లండన్: బ్రిటన్ ప్రభుత్వ చర్యల కారణంగా దేశంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో భారతీయుల చేరిక గత 8 ఏళ్లలో సగానికిపైగా తగ్గిపోయిందని అఖిలపక్ష పార్లమెంటరీ బృందం(ఏపీపీజీ) తెలిపింది. విదేశీ విద్యార్థులను ఆకట్టుకునే విషయంలో కెనడా కంటే బ్రిటన్ వెనుకపడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా విద్యార్థులను ఆకర్షించడానికి పోస్ట్ స్టడీ వర్క్ వీసా నిబంధనల్లో మార్పులు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఈమేరకు చేపట్టాల్సిన సంస్కరణలపై 12 సిఫార్సులతో కూడిన నివేదికను ఏపీపీజీ ప్రభుత్వానికి సమర్పించింది.
ప్రభుత్వం పోస్ట్ వర్క్ వీసాను పునరుద్ధరించాలని అందులో ఏపీపీజీ కోరింది. అలాగే సులభతర వీసా జాబితా నుంచి భారతీయులను తొలగించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి చర్యల కారణంగా అభద్రతకు లోనైన విద్యార్థులు ప్రత్యామ్నాయ గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారని ఏపీపీజీ సభ్యుడు కరన్ బిలిమోరియా తెలిపారు. బ్రిటన్ ప్రభుత్వం త్వరలోనే ఇమ్మిగ్రేషన్ బిల్లు–2018ని పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అందులో ఈ సిఫార్సులను చేర్చాల్సిందిగా డిమాండ్ చేస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment