వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా సరికొత్త వలసవిధానంపై దృష్టి సారించింది. ప్రతిభ ఆధారిత వలసలకు మొత్తం వీసాల్లో 57 శాతం కేటాయించాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీనియర్ సలహాదారు, అల్లుడు జరెడ్ కుష్నర్ నేతృత్వంలోని కమిటీ నూతన వలస విధానాన్ని రూపొందించింది. ఈ విషయమై వైట్‌హౌస్‌లో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో కుష్నర్ మాట్లాడుతూ..‘నూతన ప్రతిభ ఆధారిత వలసవిధానం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను, ప్రతిభావంతులను అమెరికావైపు ఆకర్షించవచ్చు. దీనివల్ల మన దేశానికి రాబోయే పదేళ్లలో పన్నులరూపంలో 500 బిలియన్ డాలర్ల(రూ.34.41 లక్షల కోట్ల) ఆదాయం సమకూరుతుంది. మన సామాజికభద్రత పథకాలకు చెల్లింపులు జరుపుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.
దీనివల్ల అమెరికన్లు లబ్ధి పొందుతారు. మనతోటి దేశాలను పోల్చుకుంటే అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు కాలంచెల్లింది. కెనడాలో 53 శాతం విదేశీ నిపుణులు, ప్రతిభావంతులకు వీసాలు జారీచేస్తున్నారు. ఈ సంఖ్య న్యూజిలాండ్‌లో 59 శాతం, ఆస్ట్రేలియాలో 63 శాతం, జపాన్‌లో 52 శాతంగా ఉంటే, అమెరికాలో మాత్రం 12 శాతానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో నూతన వలసవిధానం ప్రకారం మొత్తం వీసాల్లో 57 శాతం ప్రతిభ ఆధారంగా జారీచేయాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. దీనివల్ల మిగతా దేశాలతో అమెరికా పోటీపడగలుగుతుంది’ అని కుష్నర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల వలస చట్టాలను అధ్యయనం చేసిన ఈ నూతన వలస విధానాన్ని రూపొందించామనీ, ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న దీన్ని త్వరలోనే ప్రజలముందుకు తీసుకొస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment