అమెరికా ఓటర్లకు కమలా హారిస్ పిలుపు
ప్రజలను శత్రువులుగా భావిస్తున్న ట్రంప్
అధ్యక్షుడిగా పనికిరారని ధ్వజం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారం వేడెక్కుతోంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తన ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. ట్రంప్ ఏమాత్రం స్థిరత్వం లేని మనిషి, ప్రతీకారమే అతడి విధానమని మండిపడ్డారు. విభజనవాది, గందరగోళానికి మారుపేరైన ట్రంప్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాజాగా డెమొక్రటిక్ ఎన్నికల ప్రచార సభలో కమలా హారిస్ మాట్లాడారు.
అమెరికా పౌరులపైకి అమెరికా సైన్యాన్ని ప్రయోగించాలనుకుంటున్న ట్రంప్‌కు బుద్ధి చెప్పాలని సూచించారు. వ్యతిరేకులను బల ప్రయోగంతో అణచివేయాలన్నదే ఆయన ఆలోచన అని ఆరోపించారు. ప్రజలను శత్రువులుగా భావిస్తున్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎంతమాత్రం పనికిరారని తేల్చిచెప్పారు. ప్రజలు కోరుకుంటున్న కొత్త తరం నాయకత్వాన్ని పరిచయం చేస్తానని, అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లకు కమలా హారిస్ విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు మేలు చేయడమే తన లక్ష్యమని, అందుకోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టంచేశారు. దుష్ట స్వభావం కలిగిన వ్యక్తులపై, స్వప్రయోజనాల కోసం పాకులాడే శక్తులపై కఠినమైన పోరాటానికి భయపడబోనని చెప్పారు. తన తల్లి తనకు ధైర్యసాహసాలు నూరిపోశారని వ్యాఖ్యానించారు. కష్టపడి పనిచేసే నిజాయతీపరులైన ప్రజలను స్వార్థ శక్తుల నుంచి కాపాడుతానని హామీ ఇచ్చారు.
అధికారికంలోకి వచ్చాక రాజకీయాలకు అతీతంగా అందరి బాగు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. అన్ని పార్టీలతో కలిసి పని చేస్తానన్నారు. అమెరికా అధ్యక్షురాలిగా తాను భిన్నమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని కమలా హారిస్ ఉద్ఘాటించారు. ఆకాశాన్నంటున్న ధరలే తన ముందున్న అతిపెద్ద సవాలు అని చెప్పారు. ధరలు తగ్గించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు.
నాకు ఓటేయని వారికీ ప్రతినిధినే: హారిస్
బైడెన్ వివాదం నేపథ్యంలో వ్యాఖ్యలు
వాషింగ్టన్: ‘‘నేను అమెరికన్లందరికీ ప్రాతినిధ్యం వహిస్తా. అధ్యక్ష ఎన్నికల్లో నాకు ఓటేయని వారు కూడా అందులో భాగమే’’ అని హారిస్ స్పష్టం చేశారు. ట్రంప్ మద్దతుదారులను ‘చెత్త’గా అభివర్ణిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడం తెలిసిందే. వాటిపై హారిస్ ఇలా స్పందించారు. ఎవరికి ఓటేస్తారన్న దాని ఆధారంగా వ్యక్తులపై విమర్శలు చేయడాన్ని తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment