నేటి నుంచి తొలి టెస్టు
మధ్యాహ్నం గం. 1:30 నుంచి జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
సెంచూరియన్: దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ జట్టు నేటి నుంచి టెస్టు సిరీస్ ఆడనుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో 63.33 పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా... ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్‌ను 2–0తో గెలవాల్సిన అవసరముంది.
ఇదే తమ లక్ష్యమని సఫారీ జట్టు సారథి తెంబా బవుమా ఇప్పటికే ప్రకటించగా... వన్డే సిరీస్‌లో కనబర్చిన జోరును కొనసాగిస్తూ సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ సత్తా చాటాలని పాకిస్తాన్ జట్టు ఆశిస్తోంది. పేసర్లకు సహకరించనున్న సెంచూరియన్ పిచ్‌పై దక్షిణాఫ్రికా నలుగురు పేసర్లతో బరిలోకి దిగనుంది. గత ఆరేళ్లలో సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో పేసర్లు 227 వికెట్లు పడగొట్టగా... స్పిన్నర్లు కేవలం 16 వికెట్లు మాత్రమే తీశారు. సఫారీ గడ్డపై పాకిస్తాన్ టెస్టు రికార్డు ఏమంత గొప్పగా లేదు.
1995 నుంచి అక్కడ పర్యటిస్తున్న పాక్ జట్టు 15 టెస్టులాడి 12 మ్యాచ్‌ల్లో ఓడింది. పాకిస్తాన్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరు (49) కూడా దక్షిణాఫ్రికా గడ్డపైనే నమోదైంది. వన్డే సిరీస్‌లో సత్తా చాటిన ప్రధాన పేసర్ షాహీన్ షా అఫ్రిది లేకపోవడం పాక్ జట్టుకు ప్రధాన లోటు కాగా... చివరగా ఇంగ్లండ్‌తో ఆడిన టెస్టు మ్యాచ్‌లో చోటు దక్కించుకోలేకపోయిన నసీమ్ షా, బాబర్ ఆజమ్ తిరిగి జట్టులోకి వచ్చారు.
పేస్ బౌలర్ మొహమ్మద్ అబ్బాస్ మూడేళ్ల తర్వాత పాక్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరి టెస్టుల్లో నిలకడైన ప్రదర్శన కనబర్చలేకపోతున్న పాకిస్తాన్ జట్టు షాన్ మసూద్ సారథ్యంలో సఫారీ గడ్డపై పేస్ సవాల్‌ను ఎలా ఎదుర్కొంటుదనేది ఆసక్తికరం.
Comments
Please login to add a commentAdd a comment