యూకే ఇమ్మిగ్రేషన్ డేటా ఇటీవలి విశ్లేషణ ఊహించని పరిణామాన్ని వెల్లడించింది. కంప్యూటర్ ప్రోగ్రామర్‌ల కంటే చెఫ్‌ల వీసా దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. డిజిటల్ సూపర్ పవర్ గా ఎదగాలన్న తన ఆకాంక్షలకు ఊతమిచ్చేందుకు అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులను ఆకర్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అందుకు విరుద్ధంగా ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 2024 మార్చి వరకు 6,203 మంది చెఫ్‌లకు స్కిల్డ్ వర్కర్ వీసాలు మంజూరయ్యాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 54 శాతం అధికం. ఇదే సమయంలో ప్రోగ్రామర్లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు జారీ చేసిన వర్క్ పర్మిట్ల సంఖ్య 8,752 నుంచి 4,280కి పడిపోయింది. ఈ రెండు వృత్తులు ముఖ్యంగా భారతీయ వలసదారులలో ప్రాచుర్యం పొందాయి. యూకేలో భారతీయ రెస్టారెంట్ పరిశ్రమకి గణనీయమైన ఉనికి ఉంది.
అయితే చెఫ్ వీసాల పెరుగుదల స్వల్పకాలికమే కావచ్చు. స్కిల్డ్ వర్కర్ వీసా నిబంధనల్లో మార్పులు చేయడం వల్ల యువ వర్కర్లకు కనీస వేతనం 38,700 పౌండ్లకు (సుమారు రూ.41 లక్షలు) పెరిగింది. 2023 ఏప్రిల్ నాటికి యూకేలో సగటు చెఫ్ జీతం 22,877 పౌండ్లు (సుమారు రూ.24 లక్షలు)గా ఉంది. చాలా రెస్టారెంట్లు కొత్త వేతన స్థాయిలను భరించే అవకాశం లేదు. దీంతో కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే దరఖాస్తుల హడావుడి పెరిగినట్లుగా తెలుస్తోంది.
మరింత కఠినమైన ఆంక్షలు, అధిక వీసా ఫీజులను ప్రవేశపెట్టిన యూకే ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో తాజా మార్పులను అధికారిక గణాంకాలు ఇంకా ప్రతిబింబించలేదు. 2023లో నికర వలసలు 10 శాతం తగ్గి 6,85,000 కు పడిపోవడం, వీసా దరఖాస్తులు తగ్గడంతో వలసలు తగ్గుముఖం పట్టాయని ప్రారంభ సూచికలు సూచిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment