UK visa
-
ఐటీ ఉద్యోగులను మించిపోయిన చెఫ్‌లు.. ఎలాగో చూడండి..
యూకే ఇమ్మిగ్రేషన్ డేటా ఇటీవలి విశ్లేషణ ఊహించని పరిణామాన్ని వెల్లడించింది. కంప్యూటర్ ప్రోగ్రామర్ల కంటే చెఫ్‌ల వీసా దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. డిజిటల్ సూపర్ పవర్ గా ఎదగాలన్న తన ఆకాంక్షలకు ఊతమిచ్చేందుకు అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులను ఆకర్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అందుకు విరుద్ధంగా ఈ పరిణామం చోటు చేసుకుంది.ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 2024 మార్చి వరకు 6,203 మంది చెఫ్‌లకు స్కిల్డ్ వర్కర్ వీసాలు మంజూరయ్యాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 54 శాతం అధికం. ఇదే సమయంలో ప్రోగ్రామర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లకు జారీ చేసిన వర్క్ పర్మిట్ల సంఖ్య 8,752 నుంచి 4,280కి పడిపోయింది. ఈ రెండు వృత్తులు ముఖ్యంగా భారతీయ వలసదారులలో ప్రాచుర్యం పొందాయి. యూకేలో భారతీయ రెస్టారెంట్ పరిశ్రమకి గణనీయమైన ఉనికి ఉంది.అయితే చెఫ్ వీసాల పెరుగుదల స్వల్పకాలికమే కావచ్చు. స్కిల్డ్ వర్కర్ వీసా నిబంధనల్లో మార్పులు చేయడం వల్ల యువ వర్కర్లకు కనీస వేతనం 38,700 పౌండ్లకు (సుమారు రూ.41 లక్షలు) పెరిగింది. 2023 ఏప్రిల్ నాటికి యూకేలో సగటు చెఫ్ జీతం 22,877 పౌండ్లు (సుమారు రూ.24 లక్షలు)గా ఉంది. చాలా రెస్టారెంట్లు కొత్త వేతన స్థాయిలను భరించే అవకాశం లేదు. దీంతో కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే దరఖాస్తుల హడావుడి పెరిగినట్లుగా తెలుస్తోంది.మరింత కఠినమైన ఆంక్షలు, అధిక వీసా ఫీజులను ప్రవేశపెట్టిన యూకే ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో తాజా మార్పులను అధికారిక గణాంకాలు ఇంకా ప్రతిబింబించలేదు. 2023లో నికర వలసలు 10 శాతం తగ్గి 6,85,000 కు పడిపోవడం, వీసా దరఖాస్తులు తగ్గడంతో వలసలు తగ్గుముఖం పట్టాయని ప్రారంభ సూచికలు సూచిస్తున్నాయి. -
యూకే వీసా 15 రోజుల్లోనే: బ్రిటిష్ హైకమిషనర్ గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: భారతీయులకు యూకే తీపి కబురు చెప్పింది. వీసా నిరీక్షణ సమయాన్ని కూడా తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా 15 రోజుల్లో వీసా ప్రాసెసింగ్ ప్రక్రియను మళ్లీ ప్రారంభించనుంది. వీసాల జారీపై భారీ జాప్యం, ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరంతో పోల్చితే భారతీయ విద్యార్థుల సంఖ్య 89 శాతం పెరిగిందని భారతదేశంలోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ (అక్టోబర్ 18) ట్విటర్లో వెల్లడించారు. విజిటర్ వీసాల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడంపై దృష్టి సారించామని ట్విటర్లో షేర్ చేసిన ఒక వీడియోద్వారా తెలిపారు. అలాగే ఐటీ నిపుణుల వర్క్ వీసాల ఆలస్యాన్ని నివారించడం తోపాటు, జారీ ప్రక్రియను మరింత వేగంగా ప్రాసెస్ చేయనున్నామన్నారు. ఈ నిర్ణయం ఐటీ నిపుణుల తోపాటు, చాలామంది భారతీయులకు ఊరటనిస్తోంది. దీంతో పలువురు హర్షం ప్రకటిస్తున్నారు. 15 రోజుల టైమ్‌లైన్ చాలా ఉపశమనం కలిగిస్తుందని ఒక ట్విటర్ యూజర్ కమెంట్ చేశారు. షార్ట్ టర్మ్ స్టడీ విజిటర్ వీసా కోసం అప్లై చేసి 9 వారాలు అయినా ఇంకా రాలేదని మరో యూజర్ ఫిర్యాదు చేశారు. వీసా రాని కారణంగా యూనివర్సిటీలో ఫిజికల్ హాజరు గడువు దాటిపోవడంతో స్టడీని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇపుడిక మంచి జరుగుతుందని భావిస్తున్నారు. We are on track to get back to processing 🇮🇳 to 🇬🇧 #visa applications within our standard of 15 days. 👉 Student numbers ⬆️ by 89% since last year. 👉 Skilled workers visas bring processed faster 👉 Focus on improving visitor visa processing times. A long way come, more to go. pic.twitter.com/cjX26mRxs8 — Alex Ellis (@AlexWEllis) October 18, 2022 -
చలో యూకే.. పోస్ట్ స్టడీ వర్క్ ఇక.. ఓకే!
యూకేలో ఉన్నత విద్య.. మన దేశ విద్యార్థులకు.. టాప్–4 డెస్టినేషన్! అకడమిక్‌గా పలు వెసులుబాట్లు ఉండటంతో.. మన విద్యార్థులు యూకే వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా యూకే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త విధానంతో.. బ్యాచిలర్ నుంచి పీహెచ్డీ వరకు..ఆయా కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు.. అక్కడే ఉండి పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు అన్వేషించొచ్చు. ఉద్యోగం దొరికితే.. ఆ దేశంలోనే స్థిరపడొచ్చు. ఇంతకీ.. ఆ కొత్త విధానం ఏంటి? అంటే.. గ్రాడ్యుయేట్ రూట్ వీసా!! ఈ విధానం ఈ ఏడాది జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. గ్రాడ్యుయేట్ రూట్ వీసా విధానంతో.. భారత విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ఈ నేపథ్యంలో.. గ్రాడ్యుయేట్ రూట్ వీసా విధి విధానాలు.. భారత విద్యార్థులకు ప్రయోజనాలు.. పోస్ట్ స్టడీ వర్క్ గరిష్ట సమయం తదితర అంశాలపై విశ్లేషణ... అంతర్జాతీయ విద్యార్థుల కోసం యూకే ప్రభుత్వం ఇటీవల గ్రాడ్యుయేట్ రూట్ వీసా విధానం ప్రవేశ పెట్టింది. ఈ విధానంలో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ కోర్సుల విద్యార్థులు రెండేళ్లు, పీహెచ్డీ విద్యార్థులు మూడేళ్లుపాటు పోస్ట్ స్టడీ వర్క్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ వీసా మంజూరైతే.. ఆఫర్ లెటర్ లేకపోయినా.. అక్కడే ఉండి ఉద్యోగానేష్వణ చేయొచ్చు. ఉద్యోగం లభిస్తే గ్రాడ్యుయేట్ వీసా కాలపరిమితి ముగిశాక.. ఇతర వర్క్ వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదాహరణకు గ్రాడ్యుయేట్ వీసాతో ఉద్యోగం పొంది.. రెండేళ్లు, లేదా మూడేళ్ల వ్యవధి పూర్తయ్యాక.. స్కిల్డ్ వర్కర్ వీసాకు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. స్కిల్డ్ వర్కర్ వీసా మంజూరైతే.. సదరు అభ్యర్థులు మరింత కాలం యూకేలో ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది. గ్రాడ్యుయేట్ వీసాకు అర్హతలు ► జూలై 1, 2021 నుంచి గ్రాడ్యుయేట్ రూట్ వీసా అమల్లోకి వచ్చింది. ► ఈ వీసా పొందేందుకు యూకే ప్రభుత్వం కొన్ని అర్హత ప్రమాణాలు పేర్కొంది. ► గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకునే నాటికి యూకేలో ఉండాలి. ► ప్రస్తుతం స్టూడెంట్ వీసా లేదా చదువుల కోసం ఇచ్చే టైర్–4 జనరల్ వీసా కలిగుండాలి. ► యూకే విద్యా విధానం నిబంధనల ప్రకారం–నిర్దేశించిన కనీస కాలపరిమితితో ఆయా కోర్సులు పూర్తి చేసి ఉండాలి. ► కనీసం 12 నెలల వ్యవధిలోని కోర్సులను స్టూడెంట్ వీసా లేదా, టైర్–4 జనరల్ వీసా ద్వారా చదివుండాలి. స్టూడెంట్ వీసా ముగిసే లోపే గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకొని.. పోస్ట్ స్టడీ వర్క్ అవకాశం పొందాలనుకునే విద్యార్థులు.. తమ స్టూడెంట్ వీసా లేదా టైర్–4 జనరల్ వీసా కాలపరిమితి ముగిసేలోపే గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. తాజా నిబంధన కల్పిస్తున్న మరో ముఖ్యమైన వెసులుబాటు.. విద్యార్థులు తమ కోర్సులకు సంబంధించి సర్టిఫికెట్లు పొందకముందే గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ వీసా పొందేందుకు వీలుగా తాము కోర్సులు పూర్తిచేసుకున్న యూకే ఇన్స్టిట్యూట్ లేదా కాలేజ్ నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. ‘ఆన్లైన్’ విద్యార్థులకూ.. అవకాశం కరోనా కారణంగా యూకే యూనివర్సిటీల్లో ఆన్లైన్ విధానంలో కోర్సులు చదివిన విద్యార్థులు కూడా గ్రాడ్యుయేట్ వీసా విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కరోనా పరిస్థితుల్లో 2020 నుంచి లాక్డౌన్, విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దాంతో విద్యా సంస్థలు ఆన్లైన్లో విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పించి... బోధన సాగించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని తాజాగా ఈ వెసులుబాటు కల్పించారు. ఫలితంగా 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితితో స్టూడెంట్ వీసా లేదా టైర్–4 వీసా కలిగి.. జనవరి 24, 2020 నుంచి సెప్టెంబర్ 27, 2021లోపు యూకే ఇన్స్టిట్యూట్లలో యూకే వెలుపలే ఉంటూ.. ఆన్లైన్ విధానంలో కోర్సులు అభ్యసించిన విద్యార్థులు గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు ► గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆన్లైన్లో పూర్తి చేయాలి. నిర్దేశిత డాక్యుమెంట్లను అందించాల్సి ఉంటుంది. ► పాస్ట్ పోర్ట్ ఐడెంటిటీ ప్రూఫ్, స్కాలర్షిప్ లేదా స్పాన్సర్షిప్ ప్రొవైడర్ నుంచి ధ్రువీకరణ పత్రం, కోర్సు ప్రవేశ సమయంలో ఇచ్చే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్(సీఏఎస్) రిఫరెన్స్ నెంబర్, బయో మెట్రికల్ రెసిడెన్స్ పర్మిట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. ► పీహెచ్డీ విద్యార్థుల విషయంలో అకడమిక్ టెక్నాలజీ అప్రూవల్ స్కీమ్ సర్టిఫికెట్ కూడా అవసరం. ఎనిమిది వారాల్లో నిర్ణయం ఆన్లైన్లో గ్రాడ్యుయేట్ వీసా దరఖాస్తును పరిశీలించి.. తుది నిర్ణయం తీసుకునేందుకు గరిష్టంగా ఎనిమిది వారాల సమయం పడుతుందని యూకే ఇమిగ్రేషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. దరఖాస్తుకు ఆమోదం లభిస్తే ఈ–మెయిల్ లేదా యూకే ఇమిగ్రేషన్ పోర్టల్‌లో దానికి సంబంధించిన ధ్రువీకరణను తెలుసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ వీసాతో ప్రయోజనాలు ► కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాన్వేషణ సాగించే అవకాశం లభిస్తుంది. ► ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసుకునే వీలుంటుంది. ► స్వయం ఉపాధి పొందొచ్చు. స్వచ్ఛంద సేవకు అవకాశం ఉంటుంది. ► గ్రాడ్యుయేట్ వీసా కాల పరిమితి సమయంలో యూకే నుంచి స్వదేశానికి లేదా ఇతర దేశాలకు వెళ్లి, మళ్లీ యూకేకు తిరిగిరావచ్చు. నిపుణుల కొరతే కారణం ► యూకేలో పలు రంగాల్లో నిపుణులైన మానవ వనరుల కొరత కారణంగా అక్కడి ప్రభుత్వం తాజాగా గ్రాడ్యుయేట్ రూట్ వీసాను ప్రవేశ పెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ► ప్రస్తుతం యూకేలో హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో నిపుణుల కొరత కనిపిస్తోంది. ► 2030 నాటికి ఆరు లక్షల మంది విదేశీ విద్యార్థులకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యం కూడా తాజా గ్రాడ్యుయేట్ రూట్ వీసా విధానం తేవడానికి మరో కారణంగా చెబుతున్నారు. భారత విద్యార్థులకు ప్రయోజనం గ్రాడ్యుయేట్ రూట్ వీసాతో భారత విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. గత నాలుగైదేళ్లుగా యూకేకు వెళుతున్న భారత విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తాజా విధానంతో వేల మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకునే వీలు కలుగుతుంది. ఈ వీసా కాల పరిమితి సమయంలో అక్కడే ఉండి ఉద్యోగం సాధించి.. అక్కడే పర్మనెంట్ రెసిడెన్సీ కూడా పొందొచ్చు. యూకేలో విద్యార్థులు యూకేలో విద్య కోసం గత నాలుగేళ్లుగా భారత్ నుంచి వెళుతున్న విద్యార్థుల సంఖ్య వివరాలు.. » 2016 – 11,328 » 2017 – 14,435 » 2018 – 19,505 » 2019 – 34,540 » 2020 – 49,884 గ్రాడ్యుయేట్ రూట్ వీసా.. ముఖ్యాంశాలు ► జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన గ్రాడ్యుయేట్ రూట్ వీసా విధానం. ► బ్యాచిలర్, పీజీ విద్యార్థులు రెండేళ్లు; పీహెచ్డీ అభ్యర్థులు మూడేళ్లు అక్కడే ఉండి పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు అన్వేషించొచ్చు. ► 2020, 2021లో యూకేలోని వర్సిటీలు, ఇన్స్టిట్యూట్లలో కోర్సులు అభ్యసించిన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం. ► కోవిడ్ నేపథ్యంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ విధానంలో అభ్యసించిన వారు కూడా అర్హులే. ► ఉద్యోగం సొంతం చేసుకున్నాక.. వర్క్ వీసాకు బదిలీ చేసుకునే వీలుంటుంది. ► కోర్సుల సర్టిఫికెట్లు రాకముందే గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు. ఎంతో సానుకూల అంశం యూకే తాజా నిర్ణయం.. భారత విద్యార్థులకు ఎంతో సానుకూల అంశంగా చెప్పొచ్చు. యూకేలోని విదేశీ విద్యార్థుల విషయంలో భారత్ రెండో స్థానంలో ఉంటోంది. ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. గ్రాడ్యుయేట్ వీసా ద్వారా భారత విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రయోజనం పొందే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం విదేశీయులకు ఇచ్చే వీసాల విషయంలోనూ.. దాదాపు యాభై శాతం వీసాలు మన దేశానికి చెందిన వారికే లభిస్తున్నాయి. – జె.పుష్పనాథన్, డైరెక్టర్ (సౌత్ ఇండియా), బ్రిటిష్ కౌన్సిల్ -
57వేల వీసాలతో టాప్‌లో మనోళ్లు!
లండన్: బ్రిటన్ విద్యార్థి వీసా పొందిన విదేశీయుల్లో భారతీయులు తొలిస్థానంలో నిలిచారు. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్(ఓఎన్ఎస్) వెలువరించిన గణాంకాల ప్రకారం 2019లో 37,500 మంది భారతీయ విద్యార్థులకు టయర్–4(విద్యార్థి) వీసాలు దక్కాయి. 8 ఏళ్లతో పోలిస్తే ఇదే అత్యధికం. వృత్తి నిపుణులకిచ్చే టయర్–2 వీసాల్లో సగం భారతీయులకే దక్కాయి. ఈ విభాగంలో భారతీయులు 57వేల వీసాలతో టాప్‌లో నిలిచారు. గత ఏడాది 5.15 లక్షల మంది భారతీయులకు పర్యాటక వీసా ఇచ్చినట్లు తెలిపింది. అంతకు ముందుతో పోలిస్తే ఇది 8 శాతం ఎక్కువని వివరించింది. మొత్తమ్మీద భారతీయుల వీసా దరఖాస్తులను 95 శాతం వరకు ఆమోదించినట్లు తెలిపింది. బ్రిటన్‌కు వలసలు యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి తగ్గిపోగా, మిగతా దేశాల నుంచి క్రమేపీ పెరుగుతున్నట్లు వివరించింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త విధానంతో కూడా భారతీయులకు లాభం కలుగుతుందని తెలిపింది. (చదవండి: హ్యాపీనెస్ క్లాస్‌పై మెలానియా ట్వీట్..) -
బ్రిటన్‌లో కొత్త వీసా విధానం!
లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ బయటకొచ్చిన (బ్రెగ్జిట్) అనంతరం ఆ దేశ వలస విధానంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత బ్రిటన్ తన వలస నిబంధనల్లో భారీ మార్పులు చేపడుతోంది. బ్రెగ్జిట్ అనంతరం వీసాలు, వలసల విషయంలో అవలంబించాల్సిన వ్యూహాలపై రూపొందించిన శ్వేతపత్రాన్ని బుధవారం ఆ దేశ పార్లమెంటులో హోంశాఖ మంత్రి సాజిద్ జావీద్ ప్రవేశపెట్టారు. అత్యున్నత నైపుణ్యానికి పట్టం గట్టేలా ఉన్న ప్రతిపాదిత విధానం భారతీయ విద్యార్థులకు, వృత్తి నిపుణులకు ప్రయోజనకరమని నిపుణులు భావిస్తున్నారు. ఈ విధానం ప్రకారం ప్రపంచంలోని ఏ ప్రాంతం వారైనా తగిన ప్రతిభా సంపత్తి ఉన్నట్టయితే బ్రిటన్‌లో పని చేసేందుకు వీలవుతుంది. విదేశీ విద్యార్థులు బ్రిటన్‌లో చదువుకుంటే వారి విద్యాభ్యాసం పూర్తయిన అనంతరం పనిచేసుకునే అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఈ విధానం బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత (2021 డిసెంబర్ తర్వాత) 2025 వరకూ దశలవారీగా అమలవుతుంది. దీని ప్రకారం ఈయూ సహా ప్రపంచం మొత్తానికీ ఒకే రకమైన వలస విధానాన్ని బ్రిటన్ అమలులోకి తెస్తుంది. ఇప్పటిలా ఈయూలోని 28 దేశాల ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు వీలుండదు. అయితే ఈయూ నుంచి వచ్చే సందర్శకులు మాత్రం వీసా లేకుండా బ్రిటన్ సందర్శించవచ్చు. వీసాల సంఖ్యపై పరిమితులుండవు.. ప్రస్తుతం బ్రిటన్ ఏడాదికి 20,700 ఉద్యోగ వీసాలు (టైర్ 2 వీసాలు) జారీ చేస్తోంది. బ్రెగ్జిట్ తర్వాత ఇలాంటి పరిమితులు ఏమీ ఉండబోవు. దీంతో వైద్యం, ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన భారతీయ నిపుణులకు ఈ విధానం లబ్ధి చేకూర్చగలదని భావిస్తున్నారు. కొద్దిపాటి నైపుణాలు ఉన్న ఉద్యోగులు/కార్మికులు ఏడాది వీసాపై వెళ్లి పని చేసేందుకు కూడా ఈ విధానం వీలు కల్పిస్తుంది. అయితే ఇలాంటి వారు తమతో కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు, యూకేలో నివాస హక్కులు అడిగేందుకు అంగీకరించబోమని బ్రిటన్æ హోం మంత్రిత్వ కార్యాలయం తెలిపింది. ఈ తరహా వీసాలు కొన్ని దేశాలకు మాత్రమే ఇవ్వాలనేది వలస విధానంలోని ఒక అంశం. ఇందులో భారత్ కూడా ఉన్నదా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. బ్రిటన్‌లో ఇప్పటివరకు నైపుణ్యాలు అంతగా అవసరం లేని ఉద్యోగాలను అధికభాగం యూరప్ దేశాల ప్రజలే చేస్తున్నారు. అయితే ఐదేళ్లపాటు విదేశీ నిపుణులను కంపెనీలు నియమించుకుంటే వారికి కనీస వేతనం 30,000 పౌండ్లు ఉండాలనే అంశం వివాదాస్పదంగా మారింది. దీనిపై కంపెనీలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు ఆరునెలల పాటు బ్రిటన్‌లో ఉండి ఉద్యోగం చేసుకునేందుకు ఈ విధానం అవకాశం కల్పిస్తుంది. -
బ్రిటన్ వర్సిటీల్లో తగ్గిన భారతీయుల చేరిక
లండన్: బ్రిటన్ ప్రభుత్వ చర్యల కారణంగా దేశంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో భారతీయుల చేరిక గత 8 ఏళ్లలో సగానికిపైగా తగ్గిపోయిందని అఖిలపక్ష పార్లమెంటరీ బృందం(ఏపీపీజీ) తెలిపింది. విదేశీ విద్యార్థులను ఆకట్టుకునే విషయంలో కెనడా కంటే బ్రిటన్ వెనుకపడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా విద్యార్థులను ఆకర్షించడానికి పోస్ట్ స్టడీ వర్క్ వీసా నిబంధనల్లో మార్పులు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఈమేరకు చేపట్టాల్సిన సంస్కరణలపై 12 సిఫార్సులతో కూడిన నివేదికను ఏపీపీజీ ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వం పోస్ట్ వర్క్ వీసాను పునరుద్ధరించాలని అందులో ఏపీపీజీ కోరింది. అలాగే సులభతర వీసా జాబితా నుంచి భారతీయులను తొలగించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి చర్యల కారణంగా అభద్రతకు లోనైన విద్యార్థులు ప్రత్యామ్నాయ గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారని ఏపీపీజీ సభ్యుడు కరన్ బిలిమోరియా తెలిపారు. బ్రిటన్ ప్రభుత్వం త్వరలోనే ఇమ్మిగ్రేషన్ బిల్లు–2018ని పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అందులో ఈ సిఫార్సులను చేర్చాల్సిందిగా డిమాండ్ చేస్తామని వెల్లడించారు. -
ఇంగ్లీష్‌లో ఓవర్ క్వాలిఫై : వీసా తిరస్కరణ
ఇంగ్లీష్‌లో ఓవర్ క్వాలిఫై అయిందని ఓ భారతీయ మహిళ వీసా అప్లికేషన్‌ను యూకే ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరస్కరించారు. ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్కు అవసరమైన దానికంటే ఎక్కువగా ఇంగ్లీష్ భాషలో ఆమె నైపుణ్యం కలిగి ఉన్నట్టు అధికారులు చెప్పడం గమనార్హం. అలెగ్జాండ్రియా రింటుల్.. మేఘాలయలోని షిల్లాంగ్ ప్రాంతానికి చెందిన ఆమె. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్‌లో అడ్వాన్స్డ్ వెర్షన్లో ఆమె పాస్ అయ్యారు. కానీ వీసాకు అవసరమయ్యే ఎగ్జామ్ చాలా తేలికగా ఉంటుంది. ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్‌ను పాస్ అవ్వాలంటూ అలెగ్జాండ్రియా వీసాను తిరస్కరించారు. దీనికి రుజువుగా ఐలెట్స్ సర్టిఫికేట్‌ను అందజేయాలని, అయితే ఈ ప్రమాణపత్రం యూకేవీ కోసం ఆమోదయోగ్యమైన ఐలెట్స్ సర్టిఫికేట్ కాదని గుర్తించినట్టు ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఓ లెటర్‌ను అలెగ్జాండ్రియాకు పంపించింది. అంతేకాక అలెగ్జాండ్రియా ఇంగ్లీష్‌పై కూడా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ అనుమానాలు వ్యక్తంచేసింది. మెజార్టీ ఇంగ్లీష్ మాట్లాడే భాషా దేశాల జాబితాలో కూడా అలెగ్జాండ్రియా దేశం లేదని పేర్కొంది. అలెగ్జాండ్రియా ఈ క్రిస్మస్ ను స్కాటిష్ నేషనల్లో ఉంటున్న తన భర్త బాబీ రింటుల్తో జరుపుకోవాలని వీసాను దరఖాస్తు చేసుకున్నారు. కానీ యూకే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమె వీసాను తిరస్కరించారు. యూకే ప్రభుత్వం కనీసం పార్టనర్, డిపెండెంట్ లేదా జీవిత భాగస్వామిగా పరిగణించి ఈ తిరస్కరణ చేపట్టకుండా ఉండాల్సిందని అలెగ్జాండ్రియా అన్నారు. భారత్ ఇంగ్లీష్ మాట్లాడే దేశం కాదనే రుజువు వారి వద్ద లేదని తెలిపారు. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండ్ మీడియాను ఆమె మౌంట్ కార్మెల్ కాలేజీ బెంగళూరులో అలెగ్జాండ్రియా చదువుకున్నారు. మే 2న స్కాటిష్ జాతీయుడిని ఆమె వివాహం చేసుకున్నారు. మరోసారి వీసాను రీఅప్లయ్ చేశానని, ఇదంతా చాలా ఖరీదుతో కూడుకున్నదని చెప్పారు. ప్రతి వీసా డాక్యుమెంట్ 2వేల బ్రిటిష్ పౌండ్ల అని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఎలాంటి ఆప్షన్ లేదని అలెగ్జాండ్రియా చెప్పారు. -
భారతీయులకు బాగా పెరిగిన వీసాలు
న్యూఢిల్లీ : భారతీయులకు యూకే వీసాలు పెరిగాయి. భారతీయులకు జారీచేసిన యూకే వీసాలు గతేడాది కంటే 9 శాతం పెరిగి సెప్టెంబర్ నాటికి 5,17,000గా నమోదైనట్టు యూకే ఆఫీసు ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ రెగ్యులర్ రిపోర్టు పేర్కొంది. ఈ సంఖ్యలో పర్యాటక వీసాలు 11 శాతం పెరిగి 4,27,000కు చేరుకున్నాయని, వర్క్ వీసాలు 53వేల గానే ఉన్నట్టు రిపోర్టు నివేదించింది. యూకేలోఇతర దేశాలతో పోలిస్తే ఉద్యోగవకాశాల కోసం భారతీయులు ఎక్కువగా వీసాలు పొందుతున్నట్టు తెలిసింది. టైర్ 4 స్టూడెంట్ వీసా కేటగిరీలో ఎక్కువ మొత్తంలో పెంపుదల చూడొచ్చని రిపోర్టు తెలిపింది. గతేడాది భారతీయులకు 14వేలకు పైగా స్టూడెంట్ వీసాలు జారీ అయ్యాయని, అంతకముందు 12 నెలల కాలాల కంటే 27 శాతం ఎక్కువని రిపోర్టు వివరించింది. వరుసగా మూడు క్వార్టర్ల నుంచి యూకేలో భారతీయులకు స్టూడెంట్ వీసాలు పెరుగుతూ వస్తున్నాయి. యూకే-బ్రిటన్ సంబంధాల విషయంలో ఇది చాలా అద్భుతమైన సమయమని భారత్‌కు బ్రిటన్ హై కమిషనర్ సర్ డొమినిక్ ఆస్క్విత్ చెప్పారు. యూకేతో భారత్ సంబంధాలు బాగా బలోపేతమవుతున్నాయనే దానికి ఈ గణాంకాలే నిదర్శనమన్నారు. భారతీయులకు తమ వీసా సర్వీసులు మెరుగ్గా ఉన్నాయని, 90 శాతం దరఖాస్తుదారులు వీసాలు పొందుతున్నారని, 99 శాతం టార్గెట్ సమయంలో వీసా అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నామని తెలిపారు. -
బ్రిటన్ వీసాలు ప్రియం
లండన్: వీసా చార్జీల పెంపు, ఇతర కఠిన నిర్ణయాలతో బ్రిటన్ గత ఏడాది మార్చి ప్రకటించిన వీసా నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఫలితంగా భారతీయులతోపాటు నాన్ యూరోపియన్ యూనియన్ (ఈయూయేతర) దేశాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. వీరు కోరుకునే టైర్ 2 కేటగిరీ వీసాల్లో భారీ మార్పులు రానున్నాయి. ఈయూయేతర దేశాల ఉద్యోగులను నియమించుకునే బ్రిటన్ కంపెనీలు ఇమిగ్రేషన్ స్కిల్స్ చార్జి కింద ఇకపై అదనంగా ఒక్కో ఉద్యోగికి ఏడాదికి 1,000 పౌండ్లు(దాదాపు రూ.81వేలు) చెల్లించాలి. చిన్న, చారిటబుల్ సంస్థలు 364 పౌండ్లు చెల్లించాలి. టైర్ 2 ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్(ఐసీటీ) వీసాకోసం దరఖాస్తు చేసేవారు ఏడాదికి 200 పౌండ్ల హెల్త్ సర్‌చార్జి చెల్లించాలి. వలసదారులకు ఉద్యోగాలిచ్చే సంస్థలను తగ్గించి, ఆ ఉద్యోగాలను బ్రిటిషర్లతో భర్తీ చేసేందుకు వారికి శిక్షణ ఇవ్వడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు యూకే హోం ఆఫీస్ తెలిపింది. అయితే పీహెచ్డీ స్థాయి ఉద్యోగాలకు, విద్యార్థి వీసా నుంచి వర్కింగ్ వీసాకు మారే విదేశీ విద్యార్థులకు చార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని, బ్రిటన్ ఆర్థిక పురోగతికి కీలకమైన నిపుణులను దేశంలో ఉంచుకుకోవడానికి ఇది రక్షణ కల్పిస్తుందని పేర్కొంది. టైర్ 2 ఐసీటీ షార్ట్ టర్మ్ స్టాఫ్ వీసాలను రద్దు చేశారు. కొరత ఉన్న ఉద్యోగాల జాబితా నుంచి కెమిస్ట్రీ టీచర్లను తొలగించారు. ఈ–వీసాతో 60 రోజులు న్యూఢిల్లీ: ఈ–వీసాలపై భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకులు ఇక నుంచి మన దేశంలో రెండు నెలల వరకు ఉండొచ్చని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం చెప్పారు. ఏప్రిల్ 1 నుంచే ఈ విధానం అమలులోకి వచ్చిందన్నారు. అలాగే ఈ–వాణిజ్య, ఈ–పర్యాటక వీసాలు కలిగిన వారిని రెండుసార్లు, ఈ–వైద్య వీసా ఉంటే మూడుసార్లు భారత్‌లోకి ప్రవేశించడానికి అనుమతి స్తామని చెప్పారు. గతంలో వారిని 30 రోజుల వరకే భారత్‌లో ఉండేందుకు అనుమతించేవారు. -
నేటి నుంచి యూకే కొత్త వీసా విధానం
లండన్: వలసదారుల సంఖ్యను నియంత్రించేందుకు యూరోపియన్ యూనియనేతర ప్రజల కోసం యూకే ప్రభుత్వం వీసా విధానంలో చేసిన మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి వల్ల భారీ సంఖ్యలో భారత ఐటీ ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. యూకే హోం శాఖ గత నెలలో ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం... నవంబర్ 24న లేదా ఆ తర్వాత టైర్ 2 అంతర కంపెనీ బదిలీ(ఐసీటీ) కోసం చేసుకునే దరఖాస్తులకు కనీస వేతనం 30 వేల పౌండ్లు ఉండాలి. ఇంతకు పూర్వం ఇది 20 వేల 800 పౌండ్లు. ఐసీటీ విధానం కింద జారీ అయిన వీసాల్లో 90 శాతం భారత ఉద్యోగులే దక్కించుకున్నారని యూకే మైగ్రేషన్ అడ్వైజరీ తెలిపింది. వీసా విధానంలో చేసిన మార్పులు మన ఐటీ ఇంజనీర్లకు శరాఘాతంగా పరిణమించనున్నాయి. వేతన పరిమితిని కేవలం టైర్ 2 ఐసీటీ విభాగానికే కాక ఇతర విభాగాలలో కూడా పెంచారు. టైర్ 2 (సాధారణ) ఉద్యోగులకు రూ. 20.80 లక్షల వేతనం ఉండాలని చెబుతూ, కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ట్రైనీలుగా వచ్చే టైర్ 2 (ఐసీటీ) గ్రాడ్యుయేట్ ట్రైనీల వేతన పరిమితి 19.14 లక్షలుగా నిర్ణయించారు. దాంతోపాటు ఒక్కో కంపెనీ ఏడాదికి కేవలం 20 మందిని మాత్రమే ఇలా తీసుకురావాలని నిబంధన విధించారు. -
పాక్ బౌలర్ కు భారీ ఊరట!
ఇస్లామాబాద్: క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడి నిషేధం ముగిసిన తర్వాత మళ్లీ పాకిస్తాన్ జాతీయ జట్టులో ఆడేందుకు మహమ్మద్ ఆమీర్ కు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఆమీర్ కు భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. నిషేధం తర్వాత అతడు ఆడనున్న తొలి సిరీస్ కావడంతో అడ్డంకులు తొలగి పోవడంతో కెరీర్ ను పునర్ ప్రారంభించబోతున్నాడు. ఆమీర్ కు గురువారం యూకే వీసా అందించినట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. దీంతో త్వరలో ఇంగ్లండ్ లో ఆ దేశంతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు ఆమీర్ కు దారులు తెరుచుకున్నాయి. 2010లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐదేళ్ల నిషేధం వేటు పడింది. ఆరు నెలల జైలు శిక్ష విధించగా మూడు నెలలు జైలు జీవితం గడిపాడు. ఈ కారణంగా అతడికి యూకే వీసా నిరాకరిస్తుందని పలు కథనాలు వచ్చాయి. వీటితో పాటు ఎంతటి వారినైనా ఉపేక్షించకూడదని ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ వ్యాఖ్యలు చేశాడు. ఏ స్థాయి క్రికెటరైనా ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు రుజువైతే జీవిత కాలం నిషేధం ఒక్కటే తగిన పరిష్కారమని సూచించాడు. సరిగ్గా అదేరోజు ఆమీర్ కు యూకే అధికారులు వీసా ఇచ్చారు. జూన్ 18 నుంచి పాకిస్తాన్- ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే పాక్ స్పీడ్ స్టార్ ఆమీర్ ఆరేళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. ఇంగ్లండ్ లోనే గతంలో జైలు శిక్ష అనుభవించడంతో యూకే వీసా అతడికి అసాధ్యమని అందరూ భావించారు. వీసా రావడంతో పాక్ జట్టులో ఉన్న ఆమీర్ కు ఇంగ్లండ్ టూర్ కు లైన్ క్లియర్ అయింది. -
యూకేకు అందని 'భారత' వైద్యం
లండన్: యూకే ఆసుపత్రుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, వైద్య సహాయకుల ఖాళీలను భారతీయులతో నింపాలని అక్కడి సర్కారు యోచిస్తోంది. ప్రభుత్వం ఆధీనంలోని జాతీయ ఆరోగ్య సేవ (ఎన్హెచ్ఎస్)లో ఖాళీలపై కామెరాన్ సర్కారు పైవిధంగా ఆలోచించింది. అయితే.. యూకే వీసా విధానం, అక్కడి వైద్య నియమాలు ఇబ్బందికరంగా ఉండటంతో భారతీయులు ఆసక్తి కనబరచటం లేదు. -
యూకే వీసాల్లో భారతీయులు టాప్
లండన్: 2015లో ఎక్కువ యూకే వీసాలు పొందిన నైపుణ్యమున్న విదేశీయుల్లో భారతీయులు మొదటిస్థానంలో నిలిచారు. 92,062 మందికి వీసాలు జారీచేయగా అందులో 52,360 మంది భారత్‌కు చెందిన వారేనని యూకే జాతీయ గణాంకాల సంస్థ తెలిపింది. 10,130 మందితో అమెరికా తర్వాతి స్థానం దక్కించుకుంది. -
సల్మాన్‌ఖాన్ జైలు శిక్షపై స్టే
జోధ్‌పూర్: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఊరట లభించింది. వన్యమృగాలను వేటాడిన కేసులో ఆయనకు కింది కోర్టు విధించిన జైలు శిక్ష అమలుపై రాజస్థాన్ హైకోర్టు స్టే విధించింది. దీంతో బ్రిటన్ వీసా పొందేందుకు ఆయనకు అడ్డంకులు తొలగిపోయాయి. వన్యప్రాణులను వేటాడిన కేసులో సల్మాన్‌ఖాన్‌కు 2006లో కింది కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. నాలుగేళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవించిన వారు బ్రిటన్ వీసా పొందేందుకు అనర్హులు. సల్మాన్‌కు జైలు శిక్ష పడినప్పటి నుంచి ఆయనకు బ్రిటన్ దౌత్య కార్యాలయం వీసా నిరాకరిస్తూ వస్తోంది. కింది కోర్టు తీర్పును హైకోర్టు నిలుపుదల చేయడంతో తాజాగా బ్రిటన్ వీసాకు సల్మాన్ దరఖాస్తు చేయనున్నారు. తన దగ్గరవున్న బ్రిటన్ వీసా గడువు ఇటీవల ముగియడంతో కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సల్మాన్ హైకోర్టును ఆశ్రయించారు. -
సల్లూభాయ్‌కి యూకే వీసా ఓకే!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు యూకే వీసా లభించడంతో కొంత ఊరట లభించింది. వీసా కోసం అవసరమయ్యే పత్రాలు సమర్పించని కారణంగా సల్లూభాయ్‌కి యూకే వీసాను ఇటీవల నిరాకరించిన సంగతి తెలిసిందే. తెలుగులో విజయవంతమైన ‘కిక్’ రీమేక్ కోసం లండన్‌లో జరిగే షూటింగ్లో పాల్గొనేందుకు సల్మాన్ కాన్సులేట్‌లో వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ వీసాకు అవసరమయ్యే పత్రాలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో యూకే కాన్సులేట్ వీసాను ఇవ్వడానికి నిరాకరించింది. ఆ తర్వాత వీసా మంజూరు కావాల్సిన పత్రాలను దాఖలు చేశామని, దాంతో వీసా మంజూరు చేశారని సల్మాన్ తం డ్రి సలీం ఖాన్ తెలిపారు. 1998లో ’హమ్ సాథ్ సాథ్ హై’ చిత్ర షూటింగ్ సందర్భంగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో అనుమతి లేకుండా జింకలను వేటాడినట్టు, 2002 సంవత్సరంలో ’హిట్ అండ్ రన్’ కేసు సల్మాన్‌పై నమోదైంది. ఈ కేసులో నేరారోపణలు రుజువైతే సల్మాన్ ఖాన్‌కు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది అని న్యాయనిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.