ట్రంప్‌కు 295, హారిస్‌కు 226 ఎలక్టోరల్ ఓట్లు
2 రాష్ట్రాల్లో తేలాల్సి ఉన్న ఫలితం
వాటిలోని 17 ఎలక్టోరల్ ఓట్లూ ట్రంప్‌కే!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన మెజారిటీని మరింతగా పెంచుకునే దిశగా సాగుతున్నారు. విజయానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం కాగా ఆయనకు ఇప్పటికే 295 ఓట్లు సాధించారు. ఆయన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ 226 ఓట్లు సాధించారు. మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నా 48 రాష్ట్రాల్లో ఇప్పటికే ఫలితం తేలింది.
అరిజోనా, నెవడాల్లో మాత్రమే తేలాల్సి ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ట్రంపే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వాటిలోని 17 ఎలక్టోరల్ ఓట్లు కూడా ఆయన ఖాతాలోనే పడితే ఆయన మొత్తం 312 ఓట్లు సాధిస్తారు. ఇది 2016లో తొలిసారి అధ్యక్షునిగా నెగ్గినప్పుడు సాధించిన ఓట్ల కంటే (304) అధికం. ట్రంప్‌కు ఇప్పటిదాకా 50.8 శాతం, హారిస్‌కు 47.5 శాతం ఓట్లొచ్చాయి. ఆయన 7,27,34,149 ఓట్లు, హారిస్ 6,80,49,758 ఓట్లు సాధించారు.
కాంగ్రెస్‌లో...
అధ్యక్షునితో పాటు కాంగ్రెస్‌కు కూడా ఎన్నికలు జరిగాయి. సెనేట్‌లోని 100 స్థానాల్లో 34 సీట్లకు, ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటితో పాటు 11 రాష్ట్రాల గవర్నర్ పదవులకు, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరిగాయి. బిల్లుల ఆమోదంలో అత్యంత కీలక పాత్ర పోషించే సెనేట్‌లో నాలుగేళ్ల అనంతరం రిపబ్లికన్లు మెజారిటీ సాధించారు.
ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాల్లో వారి స్థానాల సంఖ్య మెజారిటీ మార్కును దాటి 52కు చేరింది. డెమొక్రాట్లకు 45 స్థానాలకు పరిమితమయ్యారు. డెమొక్రాట్లు ఇప్పటికే 3 సీట్లను రిపబ్లికన్లకు కోల్పోయారు. ప్రతినిధుల సభలో కూడా రిపబ్లికన్ల హవాయే సాగుతోంది. మెజారిటీకి 218 సీట్లు కావాల్సి ఉండగా వారికిప్పటికే 206 సీట్లు దక్కాయి. డెమొక్రాట్లు 192 సీట్లే గెలుచుకున్నారు. వారిప్పటికే 4 సీట్లను రిపబ్లికన్లకు కోల్పోయారు. మరో 37 స్థానాల్లో ఫలితాలు రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment