new visa policy
-
యూకేలో ‘పాయింట్స్ బేస్డ్ వీసా’
లండన్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ, అత్యంత తెలివైన నిపుణులను తమ దేశంలోకి ఆహ్వానించే నూతన పాయింట్స్ ఆధారిత వీసా విధానాన్ని బ్రిటన్ బుధవారం ఆవిష్కరించింది. నిపుణులు కాని, చవక కార్మికుల వలసలను నిరోధించే దిశగా ఈ విధానాన్ని రూపొందించామని భారత సంతతికి చెందిన యూకే హోం మంత్రి ప్రీతి పటేల్ పేర్కొన్నారు. ఈ తాజా వీసా విధానం వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. విద్యార్హతలు, ప్రత్యేక నైపుణ్యాలు, వృత్తులు, వేతనాలు.. మొదలైన వాటికి పాయింట్లను కేటాయించి, అవసరమైన అర్హత పాయింట్లు సాధించిన వారికే వీసా ఇచ్చేలా ఈ విధానాన్ని రూపొందించారు. ‘ఈ రోజు చరిత్రాత్మకం. ఈ దేశ పౌరులు కోరుకుంటున్నట్లుగా, పాయింట్ల ఆధారిత వీసా విధానాన్ని ప్రారంభిస్తున్నాం’ అని ఈ సందర్భంగా ప్రీతి పటేల్ పేర్కొన్నారు. తాజా వీసా విధాన ప్రకారం యూకేకి రావాలనుకునేవారు కచ్చితంగా ఆంగ్లం మాట్లాడగలగాలి. అర్హత ఉన్న యాజమాన్యం నుంచి తమ నైపుణ్యానికి సంబంధించిన ఉద్యోగ ఆహ్వానం పొంది ఉండాలి. నైపుణ్యాల ద్వారా వారికి పాయింట్లు వస్తాయి. యూకేలో నిపుణులైన ఉద్యోగుల కొరత అధికంగా ఉన్న రంగాలకు ఉపాధి కోసం వచ్చేవారికి ప్రత్యేక పాయింట్లు ఉంటాయి. వివిధ రంగాల్లో అత్యుత్తమ నైపుణ్యత కలిగినవారికి వెంటనే వీసా ఇచ్చే ఫాస్ట్ ట్రాక్ గ్లోబల్ టాలెంట్ స్కీమ్ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని హోం శాఖ వెల్లడించింది. యూకేలోని కంపెనీలు, విద్యా సంస్థల నుంచి ఉద్యోగ ఆహ్వానం లేని ఈయూ దేశాల్లోని నిపుణులైన శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ఈ ఫాస్ట్ ట్రాక్ వీసా విధానం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు. -
బ్రిటన్ కొత్త వీసాకు తుదిమెరుగులు
లండన్: ఈయూ నుంచి వైదొలగిన బ్రిటన్ బ్రెగ్జిట్ పాయింట్స్ బేస్డ్ వీసా, ఇమిగ్రేషన్ వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీనికి సంబంధించిన వ్యవహారాలకు ప్రధాని బోరిస్ జాన్సన్, హోంమంత్రి ప్రీతి పటేల్‌లు తుదిమెరుగులు దిద్దినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా నిపుణులను భారత్ సహా ప్రపంచ నలుమూలల నుంచి రప్పించుకోవచ్చని ఆ దేశం భావిస్తోంది. గత వారం జరిగిన సమావేశంలో యూకే మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ సూచించిన సలహాలను ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుంది. ఇందులోనే కనీస వేతనాలు సంబంధించిన వివరాలున్నాయి. నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా అందులో ఉన్నాయి. గురువారం మంత్రివర్గ విస్తరణ జరగనుండగా, శుక్రవారం వీసాల వ్యవహారానికి సంబంధించిన వివరాలను ప్రీతి పటేల్ వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిపుణుల రంగంలో యూకే వీసాల్లో అత్యధికులు భారతీయులే ఉన్నారు. గతేడాదిలో 56 వేలకు పైగా టైర్–2 వీసాలను యూకే ఇచ్చింది. బ్రెగ్జిట్ వల్ల ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
మూణ్నెల్లు ముందే వీసాకు దరఖాస్తు
న్యూఢిల్లీ: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుం టున్న భారతీయ వృత్తి నిపుణులు, ముఖ్యంగా టెకీలకు శుభవార్త. ఉద్యోగంలో చేరడానికి మూడు నెలలు ముందు కూడా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును అమెరికా కల్పించింది. తమ దేశంలో ఎలాంటి ఉద్యోగం చేసే భారతీయులైనా 90 రోజులు ముందుగానే వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటిం చింది. అమెరికా కంపెనీలు ప్రత్యేక సాంకేతిక నిపుణులైన విదేశీయులను ఉద్యోగులుగా నియమించుకునేందుకు హెచ్1–బీ వీసాను వాడుకుంటుంటాయి. అమెరికా ప్రభుత్వం ఏటా జారీ చేసే 85వేల హెచ్1–బీ వీసాల్లో ఏకంగా 70 శాతం భారతీయులకే అందుతుండటం గమనార్హం. దీంతో భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ వర్క్ వీసా అంశం కూడా కీలకంగా మారింది. -
ప్రతిభ వలసల వీసాలు 57 శాతం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా సరికొత్త వలసవిధానంపై దృష్టి సారించింది. ప్రతిభ ఆధారిత వలసలకు మొత్తం వీసాల్లో 57 శాతం కేటాయించాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీనియర్ సలహాదారు, అల్లుడు జరెడ్ కుష్నర్ నేతృత్వంలోని కమిటీ నూతన వలస విధానాన్ని రూపొందించింది. ఈ విషయమై వైట్‌హౌస్‌లో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో కుష్నర్ మాట్లాడుతూ..‘నూతన ప్రతిభ ఆధారిత వలసవిధానం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను, ప్రతిభావంతులను అమెరికావైపు ఆకర్షించవచ్చు. దీనివల్ల మన దేశానికి రాబోయే పదేళ్లలో పన్నులరూపంలో 500 బిలియన్ డాలర్ల(రూ.34.41 లక్షల కోట్ల) ఆదాయం సమకూరుతుంది. మన సామాజికభద్రత పథకాలకు చెల్లింపులు జరుపుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల అమెరికన్లు లబ్ధి పొందుతారు. మనతోటి దేశాలను పోల్చుకుంటే అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు కాలంచెల్లింది. కెనడాలో 53 శాతం విదేశీ నిపుణులు, ప్రతిభావంతులకు వీసాలు జారీచేస్తున్నారు. ఈ సంఖ్య న్యూజిలాండ్‌లో 59 శాతం, ఆస్ట్రేలియాలో 63 శాతం, జపాన్‌లో 52 శాతంగా ఉంటే, అమెరికాలో మాత్రం 12 శాతానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో నూతన వలసవిధానం ప్రకారం మొత్తం వీసాల్లో 57 శాతం ప్రతిభ ఆధారంగా జారీచేయాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. దీనివల్ల మిగతా దేశాలతో అమెరికా పోటీపడగలుగుతుంది’ అని కుష్నర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల వలస చట్టాలను అధ్యయనం చేసిన ఈ నూతన వలస విధానాన్ని రూపొందించామనీ, ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న దీన్ని త్వరలోనే ప్రజలముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. -
బ్రిటన్‌లో కొత్త వీసా విధానం!
లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ బయటకొచ్చిన (బ్రెగ్జిట్) అనంతరం ఆ దేశ వలస విధానంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత బ్రిటన్ తన వలస నిబంధనల్లో భారీ మార్పులు చేపడుతోంది. బ్రెగ్జిట్ అనంతరం వీసాలు, వలసల విషయంలో అవలంబించాల్సిన వ్యూహాలపై రూపొందించిన శ్వేతపత్రాన్ని బుధవారం ఆ దేశ పార్లమెంటులో హోంశాఖ మంత్రి సాజిద్ జావీద్ ప్రవేశపెట్టారు. అత్యున్నత నైపుణ్యానికి పట్టం గట్టేలా ఉన్న ప్రతిపాదిత విధానం భారతీయ విద్యార్థులకు, వృత్తి నిపుణులకు ప్రయోజనకరమని నిపుణులు భావిస్తున్నారు. ఈ విధానం ప్రకారం ప్రపంచంలోని ఏ ప్రాంతం వారైనా తగిన ప్రతిభా సంపత్తి ఉన్నట్టయితే బ్రిటన్‌లో పని చేసేందుకు వీలవుతుంది. విదేశీ విద్యార్థులు బ్రిటన్‌లో చదువుకుంటే వారి విద్యాభ్యాసం పూర్తయిన అనంతరం పనిచేసుకునే అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఈ విధానం బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత (2021 డిసెంబర్ తర్వాత) 2025 వరకూ దశలవారీగా అమలవుతుంది. దీని ప్రకారం ఈయూ సహా ప్రపంచం మొత్తానికీ ఒకే రకమైన వలస విధానాన్ని బ్రిటన్ అమలులోకి తెస్తుంది. ఇప్పటిలా ఈయూలోని 28 దేశాల ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు వీలుండదు. అయితే ఈయూ నుంచి వచ్చే సందర్శకులు మాత్రం వీసా లేకుండా బ్రిటన్ సందర్శించవచ్చు. వీసాల సంఖ్యపై పరిమితులుండవు.. ప్రస్తుతం బ్రిటన్ ఏడాదికి 20,700 ఉద్యోగ వీసాలు (టైర్ 2 వీసాలు) జారీ చేస్తోంది. బ్రెగ్జిట్ తర్వాత ఇలాంటి పరిమితులు ఏమీ ఉండబోవు. దీంతో వైద్యం, ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన భారతీయ నిపుణులకు ఈ విధానం లబ్ధి చేకూర్చగలదని భావిస్తున్నారు. కొద్దిపాటి నైపుణాలు ఉన్న ఉద్యోగులు/కార్మికులు ఏడాది వీసాపై వెళ్లి పని చేసేందుకు కూడా ఈ విధానం వీలు కల్పిస్తుంది. అయితే ఇలాంటి వారు తమతో కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు, యూకేలో నివాస హక్కులు అడిగేందుకు అంగీకరించబోమని బ్రిటన్æ హోం మంత్రిత్వ కార్యాలయం తెలిపింది. ఈ తరహా వీసాలు కొన్ని దేశాలకు మాత్రమే ఇవ్వాలనేది వలస విధానంలోని ఒక అంశం. ఇందులో భారత్ కూడా ఉన్నదా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. బ్రిటన్‌లో ఇప్పటివరకు నైపుణ్యాలు అంతగా అవసరం లేని ఉద్యోగాలను అధికభాగం యూరప్ దేశాల ప్రజలే చేస్తున్నారు. అయితే ఐదేళ్లపాటు విదేశీ నిపుణులను కంపెనీలు నియమించుకుంటే వారికి కనీస వేతనం 30,000 పౌండ్లు ఉండాలనే అంశం వివాదాస్పదంగా మారింది. దీనిపై కంపెనీలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు ఆరునెలల పాటు బ్రిటన్‌లో ఉండి ఉద్యోగం చేసుకునేందుకు ఈ విధానం అవకాశం కల్పిస్తుంది. -
కొత్త వీసా విధానాన్ని ప్రకటించనున్న ఆస్ట్రేలియా
మెల్బోర్న్: విద్యార్థి వీసాలను మరింత సులభతరం చేస్తూ ఆస్ట్రేలియా కొత్త ప్రభుత్వం త్వరలోనే కొత్త వీసా విధానాన్ని ప్రకటించనుంది. భారత్, చైనా వంటి దేశాలకు చెందిన విద్యార్థులను పెద్దసంఖ్యలో ఆకర్షించడం ద్వారా వందకోట్ల డాలర్ల విద్యా పరిశ్రమకు ఊతమిచ్చే లక్ష్యంతో కొత్త వీసా విధానాన్ని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. గత లేబర్ పార్టీ ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న విద్యా పరిశ్రమను పునరుద్ధరించేందుకు కొత్త సంకీర్ణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆస్ట్రేలియా విద్యాశాఖ మంత్రి క్రిస్టఫర్ పైనే, ఇమిగ్రేషన్ మంత్రి స్కాట్ మారిసన్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. విద్యార్థి వీసాలను మరింత సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు ప్రకటించారు. ఆస్ట్రేలియాలో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో చైనా, భారత్‌లకు చెందిన వారే ఎక్కువ. కొన్నేళ్ల కిందట భారత్ సహా ఆసియా దేశాల విద్యార్థులపై దాడులు పెరగడంతో ఆస్ట్రేలియాలో విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు భారత్, చైనాలను ‘హై రిస్క్’ దేశాలుగా గుర్తించిన గత లేబర్ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా భారత విద్యార్థుల వీసాల్లో దాదాపు 60 శాతం వరకు తిరస్కరణకు గురయ్యాయి. ఈ పరిస్థితిని చక్కదిద్ది, విద్యా పరిశ్రమను పునరుద్ధరించేందుకు విద్యార్థి వీసాలను సులభతరం చేయాలని ఆస్ట్రేలియా కొత్త ప్రభుత్వం భావిస్తోంది.