ముగిసిన మాటల పోరు! | Donald Trump and Joe Biden clash in final US presidential debate | Sakshi
Sakshi News home page

ముగిసిన మాటల పోరు!

Published Sat, Oct 24 2020 4:18 AM | Last Updated on Sat, Oct 24 2020 7:33 AM

Donald Trump and Joe Biden clash in final US presidential debate - Sakshi

అధ్యక్ష ఎన్నికల తుది చర్చలో ట్రంప్, బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగే ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్‌లో చివరి డిబేట్‌ హోరాహోరీగా ముగిసింది. అయితే తొలి డిబేట్‌తో పోలిస్తే ఈసారి వ్యక్తిగత దూషణలు, మాటలకు అడ్డం పడడాలు చాలావరకు తగ్గాయి. ముఖ్యంగా అభ్యర్థుల మైక్‌ను మ్యూట్‌ చేసే ఆప్షన్‌ బాగా ఉపయుక్తమయింది. ట్రంప్, బైడెన్‌లు డిబేట్‌లో కరోనా, జాత్యహంకారం, పర్యావరణం, వలస విధానం తదితర అంశాలపై తమ వైఖరులను వివరించారు.

నాష్‌విల్లేలోని బెల్మాట్‌ యూనివర్సిటీలో సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ డిబేట్‌లో కరోనా వైరస్‌ కట్టడి విషయంలో ఒకరినొకరు దుయ్యబట్టుకున్నారు. డిబేట్‌కు ఎన్‌బీసీ న్యూస్‌కు చెందిన క్రిస్టిన్‌ వెల్‌కర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే ఎన్ని కట్టడులు చేసినా ట్రంప్, బైడెన్‌ ఒకరి వ్యక్తిగత విషయాలను మరొకరు విమర్శించడం మానలేదు. తొలి డిబేట్‌ అనంతరం ట్రంప్‌ కరోనా బారిన పడి కోలుకోవడంతో ఈ చివరి డిబేట్‌ ఆసక్తికరంగా మారింది.  

వివిధ అంశాలపై అభ్యర్థుల వాదనలు...
కరోనా వైరస్‌:  
ట్రంప్‌: ఇది ప్రపంచవ్యాప్త సమస్య. కానీ, దీన్ని ఎంతో సమర్ధవంతంగా ఎదుర్కొన్నానని పలు దేశాలు ప్రశంసించాయి. చైనా కారణంగానే ఈ వైరస్‌ ప్రబలింది. టీకా అతి త్వరలో అందుబాటులోకి రానుంది. కొన్ని వారాల్లోనే దీనిపై ప్రకటన రావచ్చు. ప్రభుత్వం వ్యాక్సిన్‌ సత్వర పంపిణీకి తయారుగా ఉంది.  

బైడెన్‌: ట్రంప్‌ విధానాలతో కరోనా కారణంగా దేశంలో లక్షల మరణాలు సంభవించాయి. అమెరికా త్వరలో మరో డార్క్‌వింటర్‌ను(తీవ్రమైన చలికాలం అని ఒక అర్థం కాగా, అమెరికాపై జరిగే బయోవెపన్‌ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధమయ్యే ప్రాజెక్ట్‌ అని మరో అర్థం) చూడనుంది, కానీ, ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్లాన్‌ లేదు. వచ్చే ఏడాది మధ్య వరకు ఎలాంటి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేలా కనిపించడంలేదు. కరోనాతో జీవించడాన్ని ప్రజలు నేర్చుకుంటున్నారని ట్రంప్‌ చెబుతున్నాడు, కానీ ప్రజలు దీంతో చావును నేర్చుకుంటున్నారు. నా వద్ద కరోనా కట్టడికి మంచి ప్రణాళిక ఉంది.  

జాత్యహంకారం..
ట్రంప్‌: నల్లజాతీయుల చాంపియన్‌ నేనే. అబ్రహం లింకన్‌ తర్వాత నల్లజాతీయులకు అనేక ప్రయోజనాలు చేకూర్చిన ప్రెసిడెంట్‌ సైతం నేనే. ఇక్కడున్న వారందరిలో అతితక్కువ జాత్యహంకారం ఉన్న వ్యక్తిని కూడా నేనే!
బైడెన్‌: ఆధునిక అమెరికా చరిత్రలో అత్యంత జాత్యహంకార అధ్యక్షుల్లో ట్రంప్‌ ఒకరు. ప్రతి జాతి ఘర్షణలో ఆజ్యం పోస్తాడు. గత డిబేట్‌లో సైతం తన జాత్యహంకార బుద్ధిని ప్రదర్శించాడు.  

వలసవిధానం..
ట్రంప్‌: అక్రమ వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేయడం సబబే. ప్రభుత్వం వారిని సురక్షితంగా చూసుకుంది.  
బైడెన్‌: పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేయడం అమెరికా పాటించే విలువలకే అవమానం.  

హెల్త్‌కేర్‌..
ట్రంప్‌: ఒబామా కేర్‌ కన్నా మెరుగైన ఆరోగ్య విధానాన్ని తీసుకొచ్చాను. దీన్ని ఇంకా మెరుగుపరుస్తాను.  
బైడెన్‌: ఉత్తమమైన ఒబామా కేర్‌ను తీసివేసిన అనంతరం సరైన హెల్త్‌కేర్‌ పాలసీని ట్రంప్‌ తీసుకురాలేకపోయారు.
పర్యావరణం..
ట్రంప్‌: చైనా, ఇండియా, రష్యాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏమీ చేయట్లేదు. చైనాను చూడండి ఎంత మురికిగా ఉందో. ఇండియా, రష్యాలు కూడా అంతే. ఆ దేశాల్లో గాలి శ్వాసించలేనంత కలుషితంగా ఉంది. పర్యావరణ పరిరక్షణ పేరిట అమెరికా వృ«థా ఖర్చును నివారించేందుకు పారిస్‌ డీల్‌ నుంచి బయటకు వచ్చాము. ఆ ఒప్పందం కారణంగా మన వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో అమెరికా ఉద్గార గణాంకాలు 35 ఏళ్లలోనే ఉత్తమంగా ఉన్నాయి.  

బైడెన్‌: మరింత ఎకోఫ్రెండ్లీ ఆర్థిక వ్యవస్థగా అమెరికాను మార్చే ప్రణాళిక ఉంది. దీనివల్ల మరిన్ని ఉద్యోగాలు వస్తాయి. ప్రపంచ పర్యావరణానికి గ్లోబల్‌ వార్మింగ్‌ ముప్పు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి.

అవినీతి
ట్రంప్‌: బైడెన్‌ లాగా నేను చైనా నుంచి అక్రమ సొత్తు సంపాదించలేదు. ఉక్రెయిన్‌ నుంచి లంచాలు తీసుకోలేదు. రష్యా నుంచి ముడుపులు స్వీకరించలేదు.  
బైడెన్‌: చైనా నుంచి ముడుపులు తీసుకుంది నా కుమారుడు కాదు. ట్రంపే ముడుపులు స్వీకరించాడు. హంటర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణల్లో ఎలాంటి తప్పులు జరిగినట్లు తేలలేదు.
అమెరికాను మరోమారు అగ్రగామిగా నిలుపుతానని ట్రంప్‌ పేర్కొనగా, ఈ ఎన్నికల ఫలితాలపై అమెరికా భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని బైడెన్‌ చెప్పారు. హోరాహోరీగా జరిగిన డిబేట్‌లో ఎవరూ పైచేయి సాధించలేదని, ఇరువురూ తమ తమ విధానాలను గట్టిగా సమర్ధించుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. సీఎన్‌ఎన్‌ మాత్రం తాము జరిపిన పోల్‌ ప్రకారం డిబేట్‌లో బైడెన్‌దే పైచేయిగా 53 శాతం మంది భావించినట్లు తెలిపింది.  

చాలావరకు ప్రశాంతం..
తొలి డిబేట్‌తో పోలిస్తే మలి డిబేట్‌ చాలావరకు ప్రశాంతంగా జరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పలు అంశాలపై ఇరువురూ తీవ్రంగా విభేదిస్తూ వాదించుకున్నా, ఒకరికొకరు అడ్డంపడి మాట్లాడటం చాలావరకు తగ్గింది. చాలామంది గతంతో పోలిస్తే ట్రంప్‌ ఈ దఫా చాలా హుందాగా ప్రవర్తించారని భావించారు. ఉదాహరణకు డిబేట్‌కు ముందు వ్యాఖ్యాతపై పలు నెగెటివ్‌ వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌ డిబేట్‌ అనంతరం ఆమెను ప్రశంసించారు. డిబేట్‌ను చాలా బాగా నిర్వహించారన్నారు. కరోనా కారణంగా డిబేట్‌ చూసేందుకు ప్రత్యక్షంగా 200 మందిని మాత్రమే అనుమతించారు. అభ్యర్థ్ధులకు మధ్య గ్లాస్‌ గోడలు పెట్టాలని నిర్ణయించినా చివరకు ఏర్పాటు చేయలేదు. డిబేట్‌కు ముందు ఇరువురికీ కరోనా పరీక్ష నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. ఈసారి ట్రంప్‌ కుటుంబసభ్యులతో సహా ప్రేక్షకులంతా మాస్కులు ధరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement