లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ బయటకొచ్చిన (బ్రెగ్జిట్) అనంతరం ఆ దేశ వలస విధానంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత బ్రిటన్ తన వలస నిబంధనల్లో భారీ మార్పులు చేపడుతోంది. బ్రెగ్జిట్ అనంతరం వీసాలు, వలసల విషయంలో అవలంబించాల్సిన వ్యూహాలపై రూపొందించిన శ్వేతపత్రాన్ని బుధవారం ఆ దేశ పార్లమెంటులో హోంశాఖ మంత్రి సాజిద్ జావీద్ ప్రవేశపెట్టారు. అత్యున్నత నైపుణ్యానికి పట్టం గట్టేలా ఉన్న ప్రతిపాదిత విధానం భారతీయ విద్యార్థులకు, వృత్తి నిపుణులకు ప్రయోజనకరమని నిపుణులు భావిస్తున్నారు.
ఈ విధానం ప్రకారం ప్రపంచంలోని ఏ ప్రాంతం వారైనా తగిన ప్రతిభా సంపత్తి ఉన్నట్టయితే బ్రిటన్‌లో పని చేసేందుకు వీలవుతుంది. విదేశీ విద్యార్థులు బ్రిటన్‌లో చదువుకుంటే వారి విద్యాభ్యాసం పూర్తయిన అనంతరం పనిచేసుకునే అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఈ విధానం బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత (2021 డిసెంబర్ తర్వాత) 2025 వరకూ దశలవారీగా అమలవుతుంది. దీని ప్రకారం ఈయూ సహా ప్రపంచం మొత్తానికీ ఒకే రకమైన వలస విధానాన్ని బ్రిటన్ అమలులోకి తెస్తుంది. ఇప్పటిలా ఈయూలోని 28 దేశాల ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు వీలుండదు. అయితే ఈయూ నుంచి వచ్చే సందర్శకులు మాత్రం వీసా లేకుండా బ్రిటన్ సందర్శించవచ్చు.
వీసాల సంఖ్యపై పరిమితులుండవు..
ప్రస్తుతం బ్రిటన్ ఏడాదికి 20,700 ఉద్యోగ వీసాలు (టైర్ 2 వీసాలు) జారీ చేస్తోంది. బ్రెగ్జిట్ తర్వాత ఇలాంటి పరిమితులు ఏమీ ఉండబోవు. దీంతో వైద్యం, ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన భారతీయ నిపుణులకు ఈ విధానం లబ్ధి చేకూర్చగలదని భావిస్తున్నారు. కొద్దిపాటి నైపుణాలు ఉన్న ఉద్యోగులు/కార్మికులు ఏడాది వీసాపై వెళ్లి పని చేసేందుకు కూడా ఈ విధానం వీలు కల్పిస్తుంది. అయితే ఇలాంటి వారు తమతో కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు, యూకేలో నివాస హక్కులు అడిగేందుకు అంగీకరించబోమని బ్రిటన్æ హోం మంత్రిత్వ కార్యాలయం తెలిపింది.
ఈ తరహా వీసాలు కొన్ని దేశాలకు మాత్రమే ఇవ్వాలనేది వలస విధానంలోని ఒక అంశం. ఇందులో భారత్ కూడా ఉన్నదా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. బ్రిటన్‌లో ఇప్పటివరకు నైపుణ్యాలు అంతగా అవసరం లేని ఉద్యోగాలను అధికభాగం యూరప్ దేశాల ప్రజలే చేస్తున్నారు. అయితే ఐదేళ్లపాటు విదేశీ నిపుణులను కంపెనీలు నియమించుకుంటే వారికి కనీస వేతనం 30,000 పౌండ్లు ఉండాలనే అంశం వివాదాస్పదంగా మారింది. దీనిపై కంపెనీలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు ఆరునెలల పాటు బ్రిటన్‌లో ఉండి ఉద్యోగం చేసుకునేందుకు ఈ విధానం అవకాశం కల్పిస్తుంది.
బ్రిటన్‌లో కొత్త వీసా విధానం!
Published Fri, Dec 21 2018 4:56 AM | Last Updated on Thu, Jul 11 2019 8:00 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment