తొలి డిబేట్‌లో ట్రంప్ దూకుడు
తడబడ్డ బైడెన్
పదాల కోసం పదేపదే తడుముకున్న అధ్యక్షుడు
గొంతులో వణుకు, మాటల్లో అయోమయం
బైడెన్ తీరుపై డెమొక్రాట్లలో తీవ్ర ఆందోళన
అట్లాంటా: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (78) దూకుడు పెంచారు. దేశాధ్యక్షుడు, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌తో తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు. శుక్రవారం (భారత కాలమానం ప్రకారం) సీఎన్‌ఎన్ చానల్లో దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన వాదనలో బైడెన్ సర్వశక్తులూ ఒడ్డారు.
తన వయసుపై విమర్శలు, అధ్యక్ష బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై అమెరికన్లలో నానాటికీ పెరుగుతున్న అనుమానాలను కొట్టిపారేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. ట్రంప్ తనకంటే కేవలం మూడేళ్లే చిన్నవాడని పదేపదే చెప్పుకున్నారు. కానీ డిబేట్ పొడవునా బైడెన్ పదేపదే తడబడ్డారు. ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి మౌనాన్ని ఆశ్రయించారు. మాటల కోసం తడుముకున్నారు.
తనలో తానే గొణుక్కుంటూ కన్పించారు. మాట్లాడుతున్న అంశాన్ని అర్ధంతరంగా వదిలేసి మరో విషయం ఎత్తుకుని ఆశ్చర్యపరిచారు. కొన్నిసార్లు బైడెన్ ఏం చెప్తున్నదీ ఎవరికీ అర్థం కూడా కాలేదు. పలు అంశాలపై ట్రంప్ పచ్చి అబద్ధాలు చెప్పినా వాటిని ఎత్తిచూపడంలో, సొమ్ము చేసుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. తనకు అనుకూలమైన గణాంకాలను సమయానుకూలంగా ప్రస్తావించడంలో కూడా చతికిలపడ్డారు.
డిబేట్‌లో ట్రంపే నెగ్గారని సీఎన్‌ఎన్ పోలింగ్‌లో ఏకంగా 67 శాతం మంది ఓటర్లు పేర్కొన్నారు. బైడెన్‌కు 33 శాతం ఓట్లే లభించాయి. న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రఖ్యాత వార్తా పత్రికలు కూడా తొలి డిబేట్ ట్రంప్‌దేనని పేర్కొన్నాయి. ‘‘బైడెన్‌పై వయోభారం కొట్టొచ్చినట్టు కని్పస్తోంది. ఆయన మాటతీరులోనూ అది స్పష్టంగా ప్రతిఫలించింది. ఆయన చెబుతున్న విషయాల్లో పొందికే లేకుండా పోయింది’’ అంటూ విమర్శలు గుప్పించాయి.
దూకుడుకు మారుపేరైన ట్రంప్‌కు 81 ఏళ్ల బైడెన్ ఏ మేరకు పోటీ ఇవ్వగలరోనంటూ డెమొక్రాట్లలో ఇప్పటికే గట్టిగా ఉన్న అనుమానాలు కాస్తా తాజా డిబేట్ నేపథ్యంలో ఆందోళనగా మారాయి. వాదనలో బైడెన్ తొలుత కాస్త వెనకబడ్డారని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా అంగీకరించారు. అయితే క్రమంగా పుంజుకుని సమర్థంగా ముగించారని చెప్పుకొచ్చారు. బైడెన్ భార్య జిల్ మాత్రం తన భర్త భలే బాగా మాట్లాడారంటూ ప్రశంసించారు!
‘‘ప్రతి ప్రశ్నకూ చక్కగా బదులిచ్చావు. అన్ని సమాధానాలూ తెలుసు నీకు!’’ అంటూ ఆయన్ను మెచ్చుకున్నారు. కానీ ఈ డిబేట్ నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలంటున్న వారి సంఖ్య డెమొక్రాట్లలో క్రమంగా పెరుగుతోంది. ట్రంప్, బైడెన్‌లను అధ్యక్ష అభ్యర్థులుగా ఇంకా లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. జూలై 15–18 మధ్య జరిగే సదస్సులో రిపబ్లికన్లు, ఆగస్టు 19న సదస్సులో డెమొక్రాట్లు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి.
పరస్పర విమర్శల వర్షం...
అమెరికా ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ చట్టం, విదేశీ వ్యవహారాలు, వలసల వంటి పలు అంశాలపై ట్రంప్, బైడెన్ మధ్య వాడివేడి వాదనలు సాగాయి. ఆ క్రమంలో నేతలిద్దరూ తిట్ల పర్వానికి దిగారు. ‘‘నువ్వే అబద్ధాలకోరు. అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త ప్రెసిడెంట్ కూడా నువ్వే’’ అంటూ పరస్పరం దుయ్యబట్టుకున్నారు. పలు రకాల విమర్శలు చేసుకున్నారు. హష్ మనీ కేసు దోషి అంటూ ట్రంప్‌కు బైడెన్ చురకలు వేశారు.
‘‘జరిమానాలుగా నువ్వు ఎన్ని బిలియన్ డాలర్లు కట్టాలో గుర్తుందా? భార్య గర్భవతిగా ఉండగా నీలి చిత్రాల తారతో గడిపావు. నైతికత విషయంలో వీధుల్లో విచ్చలవిడిగా తిరిగే పిల్లి కంటే కూడా హీనం’’ అంటూ విమర్శల వర్షం కురిపించారు. బైడెన్‌తో పాటు ఆయన కుమారుడు హంటర్ కూడా క్రిమినలేనంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా విరుచుకుపడ్డారు. అస్తవ్యస్తమైన వలసల విధానంతో దేశ భవితవ్యాన్నే బైడెన్ ప్రమాదంలోకి నెట్టారంటూ దుయ్యబట్టారు. డిబేట్ ఆరంభం నుంచే ట్రంప్ పై చేయి కనబరిచారు. ఆయనను ఇరుకున పెట్టేందుకు బైడెన్ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.
Comments
Please login to add a commentAdd a comment