లాండ్ వంటి దేశాల్లో ఐదేళ్లలోనే గ్రీన్‌కార్డు వస్తుంది.సందీప్‌రెడ్డి , ఐర్లాండ్ ప్రస్తుత పరిస్థితులు బాగోలేవుఅమెరికాలో ప్రస్తుత పరిస్థితులు అంత బాగోలేవు. ఆర్థిక మాంద్యం నడుస్తోంది. రెండేళ్ల నుంచీ ఉద్యోగాల్లేవు. ఉన్న వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. స్టూడెంట్స్ చాలా మంది చదువు కోసం వస్తున్నారు. వారికి పార్ట్‌టైమ్ జాబ్స్ దొరకట్లేదు. ఇంటి అద్దెతోపాటు కూరగాయలు, నిత్యావసర ధరలు కూడాభారీగా పెరిగాయి. దీంతో ఇక్కడ జీవనం కష్టంగా మారుతోంది. సాయి సింధూజ న్యూజెర్సీ వర్సిటీలపై స్టడీ చేయాలి ముందుగానే ఏ యూనివర్సిటీమంచిదో కాస్త పరిశోధన చేయాలి. ఆ తర్వాతే కన్సల్టెన్సీల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అదే నేరుగా కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తే.. సరైన కాలేజీ లేదా యూనివర్సిటీకి దరఖాస్తు చేయకపోవచ్చు. తర్వాత బాధపడి ఏమీ లాభం ఉండదు. కొన్ని కన్సల్టెన్సీలు ఎక్కువ కమీషన్ ఇచ్చే వర్సిటీలకు దరఖాస్తు చేయిస్తుంటాయి. అందుకే వర్సిటీలను జాగ్రత్తగా ఎంచుకోవాలి.నిఖిల్ మండల, మాంచెస్టర్, బ్రిటన్ -
ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫీజు రెట్టింపు
మెల్బోర్న్: ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫీజును రెట్టింపునకు మించి పెంచింది. ప్రస్తుతం 710 డాలర్లు (రూ.59,255)గా ఉన్న ఫీజును 1,600 డాలర్లు (రూ.1.33 లక్షల)కు పెంచింది. పెంచిన ఫీజులు అమలవుతాయని జూలైæ ఒకటో తేదీ నుంచి తెలిపింది. దీని ప్రభావం ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై పడనుంది. ఆస్ట్రేలియాలో విదేశీ విద్యార్థుల్లో భారతీయులది రెండో స్థానం. 2023 ఆగస్ట్ నాటికి 1.2 లక్షల మంది భారతీయ విద్యార్థులున్నట్లు కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ తెలిపింది. ఇకపై విదేశీ విద్యార్థులు బ్రిటన్ వంటి దేశాలను ఎంచుకోవచ్చంటున్నారు. కునే బ్రిటన్‌లో స్టూడెంట్ వీసా ఫీజు 900 డాలర్లు(రూ.75 వేలు)గా ఉంది. -
అమెరికా బాటలో ఆస్ట్రేలియా.. భారమవుతున్న విదేశీ విద్య
విదేశీ విద్యార్థులు వలసలను తగ్గించడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే అంతర్జాతీయ విద్యార్థుల వీసా ఫీజును భారీగా పెంచుతూ ప్రకటించింది. 710 ఆస్ట్రేలియా డాలర్లుగా ఉండే వీసా ఫీజు.. ఇప్పుడు ఇది 1600 ఆస్ట్రేలియన్ డాలర్లకు పెరిగింది. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 40వేలు నుంచి రూ. 89వేలుకు పెరిగిందన్నమాట.వీసా ఫీజులను పెంచడమే కాకుండా విజిటర్ వీసా హోల్డర్లు, తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసాలు కలిగిన విద్యార్థులు ఇప్పుడు దేశంలో ఉన్నప్పుడు స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేయడం కూడా నిషేదించారు. రికార్డు స్థాయిలో విదేశీ విద్యార్థులు రాకను నియంత్రించడంలో భాగంగానే ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.ఆస్ట్రేలియా కొత్త వీసా ఫీజుల పెంపు ఈ రోజు (జూలై 1) నుంచి అమల్లోకి వస్తుంది. ఈరోజు అమల్లోకి వస్తున్న మార్పులు మన అంతర్జాతీయ విద్యా వ్యవస్థ సమగ్రతను పునరుద్ధరించడంలో సహాయపడతాయి. స్వేచ్ఛగా.. ఆస్ట్రేలియాకు మెరుగైన సేవలందించేలా ఉండేలా మైగ్రేషన్ వ్యవస్థను సృష్టిస్తామని.. హోం వ్యవహారాల మంత్రి క్లేర్ ఓ నీల్ పేర్కొన్నారు.విదేశీ విద్యకోసం వెళ్లే విద్యార్థులు ప్రారంభంలో అమెరికా, కెనడా దేశాలకు వెళ్లేవారు. ఆ రెండు దేశాలు వీసా ఫీజులను దాదాపు 185 డాలర్లు, 110 డాలర్లు పెంచడంతో.. విద్యార్థులు ఈ రెండు దేశాలకు ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియాను ఎంచుకున్నారు. దీంతో సుమారు 30 శాతం మంది విద్యార్థులు ఆస్ట్రేలియా బాట పట్టారు. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా వీసా ఫీజులను భారీగా పెంచేసింది.కొన్ని గణాంకాల ప్రకారం, విదేశీ విద్యకోసం 2022-23లో ఏకంగా 1.50 లక్షలమంది ఆస్ట్రేలియాకు వెళ్లారు. విదేశీ విద్యార్థులు రాకను నియంత్రించడానికి 2022 చివరలో విదేశీ విద్యార్థులు వీసా ఫీజుల పాలసీలలో మార్పులు వచ్చాయి. దీంతో నియమాలు మరింత కఠినతరమయ్యాయి. ప్రారంభంలో ఇంగ్లీష్ భాష అవసరాన్ని మరింత కఠినతరం చేశారు. ఆ తరువాత వీసా ఫీజులను పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నారు. -
ఆస్ట్రేలియాలో చదువు.. వీసాకు కొత్త రూల్
ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. స్టూడెంట్ వీసా కావాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులు దేశం కనీస వేతనంలో కనీసం 75 శాతానికి సమానమైన నిధులను కలిగి ఉండాలని ఆస్ట్రేలియా కొత్త నిబంధనను విధించింది.మే 10 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం.. ఆస్ట్రేలియాలో చదివేందుకు అర్హత సాధించడానికి, భారతీయ విద్యార్థులు తప్పనిసరిగా కనీసం 29,710 ఆస్ట్రేలియా డాలర్లు (దాదాపు రూ. 16,29,964) తమ బ్యాంక్ ఖాతాల్లో బ్యాలెన్స్ చూపించాలి.నాలుగు సార్లు పెంపుఇమిగ్రేషన్ విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆస్ట్రేలియా ప్రభుత్వం గడిచిన ఏడు నెలల్లో విద్యార్థుల పొదుపు సొమ్ముకు సంబంధించి వీసా నిబంధనలను నాలుగు సార్లు సవరించింది. గత సంవత్సరం అక్టోబర్ నాటికి, విద్యార్థి వీసాల కోసం చూపించాల్సిన మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ 21,041 ఆస్ట్రేలియన్ డాలర్లు ఉండేది.ఈ ఏడాది మార్చిలో ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేసే ప్రక్రియలో భాగంగా ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఇంగ్లిష్ భాషా సామర్థ్యాన్ని పెంచింది. కోవిడ్ పరిమితుల అనంతరం ఆస్ట్రేలియాకు విద్యార్థుల రాక పెరిగింది. దీంతో వసతికి సైతం కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీసా చట్టాల అమలును కఠినతరం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
కనువిప్పు కలిగించే కోత!
కెనడాతో మరో తంటా వచ్చి పడింది. సెప్టెంబర్‌లో మొదలయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి విదేశీ విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్ పర్మిట్లపై రెండేళ్ళ పాటు పరిమితులు విధిస్తున్నట్టు ఆ దేశం సోమవారం ప్రకటించింది. వీసాల సంఖ్య తగ్గిందంటే, కాలేజీ డిగ్రీ కోసం అక్కడకు వెళ్ళే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా తగ్గనుందన్న మాట. ఈ వీసాల కోత అన్ని దేశాలకూ వర్తించేదే అయినా, మనవాళ్ళ విదేశీ విద్యకు కెనడా ఓ ప్రధాన కేంద్రం కావడంతో భారతీయ విద్యార్థి లోకం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. కెనడా గడ్డపై ఓ ఖలిస్తానీ తీవ్రవాది హత్య వెనుక భారత్ హస్తం ఉందంటూ ఆ దేశం చేసిన ఆరోపణలతో ఇప్పటికే భారత – కెనడా దౌత్య సంబంధాలు చిక్కుల్లో పడ్డాయి. ఆ కథ కొలిక్కి రాకముందే, విదేశీ స్టూడెంట్ వీసాలకు కెనడా చెక్ పెట్టడం ఇంకో కుదుపు రేపింది. ఇటీవల కెనడాకు వెళ్ళి చదువుకొంటున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో అతి పెద్ద వర్గాలలో ఒకటి భారతీయ విద్యార్థి వర్గం. 2022లో 2.25 లక్షల పైచిలుకు మంది మన పిల్లలు అక్కడకు చదువులకు వెళ్ళారు. వివరంగా చెప్పాలంటే, ఆ ఏడాది కెనడా ఇచ్చిన మొత్తం స్టడీ పర్మిట్లలో 41 శాతానికి పైగా భారతీయ విద్యార్థులకే దక్కాయి. ఇక, 2023 సెప్టెంబర్ నాటి కెనడా సర్కార్ గణాంకాల ప్రకారం అక్కడ చదువుకు అనుమతి పొందిన అంతర్జాతీయ విద్యార్థుల్లో 40 శాతం మంది భారతీయులే. 12 శాతంతో చైనీయులు రెండో స్థానంలో ఉన్నారు. తీరా ఇప్పుడీ కొత్త నిబంధనలు అలా కెనడాకు వెళ్ళి చదవాలనుకుంటున్న వారికి అశనిపాతమే. వారంతా ఇతర దేశాల వంక చూడాల్సిన పరిస్థితి. 2023లో కెనడా 10 లక్షలకు పైగా స్టడీ పర్మిట్లిచ్చింది. దశాబ్ది క్రితంతో పోలిస్తే ఇది 3 రెట్లు ఎక్కువ. తాజా ప్రతిపాదనతో ఈ ఏడాది ఆ పర్మిట్ల సంఖ్య 3.64 లక్షలకు తగ్గనుంది. అంటే, 35 శాతం కోత పడుతుంది. విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లపై పరిమితి ప్రధానంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకే వర్తిస్తుంది. గ్రాడ్యుయేట్, మాస్టర్స్ డిగ్రీలు, పీహెచ్‌డీలకు ఇది వర్తించకపోవడం ఊరట. అయితే, పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్లకు షరతులు వర్తిస్తాయి. గతంలో కెనడాలో పీహెచ్డీ, మాస్టర్స్ కోర్సులు చేస్తుంటే మూడేళ్ళ వర్క్ పర్మిట్ దక్కేది. ఆ దేశంలో శాశ్వత నివాసం సంపాదించడానికి ఈ పర్మిట్లు దగ్గరి దోవ. ప్రధానంగా పంజాబీలు కెనడాలో చదువుతూనే, లేదంటే తాత్కాలిక ఉద్యోగాల్లో చేరుతూనే జీవిత భాగస్వామిని వీసాపై రప్పిస్తుంటారు. ఇక ఆ వీలుండదు. స్టడీ పర్మిట్లలో కోతతో విదేశీ విద్యార్థులకే కాదు... కెనడాకూ దెబ్బ తగలనుంది. పెద్దయెత్తున విదేశీ విద్యార్థుల్ని ఆకర్షించడానికి కెనడాలోని పలు విద్యాసంస్థలు తమ ప్రాంగణాలను విస్తరించాయి. తాజా పరిమితితో వాటికి ఎదురుదెబ్బ తగలనుంది. అంతర్జాతీయ విద్యార్థుల వల్ల కెనడా ఆర్థిక వ్యవస్థకు ఏటా 1640 కోట్ల డాలర్ల మేర ఆదాయం వస్తోంది. కోతలతో ఇప్పుడు దానికి గండి పడనుంది. అలాగే, జీవన వ్యయం భరించగలమంటూ ప్రతి విదేశీ విద్యార్థీ 20 వేల కెనడా డాలర్ల విలువైన ‘గ్యారెంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికెట్’ (జీఐసీ) తీసుకోవడం తప్పనిసరి. అలా కొత్త విద్యార్థుల వల్ల కెనడా బ్యాంకులు సైతం ఇంతకాలం లాభపడ్డాయి. తాజా నిబంధనలతో వాటికీ నష్టమే. అలాగే, దాదాపు లక్ష ఖాళీలతో కెనడాలో శ్రామికశక్తి కొరత ఉంది. విదేశీ విద్యార్థులు ఆ లోటును కొంత భర్తీ చేస్తూ వచ్చారు. గడచిన 2023లో ఒక్క ఆహారసేవల రంగంలో 11 లక్షల మంది కార్మికు లుంటే, వారిలో 4.6 శాతం మంది ఈ అంతర్జాతీయ విద్యార్థులే. ఆ లెక్కలన్నీ ఇక మారిపోతాయి. శ్రామికశక్తి కొరత పెరుగుతుంది. అయినా, కెనడా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీసుకున్న ఈ కోత నిర్ణయం వెనుక అనివార్యతలు అనేకం. చదువు పూర్తి చేసుకొని, అక్కడే వర్క్ పర్మిట్లతో జీవనోపాధి సంపాదించడం సులభం గనక విదేశీ విద్యకు కెనడా పాపులర్ గమ్యస్థానం. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరిగేసరికి, అద్దెకు అపార్ట్ మెంట్లు దొరకని పరిస్థితి. నిరుడు కెనడా వ్యాప్తంగా అద్దెలు 7.7 శాతం పెరిగాయి. గృహవసతి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. దాంతో ట్రూడో సర్కారుపై ఒత్తిడి పెరిగింది. విదేశీయుల వలసల్ని అతిగా అనుమతించడమే ఈ సంక్షోభానికి కారణమని కెనడా జాతీయుల భావన. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీకి ఇది లాభించింది. పైగా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ట్రూడో ఓటమి పాలవుతారని ప్రజాభిప్రాయ సేకరణల మాట. ఈ పరిస్థితుల్లో స్వదేశీయుల్ని సమాధానపరిచి, వలస జీవుల అడ్డుకట్టకై ట్రూడో సర్కార్ ఈ వీసాల కోతను ఆశ్రయించింది. విద్యార్థుల సంఖ్యను వాటంగా చేసుకొని, కొన్ని సంస్థలు కోర్సుల నాణ్యతలో రాజీ పడుతున్న వైనానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ చర్య చేపట్టామని కెనడా మాట. తాజా పరిణామం భారత్‌కు కనువిప్పు. కెనడాలో పలు ప్రైవేట్ సంస్థలు ట్యూషన్ ఫీజులేమో భారీగా వసూలు చేస్తూ, నాణ్యత లేని చదువులు అందిస్తున్నాయి. అయినా భారతీయ విద్యార్థులు కెనడాకో, మరో విదేశానికో వెళ్ళి, ఎంత ఖర్చయినా పెట్టి కోర్సులు చేసి, అక్కడే స్థిరపడాలనుకుంటున్నారంటే తప్పు ఎక్కడున్నట్టు? మన దేశంలో ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నట్టు? ఇది పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం. 2025 నాటికి భారతీయ కుటుంబాలు పిల్లల విదేశీ చదువులకై ఏటా 7 వేల కోట్ల డాలర్లు ఖర్చుచేస్తాయని అంచనా. చిన్న పట్నాలు, బస్తీల నుంచీ విదేశీ విద్య, నివాసంపై మోజు పెరుగుతుండడం గమనార్హం. నాణ్యమైన ఉన్నత విద్య, ఉపాధి కల్పనలో మన ప్రభుత్వాల వైఫల్యాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ఈ వాస్తవాలు గ్రహించి, ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేదంటే, అమెరికాలో ఉద్యోగాలకు, కెనడాలో వీసాలకు కోత పడినప్పుడల్లా దిక్కుతోచని మనవాళ్ళు మరో దేశం దిక్కు చూడాల్సిన ఖర్మ తప్పదు! -
స్టూడెంట్స్ పంట పండింది! రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల పంట పండింది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో భారత్‌కు చెందిన విద్యార్థులకు అమెరికా రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసింది. యూఎస్‌లో ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తు చేసుకున్న భారతీయ విద్యార్థులకు 90,000 కంటే ఎక్కువ వీసాలు జారీ చేసినట్లు భారత్‌లోని యూఎస్ మిషన్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ప్రకటించింది. నాలుగింట ఒకటి ప్రపంచవ్యాప్తంగా అమెరికా జారీ చేసిన ప్రతి నాలుగు స్టూడెంట్ వీసాలలో ఒకటి భారతీయ విద్యార్థులకే జారీ చేసినట్లు యూఎస్ మిషన్ పేర్కొంది. అలాగే తమ ఉన్నత విద్య లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ను ఎంచుకున్న విద్యార్థులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుత సెషన్ కోసం స్టూడెంట్ వీసా దరఖాస్తులు ముగిసిన నేపథ్యంలో యూఎస్ మిషన్ ఈ గణాంకాలను విడుదల చేసింది. చైనాను అధిగమించిన భారత్ 2022లో యునైటెడ్ స్టేట్స్లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులతో ప్రపంచంలోని అగ్ర దేశంగా భారత్ చైనాను అధిగమించింది. 2020లో దాదాపు 2,07,000 మంది అంతర్జాతీయ భారతీయ విద్యార్థులు యూఎస్‌లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తాజా నివేదిక హైలైట్ చేసింది. భారత్ నుంచి విద్యార్థులను ఆకర్షించడానికి విదేశీ విశ్వవిద్యాలయాలు అందించే సులభతరమైన అప్లికేషన్ ఫార్మాలిటీలు, ఆర్థిక సహాయం, స్కాలర్షిప్లు ఈ పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఫ్రాన్స్ కూడా.. ఇంతకుముందు ఫ్రాన్స్ కూడా భారత్ నుంచి సుమారు 30,000 మంది విద్యార్థులను ఉన్నత చదువుల కోసం తమ దేశానికి స్వాగతించాలన్న లక్ష్యాన్ని వ్యక్తం చేసింది. 2030 నాటికి భారతీయ విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఆ దేశం ప్రయత్నాలు చేస్తోంది. విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడం, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం , రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక స్నేహాన్ని పెంపొందించడం ద్వారానే ఈ లక్ష్యం సాధ్యమవుతుంది. The U.S. Mission in India is pleased to announce that we issued a record number – over 90,000 – of student visas this Summer/ in June, July, and August. This summer almost one in four student visas worldwide was issued right here in India! Congratulations and best wishes to all… — U.S. Embassy India (@USAndIndia) September 25, 2023 -
యూకే విజిటింగ్, స్టూడెంట్ వీసా ఫీజుల మోత
లండన్: బ్రిటన్ ప్రభుత్వం విద్యార్థి, సందర్శక వీసా ఫీజులను త్వరలో భారీగా పెంచనుంది. విజిటింగ్ వీసాపై 15 పౌండ్లు, విద్యార్థి వీసాపై అదనంగా 127 పౌండ్లు పెంచుతున్నట్లు తెలిపింది. భారతీయులు సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారికి ఇవి వర్తిస్తాయని పేర్కొంది. ఈ పెంపుదల అక్టోబర్ నాలుగో తేదీ నుంచి అమల్లోకి రానుందని స్పష్టం చేసింది. శుక్రవారం పార్లమెంట్లో హోంశాఖ ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టింది. దీని బిల్లు ప్రకారం ఆరు నెలల విజిటింగ్ వీసా ఫీజు ప్రస్తుతమున్న 100 పౌండ్ల నుంచి 115 పౌండ్ల(సుమారు రూ.12 వేలు)కు, విద్యార్థి వీసాకు ఫీజు 363 పౌండ్ల నుంచి 490 పౌండ్ల(సుమారు రూ.50 వేలు)కు పెరగనుంది. ఫీజుల పెంపు ఆరోగ్యం, సంరక్షణ వీసాతో సహా దాదాపు అన్ని రకాల వీసాలకు వర్తిస్తుంది; బ్రిటిష్ పౌరుడిగా నమోదు దరఖాస్తుకు, ఆరు నెలలు, రెండు, ఐదు, 10 సంవత్సరాల సందర్శన వీసాల ఫీజులు కూడా పెరగనున్నాయి. ఉద్యోగం, చదువుకు సంబంధించిన కొన్ని దరఖాస్తులకు సైతం ఈ పెంపు వర్తిస్తుంది. అక్టోబర్ నాలుగో తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని హోం శాఖ తెలిపింది. -
భారతీయ విద్యార్థులకు షాక్: వీసా ఫీజు భారీగా పెంపు
UK Student Visa యునైటెడ్ కింగ్డమ్ సర్కార్ భారతీయ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చింది. విద్యార్థి , పర్యాటక వీసాల ధరలను ఏకంగా 200 శాతం పెంచేసింది. ఈమేరకు బ్రిటన్‌ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. పార్లమెంటరీ ఆమోదం తరువాత పెంచిన ఫీజులు అక్టోబర్ 4వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ పెంపుతో ప్రభుత్వ పథకాలకు ఎక్కువ నిధుల ప్రాధాన్యతకు అవకాశం లభిస్తుందని యూఏ హోం ఆఫీస్ పేర్కొంది. దీంతో లక్షలాదిమంది భారతీయ విద్యార్థులపై భారం పడనుంది. UK హోమ్ ఆఫీస్ ప్రకటన ప్రకారం, ఆరు నెలల కంటే తక్కువ కాలానికి విజిట్ వీసా ధర 15 నుండి 115 పౌండ్లకు చేరింది. విదేశీ విద్యార్థుల నుంచి వసూల్ చేసే స్టడీ వీసా(Study Visa) ఫీజు దాదాపు 127 పౌండ్లనుంచి 490 చేరింది. అలాగే పర్యాటకులకు ఇచ్చే విజిట్ వీసా ఫీజు కూడాపెరగనుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ డేటా ప్రకారం, 2021-2022లో 120,000 కంటే ఎక్కువ మందే భారతీయ విద్యార్థులు యూకేలో చదువుతున్నారు. కాగా జూలైలో అక్కడి ప్రభుత్వం వర్క్, విజిట్ వీసాల ధరలో 15 శాతం పెరుగుదలను ప్రకటించింది. ప్రయార్టీ, స్టడీ వీసాలు, స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ల ఫీజును 20 శాతం పెంచింది. -
కెనడా స్టూడెంట్ వీసా రాలేదని యువకుడి ఆత్మహత్య.. చనిపోయిన మరుసటి రోజే!
చండీగఢ్: కెనడా స్టూడెండ్ వీసా ఆలస్యం అయ్యిందని 23 ఏళ్ల ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే దురదృష్టవశాత్తు అతను మరణించిన రెండు రోజులకే వీసా వచ్చింది. ఈ విషాద ఘటన హర్యానా కురుక్షేత్ర జిల్లాలో చోటుచేసుకుంది. షాబాద్ సబ్ డివిజన్లో గోర్ఖా గ్రామానికి చెందిన వివేక్ సైనీ అలియాస్ దీపక్ డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ఉన్నత చదువులు కెనడాలో చదివి అక్కడే స్థిరపడాలని అనుకున్నాడు. తల్లిదండ్రులు ఓకే చెప్పడంతో వీసా కూడా అప్లై చేశాడు. దీపక్ కొన్ని నెలల కిందట స్నేహితులతో కలిసి కెనడా స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేశాడు. ఇటీవల వారికి వీసాలు వచ్చాయి. అయితే తనకు వీసా రాకపోవడంపై అతడు నిరాశ చెందాడు. దీంతో జన్సా సమీపంలోని కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ దీపక్‌కు వీసా గురువారం వచ్చింది. అయితే అప్పటికే యువకుడు ఆచూకీ కనిపించకుండా పోయాడు. కొడుకు మిస్ అవ్వడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల అనంతరం కెనాల్లో దీపక్ మృతదేహం లభ్యమైంది. పోస్ట్‌మార్టం అనంతరం దీపక్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే గురువారమే దీపక్ ఇంటికి వీసా వచ్చిందని ఆ గ్రామ మాజీ సర్పంచ్ గుర్నామ్ సింగ్ తెలిపాడు. అప్పటికే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితులకు అప్పటికే వీసా రావడం, తనకు ఇంకా రాలేదనే మనస్థాపంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. చదవండి: తల్లీ కూతుళ్ల ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్టు ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కష్టంగా మారిన అమెరికా ప్రయాణం.. ఏకంగా రూ.1.5 లక్షలకు చేరిన..
సాక్షి, హైదరాబాద్: అమెరికా..అమెరికా అంటూ విద్యార్థులు అమెరికా తరలిపోతున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఉన్నత చదువు కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య కొంత తగ్గింది. ప్రస్తుతం పరిస్థితులు మారడం, కోవిడ్ నిబంధనల సడలింపుతో ఈ విద్యా సంవత్సరంలో ఎమ్మెస్, ఇతర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు పరుగులు పెడుతున్నారు. అమెరికా కూడా ప్రస్తుతం ఒక్క స్టూడెంట్ వీసాలు తప్ప సాధారణ వీసాలు అంత త్వరగా జారీ చేయడం లేదు. సాధారణ వీసా కోసం కనీసం రెండు, మూడు నెలల పాటు నిరీక్షించవలసి వస్తోంది. దీంతో సాధారణ ప్రయాణికులు, పర్యాటకులు అమెరికాకు వెళ్లడం కష్టంగా మారింది. విద్యార్థుల రద్దీని ఆసరాగా చేసుకుని విమానయాన సంస్థలు టికెట్ల ధరలు పెంచేశాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి అమెరికాకు రూ.75 వేల వరకు టికెట్ ధర ఉంటే ఇప్పుడది ఏకంగా రూ.1.5 లక్షలకు చేరింది. కొన్ని సంస్థలు రూ.2 లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నాయి. అయినప్పటికీ విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థులు అమెరికాకు పోటెత్తినట్లు తరలిపోతున్నారని, టికెట్లు దొరకడం కష్టంగా మారిందని ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. ఫ్లైట్ చార్జీ లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప, విద్యార్థుల రద్దీ తగ్గేవరకు మరో మూడు నెలలపాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు. రెట్టింపైన విద్యార్ధులు ప్రస్తుతం అన్ని రకాల ఆంక్షలు తొలగిపోయి అమెరికాలోని విశ్వవిద్యాలయాలు తెరుచుకోనున్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్ధులు తమ అమెరికా కలను సాకారం చేసుకొనేందుకు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. అమెరికాలో వర్క్ పర్మిట్లకు అవకాశం ఉండటంతో ఆ దేశానికే ఎక్కువ డిమాండ్ నెలకొంది. ఈసారి సుమారు 30 వేల మందికి పైగా విద్యార్ధులు అమెరికా వెళ్లే క్రమంలో ఉన్నట్లు అంచనా. ఇదే సమయంలో సాధారణ ప్రజలు కూడా ఇంతకాలం వాయిదా వేసుకున్న అమెరికా ప్రయాణానికి సమాయత్తమవుతున్నారు. దీంతో టికెట్లకు డిమాండ్ బాగా పెరిగింది. కానీ రద్దీకి తగిన విమానాలు అందుబాటులో లేవు. కోవిడ్ అనంతరం అన్ని ఎయిర్‌లైన్స్ విమాన సేవలను పునరుద్ధరించినప్పటికీ విమానాల సంఖ్యను కుదించారు. గతంలో వారానికి ఏడు ఫ్లైట్లు నడిపిన ఎయిర్‌లైన్స్ ఇప్పుడు నాలుగు మాత్రమే నడుపుతున్నాయి. సిబ్బంది కొరత వంటి అంశాలు విమానాల సంఖ్య తగ్గడానికి కారణమని ట్రావెల్ ఏజెన్సీల ప్రతినిధులు చెబుతున్నారు. హైదరాబాద్–చికాగో ఒక్కటే హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు వెళ్లే ఫ్లైట్లు చాలా తక్కువ. ఎయిర్ ఇండియా మాత్రమే హైదరాబాద్ – చికాగో ఫ్లైట్ నడుపుతోంది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్స్‌ను ఏర్పాటు చేసింది. అలాగే ఖతార్, బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లు ఖతార్, లండన్ మీదుగా విమానాలను నడుపుతున్నాయి. ఇత్తేహాద్ సంస్థ అబుదాబి మీదుగా న్యూయార్క్‌కు నడుపుతోంది. దీంతో చాలామంది ఢిల్లీ, ముంబయిల నుంచి అమెరికాకు బయలుదేరుతున్నారు. వివిధ నగరాల మీదుగా వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్లలో కొంత మేరకు చార్జీలు తక్కువ ఉన్నప్పటికీ బ్రేక్ జర్నీలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. చాలావరకు ఎయిర్‌లైన్స్ రెట్టింపు చార్జీలు వసూలు చేస్తుండగా.. హైదరాబాద్ నుంచి జెడ్డా మీదుగా అమెరికాకు విమానాలు నడుపుతున్న సౌదీ ఎయిర్‌లైన్స్‌లో మాత్రం చార్జీలు కొంత తక్కువగా ఉన్నట్టు తెలిసింది. వన్‌వే చార్జీ రూ.లక్ష వరకు ఉన్నట్లు అంచనా. కానీ జెడ్డాలో ఏకంగా 13 గంటల పాటు నిరీక్షించాల్సివస్తోంది. పెరిగిన టికెట్ ధరలను భారంగా భావించే విద్యార్ధులు, సాధారణ ప్రయాణికులు ఈ ఎయిర్‌లైన్స్‌ను ఎంపిక చేసుకుంటున్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇలా ప్రయాణించే వారు ఆ 13 గంటలు జెడ్డాలో పర్యటించేందుకు వీలుగా సౌదీ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక అనుమతితో కూడిన వీసాలు ఇస్తున్నట్లు ఐఆర్సీటీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. డిమాండ్‌కు తగ్గ విమానాల్లేవు టికెట్ ధరలు పెరగడానికి, డిమాండ్‌కు తగ్గట్లుగా విమానాలు అందుబాటులో లేకపోవడమే కారణం. ప్రయాణికుల భర్తీ రేషియో వంద శాతం ఉంటే హైదరాబాద్ నుంచి 50 శాతంసీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో సహజంగానే టికెట్ ధరలు పెరుగుతున్నాయి. రూ.లక్షలు వెచ్చించినా టికెట్లు దొరకడం కష్టంగా ఉంది. కనీసం 3 నెలల ముందే టికెట్లు తీసుకుంటే మంచిది. – వాల్మీకి హరికిషన్, వ్యవస్థాపకులు, వాల్మీకి ట్రావెల్ అండ్ టూరిజమ్ సొల్యూషన్స్ -
భారతీయ విద్యార్ధులకు అమెరికా గుడ్ న్యూస్!
భారతీయ విద్యార్థులకు భారత్‌లోని అమెరికన్ ఎంబసీ కార్యాలయం శుభవార్త చెప్పింది. చట్టబద్దంగా అమెరికాలో చదువుకునేందుకు అర్హులైన విద్యార్ధులు పొందే ఐ-20 పత్రాలు ఉండి, ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్స్ స్లాట్లు బుక్ చేసుకోవాలని ప్రకటించింది. అమెరికాలో చదువుకునేందుకు వేలాది మంది విద్యార్ధులకు యునైటెడ్ స్టేట్స్‌లోని స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సెర్టిఫైడ్ స్కూల్(ఎస్ఈవీఐసీ)లో అడ్మిషన్ లభిస్తుంది. దీని తర్వాత సంబంధిత స్కూల్ నుంచి అర్హులైన విద్యార్ధులకు అధికారులు ఫారమ్ ఐ-20ని పంపుతారు. Student visa appointments are available on our website. If you have an I-20, don't wait! Future F, M, and J appointment openings at the Embassy and Consulates will be for interviews taking place after Aug 14, so if you need to arrive at school by mid-Aug, book an appointment now! — U.S. Embassy India (@USAndIndia) June 24, 2022 అయితే విద్యార్ధులందరూ పైన పేర్కొన్న ఐ-20 ఫారమ్‌ను అమెరికన్ యూనివర్సిటీస్ నుంచి పొందారు. యూనివర్సిటీతో పాటు అమెరికా ప్రభుత్వ అనుమతి తప్పని సరి. ఇందుకోసం భారత్‌లో ఉన్న యూఎస్ ఎంబసీ విద్యార్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఆ ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. కానీ ఆ ఇంటర్వ్యూలను నిర్వహించలేదు. అందుకే భారత విదేశాంగ శాఖ యూఎస్‌తో చర్చలు జరిపి..భారతీయ విద్యార్ధులకు వీసాలు మంజూరు చేయాలని కోరింది. భారత్ కోరిక మేరకు 2022 జూన్- జులై కావాల్సిన ఇంటర్వ్యూ స్లాట్లను మే నెలలో ఓపెన్ చేసింది. తాజాగా..మరో సారి ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా..త్వరలో యూఎస్ ఎంబసీ, కాన్సలేట్ కార్యాలయాల్లో విద్యార్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. ఐ-20 డాక్యుమెంట్లు ఉంటే ఆలస్యం చేయకుండా మేం నిర్వహించే ఇంటర్వ్యూల కోసం స్లాట్లు బుక్ చేసుకోండి. విద్యార్ధులు పొందాల్సిన ఎఫ్, ఎం, జే వీసాల కోసం ఆగస్టు14 తర్వాత ఇంటర్వ్యూలు జరగుతాయి," అని ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయం చేసిన ట్వీట్లో పేర్కొంది. -
ఒకేరోజు 2,500 మంది విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూలు
సాక్షి, హైదరాబాద్: దేశంలోని యూఎస్ కాన్సులేట్లలో మంగళవారం 2,500 మంది విద్యార్థులను ఇంటర్వ్యూలు చేసినట్టు యూఎస్ ఎంబసీ వెల్లడించింది. స్టూడెంట్ వీసా ఆరో వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కతాల్లో తమ అధికారులు భారత విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి నట్టు హైదరాబాద్ కాన్సులేట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఇంటర్వ్యూల్లో వీసాలు పొందిన విద్యార్థులకు చార్జ్‌డీ అఫైర్స్ పాట్రీషియా లాసినా, కాన్సుల్ జనరల్స్ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తూ అమెరికా–ఇండియా సంబంధాలను మరిం త విస్తృతం చేయాలని చార్జ్ డీ లాసినా ఆకాంక్షిం చారు. ఇప్పటికే అమెరికా–ఇండియా ద్వైపాక్షిక సంబంధాల్లో 75 వసంతాల ఉత్సవాలు జరుపుకుంటున్నట్లు లాసినా గుర్తు చేశారు. అమెరికాలో ఉన్నత విద్య నసభ్యసిస్తున్న వారిలో భారతీయ విద్యార్థుల వాటా 20% ఉం టుందని, సంఖ్యా పరంగా 2 లక్షల మం దికిపైగానే ఉన్నారని కాన్సులేట్ పేర్కొంది. ఈసారి రికార్డు బద్దలు గతం కంటే ఈ ఏడాది స్టూడెంట్ వీసాల ఇంటర్వ్యూల్లో రికార్డు బద్దలు కొడతామని మినిస్టర్ కౌన్సెలర్ ఫర్ కాన్సులర్ ఆఫైర్ డాన్ హెల్పిన్ స్పష్టం చేశారు. కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ కౌన్సెలర్ ఆంథోని మిరిండా మాట్లాడుతూ విద్యార్థులు యూఎస్ విద్యా విధానాన్ని ఉత్తమంగా ఎంచు కుంటున్నారని, ప్రపంచస్థాయిలో అత్యుత్తమ మౌలిక సద పాయాలను కల్పిస్తోందని అన్నారు. అమెరికా విద్యావ్యవస్థ 4వేలకుపైగా విద్యాసంస్థలు, వర్సిటీలకు అక్రిడేషన్ గుర్తింపు కల్పించిందన్నారు. విద్యార్థులు తదుపరి సందేహాల నివృత్తి, విద్యావిధానం సమాచారం కోసం educationusa.state.gov ఇన్‌స్టా గ్రామ్, ఫేస్బుక్ తదితర మాధ్యమా లను సంప్రదించాలని సూచించారు. -
అమెరికాలో మనోళ్ల వాటా పెరిగింది
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. అదే సమయంలో చైనా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. 2021లో భారతీయ విద్యార్థుల సంఖ్య ఏకంగా 12 శాతం పెరిగింది, చైనా విద్యార్థుల సంఖ్య 8 శాతానికి పైగా పడిపోయింది. ఈ విషయాన్ని యూఎస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తాజాగా తన వార్షిక నివేదికలో వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి గతేడాది విదేశీ విద్యార్థుల చేరికపై ప్రభావం చూపిందని తెలిపింది. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో ఇప్పటికీ చైనా జాతీయులదే మెజారిటీ వాటా కాగా భారతీయ విద్యార్థులు రెండో స్థానంలో ఉన్నారు. స్టూడెంట్స్, ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(సెవిస్) ప్రకారం.. నాన్–ఇమ్మిగ్రెంట్ స్టూడెంట్ వీసాలైన ఎఫ్–1, ఎం–1 ద్వారా 2021లో 12,36,748 మంది అమెరికాలో ఉన్నారు. 2020తో పోలిస్తే ఇది 1.2% తక్కువ. 2021లో చైనా నుంచి 3,48,992 మంది, భారత్ నుంచి 2,32,851 మంది అమెరికాకు వచ్చారు. 2020తో పోలిస్తే చైనా విద్యార్థులు 33,569 మంది తగ్గిపోయారు. ఇక భారత్ నుంచి 25,391 మంది అదనంగా వచ్చారు. విదేశీయులు విద్యాభ్యాసం కోసం అమెరికాలోని ఇతర రాష్ట్రాల కంటే కాలిఫోర్నియాకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 2021లో 2,08,257 మంది (16.8 శాతం) విదేశీయులు కాలిఫోర్నియా విద్యాసంస్థల్లో చేరారు. 2021లో యూఎస్‌లో 11,42,352 మంది విదేశీ విద్యార్థులు ఉన్నత విద్యలో డిగ్రీలు పొందారు. -
స్టూడెంట్ వీసాలపై అమెరికన్ ఎంబసీ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: స్టూడెంట్ వీసాలపై దిగులు చెందవద్దని, జూలైలో అదనపు అపాయింట్మెంట్లు ఇస్తామని అమెరికన్ ఎంబసీ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో అమెరికన్ ఎంబసీ జూన్ 14 నుంచి స్టూడెంట్ వీసాల అపాయింట్మెంట్లకు దరఖాస్తులు తీసుకుంటున్న సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికా లోని పలు యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులంతా ఒక్కసారిగా వెబ్సైట్లో లాగిన్ అవుతున్నారు. ఫలితంగా పలుమార్లు సైట్ క్రాష్ అవుతోంది. అదే సమయంలో పదే పదే రిఫ్రెష్ కొట్టడంతో చాలామంది ఖాతాలు ‘లాక్’ అయిపోయాయి. దీంతో 72 గంటలపాటు ఆ ఖాతాలు స్తంభించిపోతున్నాయి. చాలా మంది తమ ఖాతాను ‘అన్‌లాక్’ చేయాలని ఎంబసీకి విన్నవిస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న అమెరికన్ ఎంబసీ.. అపాయింట్మెంట్ల విషయంలో ఆందోళన చెందవద్దని, జూలైలో మరిన్ని అపాయింట్మెంట్లు ఇస్తామని ప్రకటిస్తూ గురువారం ట్వీట్ చేసింది. టీకా గురించి వర్సిటీని అడగండి అమెరికాలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులంతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో టీకా వేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇలాంటి వారంతా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ వేసుకోవడం కన్నా.. అడ్మిషన్ పొందిన వర్సిటీ సూచనల ప్రకారం నడుచుకుంటే మేలని ఎంబసీ వర్గాలు వెల్లడించాయి. అందుకోసం వారిని సంప్రదించాలని స్పష్టంచేశాయి. ఎందుకంటే కొన్ని వర్సిటీలు తాము సూచించిన వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేసుకోవాలని నిబంధనను పక్కాగా అమలుచేస్తున్నాయి. సమాచార లోపం కారణంగా తీరా ఇక్కడ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా.. అక్కడ మరోసారి వేసుకోవాల్సి వస్తుంది. అందుకే, వర్సిటీ నిబంధనల మేరకు నడుచుకోవాలని ఎంబసీ వర్గాలు స్పష్టంచేశాయి. -
ఆగస్టు 1 తరువాతే అమెరికా ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులను ఆగస్టు తరువాతే తమ దేశంలోకి అనుమతిస్తామని హైదరాబాద్ కాన్సులేట్ తెలిపింది. మంగళవారం ఈ మేరకు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఓ ప్రకటన జారీ చేసింది. కరోనా వైరస్ కట్టడికి అమెరికా అధ్యక్షుడు విధించిన నిబంధనలు అమలులో ఉన్న కారణంగా విదేశీ విద్యార్థులందరికీ ఆగస్టు 1 తరువాత మాత్రమే తమ దేశంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థి వీసా (ఎఫ్)లు పొందినప్పటికీ ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చెందే ముప్పు ఉండటంతో వారిని దేశంలోకి అనుమతించలేమని వివరించింది. భారత్‌తోపాటు చైనా, ఇరాన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా విద్యార్థులకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయంది. ఆగస్టు 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యక్తిగత మినహాయింపు కోరుతూ అమెరికన్ ఎంబసీని ఆశ్రయించాల్సిన అవసరం లేదంది. చదవండి: భారత్‌లో పరిస్థితి తీవ్ర ఆందోళనగా ఉంది.. సైన్యాన్ని దించండి భారత్‌లో కరోనా పరిస్థితి విషాదకరం.. ప్రజలకు అండగా ఉంటాం -
‘నేను అమెరికాకు ఎలా వెళ్లగలను?’
వాషింగ్టన్: మహమ్మారి కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఐసీఈ(ద ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్) చేసిన ప్రకటన తమ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టిందని అమెరికాలో విద్యనభ్యసిస్తున్న పలువురు విదేశీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న వేళ ఇప్పటికిప్పుడు స్వదేశానికి వెళ్లలేమని, ఒకవేళ ఇక్కడే ఉంటే వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళనకు గురువుతున్నారు. లోన్లు తీసుకుని.. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి, మెరుగైన భవిష్యత్తు ఉంటుందని భావించి ఇక్కడకు వస్తే అంచనాలన్నీ తలకిందులయ్యాయని వాపోతున్నారు. కాగా కోవిడ్–19 నేపథ్యంలో అమెరికా విశ్వవిద్యాలయాలు పూర్తిగా ఆన్లైన్ క్లాసుల వైపు మొగ్గిచూపినట్లయితే విదేశీ విద్యార్థులు వారి స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందని ఐసీఈ సోమవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లకపోతే కఠిన చర్యలు ఉంటాయని, ఇకపై ఆన్లైన్ క్లాసులతో నడిచే కోర్సులకు వీసాల జారీ కూడా ఉండదని పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికాలో చదువుకుంటున్న లక్షలాది మంది భవిష్యత్తుపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ క్రమంలో వత్సలా థాపర్ అనే యువతి సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు. లాస్ఏంజెల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కరోలినాలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో అండర్ గ్రాడ్యుయేట్(ఐదో సెమిస్టర్) అయిన ఆమె తన అభిప్రాయాలు పంచుకున్నారు. (ఆన్లైన్ క్లాసులా...? మీ దేశాలకు వెళ్లిపోండి!) ‘‘ఐసీఈ ఆదేశాల ప్రకారం.. వివిధ కోర్సుల్లో చేరిన విదేశీ విద్యార్థులు నేరుగా విద్యాబోధన చేసే చోటికి బదిలీ లేదా ఇతర చర్యలు తీసుకోవాలి. ఇదంతా బాగానే ఉంది. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో విద్యా సంస్థలు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో తెలియదు. ఒకవేళ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్న కాలేజీలు మమ్మల్ని వెనక్కి పంపిస్తాయి. అప్పుడు ఆన్లైన్ క్లాసులు వినాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మేం దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం వివిధ దేశాల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించారు. అమెరికా సైతం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి వెళ్లాలనుకున్నా.. విమాన చార్జీలు విపరీతంగా పెరిగాయి. మా కాలేజీని మూసివేస్తున్నట్లు యాజమాన్యం చెప్పిన క్రమంలో నేను మార్చి 18న ఢిల్లీకి వచ్చేశాను. ఇప్పుడు ఒకవేళ కాలేజీ తెరిచి.. ప్రత్యక్ష క్లాసులు నిర్వహిస్తే నేను అమెరికాకు ఎలా వెళ్లగలను? నాలాగే స్వదేశాలకు వెళ్లిన విద్యార్థులు కాలేజీకి ఎలా వెళ్తారు? ఇదిలా ఉంటే.. హార్వర్డ్ యూనివర్సిటీ ఇప్పటికే ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లక తప్పని పరిస్థితి. ఇప్పుడు ఆ యూనివర్సిటీ కోర్టుకు వెళ్లినా.. ఆ తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. నిబంధనల ప్రకారం అమెరికాను వీడిన వారికి మళ్లీ ఆ దేశంలో ప్రవేశం ఉండదు.(‘ఆన్లైన్’ ఆదేశాలపై కోర్టుకు వెళ్లిన హార్వర్డ్, ఎంఐటీ) నిజానికి అమెరికా ఆర్థిక వ్యవస్థలో విదేశీ విద్యార్థుల కంట్రిబ్యూషన్ కూడా ఏమీ తక్కువగా లేదు. అలాంటప్పుడు ఇలా మా ప్రాణాల్ని, భవిష్యత్‌ను గందరగోళంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసం? చాలా మంది ఇప్పటికే ఇంటి అద్దె కోసం యజమానులతో ఒప్పందాలు చేసుకుని ఉన్నారు. మధ్యలో వెళ్లిపోతామంటే కుదరదు. డబ్బు పూర్తిగా చెల్లించమంటారు. ఫీజు కట్టడానికే ఎన్నో కష్టాలు పడుతూ, లోన్లు తీసుకున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇది అదనపు భారం. నాలాగా టెక్నికల్, లాబ్- బేస్డ్ క్లాసులు, ప్రాక్టికల్ క్లాసులకు హాజరు కావాల్సిన వారికి ఆన్లైన్ క్లాసులు ఎంతమేరకు ప్రయోజనం చేకూరుస్తాయి. చాలా దేశాల్లో ఆన్లైన్ క్లాసులు సజావుగా సాగే మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేవు. ఇంటర్నెట్ సదుపాయం లేక, కరెంటు కోతలతో ఇబ్బందిపడే వారు ఎందరో ఉన్నారు. విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆకాంక్షిస్తున్నాను. అయితే అది ఎంత వరకు నెరవేరుతుందో తెలియదు’’ అని ఆవేదన చెందారు. -
విదేశీ విద్యార్థులకు అమెరికా భారీ షాక్!
వాషింగ్టన్: విదేశీ విద్యార్థులకు అమెరికా భారీ షాకిచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు విద్యా సంస్థలు మొగ్గు చూపినట్లయితే విదేశీ విద్యార్థులు అమెరికా విడిచి వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అదే విధంగా కొత్తగా విద్యార్థి వీసాలు జారీ చేయబోమని పేర్కొంది. ఈ మేరకు.. ‘‘వచ్చే విద్యా సంవత్సరానికి గానూ పూర్తి స్థాయిలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు నిర్ణయించిన స్కూళ్లలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వీసా జారీచేయబోం. అలాంటి వారిని యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ దేశంలోకి అనుమతించదు. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా(ఎఫ్-1 ఎం-1-తాత్కాలిక ప్రాతిపదికన జారీ చేసేవి) మీద ప్రస్తుతం అమెరికాలో ఉండి ఆన్లైన్ క్లాసులు వింటున్న వాళ్లు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది, లేదా చట్టబద్ధంగా అమెరికాలో ఉండాలనుకుంటే స్కూల్‌కు వెళ్లేందుకు అనుమతి ఉన్న విద్యా సంస్థకు బదిలీ చేయించుకోవాలి. అలా జరగని పక్షంలో ఇమ్మిగ్రేషన్ విధానాన్ని అనుసరించి ఎదురయ్యే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి’’అని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. (హెచ్ 1బీ: భవిష్యత్తుపై మనోళ్ల బెంగ!) కాగా ట్రంప్ యంత్రాంగం తీసుకున్న తాజా నిర్ణయం భారత విద్యార్థులపై దుష్ప్రభావం చూపనుంది. ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్(ఐఐఈ) గణాంకాల ప్రకారం 2018-19 విద్యా సంవత్సరానికి గానూ అమెరికాలో దాదాపు 10 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరిలో అత్యధికులు చైనా, భారత్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కెనడా నుంచి వచ్చినవాళ్లే. ఇదిలా ఉండగా.. లాక్డౌన్ కారణంగా కోల్పోయిన సిలబస్, కొత్త సెమిస్టర్లకు సంబంధించి తమ విధానం ఎలా ఉండబోతుందో పలు కాలేజీలు, యూనివర్సిటీలు ఇంతవరకు స్పష్టం చేయలేదు. మరికొన్ని విద్యాసంస్థలు వర్చువల్ క్లాసెస్‌తో పాటు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు విద్యార్థులకు అవకాశమిస్తామని పేర్కొనగా.. హార్వర్డ్ యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులకే మొగ్గుచూపాయి. మరోవైపు.. అమెరికాలో కరోనా రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే అక్కడ దాదాపు 29 లక్షల మంది మహమ్మారి బారిన పడగా.. దాదాపు లక్షా ముప్పై వేల మంది కరోనాతో మృతి చెందారు. ఇలాంటి తరుణంలోఅమెరికాలో ఉంటే కాలేజీకి వెళ్లాలి లేదంటే స్వదేశానికి వెళ్లిపోవాలి అన్నట్లుగా ట్రంప్ సర్కారు నిర్ణయం ఉందంటూ ఇమ్రిగ్రేషన్ అటార్నీ సైరస్ మెహతా విమర్శించారు. ట్రంప్ క్రూర పాలనకు ఇది నిదర్శనం.. విదేశీ విద్యార్థుల ప్రాణాలను అపాయంలోకి నెట్టారు అంటూ డెమొక్రాట్లు మండిపడుతున్నారు. (కువైట్‌లో 8 లక్షల మంది భారతీయులకు కత్తెర?) -
వీసా బ్యాన్పై కసరత్తు!
వాషింగ్టన్: హెచ్1బీ సహా పలు రకాల వర్క్ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించే దిశగా అమెరికా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వర్క్ ఆథరైజేషన్‌తో కూడిన స్టుడెంట్ వీసాలపై నిషేధం విధించాలని భావిస్తోంది. కరోనా కారణంగా అమెరికా ఉద్యోగరంగంలో నెలకొన్న సంక్షోభంతో వర్క్ వీసాల జారీపై తాత్కాలికంగా నిషేధం విధించాలని ట్రంప్ సర్కారు యోచిస్తోంది. సాంకేతిక, ఇతర నైపుణ్యాలున్న విదేశీయులకు అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగావకాశం కల్పించేదే హెచ్1బీ వీసా. ఈ వీసాకు భారత్, చైనాలో భారీ డిమాండ్ ఉంది. ఈ వీసాపై ప్రస్తుతం దాదాపు 5 లక్షల మంది విదేశీయులు అమెరికాలో ఉన్నారు. ‘వర్క్ వీసాల నిషేధానికి సంబంధించి ఈ నెలలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడవచ్చు. ఈ దిశగా ఇమిగ్రేషన్ సలహాదారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు’అని శుక్రవారం వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో పేర్కొంది. కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడే వైద్య నిపుణుల కొరత తీర్చుకునేందుకు అందుబాటులో ఉన్న 40 వేల గ్రీన్‌కార్డులను విదేశీ వైద్యులు, నర్సులకు జారీ చేయాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ ఆమోదం పొంది, జారీ చేయని గ్రీన్ కార్డ్‌లను ఇప్పుడు వైద్యులు, నర్సులకు జారీ చేయాలని కోరుతూ పలువురు సభ్యులు కాంగ్రెస్‌లో ప్రతిపాదన చేశారు. -
చదువుకు సై.. కొలువుకు నై
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : డాలర్ కల చెదురుతోంది! అమెరికా కొలువులు ఇక అందని ద్రాక్ష కానున్నాయి. అక్కడ భారత విద్యార్థులకు, వర్క్ వీసాలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోతోంది. మూడేళ్ల క్రితమే మొదలైన ఈ తేడా ఈ ఏడాది ఏకంగా రెట్టింపైంది. అమెరికాలో ఉద్యోగం చేయొచ్చన్న ఆశతో లక్షల సంఖ్యలో విద్యార్థులు వెళ్తున్నా.. ఆ దేశం ఏటా జారీ చేస్తున్న వర్క్ వీసాల సంఖ్య మాత్రం 85 వేలు దాటడం లేదు. దీంతో మున్ముందు ఉద్యోగాలు దొరక్క భారతీయ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను ఏటేటా పెంచుకోవడం ద్వారా గతేడాది అమెరికన్ విశ్వవిద్యాలయాలు 70 కోట్ల డాలర్ల టర్నోవర్‌ను దాటాయి. ఇలా అమెరికా ప్రభుత్వం ఓవైపు విద్యార్థులను ఆకర్షిస్తూనే మరోవైపు హెచ్1బీ వీసాలపై సవాలక్ష ఆంక్షలు విధిస్తోంది. ప్రస్తుతం ఉన్న 85 వేల హెచ్1బీ వీసాల గరిష్ట పరిమితి భవిష్యత్‌లోనూ కొనసాగితే 2020 నుంచి ఏటా లక్ష మంది భారతీయులు అమెరికా నుంచి తిరుగుముఖం పట్టాల్సి ఉంటుందని కొలంబియా బిజినెస్ స్కూల్ రీసెర్చ్ స్కాలర్ సూరజ్ బజాజ్ అంచనా వేశారు. ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే ఆ సంఖ్య పెరిగినా ఆశ్చర్యం లేదని అమెరికాలో బ్యాంకింగ్ నిపుణుడు శ్రీనివాసన్ రాధాకృష్ణన్ ఆందోళన వ్యక్తం చేశారు. వీసా గడువు ముగుస్తున్న దశలో రెన్యువల్ కోసం వస్తున్న దరఖాస్తులను కూడా యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సీఐఎస్) నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తోంది. హెచ్1బీ వీసాల జారీ, గడువు పొడిగింపు వంటి అంశాల్లో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. హెచ్1బీ వీసా నిబంధనలను కచ్చితంగా అమలు చేసి తీరాలని 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకే యూఎస్ విమానాశ్రయాల నుంచి విద్యార్థులను వెనక్కి పంపడం, హెచ్1బీ గడువు పెంపు కోసం వచ్చిన దరఖాస్తులను కఠిన పరిశీలన చేసి తిరస్కరించడం వంటి చర్యలు మొదలయ్యాయి. నాలుగేళ్ల క్రితమే మొదలైన పోటీ హెచ్1బీ వీసాల కోసం భారతీయుల పోటీ 2014లోనే మొదలైంది. అంతకుముందు సంవత్సరాల్లో 35 నుంచి 40 వేలలోపు మాత్రమే ఉన్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2014 తర్వాత లక్ష దాటింది. 2014 దాకా వీసాల జారీకి పరిమితి లేకపోవడంతో దరఖాస్తు చేసిన దాదాపు ప్రతి పది మందిలో 8 మందికి ఉద్యోగ వీసాలు లభించేవి. కానీ 2015లో వీసాలకు పరిమితి విధించడంతో ఏటేటా భారతీయుల బ్యాక్లాగ్ (హెచ్1బీ వీసాల కోసం) పెరుగుతూ వస్తోంది. 2015, 2016, 2017లో 1,26,292 మందికి వీసాలు లభించలేదు. ఈ ఏడాదిలో వీసా కోసం భారతీయుల నుంచి వచ్చిన దరఖాస్తులు మొత్తం 1.68 లక్షలు. వీరిలో 71,675 మందికి మాత్రమే హెచ్1బీ వీసాలు మంజూరయ్యాయి. వాటిలోనూ వెరిఫికేషన్ తర్వాత 3 నుంచి 5 శాతం తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. వీరంతా అర్హత ఉంటే 2019 ఏప్రిల్‌కు మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అయితే గ్రాడ్యుయేషన్ తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) కోసం మూడేళ్లు అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తారు. ఈ మూడేళ్లలో హెచ్1 బీ వీసా లభించకపోతే తిరిగి స్వదేశం వెళ్లడమో లేదా మళ్లీ విశ్వవిద్యాలయాల్లో చేరిపోవడమో తప్ప వేరే మార్గం ఉండదు. గ్రాడ్యుయేషన్ తర్వాత మూడేళ్లు ఉద్యోగం చేసినా వీసా దొరకని వారు అప్పటిదాకా కూడబెట్టుకున్న సొమ్ముతో తిరిగి ఇతర కోర్సుల్లో చేరేందుకు మళ్లీ ఎఫ్–1 (విద్యార్థి వీసా)కు మారిపోతున్నారు. గడచిన రెండేళ్లలో దాదాపు లక్ష మంది ఓపీటీ గడువు ముగిసినా వీసా రాక అక్కడే వేర్వేరు విశ్వవిద్యాలయాల్లో ఇతర కోర్సుల్లో చేరిపోయారని సూరజ్ బజాజ్ తన పరిశీలన పత్రంలో వెల్లడించారు. రెన్యువల్‌కు సవాలక్ష ఆంక్షలు గతంలో హెచ్1బీ వీసా రెన్యువల్ చేసే విషయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఉదారంగా వ్యవహరించేవారు. కానీ గడచిన మూడేళ్లుగా నిబంధనలు కఠినం చేశారు. వీసా పొందిన మూడేళ్లు క్రమం తప్పకుండా పన్ను చెల్లించారా లేదా అన్న అంశంతోపాటు 36 నెలలు నెలనెలా బ్యాంక్‌లో వేతనం జమ అయిందా లేదా అన్న వివరాలు పరిశీలిస్తున్నారు. ఏ కారణం చేత అయినా 6 నెలలు లేదా ఏడాది ఖాళీగా ఉంటే వీసాను పునరుద్ధరించడం లేదు. గడచిన మూడేళ్లలో 1.38 లక్షల మంది వీసాలు పునరుద్ధరణకు నోచుకోలేదు. అంటే ఏటా సగటున 45 వేల మంది అక్కడ ఉద్యోగం ఉండి కూడా తిరుగుముఖం పడుతున్నారన్నమాట! ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని అక్కడి ఇమిగ్రేషన్ వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్న వారు చెబుతున్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి: నిపుణులు ఉద్యోగం కోసం అమెరికాలో విద్య అభ్యసించాలనుకునేవారు ముందు అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం ఉద్యోగం కోసమే అయితే భారీగా అప్పులు చేసి అమెరికాలో చదవాలనుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అంత మంచిది కాదంటున్నారు. వర్క్ వీసాల (ఎల్1) విషయంలో ఇప్పటికే ఐటీ కంపెనీలను కట్టడి చేసిన అమెరికా ప్రభుత్వం తదుపరి హెచ్1బీ విషయంలోనూ నిబంధనలు కఠినతరం చేసే ఆలోచన చేస్తోందని గడచిన ఏడాదిన్నరగా అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తున్న కొలంబియా బిజినెస్ స్కూల్ రీసెర్చ్ స్కాలర్ సూరజ్ బజాజ్ అభిప్రాయపడ్డారు. అత్యంత ప్రతిభావంతులు, ఆర్థిక స్థోమత కలిగి ఉన్నవారు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని, ఎటొచ్చి బ్యాంకు రుణాలతో చదవాలనుకునే వారికి మాత్రం ‘రిస్క్’ఉంటుందని ఆయన అన్నారు. అమెరికాలో ఉన్నత విద్య కోసం ఈ ఏడాది వచ్చే విద్యార్థుల సంఖ్య 2.10 లక్షల కంటే ఎక్కువే ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ ఏడాది మొదటి సీజన్ (ఫాల్)కు వచ్చేవారి సంఖ్య 1.18 లక్షలు దాటిందని, రెండో సీజన్ (స్ప్రింగ్)కు విద్యార్థుల సంఖ్య లక్ష దాకా ఉంటుందని యూఎస్సీఐఎస్ అంచనా. గడచిన మూడేళ్లలో అమెరికాలో ఉన్నత విద్య కోసం వచ్చిన వారి సంఖ్య 4.75 లక్షలు. ఈ ఏడాది విద్యార్థులను కలుపుకుంటే సుమారు 7 లక్షలకు చేరుతుందని భావిస్తున్నారు. -
ఊరిస్తున్న బ్రిటన్ వీసా..
లండన్: విదేశీ వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూర్చేలా.. తన వలస విధానం(ఇమిగ్రేషన్ పాలసీ)లో మార్పులు చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఇమిగ్రేషన్ పాలసీలో సవరణల్ని ఆమోదం కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. బ్రిటన్ వ్యాపార సంస్థలు, కంపెనీలు తమ అవసరం మేరకు విదేశీ వృత్తి నిపుణుల్ని నియమించుకునేందుకు అవకాశం కల్పించేలా వీసా నిబంధనల్ని సరళతరం చేయాలని ఈ సవరణల్లో ప్రతిపాదించారు. బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయం మన వృత్తి నిపుణులకు మేలు చేకూరుస్తుందని భారత ఐటీ వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. విదేశీ వృత్తి నిపుణుల కోసం బ్రిటన్ జారీ చేస్తోన్న టైర్ 2 వీసాల ప్రక్రియలో ఇంతవరకూ కఠిన నిబంధనలు కొనసాగాయి. అయితే బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్ మానవవనరుల కొరతతో ఇబ్బందిపడుతోంది. దాన్ని అధిగమించేందుకు వలస విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. వీసాల పరిమితిని సడలించడంతో పాటు.. ప్రస్తుతం కొనసాగుతున్న కఠిన నిబంధనల్ని సమీక్షించాలని ప్రతిపాదించింది. వేర్వేరు రంగాల్లో ఉద్యోగుల కొరతపై నెలవారీ సమీక్ష నిర్వహించాలని స్వతంత్ర వలసల సలహా కమిటీని కోరతామని పార్లమెంటుకు తెలిపింది. బ్రిటన్ పార్లమెంట్ ప్రకటన ప్రకారం.. ‘ఐరోపాయేతర దేశాల నుంచి బ్రిటన్‌లో పనిచేయడానికి వచ్చే వైద్యులు, నర్సుల్ని టైర్–2 వీసాల పరిధి నుంచి మినహాయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ఆస్పత్రుల్లో వైద్య నిపుణులు, సిబ్బంది కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది’ అని వెల్లడించారు. ప్రస్తుతం నెలకు 1,600 వరకూ టైర్ 2 వీసాలు జారీ చేస్తుండగా.. ఆ కేటగిరి నుంచి వైద్యులు, నర్సుల్ని మినహాయించడంతో భారతీయ వైద్యులు, నర్సులు లబ్ధి పొందనున్నారు. ఇతర కీలక వృత్తులను టైర్ 2 కేటగిరీ నుంచి మినహాయించవచ్చని భావిస్తున్నారు. సృజనాత్మకత ఉన్న ఫ్యాషన్ డిజైనర్లకు టాలెంట్ వీసాను జారీ చేయనున్నట్లు సవరణల్లో బ్రిటన్ వెల్లడించింది. ఆహ్వానించదగ్గ పరిణామం: ఫిక్కీ బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఫిక్కీ, బ్రిటిష్ పరిశ్రమల సమాఖ్య స్వాగతించాయి. ‘భారతీయ నిపుణులు ఎంతో కాలంగా ఈ డిమాండ్‌ను వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టైర్ 2 వీసా కేటగిరీని సులభతరం చేయాలన్న బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామం. దీంతో వృత్తి నిపుణులు బ్రిటన్‌లో పనిచేసేందుకు మార్గం సులభతరమవుతుంది. దీర్ఘకాలంలో బ్రిటన్ వ్యాపార సంస్థల మధ్య పోటీతత్వం పెరుగుతుంది’ అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) అధ్యక్షుడు రశేష్ షా అన్నారు. రెండు దేశాల మధ్య ఉత్సాహపూరితమైన వాణిజ్య, ఆర్థిక సంబంధాల కోసం స్వేచ్ఛాయుత, నిజాయితీ, పారదర్శకతతో కూడిన వీసా నిబంధనల కోసం ఫిక్కీ ప్రయత్నాలు చేసిందని ఆయన చెప్పారు. బ్రిటన్ వ్యాపార సంస్థలు ఈ సంస్కరణల్ని ఆహ్వానిస్తాయని, అంతర్జాతీయ నైపుణ్యం, ప్రతిభ బ్రిటన్ కంపెనీలకు కీలకమని బ్రిటన్ పరిశ్రమ సమాఖ్యకు చెందిన ముఖ్య అధికారి మాథ్యూ ఫెల్ పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులకు బ్రిటన్ ఝలక్ బ్రిటన్‌లో విద్యార్థి వీసాలకు సంబంధించి ‘లో రిస్క్’ దేశాల జాబితా నుంచి భారత్‌ను మినహాయించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వలస విధానం సవరణల్లో భాగంగా విదేశీ విద్యార్థులకు ఇచ్చే ‘టైర్ 4’ వీసాలకు సంబంధించి 25 దేశాల విద్యార్థులకు నిబంధనల్లో సడలింపు నిచ్చారు. ఈ జాబితాలో ఉన్న అమెరికా, కెనడా, న్యూజిలాండ్ తదితర దేశాలకు ఎప్పటినుంచో సడలింపు కొనసాగుతుండగా.. తాజాగా చైనా, బహ్రైన్, సెర్బియా తదితర దేశాల్ని చేర్చారు. జూలై 6 నుంచి ఇది అమల్లోకి రానుంది. జాబితాలోని దేశాలకు చెందిన విద్యార్థులు పెద్దగా తనిఖీలు ఎదుర్కోవాల్సిన అవసరముండదు. అయితే మన దేశం నుంచి వెళ్లే విద్యార్థులు కఠిన తనిఖీలు ఎదుర్కోక తప్పదు. ఇది అవమానకరమని, తప్పుడు సంకేతాలు పంపుతుందని భారత సంతతి వ్యాపారవేత్త లార్డ్ కరణ్ బిలిమోరియా విమర్శించారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులు 12% పెరిగారు
హైదరాబాద్ : పదేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య 90,000 ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అయ్యిందని అమెరికన్ కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హడ్డా పేర్కొన్నారు. ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లే భారత విద్యార్థులు గత ఏడాది కంటే ఈ ఏడాది 12 శాతం పెరిగారని చెప్పారు. న్యూఢిల్లీలోని ఎంబసీ కార్యాలయంతో పాటు హైదరాబాద్, కోల్కత్తా, చెన్నై, ముంబై నగరాల్లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయాల్లో బుధవారం ‘స్టూడెంట్ వీసా డే’నిర్వహించారు. ఆయా కార్యాలయాల ద్వారా ఒక్కరోజే 4,000 మందికి వీసాలు జారీ చేసినట్లు యూఎస్ కాన్సులేట్ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ కార్యాలయంలో 16 మంది విద్యార్థులకు క్యాథరిన్ హడ్డా వీసాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా యూఎస్‌కు వచ్చేవారిలో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. అమెరికాకు చదువులకు వెళ్లే ప్రతి ఆరుగురిలో ఒక భారతీయ విద్యార్థి ఉన్నాడన్నారు. ఈ క్రమంలో భారత, అమెరికా మధ్య బంధాన్ని మరింత పటిష్టపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన సినీనటుడు అడవి శేషు, ప్రముఖ పారిశ్రామికవేత్త వీణారెడ్డి మాట్లాడుతూ.. తాము అమెరికాలో ఉన్నత చదువులు చదివి తమ కెరీర్‌ను ఇక్కడే మలచుకున్న తీరును, అనుభవాలను వివరించారు. యూఎస్‌లో అన్ని దేశాలకు చెందిన విద్యార్థులను కలిసే అవకాశం ఉంటుందని, ఈ క్రమంలో ఒకరికొకరు పరస్పరం మేథస్సును, సంస్కృతిని పంచుకోవచ్చని తెలిపారు. -
బ్రిటన్ విద్యార్థి వీసాల్లో కోత!
లండన్: బ్రిటన్ ప్రభుత్వం విద్యార్థి వీసాల సంఖ్యను భారీగా తగ్గించనున్నట్లు తెలుస్తోంది. భారత్ సహా ఐరోపా బయటి దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చే విద్యార్థుల సంఖ్య నానా టికీ తగ్గుతోంది. ప్రస్తుతం 3 లక్షల విద్యార్థి వీసాలను బ్రిటన్ మంజూరు చేస్తుండగా విశ్వసనీయ సమాచారం ప్రకారం వీటి సంఖ్యను దాదాపు సగానికి అంటే 1.7 లక్షలకు తగ్గించనుంది. బ్రిటన్‌లోకి వలసలను తగ్గించే లక్ష్యంతో ఇప్పటికే అనేక మంది భారతీయ విద్యార్థులకు బ్రిటన్ చిన్న చిన్న కారణాలతో వీసాలను నిరాకరిస్తోంది. ప్రభుత్వ గణాంకాల కార్యాలయం సర్వే ప్రకారం గతేడాది 1.34 లక్షల మందికి విద్యార్థి వీసాలను మంజూరు చేయగా ఈ ఏడాది 1.11 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. బ్రిటన్ విద్యార్థి వీసాలను అత్యధికంగా దక్కించకుంటున్న తొలి మూడు దేశాలు అమెరికా, చైనా, భారత్. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థుల పాత్ర ఎంతో ఉందనీ, వారి వల్ల ఏడాదికి 14 బిలియన్ పౌండ్లు సమకూరుతున్నాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి వలసలను తగ్గించడానికి ఇతర వీసాల సంఖ్యలో కోత పెట్టినా విద్యార్థి వీసాలను మాత్రం ఎక్కువగా ఇవ్వాలని సూచిస్తున్నారు. -
ఇలాకూడా ‘హెచ్-1బీ వీసా’ పొందొచ్చు!
న్యూఢిల్లీ : విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లిన విద్యార్థులు.. అక్కడ చదువుకుంటూ పనిచేసుకోవాలంటే హెచ్-1బీ వీసా తప్పని సరి. ఈ వీసా కావాలంటే ఏటా ఇచ్చే 85వేల హెచ్-1బీ వీసాల కోసం లాటరీలో అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది. కానీ, వర్సిటీ ఉద్యోగులు, వర్సిటీలకు బయటనుంచి పనిచేసే వారికి ఈ లాటరీ నుంచి మినహాయించి.. నేరుగా హెచ్-1బీ వీసా ఇస్తారు. దీనివల్ల వర్సిటీలో పనిచేయటంతోపాటు బయట వేరే వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. అయితే అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టంలోని ‘వర్సిటీల ఉద్యోగులకు మినహాయింపు’ అనే లొసుగును వాడుకుంటూ బాబ్సన్తోపాటు పలు వర్సిటీలు తమ విద్యార్థులకు ఈ వీసాలిప్పిస్తున్నాయని విద్యారంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నా.. కొన్ని విద్యాసంస్థలు పంపించిన వారికే ఈ వీసాలు రావటమే ఇందుకు నిదర్శనమని వారంటున్నారు.