అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో భారత విద్యార్థులకు యూఎస్ వీసాలు కష్టమేనన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ స్టూడెంట్స్ ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాల్లో ఉన్నత చదువులకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులకు బ్రిటన్ చేదువార్త చెప్పింది. స్టూడెంట్ వీసా కావాలంటే మునుపటి కన్నా ఎక్కువ సొమ్ములు చూపించాలని అంటోంది.
ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులు ఇక నుంచి అధిక నిధులు సమకూర్చుకోవాల్చిందే. యూకే స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు.. మెయింటెనెన్స్ మనీగా చూపించాల్సిన మొత్తాన్ని బ్రిటన్ 11.17 శాతం పెంచేసింది. 2025, జనవరి నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇక నుంచి విద్యార్థి వీసా దరఖాస్తుదారులు తమ బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.14.4 లక్షలు (13,347 పౌండ్లు) మెయింటెనెన్స్ మనీగా చూపించాల్సి ఉంటుంది. 28 రోజుల పాటు వారి బ్యాంక్ ఖాతాలో ఈ నగదు ఉండాలి. ఇప్పటివరకు ఈ మొత్తం రూ. 12.9 లక్షలు (12,006 పౌండ్లు)గా ఉంది. బ్రిటన్‌లో పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘మెయింటెనెన్స్ మనీ’ కూడా పెంచినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
లండన్‌లో వెలుపల చదవాలనుకున్న విద్యార్థులకు కూడా మెయింటెనెన్స్ మనీ 11.05 శాతం వరకు పెరిగింది. లండన్‌లో కాకుండా ఇతర ప్రాంతాల్లోని యూనివర్సిటీల్లో చదివేందుకు విదేశీ విద్యార్థులు ఇప్పటివరకు 9,207 పౌండ్లు మెయింటెనెన్స్ మనీగా చూపించేవారు. ఇక నుంచి ఈ మొత్తం 10,224 పౌండ్లకు పెరుగుతుంది. 2025, జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని బ్రిటీష్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది.
యూకే స్టూడెంట్ వీసాల నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో బ్రిటన్ వెళ్లాలనుకునే భారత విద్యార్థులు మరిన్ని నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తమ ఆర్థిక వ్యవహారాలను మరింత సూక్ష్మంగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. నిర్వహణ ఖర్చుల భారం నుంచి ఉపశమనం పొందాలంటే స్కాలర్‌షిప్‌లు సంపాదించాలని సలహాయిస్తున్నారు. విదేశాల్లో చదువు పూర్తైన తర్వాత బాగా సెటిలయితే తాము పెట్టిన పెట్టుబడి సద్వినియోగం అయినట్టేనని కెరీర్ మొజాయిక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మనీషా జవేరీ పేర్కొన్నారు.
చదవండి: హెచ్1బీ వీసా రగడలో అనూహ్య పరిణామాలు!
విదేశాల్లో ఉన్నత చదువు కోసం స్టూడెంట్ వీసా పొందేందుకు కొంత మొత్తాన్ని తమ బ్యాంకు ఖాతాలో చూపించాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు, నిర్వహణ ఖర్చుల కోసం తగినంత డబ్బును వారి బ్యాంక్ ఖాతాలో చూపించాలి. లండన్‌లో చదవాలకునే విదేశీ విద్యార్థులు 20 వేల పౌండ్లు ‘మెయింటెనెన్స్ మనీ’ అవసరమవుతుంది. ఒకవేళ వీసా అప్లై చేయడానికి ముందే 5 వేల పౌండ్లు చెల్లిస్తే.. మిగతా 15 వేల పౌండ్లు బ్యాంకు ఖాతాలో 28 రోజుల పాటు ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment