వాషింగ్టన్: కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారి పీడ ఎప్పటికి విరగడ అవుతుంది? ఈ ప్ర«శ్నలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మరో ప్రశ్న అందరినీ వేధిస్తోంది. అదే ప్రపంచానికి పెద్దన్న ఎవరు కాబోతున్నారు? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది? రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. దీంతో స్వింగ్ స్టేట్స్ ఎటువైపు మొగ్గు చూపిస్తాయన్నది కీలకంగా మారింది.
నవంబర్ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల పైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఎన్నికల ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో స్వింగ్ స్టేట్స్ (ఆఖరి నిమిషం వరకు ఏ పార్టీ వైపు ఉంటారో అంచనా వేయలేని రాష్ట్రాలు) ఎటు వైపు మొగ్గుతాయన్న ఉత్కంఠ రేగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రజాదరణ ఓట్లు సాధించిన వారే పీఠాన్ని దక్కించుకుంటారని చెప్పలేం.
గత ఎన్నికల్లో ట్రంప్ కంటే పాపులర్ ఓట్లు 30 లక్షలు అధికంగా హిల్లరీ క్లింటన్ సాధించినప్పటికీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ట్రంప్‌కి ఎక్కువ రావడంతో ఆయన అ«ధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థి పార్టీకి ఓటు వేస్తారు. ఆ ఓటింగ్ రాష్ట్రాల స్థాయిలోనే ఉంటుంది. అక్కడ ఎన్నిౖకైన ప్రతినిధులంతా కలిసి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. దేశం మొత్తమ్మీద 50 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ కొలంబియాలో జనాభా ప్రాతిపదికన ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటాయి. దేశవ్యాప్తంగా 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకిగాను 270 ఓట్లు సాధించిన వారే అధ్యక్షుడిగా ఎన్నికవుతారు.
స్వింగ్ రాష్ట్రాలు ఇవే
ఈసారి ఎన్నికల్లో మొత్తం 14 రాష్ట్రాల్లో ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతారో తెలీని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు అమెరికా ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో జనం నాడి తెలియకుండా ఎప్పుడూ లేదు. టెక్సాస్ (38 ఎలక్టోరల్ ఓట్లు), ఫ్లోరిడా (29 ), పెన్సిల్వేనియా (20), ఒహియో (18), మిషిగాన్ (16), జార్జియా (16 ), నార్త్ కరోలినా (15), వర్జీనియా (13), అరిజోనా (11), విస్కాన్సన్ (10), మిన్నెసోటా (10), నెవడా (6), అయోవా (6) న్యూ హ్యాంప్‌షైర్ (4) రాష్ట్రాల్లో ప్రతీ నెల జనం మూడ్ మారిపోతున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి.
తాజా సర్వేల్లో జార్జియా, అయోవా, టెక్సాస్ రాష్ట్రాల్లో ట్రంప్‌కి మొగ్గు కనిపిస్తూ ఉంటే, మిగిలిన స్వింగ్ స్టేట్స్‌లో బైడెన్ దూసుకుపోయే అవకాశాలున్నట్టుగా రియల్ క్లియర్ పాలిటిక్స్ సర్వే అంచనా వేస్తోంది. టెక్సాస్, జార్జియా రాష్ట్రాలు ఎప్పుడూ రిపబ్లికన్ల వైపు ఉంటాయి. ఈసారి కూడా ట్రంప్‌వైపే ఉన్నప్పటికీ మొగ్గు చాలా స్వల్పంగా ఉందని అంచనా. అందుకే టెక్సాస్, జార్జియా రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వెయ్యాలని బైడెన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో ప్రచారం కోసం డాలర్ల వరద పారిస్తున్నారు. జాతీయ స్థాయిలో చూసుకుంటే ట్రంప్ కంటే బైడెన్‌కు 10 పాయింట్లు అధికంగా ఉన్నాయి.
ఫ్లోరిడా ఫ్యాక్టర్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 1964 నుంచి ఫ్లోరిడాలో నెగ్గిన వారికే అధ్యక్ష పదవి దక్కుతూ వస్తోంది. 1992 ఎన్నికలు మాత్రం దీనికి మినహాయింపుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ట్రంప్‌కి 48.6% ఓట్లు వస్తే, హిల్లరీకి 47.4% ఓట్లు వచ్చాయి. అంతకు ముందు ఎన్నికల్లో బరాక్ ఒబామా 51% ఓట్లను సాధించి అవలీలగా అధ్యక్ష పదవిని అందుకున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల ఆలోచనా ధోరణి వినూత్నంగా ఉంటుంది. యువ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు.
ఇక్కడ ఓటర్లు అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగే డిబేట్లను విన్నాక ఓటుపై నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికలకి ముందు మూడు సార్లు సెప్టెంబర్ 29, అక్టోబర్ 7, అక్టోబర్ 15న అధ్యక్ష అభ్యర్థుల మధ్య బిగ్ డిబేట్స్ జరుగుతాయి. ఈ డిబేట్స్‌లో ట్రంప్, బైడెన్ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో వివరిస్తారు. ఆ డిబేట్స్ తర్వాత పరిస్థితులన్నీ మారే అవకాశాలైతే ఉన్నాయి. ఈ డిబేట్స్‌లో ట్రంప్ నెగ్గుతారని 47% మంది అమెరికన్లు భావిస్తూ ఉంటే, బైడెన్ వైపు 41% మంది మాత్రమే ఉన్నారు.
కరోనా ఎఫెక్ట్
ఈసారి ఎన్నికల్లో కరోనా వైరస్ నంబర్ గేమ్‌ని మార్చేస్తుందని అంచనాలున్నాయి. కరోనా కట్టడిలో ట్రంప్ వైఫల్యంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అగ్రరాజ్యంలో ఎన్నికల నాటికి వైరస్ కారణంగా 2 లక్షల 60 వేల వరకు మరణాలు నమోదవుతాయని అంచనాలున్నాయి. ట్రంప్ చెబుతున్నట్టుగా అక్టోబర్ సర్‌ప్రైజ్ సాకారమై పోలింగ్ తేదీలోగా వ్యాక్సిన్ వస్తే ఆయనకి మళ్లీ అనుకూలంగా పరిస్థితులు మారే అవకాశాలున్నాయి. ఆర్థిక మాంద్యం, పెరిగిపోతున్న నిరుద్యోగం, జాతివివక్ష, వలసవిధానం, వాతావరణంలో మార్పులు వంటి అంశాలు కూడా ఎన్నికల్లో ప్రధాన అంశాలు కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment