పాక్ బౌలర్ కు భారీ ఊరట!
ఇస్లామాబాద్: క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడి నిషేధం ముగిసిన తర్వాత మళ్లీ పాకిస్తాన్ జాతీయ జట్టులో ఆడేందుకు మహమ్మద్ ఆమీర్ కు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఆమీర్ కు భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. నిషేధం తర్వాత అతడు ఆడనున్న తొలి సిరీస్ కావడంతో అడ్డంకులు తొలగి పోవడంతో కెరీర్ ను పునర్ ప్రారంభించబోతున్నాడు. ఆమీర్ కు గురువారం యూకే వీసా అందించినట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. దీంతో త్వరలో ఇంగ్లండ్ లో ఆ దేశంతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు ఆమీర్ కు దారులు తెరుచుకున్నాయి. 2010లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐదేళ్ల నిషేధం వేటు పడింది. ఆరు నెలల జైలు శిక్ష విధించగా మూడు నెలలు జైలు జీవితం గడిపాడు. ఈ కారణంగా అతడికి యూకే వీసా నిరాకరిస్తుందని పలు కథనాలు వచ్చాయి.
వీటితో పాటు ఎంతటి వారినైనా ఉపేక్షించకూడదని ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ వ్యాఖ్యలు చేశాడు. ఏ స్థాయి క్రికెటరైనా ఫిక్సింగ్కు పాల్పడినట్లు రుజువైతే జీవిత కాలం నిషేధం ఒక్కటే తగిన పరిష్కారమని సూచించాడు. సరిగ్గా అదేరోజు ఆమీర్ కు యూకే అధికారులు వీసా ఇచ్చారు. జూన్ 18 నుంచి పాకిస్తాన్- ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే పాక్ స్పీడ్ స్టార్ ఆమీర్ ఆరేళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. ఇంగ్లండ్ లోనే గతంలో జైలు శిక్ష అనుభవించడంతో యూకే వీసా అతడికి అసాధ్యమని అందరూ భావించారు. వీసా రావడంతో పాక్ జట్టులో ఉన్న ఆమీర్ కు ఇంగ్లండ్ టూర్ కు లైన్ క్లియర్ అయింది.