బ్రిటన్ వీసాలు ప్రియం
లండన్: వీసా చార్జీల పెంపు, ఇతర కఠిన నిర్ణయాలతో బ్రిటన్ గత ఏడాది మార్చి ప్రకటించిన వీసా నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఫలితంగా భారతీయులతోపాటు నాన్ యూరోపియన్ యూనియన్ (ఈయూయేతర) దేశాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. వీరు కోరుకునే టైర్ 2 కేటగిరీ వీసాల్లో భారీ మార్పులు రానున్నాయి. ఈయూయేతర దేశాల ఉద్యోగులను నియమించుకునే బ్రిటన్ కంపెనీలు ఇమిగ్రేషన్ స్కిల్స్ చార్జి కింద ఇకపై అదనంగా ఒక్కో ఉద్యోగికి ఏడాదికి 1,000 పౌండ్లు(దాదాపు రూ.81వేలు) చెల్లించాలి.
చిన్న, చారిటబుల్ సంస్థలు 364 పౌండ్లు చెల్లించాలి. టైర్ 2 ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫర్(ఐసీటీ) వీసాకోసం దరఖాస్తు చేసేవారు ఏడాదికి 200 పౌండ్ల హెల్త్ సర్‌చార్జి చెల్లించాలి. వలసదారులకు ఉద్యోగాలిచ్చే సంస్థలను తగ్గించి, ఆ ఉద్యోగాలను బ్రిటిషర్లతో భర్తీ చేసేందుకు వారికి శిక్షణ ఇవ్వడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు యూకే హోం ఆఫీస్ తెలిపింది. అయితే పీహెచ్‌డీ స్థాయి ఉద్యోగాలకు, విద్యార్థి వీసా నుంచి వర్కింగ్ వీసాకు మారే విదేశీ విద్యార్థులకు చార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని, బ్రిటన్ ఆర్థిక పురోగతికి కీలకమైన నిపుణులను దేశంలో ఉంచుకుకోవడానికి ఇది రక్షణ కల్పిస్తుందని పేర్కొంది. టైర్ 2 ఐసీటీ షార్ట్ టర్మ్ స్టాఫ్ వీసాలను రద్దు చేశారు. కొరత ఉన్న ఉద్యోగాల జాబితా నుంచి కెమిస్ట్రీ టీచర్లను తొలగించారు.
ఈ–వీసాతో 60 రోజులు
న్యూఢిల్లీ: ఈ–వీసాలపై భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకులు ఇక నుంచి మన దేశంలో రెండు నెలల వరకు ఉండొచ్చని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం చెప్పారు. ఏప్రిల్ 1 నుంచే ఈ విధానం అమలులోకి వచ్చిందన్నారు. అలాగే ఈ–వాణిజ్య, ఈ–పర్యాటక వీసాలు కలిగిన వారిని రెండుసార్లు, ఈ–వైద్య వీసా ఉంటే మూడుసార్లు భారత్‌లోకి ప్రవేశించడానికి అనుమతి స్తామని చెప్పారు. గతంలో వారిని 30 రోజుల వరకే భారత్‌లో ఉండేందుకు అనుమతించేవారు.