అమెరికా అధ్యక్షున్ని తేల్చేది 7 స్వింగ్ స్టేట్లే
వాటిలో మెజారిటీ సాధించే వారిదే పీఠం
అందరి చూపు ఆ రాష్ట్రాలవైపే
ఆ ఏడింటా ట్రంప్, హారిస్ హోరాహోరీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు కురుక్షేత్రాన్ని తలపిస్తూ అత్యంత హోరాహోరీగా సాగుతోంది. రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ ప్రత్యర్థి కమలా హారిస్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు. ఎన్నికలు మొత్తం 50 రాష్ట్రాల్లోనూ జరుగుతున్నా వాటిలో ఏడు రాష్ట్రాలు విజేతను తేల్చడంలో అతి కీలకంగా మారాయి. స్వింగ్ స్టేట్స్‌గా పిలిచే ఆ ఏడింటిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. వాటిలో మెజారిటీ రాష్ట్రాలను నెగ్గిన వారే అధ్యక్షుడు కావడం ఖాయంగా కన్పిస్తోంది. అయితే అన్ని పోల్స్‌లోనూ ఆ ఏడు రాష్ట్రాల్లో కూడా ట్రంప్, హారిస్ దాదాపుగా సమవుజ్జీలుగా నిలుస్తుండటం విశేషం. దాంతో ఈ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారిపోయాయి.
స్వింగ్ స్టేట్స్ అంటే...?
అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీల్లో ఏదో ఒకదానివైపు స్పష్టంగా మొగ్గేవే ఉంటాయి. వాటిని సేఫ్ స్టేట్స్‌గా పిలుస్తారు. పారీ్టల జెండా రంగుపరంగా వీటిని బ్లూ (డెమొక్రాట్), రెడ్ (రిపబ్లికన్) స్టేట్స్‌గా పేర్కొంటారు. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఒక ఎన్నికలో డెమొక్రాట్లకు జై కొడితే మరో ఎన్నికలో రిపబ్లికన్ అభ్యరి్థని గెలిపిస్తుంటాయి. వీటినే స్వింగ్ స్టేట్స్, బ్యాటిల్‌గ్రౌండ్ స్టేట్స్, పర్పుల్ స్టేట్స్ (డెమొక్రాట్, రిపబ్లికన్ పారీ్టల్లో ఎటైనా మొగ్గవచ్చనే అనే అర్థంలో) అని పిలుస్తుంటారు. అభ్యర్థులు సేఫ్ స్టేట్స్‌పై పెద్దగా దృష్టి పెట్టరు. ఈ స్వింగ్ స్టేట్స్‌ను తమవైపు తిప్పుకోవడం, లేదా అవి ప్రత్యరి్థకి జై కొట్టకుండా చూడటంపైనే శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరిస్తారు. దాంతో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ హోరాహోరీ ప్రచారం సాగుతుంటుంది. మీడియాలోనూ, బయటా భారీగా ఎన్నికల ప్రకటనలు ఇతరత్రా హడావుడి కూడా స్వింగ్ స్టేట్స్‌లోనే ఎక్కువ.
ఆ 7 రాష్ట్రాలివే...
ఈ ఎన్నికల్లో 7 రాష్ట్రాలు స్వింగ్ స్టేట్లుగా అందరి దృష్టినీ తమవైపు తిప్పుకుంటున్నాయి. అవి... పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా, అరిజోనా, మిషిగన్, నెవడా, విస్కాన్సిన్
పెన్సిల్వేనియా
ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 19
రాష్ట్ర జనాభా 1.3 కోట్లు
2020లో విజేత బైడెన్ (82 వేల ఓట్ల మెజారిటీ)
ఏడు స్వింగ్ స్టేట్లలో అత్యధిక ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్న రాష్ట్రం. దాంతో సహజంగానే ఇక్కడ గెలుపు అభ్యర్థులకు అత్యంత కీలకం. ట్రంప్‌పై గత జూలైలో హత్యాయత్నం జరిగింది పెన్సిల్వేనియాలోనే. ఇది బైడెన్ సొంత రాష్ట్రం కూడా. ఆర్థిక పరిస్థితులు ఈసారి ఇక్కడ కీలక ఎన్నికల అంశంగా మారాయి. ధరాభారంతో పెన్సిల్వేనియావాసులు నానా కష్టాలు పడుతున్నారు. అమెరికా అంతటినీ అతలాకుతలం చేస్తున్న జీవన వ్యయం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మరీ ఎక్కువగా పెరిగిందని మార్కెట్ సర్వే సంస్థ డేటాసెంబ్లీ సర్వేలో తేలింది. కనీవిని ఎరగని రీతిలో రాష్ట్రంలో ప్రతి పదిమందిలో ఏకంగా ఎనిమిది మంది ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నట్టు ఆ సర్వే తేలి్చంది! ఇది హారిస్‌కు బాగా ప్రతికూలంగా మారవచ్చంటున్నారు.
తాజా పరిస్థితి
తాజా పోల్ ఆఫ్ పోల్స్‌లో హారిస్ 0.9 శాతం ఆధిక్యంలో ఉన్నారు
నార్త్ కరోలినా
ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 16
రాష్ట్ర జనాభా 10.8 కోట్లు
2020లో విజేత ట్రంప్ (74 వేల ఓట్ల మెజారిటీ)
గత ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన ఏకైక స్వింగ్ స్టేట్ ఇదే. ఈసారి కూడా బైడెన్ ప్రత్యరి్థగా ఉన్నన్ని రోజులూ ట్రంప్ హవాయే నడిచింది. ఆయన తప్పుకుని హారిస్ తెరపైకి రావడంతో పరిస్థితి మారుతూ వచి్చంది. దాంతో ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడం ట్రంప్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ విషయాన్ని ఆయన కూడా అంగీకరించారు. అందుకే ఇక్కడ వీలైనన్ని ఎక్కువ ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు.
తాజా పరిస్థితి
ట్రంప్ 0.9 శాతం ఆధిక్యంలో ఉన్నారు
మిషిగన్
ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 15
రాష్ట్ర జనాభా కోటి
2020లో విజేత బైడెన్ (1.5 లక్షల ఓట్ల మెజారిటీ)
గత ఎన్నికల్లో బైడెన్‌కు మంచి మెజారిటీ కట్టబెట్టిన రాష్ట్రమిది. కానీ రాష్ట్రంలో ప్రబల శక్తిగా ఉన్న అరబ్ అమెరికన్లు హారిస్ పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆమె ఇజ్రాయెల్‌కు మద్దతిస్తుండటం బాగా ప్రతికూలంగా మారేలా కని్పస్తోంది. దీన్ని గమనించి కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ విషయంలో హారిస్ కాస్త విమర్శనాత్మక వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు. అది ఇక్కడ అరబ్ ఓటర్ల ఆగ్రహాన్ని ఏ మేరకు చల్లార్చిందన్నది ఫలితాలొస్తే గానీ తేలదు.
తాజా పరిస్థితి
కమలా హారిస్ 0.8 శాతం ఆధిక్యంలో ఉన్నారు
జార్జియా
ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 16
రాష్ట్ర జనాభా 1.1 కోట్లు
2020లో విజేత బైడెన్ (13 వేల ఓట్ల మెజారిటీ)
గత ఎన్నికల్లో అత్యంత వివాదాస్పదంగా నిలిచిన ఫలితం జార్జియాదే. ఇక్కడి ఓటమిని ఒప్పుకునేది లేదంటూ ట్రంప్ భీషి్మంచారు. ఏకంగా ఫలితాలనే మార్చేసేందుకు ప్రయతి్నంచి భంగపాటుకు గురయ్యారు. దీనికి సంబంధించి నాలుగు కేసులను కూడా ఎదుర్కొంటున్నారు. ఒకదాంట్లో ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలగా మూడింట్లో విచారణ కొనసాగుతోంది. జార్జియా జనాభాలో ఏకంగా మూడో వంతు ఆఫ్రికా మూలాలున్నవారే. 2020లో బైడెన్‌ను గెలిపించినా, ఆయన నాలుగేళ్ల పాలనపై వారంతా పెదవి విరుస్తున్నారు. ఇది హారిస్‌కు ప్రతికూలంగా మారేలా కని్పస్తోంది. కానీ ఇక్కడ నిర్వహించిన ముమ్మర ప్రచారం పరిస్థితిని ఆమెకు కాస్త అనుకూలంగా మార్చిందంటున్నారు.
తాజా పరిస్థితి
ట్రంప్ ఏకంగా దాదాపు 2 శాతం ఆధిక్యం కనబరుస్తున్నారు
అరిజోనా
ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 11
రాష్ట్ర జనాభా 74 లక్షలు
2020లో విజేత బైడెన్ (10 వేల ఓట్ల మెజారిటీ)
2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయంలో ఈ రాష్ట్రానిదే కీలక పాత్ర. ఇక్కడ డెమొక్రాట్ అభ్యర్థి గెలవడం 1990ల తర్వాత అదే తొలిసారి కావడం విశేషం. మెక్సికోతో అరిజోనా వందలాది కిలోమీటర్ల మేరకు సరిహద్దులను పంచుకుంటుంది. దాంతో సహజంగానే వలసలు ఇక్కడ కీలక ఎన్నికల అంశంగా మారాయి. తాను గెలిస్తే ఏకంగా 10 లక్షల మంది అక్రమ వలసదారులను వెనక్కు పంపుతానన్న ట్రంప్ ప్రకటన అరిజోనావాసులను బాగా ఆకట్టుకుంటోంది. వలసలపై హారిస్ విధానాల పట్ల వారు పెదవి విరుస్తున్నారు. అయితే అబార్షన్లపై ట్రంప్ స్పష్టమైన వైఖరంటూ ప్రకటించకపోవడంపై ఆయనకు కాస్త మైనస్‌గా మారే ఆస్కారముంది. మహిళా ఓటర్లలో హారిస్ పట్ల స్పష్టమైన మొగ్గు కనిపిస్తుండటం కూడా డెమొక్రాట్లకు సానుకూలాంశమే.
తాజా పరిస్థితి
ట్రంప్ ఏకంగా దాదాపు 3 శాతం ఆధిక్యం కనబరుస్తున్నారు
విస్కాన్సిన్
ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 10
రాష్ట్ర జనాభా 59 లక్షలు
2020లో విజేత బైడెన్ (21 వేల ఓట్ల మెజారిటీ)
స్వతంత్ర అభ్యరి్థగా తొలుత బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనెడీ మేనల్లుడు రాబర్ట్ ఎఫ్.కెనెడీకి విస్కాన్సిన్‌లో భారీ జనాదరణ దక్కింది. ఆగస్టు చివర్లో ఆయన బరి నుంచి తప్పుకుని ట్రంప్‌కు మద్దతు పలకడం రిపబ్లికన్లకు బాగా కలిసొచ్చేలా ఉంది. దీనికి తోడు గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టెయిన్ ఇక్కడ డెమొక్రాట్ల అవకాశాలకు మరింత గండి కొట్టేలా కని్పస్తున్నారు. ఆయన్ను ఎలాగైనా బరిలోంచి తప్పించాలని డెమొక్రాట్లు చివరిదాకా ప్రయతి్నంచినా కుదర్లేదు.
తాజా పరిస్థితి
హారిస్ ఒక్క శాతం కంటే తక్కువ ఆధిక్యంలో ఉన్నారు
నెవడా
ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 6
రాష్ట్ర జనాభా 32 లక్షలు
2020లో విజేత బైడెన్ (34 వేల ఓట్ల మెజారిటీ)
కొద్ది ఎన్నికలుగా వరుసగా డెమొక్రాట్లకే జై కొడుతూ వస్తున్న రాష్ట్రమిది. కానీ ఈసారి మాత్రం ట్రంప్ ఖాతాలో పడే సూచనలు గట్టిగానే కని్పస్తున్నాయి. పోల్ ట్రాకింగ్ సంస్థ 538 తాజా గణాంకాల ప్రకారం ట్రంప్‌కు ఈ రాష్ట్రంలో ఆదరణ బాగా పెరిగింది. హారిస్ రంగప్రవేశంతో పరిస్థితి కాస్త మారినా ఇప్పటికీ ఇక్కడ ట్రంప్‌దే పై చేయిగా కన్పిస్తోంది. అమెరికాలోకెల్లా నిరుద్యోగం అతి ఎక్కువగా (5.1 శాతం)ఉన్న రాష్ట్రం నెవడానే. ఇక్కడ లాటిన్ అమెరికన్లు చాలా ఎక్కువ. వారంతా చాలీచాలని వేతనాలతో సతమతమవుతున్నారు. వారిలో హోటళ్లలో వెయిటర్లు తదితర పనులు చేసేవాళ్లే ఎక్కువ. టిప్పులపై పన్ను ఎత్తేస్తామన్న ట్రంప్ హామీ వారిని బాగా ఆకట్టుకుంది. దాన్ని గమనించిన హారిస్ తాను కూడా ఈ మేరకు గత ఆగస్టులోనే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రం వారిలో ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
తాజా పరిస్థితి
హారిస్ ఒక్క శాతం కంటే తక్కువ ఆధిక్యంలో ఉన్నారు
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment