swing states
-
ట్రంప్‌దే నెవడా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసిన ట్రంప్ తన మెజారిటీని మరింత పెంచుకుంటున్నారు. ఏడు కీలక స్వింగ్ రాష్ట్రాల్లో ఒకటైన నెవడాను కూడా శనివారం తన ఖాతాలో వేసుకున్నారు. అక్కడి 6 ఎలక్టోరల్ ఓట్లతో కలిపి ఆయన మొత్తం ఓట్లు 301కి పెరిగాయి. నెవడా 20 ఏళ్ల తర్వాత డెమొక్రాట్ల చేజారడం విశేషం. 11 ఓట్లున్న అరిజోనాలో ఫలితం వెలువడాల్సి ఉంది. అక్కడా 83 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ట్రంప్ 5 శాతానికి పైగా ఆధిక్యంలో ఉన్నారు. హారిస్‌కు 226 ఓట్లుకు రావడం తెలిసిందే. రిపబ్లికన్లు నాలుగేళ్ల తర్వాత సెనేట్‌లో కూడా మెజారిటీ సాధించడం తెలిసిందే. వారికి 52 సీట్లు రాగా డెమొక్రాట్లు 44కే పరిమితమయ్యారు. 2 సీట్లు స్వతంత్రులకు దక్కగా మరో రెండింట్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. ప్రతినిధుల సభ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ల ఆధిపత్యమే సాగుతోంది. 435 స్థానాలకు గాను ఇప్పటిదాకా రిపబ్లికన్లు 212 సీట్లు గెలుచుకున్నారు. మరో 6 సీట్లు వస్తే వారు మెజారిటీ మార్కు చేరుకుంటారు. డెమొక్రాట్లకు 200 స్థానాలు దక్కాయి. -
కీలక ‘స్వింగ్’లో ట్రంప్ హవా.. రెండు స్టేట్స్లో గెలుపు
వాషింగ్టన్:అమెరికా ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ లీడ్‌లో ఉన్నారు. అయితే తుది ఫలితాన్ని డిసైడ్ చేసే స్వింగ్ స్టేట్లలో మాత్రం ట్రంప్,కమల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఇప్పటివరకు ఈ స్టేట్లలో కీలకమైన నార్త్ కరోలినాతో పాటు జార్జియాలను ట్రంప్ కైవసం చేసుకున్నారు. ఇది కాకుండా విస్కాన్సిన్, అరిజోనా, పెన్సిల్వేనియా, మిచిగాన్లలో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. కీలక పెన్సిల్వేనియాలో మాత్రం కమల లీడ్‌లో ఉన్నట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి. స్వింగ్ స్టేట్స్ కాకుండా ఎలక్టోరల్ ఓట్లు అధికంగా ఉన్న కాలిఫోర్నియా(54)ను కమల తన ఖాతాలో వేసుకోగా టెక్సాస్(40) ఓట్లను ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు.ఇదీ చదవండి: హారిస్, ట్రంప్ హోరాహోరీ -
USA Presidential Elections 2024: అత్యంత అవినీతిపరురాలు
వాషింగ్టన్: 2020 ఎన్నికల్లో ఓటమి తర్వాత తాను వైట్‌హౌస్‌ను వీడకుండా ఉండాల్సిందని మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. డెమొక్రాట్లు తనను మోసగించి గెలిచారని ఆరోపించారు. హోరాహోరీ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా ఆది, సోమవారాల్లో ఆయన కీలక స్వింగ్ రాష్ట్రాల్లో పర్యటించారు. పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియాల్లో పలు ర్యాలీల్లో మాట్లాడారు. ‘2020 ఎన్నికల్లో మనమేంటో చూపించాం. విజయం అంచుకు చేరాం. ఆ తర్వాతి పరిణామాలను ఎదుర్కోవాల్సింది. వైట్‌హౌస్‌ను వీడి ఉండాల్సింది కాదు’’ అన్నారు. ‘‘డెమొక్రాటిక్ పార్టీ ఓ రాక్షస పార్టీ. అతి పెద్ద అవినీతి యంత్రం. ఇక హారిస్ అత్యంత అవినీతిపరురాలు’’ అంటూ దుయ్యబట్టారు. -
ట్రంప్ వైపే కీలక స్వింగ్!
వాషింగ్టన్: ఫలితాలను తేల్చే కీలక స్వింగ్ స్టేట్స్ అయిన పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియా, నార్త్ కరోలినా, నెవడా, అరిజోనా, విస్కాన్సిన్ అనూహ్యంగా ట్రంప్ వైపు మొగ్గుతున్నాయి. మొత్తం ఏడు రాష్ట్రాల్లోనూ ఆయనే ఆధిక్యంలోకి వచ్చినట్టు అట్లాస్ ఇంటెల్ తాజా పోల్‌లో తేలడం విశేషం. నవంబర్ 1, 2 తేదీల్లో జరిగిన ఈ పోల్‌లో ట్రంప్‌కు ఓటేస్తామని 49 శాతం చెప్పారు. హారిస్‌కు జైకొట్టిన వాళ్లకంటే ఇది ఏకంగా 1.8 శాతం అధికం! అరిజోనాలోనైతే ట్రంప్ ఏకంగా 6.5 శాతం ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఆయనకు 52.3, హారిస్ 45.8 శాతం మంది జైకొట్టారు. నెవడాలో కూడా ట్రంప్ 5.2 శాతం ఆధిక్యంలో ఉన్నారు. ఆయన నార్త్ కరోలినాలో 3.2, జార్జియాలో 2.5, పెన్సిల్వేనియాలో 1.9, మిషిగన్‌లో 1.5, విస్కాన్సిన్లో 1.1 శాతం ఆధిక్యంలో ఉన్నట్టు సర్వే తేల్చింది. మరో సర్వే సైతం ఏడు స్వింగ్ స్టేట్స్‌లోనూ ట్రంపే గెలిచే అవకాశముందని తెలిపింది.అక్టోబర్ 24– నవంబర్ 2 మధ్య జరిగిన న్యూయార్క్ టైమ్స్/ సియానా కాలేజ్ పోల్ సర్వే స్వింగ్ స్టేట్స్లో హోరాహోరీయే సాగుతోందని పేర్కొంది. అయితే వాటిలో ఇప్పటిదాకా న్యూయార్క్ టైమ్స్ జరిపిన అన్ని పోల్స్‌లోనూ హారిస్ కనీసం 4 శాతం, అంతకుమించి స్పష్టమైన ఆధిక్యంలో ఉండగా తాజా సర్వేలో ట్రంప్ మెరుగవడం విశేషం. హారిస్ 49 శాతం ఓట్లతో ట్రంప్ కంటే కేవలం ఒక పాయింట్ ఆధిక్యంలో ఉన్నట్టు సర్వే తేల్చింది. నార్త్ కరోలినా, విస్కాన్సిన్, నెవడాల్లో హారిస్‌కు ఆధిక్యం కనబడగా అరిజోనాలో ట్రంప్ స్పష్టంగా ముందంజలో ఉన్నారు. హారిస్ నెవడాలో 3 శాతం, విస్కాన్సిన్, నార్త్ కరోలినాల్లో 2 శాతం, జార్జియాలో ఒక శాతం ఆధిక్యంలో ఉన్నారు. ఇద్దరికీ పెన్సిల్వేనియాలో 48 శాతం, మిషిగాన్‌లో 47 శాతం చొప్పున వచ్చాయి. అరిజోనాలో మాత్రం ట్రంప్ ఏకంగా 4 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎన్బీసీ న్యూస్ తాజా సర్వేలో ట్రంప్, హారిస్ ఇద్దరూ చెరో 49 శాతం ఓట్లు సాధించారు. ఎవరికి ఓటేయాలో ఇంకా తేల్చుకోలేదని సర్వేలో పాల్గొన్న వారిలో 2 శాతం మంది చెప్పారు. పోల్ ఆఫ్ పోల్స్‌లో ట్రంప్ 0.1 శాతం అతి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.ఓటేసిన వారిలో హారిస్‌కు 8 శాతం ఆధిక్యంఏడు స్వింగ్ స్టేట్లలో ఇప్పటికే 40 శాతం మంది ఓటేశారు. వారిలో హారిస్ 8 శాతం ఆధిక్యంలో ఉన్నట్టు న్యూయార్క్ టైమ్స్ సర్వే తెలిపింది. కాకపోతే ఓటేయాల్సి ఉన్న వారిలో మాత్రం ట్రంప్ ముందంజలో ఉన్నట్టు వెల్లడించింది. పెన్సిల్వేనియాలో గట్టి పోటీ నెలకొంది. అమెరికాలో ఏడు స్వింగ్ స్టేట్స్ను మినహాయిస్తే మిగతావన్నీ సేఫ్ స్టేట్లే. వాటిలో ఏదో ఒక పార్టీయే నిలకడగా గెలుస్తూ వస్తోంది. వాటిని రెడ్ (రిపబ్లికన్), బ్లూ (డెమొక్రటిక్) రాష్ట్రాలుగా పేర్కొంటారు. రెడ్ స్టేట్స్ 1980 నుంచి రిపబ్లికన్లకు, బ్లూ స్టేట్స్ 1992 నుంచి డెమొక్రాట్లకు జై కొడుతూ వస్తున్నాయి. దాంతో ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో పై చేయి సాధించే వారే గద్దెనెక్కడం పరిపాటి. వాటిలో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు హోరాహోరీగా తలపడుతుంటారు. ఈ రాష్ట్రాల్లో సాధారణంగా గెలుపోటముల మధ్య తేడా స్వల్పంగానే ఉంటుంది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ అరిజోనాలో కేవలం 10,000 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు.హారిస్‌వైపు అయోవా!పోలింగ్ తేదీ ముంచుకొచ్చిన వేళ రిపబ్లికన్లకు అనూహ్య షాక్ తగిలింది. వారికి అత్యంత సేఫ్ స్టేట్స్లో ఒకటైన అయోవా అనూహ్యంగా హారిస్‌వైపు మొగ్గుతున్నట్టు తాజా సర్వే ఒకటి తేల్చింది. అందులో హారిస్‌కు 47 శాతం ఓట్లు రాగా ట్రంప్‌కు 44 శాతమే దక్కాయి. మహిళలతో పాటు తటస్థ ఓటర్లు భారీగా ఆమె వైపు మొగ్గడమే ఇందుకు కారణమని దెస్ మొయినెస్ రిజిస్టర్ వార్తా పత్రిక కోసం ఈ సర్వేను నిర్వహించిన సెల్జర్ పోల్ సంస్థ వివరించింది. అమెరికాలో పోల్స్ నిర్వహణలో అత్యధిక రేటింగులున్నది ఈ సంస్థకే కావడం విశేషం. అమెరికావ్యాప్తంగా మహిళల్లో ఇదే ధోరణి ప్రతిఫలిస్తే హారిస్ భారీ మెజారిటీతో నెగ్గినా ఆశ్చర్యం లేదంటున్నారు. సెప్టెంబర్ పోల్‌లో అయోవాలో ట్రంప్ 4 శాతం ఆధిక్యంలో ఉన్నారు. జూన్‌లో బైడెన్‌పై 18 పాయింట్ల ఆధిక్యం కనబరిచారు. అయోవా పోల్ తాజా ఫలితాలను తప్పుడువంటూ ట్రంప్ కొట్టిపారేశారు. -
USA Presidential Elections 2024: వైట్‌హౌస్‌కు దారేది?..7 స్వింగ్ స్టేట్లే కీలకం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది. అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పోలింగ్ ప్రక్రియ మంగళవారం జరగనుంది. డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అత్యంత హోరాహోరీగా తలపడుతున్నారు. దాంతో వారిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి! అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల్లో ఏదో ఒకదానికి స్పష్టంగా మద్దతిచ్చేవే. వీటిని సేఫ్ స్టేట్స్‌గా పిలుస్తారు. ప్రతి అధ్యక్ష ఎన్నికల్లోనూ సదరు రాష్ట్రాలను ఆయా పార్టీలే గెలుచుకుంటాయి. కనుక ఎటూ తేల్చుకోని ఓటర్లు ఎక్కువగా ఉండే కొన్ని రాష్ట్రాల్లోనే పోటీ ప్రధానంగా కేంద్రీకృతం అవుతుంటుంది. వాటిని స్వింగ్ స్టేట్స్‌గా పిలుస్తుంటారు. ఈసారి అలాంటి రాష్ట్రాలు ఏడున్నాయి. అవే పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా, జార్జియా, నెవడా, అరిజోనా. 93 ఎలక్టోరల్ ఓట్లు వీటి సొంతం. వాటిలో మెజారిటీ ఓట్లను ఒడిసిపట్టే వారే అధ్యక్ష పీఠమెక్కుతారు. ట్రంప్‌కు 51, హారిస్‌కు 44 అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. విజయా నికి కనీసం 270 ఓట్లు రావాలి. 48 రాష్ట్రాల్లో మెజారిటీ ఓ ట్లు సాధించిన అభ్యర్థి తాలూకు పార్టీకే ఆ రాష్ట్రంలోని మొ త్తం ఎలక్టోరల్ ఓట్లు దఖలు పడే (విన్నర్ టేక్స్ ఆల్) విధా నం అమల్లో ఉంది. ఆ లెక్కన సేఫ్ స్టేట్లన్నీ ఈసారి ఆయా పార్టీల ఖాతాలోనే పడే పక్షంలో హారిస్ 226 ఓట్లు సాధిస్తారు. ట్రంప్‌కు మాత్రం 219 ఓట్లే వస్తాయి. స్వింగ్ స్టేట్లలో ని 93 ఓట్లు అత్యంత కీలకంగా మారడానికి కారణమిదే. ట్రంప్ గెలవాలంటే వాటిలో కనీసం 51 ఓట్లు సాధించాలి. హారిస్‌కు మాత్రం 44 ఓట్లు చాలు. గత కొద్ది ఎన్నికలుగా ఈ ఏడు స్వింగ్ స్టేట్ల ఓటింగ్ ధోరణి, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా వాటిలో ఈసారి ఫలితాలు ఎలా ఉండవచ్చన్న దానిపై జోరుగా అంచనాలు, విశ్లేషణలు సాగుతున్నాయి.పెన్సిల్వేనియా కీలకం 19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియా ఈసారి మొత్తం అమెరికా దృష్టినీ ఆకర్షిస్తోంది. అక్కడ నెగ్గిన అభ్యర్థే అధ్యక్షుడయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. జనాభా వైవిధ్యం విషయంలో కూడా ఆ రాష్ట్రం అచ్చం అమెరికాకు నకలులా ఉంటుంది. డెమొక్రాట్ల ఆధిపత్యం సాగే పెద్ద నగరాలు, రిపబ్లికన్ కంచుకోటలైన గ్రామీణ ప్రాంతాలు పెన్సిల్వేనియా సొంతం. దాంతో హారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీ నెలకొంది.రస్ట్ బెల్ట్–సన్ బెల్ట్ అమెరికా నిర్మాణ రంగంలో ప్రముఖ పాత్ర పోషించే విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాలను రస్ట్ బెల్ట్ రాష్ట్రాలుగా పిలుస్తారు. ఈ మూడింట్లో కలిపి 44 ఓట్లున్నాయి. మిగతా దేశంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే నెవడా, అరిజోనా, నార్త్ కరోలినా, జార్జియాలను సన్ బెల్ట్ రాష్ట్రాలంటారు. వీటిలో మొత్తం 49 ఓట్లున్నాయి. → రస్ట్ బెల్ట్ నిర్మాణ రంగానికి నిలయం. దాంతో విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటర్లపై కారి్మక సంఘాల ప్రభావం ఎక్కువే. → ఈ రాష్ట్రాలపై దశాబ్దాలుగా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగుతూ వస్తోంది. ఎంతగా అంటే, గత ఎనిమిది అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఏడుసార్లు ఈ మూడు రాష్ట్రాలూ ఆ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ఒక్క 2016లో మాత్రం వాటిలో పూర్తిగా ట్రంప్ హవా నడిచింది. → ఈసారి కూడా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగితే 44 ఓట్లూ కమల ఖాతాలోనే పడతాయి. అదే జరిగితే తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ఆమె చరిత్ర సృష్టిస్తారు. → అలాగాక 2016లో మాదిరిగా ట్రంప్ మరోసారి ఈ మూ డు రాష్ట్రాలనూ నెగ్గినా విజయానికి ఏడు ఓట్ల దూరంలో నిలుస్తారు. అప్పుడాయన విజయం కోసం కనీసం మరో స్వింగ్ స్టేట్‌ను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. → ఒకవేళ హారిస్ రస్ట్ బెల్ట్ రాష్ట్రాల్లో కీలకమైన పెన్సిల్వేనియాతో పాటు మరోదాన్ని దక్కించుకున్నా ఆమె విజయావకాశాలు మెరుగ్గానే ఉంటాయి. మిగతా నాలుగు స్వింగ్ స్టేట్లలో ఏ ఒక్కదాన్ని నెగ్గినా ఆమె గెలిచినట్టే. ట్రంప్ గెలవాలంటే ఆ నాలుగింటినీ స్వీప్ చేయాల్సి ఉంటుంది. → హారిస్ రస్ట్ బెల్ట్‌లో సున్నా చుట్టినా నాలుగు సన్ బెల్ట్ రాష్ట్రాలను స్వీప్ చేస్తే విజయం ఆమెదే. → అయితే ఇందుకు అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే 1948 తర్వాత డెమొక్రాట్లు సన్ బెల్ట్‌ను క్లీన్‌స్వీప్ చేయలేదు. → రిపబ్లికన్లకు మాత్రం సన్ బెల్ట్‌ను పలుమార్లు క్లీన్‌స్వీప్ చేసిన చరిత్ర ఉంది. ఈసారీ అలా జరిగినా ట్రంప్ విజయానికి అది చాలదు. రస్ట్ బెల్ట్ నుంచి కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా ఆయన చేజిక్కించుకోవాలి. లేదంటే 269 ఓట్లకు పరిమితమై ఓటమి పాలవుతారు.రస్ట్ బెల్ట్‌లో విజయావకాశాలు → రస్ట్ బెల్ట్‌లో హారిస్ గెలవాలంటే పట్టణ ఓటర్లు భారీగా ఓటేయాల్సి ఉంటుంది. నల్లజాతీయులు, మైనారిటీలు, విద్యాధికులు, మధ్య తరగతి ఓట్లు, ముఖ్యంగా మహిళలు పోలింగ్ బూత్‌లకు తరలడం తప్పనిసరి. → అలాగాక గ్రామీణ ఓటర్లు భారీగా ఓటేస్తే 2016లో మాదిరిగా మరోసారి రస్ట్ బెల్ట్ ట్రంప్‌దే అవుతుంది. → ఈసారి గ్రామీణులతో పాటు యువ ఓటర్లు కూడా తనకే జైకొడతారని ఆయన ధీమాగా ఉన్నారు. సన్ బెల్ట్‌లో విజయావకాశాలు → ఇక్కడ విజయావకాశాలను అమితంగా ప్రభావితం చేసేది నల్లజాతీయులు, లాటిన్ అమెరికన్ ఓటర్లే. → జార్జియా, నార్త్ కరోలినాల్లో నల్లజాతి ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. అరిజోనా, నెవడాల్లో లాటిన్ అమెరికన్ జనాభా నానాటికీ పెరుగుతోంది. → హారిస్ జమైకన్ మూలాల దృష్ట్యా నల్లజాతీయులు ఆమెవైపే మొగ్గుతారని భావిస్తున్నారు. ఇక ట్రంప్ ర్యాలీలో ప్యూర్టోరీకన్లు, లాటిన్ అమెరికన్లపై వెలువడ్డ వ్యంగ్య వ్యాఖ్యలపై ఆగ్రహంతో వారు కూడా హారిస్‌కే ఓటేస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
USA Presidential Elections 2024: ఓట్లు తగ్గినా... గద్దెనెక్కవచ్చు!
అధ్యక్ష తరహా పాలన ఉన్న చాలా దేశాల్లో ఆ పదవికి ప్రత్యక్ష ఎన్నిక జరుగుతుంది. ప్రజలు తమ ప్రెసిడెంట్‌ను నేరుగా ఎన్నుకుంటారు. అత్యధిక ఓట్లు సాధించే వారే విజేతగా నిలుస్తారు. కానీ అగ్రరాజ్యమైన అమెరికాలో మాత్రం గమ్మత్తైన పరోక్ష ఎన్నిక విధానం అమల్లో ఉంది. అక్కడ అధ్యక్షున్ని ఎన్నుకునేది ఎలక్టోరల్ కాలేజీ. మరి పోలింగ్ తేదీన ప్రజలు ఓటేసేది ఎవరికంటారా? ఎలక్టర్లుగా పిలిచే ఈ ఎలక్టోరల్ కాలేజీ సభ్యులకు. అనంతరం వారంతా కలిసి అధ్యక్షున్ని, ఉపాధ్యక్షున్ని నేరుగా ఎన్నుకుంటారు.విన్నర్ టేక్స్ ఆల్! అధ్యక్ష ఎన్నిక విషయంలో అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 48 రాష్ట్రాలు విన్నర్ టేక్స్ ఆల్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దానిప్రకారం ఒక రాష్ట్ర ఎలక్టోరల్ ఓట్లన్నీ ఆ రాష్ట్రంలో మెజారిటీ ఓట్లు సాధించే అభ్యరి్థకే దక్కుతాయి (మెయిన్, నెబ్రాస్కా మాత్రం అభ్యర్థులు సాధించే ఓట్ల ప్రకారం నైష్పత్తిక పద్ధతిలో వారికి ఎలక్టర్లను కేటాయిస్తాయి). దీనివల్ల దేశవ్యాప్తంగా కలిపి అత్యధిక ఓట్లు (పాపులర్ ఓట్) సాధించే అభ్యర్థి కూడా ఓటమి పాలయ్యే ఆస్కారం పుష్కలంగా ఉంది. గతంలో ఇలా జరిగింది కూడా. 2016లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే ఏకంగా 28 లక్షల పై చిలుకు ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయినా ఆమె ఏకంగా 74 ఎలక్టోరల్ ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు! 2000లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అల్ గోర్ కూడా తన రిపబ్లికన్ ప్రత్యర్థి జార్జి డబ్లు్య.బుష్ కంటే 5.5 లక్షల ఎక్కువ ఓట్లు సాధించారు. అయినా 271 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించిన బుష్కే పీఠం దక్కింది. 1876, 1888ల్లో కూడా పాపులర్ ఓట్ సాధించిన అభ్యర్థులు ఓటమి చవిచూశారు. కాకపోతే ఇప్పటిదాకా జరిగిన 59 అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా 54సార్లు పాపులర్ ఓట్ సాధించిన అభ్యర్థే విజేతగా నిలిచారు. ఎందుకీ ‘కాలేజీ’...? ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థ వల్ల చిన్న రాష్ట్రాలకు కూడా అధ్యక్షుని ఎన్నికలో తగిన ప్రాధాన్యం దక్కుతుంది. అంతేగాక అభ్యర్థులు దేశమంతటా కాలికి బలపం కట్టుకుని తిరిగే అవసరముండదు. గెలుపోటములను నిర్దేశించి ఆరేడు స్వింగ్ స్టేట్స్పై గట్టిగా దృష్టి పెడితే సరిపోతుంది. కాకపోతే ఈ విధానంలో లోపాలూ లేకపోలేదు. పాపులర్ ఓట్ సాధించిన వాళ్లు కూడా ఓడే ఆస్కారముండటం వాటిలో ప్రధానమైనది. తమ ఓట్లకు ప్రాధాన్యం లేదనే భావనతో జనం ఓటింగ్‌కు దూరమయ్యే ఆస్కారమూ ఉంటుంది.జనాభాకు తగ్గట్టు... ప్రతి రాష్ట్రానికి జనాభాకు అనుగుణంగా ఎలక్టర్ల సంఖ్యను కేటాయిస్తారు. ఇది ఆ రాష్ట్రానికి కేటాయించిన ప్రతినిధుల సభ, సెనేట్ సభ్యుల సంఖ్యకు సమానంగా ఉంటుంది. ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల సంఖ్య 538. అధ్యక్ష ఎన్నికలో నెగ్గాలంటే వీటిలో కనీసం 270 ఓట్లు అవసరం. కాలిఫోర్నియాలో అత్యధికంగా 54 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లుంటే వ్యోమింగ్, నార్త్ డకోటా, అలస్కా వంటి రాష్ట్రాల్లో కేవలం మూడే ఉన్నాయి. అమెరికాలోనూ అప్పుడప్పుడూ గోడదూకుళ్లు! ఎలక్టర్లు తమ పార్టీ అభ్యరి్థకే ఓటేయాలన్న రాజ్యాంగ నిర్బంధమేమీ అమెరికాలో లేదు! 2016లో ఏడుగురు ఎలక్టర్లు ప్రత్యర్థులకు ఓటేశారు. వీరిలో ఐదుగురు డెమొక్రాట్లు కాగా ఇద్దరు రిపబ్లికన్లు. అయితే వారి చర్య తుది ఫలితంపై ప్రభావం చూపలేదు. హిల్లరీ క్లింటన్‌కు 232 ఎలక్టర్ ఓట్లు రాగా 306 ఓట్లతో ట్రంప్ సునాయాసంగా విజయం సాధించారు. ఇలాంటి గోడదూకుడు ఎలక్టర్లకు సంబంధిత పారీ్టలు జరిమానా విధించడమే గాక వారిపై అనర్హత వేటు కూడా వేయొచ్చు. వారిపై చట్టప్రకారం చర్యలు కూడా చేపట్టమే గాక వారి స్థానంలో వేరేవాళ్లను ఎలక్టర్లుగా నియమించుకునేందుకు వీలు కల్పిస్తూ 32 రాష్ట్రాలు చట్టాలు చేశాయి. సుదీర్ఘ ప్రక్రియ అమెరికాలో అధ్యక్ష ఎన్నిక సుదీర్ఘ ప్రక్రియ. ముందుగా ప్రధాన పార్టీలు తమ అధ్యక్ష అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుడతాయి. ఇది పోలింగ్‌కు దాదాపు 9 నెలల ముందుగానే మొదలవుతుంది... -అధ్యక్ష అభ్యర్థులపై కాకస్‌లు, ప్రైమరీల ద్వారా పార్టీ సభ్యులు, ప్రతినిధులు తమ అభిప్రాయం వెలిబుచ్చుతారు. -అనంతరం ఆగస్టు/సెప్టెంబర్ నెల్లలో పార్టీ జాతీయ సదస్సులో అభ్యరి్థని అధికారికంగా ప్రకటిస్తారు. అక్కడినుంచి ఎన్నికల పోరు ఊపందుకుంటుంది. -ప్రచారం, ప్రధాన అభ్యర్థుల డిబేట్లతో పోరు పతాక స్థాయికి చేరుకుంటుంది. -నవంబర్‌లో తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం పోలింగ్ ఉంటుంది. -విజేత ఎవరో పోలింగ్ ముగియగానే ఆ రాత్రే దాదాపుగా తేలిపోతుంది. -అయితే అంతకు కొద్ది నెలల నుంచే ముందస్తు ఓటింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ఈసారి ఇప్పటికే 3.5 కోట్ల మందికి పైగా అమెరికన్లు ముందుగానే ఓటేయడం విశేషం.జనవరి 6న ఫలితం జనవరి 6న అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం జరుగుతుంది. ఎలక్టోరల్ ఓట్ల లెక్కింపు జరిపి అధ్యక్ష, ఉపాధ్యక్షులను అధికారికంగా ప్రకటిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు ఈ ప్రక్రియను సెనేట్ అధ్యక్షుని హోదాలో పర్యవేక్షిస్తారు. నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షుల పేర్లను కూడా ప్రకటిస్తారు. → ఎలక్టోరల్ ఓట్లలో ఏ అభ్యరి్థకీ మెజారిటీ రాకపోతే అధ్యక్షున్ని ఎన్నుకునే బాధ్యత ప్రతినిధుల సభపై పడుతుంది. దాని సభ్యులంతా కలిసి అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు సాధించిన తొలి ముగ్గురు అభ్యర్థుల్లో నుంచి మెజారిటీ ఓటు ద్వారా ఒకరిని అధ్యక్షునిగా ఎన్నుకుంటారు. → ఉపాధ్యక్ష పదవికి కూడా అంతే. ఎవరికీ మెజారిటీ రాకపోతే అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు సాధించిన తొలి ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిని సెనేట్ సభ్యులు మెజారిటీ ఓటు ద్వారా ఉపాధ్యక్షునిగా ఎన్నుకుంటారు. → దాంతో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ కొలిక్కి వచి్చనట్టే. చివరగా జనవరి 20న ప్రమాణస్వీకారం ఉంటుంది. ముందుగా ఉపాధ్యక్షుడు, అనంతరం అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ రోజు ఆదివారమైతే కార్యక్రమాన్ని జనవరి 21న నిర్వహిస్తారు. → 1933 దాకా కొత్త అధ్యక్షుడు మార్చి 4న ప్రమాణస్వీకారం చేసేవారు. 1937 నుంచి జనవరి 20కి మార్చారు.అసలు ఎన్నిక డిసెంబర్ 16న!ఓటింగ్ ముగిశాక కూడా అమెరికా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఏకంగా మరో రెండు నెలల పాటు సాగుతుంది! → రాష్ట్రాల స్థాయిలో ఎలక్టర్ల ఎన్నిక ప్రక్రియ దాదాపు నెల పాటు జరుగుతుంది. మెయిన్, నెబ్రాస్కా మినహా మిగతా 48 రాష్ట్రాల్లోనూ మెజారిటీ ఓట్లు సాధించిన పారీ్టకే ఆ రాష్ట్రంలోని మొత్తం ఎలక్టోరల్ ఓట్లూ దక్కుతాయి. → అనంతరం తమ ఎలక్టర్లుగా ఎవరుండాలో సదరు పార్టీ తాలూకు రాష్ట్ర శాఖ నిర్ణయిస్తుంది. → ఎలక్టర్లుగా ఎన్నికైన వారంతా డిసెంబర్లో రెండో బుధవారం తర్వాత వచ్చే సోమవారం ఆయా రాష్ట్రాల రాజధానుల్లో భేటీ అవుతారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులకు విడివిడిగా ఓటేస్తారు. ఒకవిధంగా అధ్యక్షున్ని వాస్తవంగా ఎన్నుకునేది ఈ రోజే! ఈసారి ఎలక్టర్ల భేటీ డిసెంబర్ 16న జరగనుంది. → అనంతరం డిసెంబర్ నెల నాలుగో బుధవారం లోగా, అంటే ఎలక్టర్ల భేటీ జరిగిన 9 రోజుల్లోపు వారి ఓట్లన్నీ సెనేట్ అధ్యక్షునికి చేరాల్సి ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
USA Presidential Elections 2024: ఊరిస్తున్న ఊయల సేవ
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు కురుక్షేత్రాన్ని తలపిస్తూ అత్యంత హోరాహోరీగా సాగుతోంది. రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ ప్రత్యర్థి కమలా హారిస్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు. ఎన్నికలు మొత్తం 50 రాష్ట్రాల్లోనూ జరుగుతున్నా వాటిలో ఏడు రాష్ట్రాలు విజేతను తేల్చడంలో అతి కీలకంగా మారాయి. స్వింగ్ స్టేట్స్‌గా పిలిచే ఆ ఏడింటిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. వాటిలో మెజారిటీ రాష్ట్రాలను నెగ్గిన వారే అధ్యక్షుడు కావడం ఖాయంగా కన్పిస్తోంది. అయితే అన్ని పోల్స్‌లోనూ ఆ ఏడు రాష్ట్రాల్లో కూడా ట్రంప్, హారిస్ దాదాపుగా సమవుజ్జీలుగా నిలుస్తుండటం విశేషం. దాంతో ఈ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారిపోయాయి. స్వింగ్ స్టేట్స్ అంటే...?అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీల్లో ఏదో ఒకదానివైపు స్పష్టంగా మొగ్గేవే ఉంటాయి. వాటిని సేఫ్ స్టేట్స్‌గా పిలుస్తారు. పారీ్టల జెండా రంగుపరంగా వీటిని బ్లూ (డెమొక్రాట్), రెడ్ (రిపబ్లికన్) స్టేట్స్‌గా పేర్కొంటారు. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఒక ఎన్నికలో డెమొక్రాట్లకు జై కొడితే మరో ఎన్నికలో రిపబ్లికన్ అభ్యరి్థని గెలిపిస్తుంటాయి. వీటినే స్వింగ్ స్టేట్స్, బ్యాటిల్‌గ్రౌండ్ స్టేట్స్, పర్పుల్ స్టేట్స్ (డెమొక్రాట్, రిపబ్లికన్ పారీ్టల్లో ఎటైనా మొగ్గవచ్చనే అనే అర్థంలో) అని పిలుస్తుంటారు. అభ్యర్థులు సేఫ్ స్టేట్స్పై పెద్దగా దృష్టి పెట్టరు. ఈ స్వింగ్ స్టేట్స్ను తమవైపు తిప్పుకోవడం, లేదా అవి ప్రత్యరి్థకి జై కొట్టకుండా చూడటంపైనే శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరిస్తారు. దాంతో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ హోరాహోరీ ప్రచారం సాగుతుంటుంది. మీడియాలోనూ, బయటా భారీగా ఎన్నికల ప్రకటనలు ఇతరత్రా హడావుడి కూడా స్వింగ్ స్టేట్స్లోనే ఎక్కువ. ఆ 7 రాష్ట్రాలివే... ఈ ఎన్నికల్లో 7 రాష్ట్రాలు స్వింగ్ స్టేట్లుగా అందరి దృష్టినీ తమవైపు తిప్పుకుంటున్నాయి. అవి... పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా, అరిజోనా, మిషిగన్, నెవడా, విస్కాన్సిన్పెన్సిల్వేనియా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 19 రాష్ట్ర జనాభా 1.3 కోట్లు 2020లో విజేత బైడెన్ (82 వేల ఓట్ల మెజారిటీ) ఏడు స్వింగ్ స్టేట్లలో అత్యధిక ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్న రాష్ట్రం. దాంతో సహజంగానే ఇక్కడ గెలుపు అభ్యర్థులకు అత్యంత కీలకం. ట్రంప్‌పై గత జూలైలో హత్యాయత్నం జరిగింది పెన్సిల్వేనియాలోనే. ఇది బైడెన్ సొంత రాష్ట్రం కూడా. ఆర్థిక పరిస్థితులు ఈసారి ఇక్కడ కీలక ఎన్నికల అంశంగా మారాయి. ధరాభారంతో పెన్సిల్వేనియావాసులు నానా కష్టాలు పడుతున్నారు. అమెరికా అంతటినీ అతలాకుతలం చేస్తున్న జీవన వ్యయం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మరీ ఎక్కువగా పెరిగిందని మార్కెట్ సర్వే సంస్థ డేటాసెంబ్లీ సర్వేలో తేలింది. కనీవిని ఎరగని రీతిలో రాష్ట్రంలో ప్రతి పదిమందిలో ఏకంగా ఎనిమిది మంది ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నట్టు ఆ సర్వే తేలి్చంది! ఇది హారిస్‌కు బాగా ప్రతికూలంగా మారవచ్చంటున్నారు. తాజా పరిస్థితి తాజా పోల్ ఆఫ్ పోల్స్‌లో హారిస్ 0.9 శాతం ఆధిక్యంలో ఉన్నారునార్త్ కరోలినా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 16 రాష్ట్ర జనాభా 10.8 కోట్లు 2020లో విజేత ట్రంప్ (74 వేల ఓట్ల మెజారిటీ) గత ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన ఏకైక స్వింగ్ స్టేట్ ఇదే. ఈసారి కూడా బైడెన్ ప్రత్యరి్థగా ఉన్నన్ని రోజులూ ట్రంప్ హవాయే నడిచింది. ఆయన తప్పుకుని హారిస్ తెరపైకి రావడంతో పరిస్థితి మారుతూ వచి్చంది. దాంతో ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడం ట్రంప్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ విషయాన్ని ఆయన కూడా అంగీకరించారు. అందుకే ఇక్కడ వీలైనన్ని ఎక్కువ ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. తాజా పరిస్థితి ట్రంప్ 0.9 శాతం ఆధిక్యంలో ఉన్నారుమిషిగన్ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 15 రాష్ట్ర జనాభా కోటి 2020లో విజేత బైడెన్ (1.5 లక్షల ఓట్ల మెజారిటీ) గత ఎన్నికల్లో బైడెన్‌కు మంచి మెజారిటీ కట్టబెట్టిన రాష్ట్రమిది. కానీ రాష్ట్రంలో ప్రబల శక్తిగా ఉన్న అరబ్ అమెరికన్లు హారిస్ పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆమె ఇజ్రాయెల్‌కు మద్దతిస్తుండటం బాగా ప్రతికూలంగా మారేలా కని్పస్తోంది. దీన్ని గమనించి కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ విషయంలో హారిస్ కాస్త విమర్శనాత్మక వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు. అది ఇక్కడ అరబ్ ఓటర్ల ఆగ్రహాన్ని ఏ మేరకు చల్లార్చిందన్నది ఫలితాలొస్తే గానీ తేలదు. తాజా పరిస్థితి కమలా హారిస్ 0.8 శాతం ఆధిక్యంలో ఉన్నారుజార్జియా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 16 రాష్ట్ర జనాభా 1.1 కోట్లు 2020లో విజేత బైడెన్ (13 వేల ఓట్ల మెజారిటీ)గత ఎన్నికల్లో అత్యంత వివాదాస్పదంగా నిలిచిన ఫలితం జార్జియాదే. ఇక్కడి ఓటమిని ఒప్పుకునేది లేదంటూ ట్రంప్ భీషి్మంచారు. ఏకంగా ఫలితాలనే మార్చేసేందుకు ప్రయతి్నంచి భంగపాటుకు గురయ్యారు. దీనికి సంబంధించి నాలుగు కేసులను కూడా ఎదుర్కొంటున్నారు. ఒకదాంట్లో ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలగా మూడింట్లో విచారణ కొనసాగుతోంది. జార్జియా జనాభాలో ఏకంగా మూడో వంతు ఆఫ్రికా మూలాలున్నవారే. 2020లో బైడెన్‌ను గెలిపించినా, ఆయన నాలుగేళ్ల పాలనపై వారంతా పెదవి విరుస్తున్నారు. ఇది హారిస్‌కు ప్రతికూలంగా మారేలా కని్పస్తోంది. కానీ ఇక్కడ నిర్వహించిన ముమ్మర ప్రచారం పరిస్థితిని ఆమెకు కాస్త అనుకూలంగా మార్చిందంటున్నారు. తాజా పరిస్థితి ట్రంప్ ఏకంగా దాదాపు 2 శాతం ఆధిక్యం కనబరుస్తున్నారుఅరిజోనా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 11 రాష్ట్ర జనాభా 74 లక్షలు 2020లో విజేత బైడెన్ (10 వేల ఓట్ల మెజారిటీ) 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయంలో ఈ రాష్ట్రానిదే కీలక పాత్ర. ఇక్కడ డెమొక్రాట్ అభ్యర్థి గెలవడం 1990ల తర్వాత అదే తొలిసారి కావడం విశేషం. మెక్సికోతో అరిజోనా వందలాది కిలోమీటర్ల మేరకు సరిహద్దులను పంచుకుంటుంది. దాంతో సహజంగానే వలసలు ఇక్కడ కీలక ఎన్నికల అంశంగా మారాయి. తాను గెలిస్తే ఏకంగా 10 లక్షల మంది అక్రమ వలసదారులను వెనక్కు పంపుతానన్న ట్రంప్ ప్రకటన అరిజోనావాసులను బాగా ఆకట్టుకుంటోంది. వలసలపై హారిస్ విధానాల పట్ల వారు పెదవి విరుస్తున్నారు. అయితే అబార్షన్లపై ట్రంప్ స్పష్టమైన వైఖరంటూ ప్రకటించకపోవడంపై ఆయనకు కాస్త మైనస్‌గా మారే ఆస్కారముంది. మహిళా ఓటర్లలో హారిస్ పట్ల స్పష్టమైన మొగ్గు కనిపిస్తుండటం కూడా డెమొక్రాట్లకు సానుకూలాంశమే. తాజా పరిస్థితి ట్రంప్ ఏకంగా దాదాపు 3 శాతం ఆధిక్యం కనబరుస్తున్నారువిస్కాన్సిన్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 10 రాష్ట్ర జనాభా 59 లక్షలు 2020లో విజేత బైడెన్ (21 వేల ఓట్ల మెజారిటీ) స్వతంత్ర అభ్యరి్థగా తొలుత బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనెడీ మేనల్లుడు రాబర్ట్ ఎఫ్.కెనెడీకి విస్కాన్సిన్లో భారీ జనాదరణ దక్కింది. ఆగస్టు చివర్లో ఆయన బరి నుంచి తప్పుకుని ట్రంప్‌కు మద్దతు పలకడం రిపబ్లికన్లకు బాగా కలిసొచ్చేలా ఉంది. దీనికి తోడు గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టెయిన్ ఇక్కడ డెమొక్రాట్ల అవకాశాలకు మరింత గండి కొట్టేలా కని్పస్తున్నారు. ఆయన్ను ఎలాగైనా బరిలోంచి తప్పించాలని డెమొక్రాట్లు చివరిదాకా ప్రయతి్నంచినా కుదర్లేదు. తాజా పరిస్థితి హారిస్ ఒక్క శాతం కంటే తక్కువ ఆధిక్యంలో ఉన్నారునెవడా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 6 రాష్ట్ర జనాభా 32 లక్షలు 2020లో విజేత బైడెన్ (34 వేల ఓట్ల మెజారిటీ) కొద్ది ఎన్నికలుగా వరుసగా డెమొక్రాట్లకే జై కొడుతూ వస్తున్న రాష్ట్రమిది. కానీ ఈసారి మాత్రం ట్రంప్ ఖాతాలో పడే సూచనలు గట్టిగానే కని్పస్తున్నాయి. పోల్ ట్రాకింగ్ సంస్థ 538 తాజా గణాంకాల ప్రకారం ట్రంప్‌కు ఈ రాష్ట్రంలో ఆదరణ బాగా పెరిగింది. హారిస్ రంగప్రవేశంతో పరిస్థితి కాస్త మారినా ఇప్పటికీ ఇక్కడ ట్రంప్‌దే పై చేయిగా కన్పిస్తోంది. అమెరికాలోకెల్లా నిరుద్యోగం అతి ఎక్కువగా (5.1 శాతం)ఉన్న రాష్ట్రం నెవడానే. ఇక్కడ లాటిన్ అమెరికన్లు చాలా ఎక్కువ. వారంతా చాలీచాలని వేతనాలతో సతమతమవుతున్నారు. వారిలో హోటళ్లలో వెయిటర్లు తదితర పనులు చేసేవాళ్లే ఎక్కువ. టిప్పులపై పన్ను ఎత్తేస్తామన్న ట్రంప్ హామీ వారిని బాగా ఆకట్టుకుంది. దాన్ని గమనించిన హారిస్ తాను కూడా ఈ మేరకు గత ఆగస్టులోనే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రం వారిలో ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. తాజా పరిస్థితి హారిస్ ఒక్క శాతం కంటే తక్కువ ఆధిక్యంలో ఉన్నారు – సాక్షి, నేషనల్ డెస్క్ -
అడ్వాంటేజ్ డొనాల్డ్ ట్రంప్.. హారిస్‌తో ఉత్కంఠ పోరు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పది రోజులే మిగిలి ఉంది. పోలింగ్ తేదీ నవంబర్ 5 దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార హోరు పెరిగింది. పోల్స్ ఫలితాలు కూడా తారుమారవుతున్నాయి. అధ్యక్ష బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకొన్న మొదట్లో వరుస పోల్స్ హారిస్ వైపే మొగ్గు చూపాయి. కానీ తీరా పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ పరిస్థితి క్రమంగా తారుమారు అవుతున్నట్టు కన్పిస్తోంది. కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలోకి వెళ్తున్నారు. అంతేగాక తాజా పోల్స్‌లో సానుకూలతను పెంచుకున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ట్రంప్, హారిస్ పోరు తారాస్థాయికి చేరుతోంది. మొన్నటిదాకా సర్వేల్లో హారిస్ ఆధిక్యంలో ఉండగా తాజాగా ట్రంప్ కాస్త ముందంజలోకి వచ్చారు. వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా సర్వేలో ట్రంప్ 47 శాతం మద్దతు దక్కించుకోగా హారిస్‌కు 45 శాతం ఓట్లు పోలయ్యాయి. సీఎన్‌బీసీ ఆల్ అమెరికన్ ఎకనమిక్ సర్వేలోనూ హారిస్ కంటే ట్రంప్ రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. హోరాహోరీ పోరు సాగుతున్న 7 కీలక స్వింగ్ రాష్ట్రాల్లోనూ తాజా సర్వేల్లో హారిస్ కంటే ట్రంప్ ఒక్క పాయింట్ ఆధిక్యం సాధించారు. డెమొక్రాట్ల కంచుకోటలైన మిషిగన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియాతో పాటు నల్లజాతీయులు, లాటినో ఓటర్లలో ఆయన పట్టు సాధిస్తున్నారు.ఇది డెమొక్రాట్లకు ఆందోళన కలిగిస్తోంది. అయితే ప్రాంతీయ, జాతీయ స్థాయిలో ప్రధాన పోల్స్ అన్నింటినీ విశ్లేషించే రియల్క్లియర్పాలిటిక్స్ ప్రకారం హారిస్ ఇప్పటికీ ట్రంప్‌పై 0.3 శాతం ఆధిక్యంలో ఉన్నారు. కాకపోతే స్వింగ్ స్టేట్లలో మాత్రం ట్రంప్‌కే 0.9 శాతం మొగ్గుందని అది తేల్చింది. అమెరికా బెట్టింగ్ మార్కెట్ అయితే ట్రంప్ విజయావకాశాలను ఏకంగా 61 శాతంగా అంచనా వేసింది. హారిస్ గెలిచేందుకు 39 శాతం మాత్రమే చాన్సుందని పేర్కొంది. ట్రంప్‌పై కొన్ని రోజులుగా హారిస్ తీవ్ర విమర్శలు చేస్తుండటం తెలిసిందే. హిట్లర్‌ను ప్రశంసించిన ట్రంప్ అంతకంటే నియంత అంటూ దుయ్యబట్టారు. ఆయనో అసమర్థుడని ఎద్దేవా చేశారు. ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే పర్యవసానాల గురించి పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హారిస్ పాపులర్ ఓట్లను గెలుచుకోవచ్చని సర్వేలంటున్నాయి. కానీ కీలక రాష్ట్రాలను కైవసం చేసుకుంటేనే ఎన్నికల విజయం సాధ్యం. మరోవైపు చాలా రాష్ట్రాల్లో ఓటర్లకు హారిస్‌పై పలు అంశాల్లో ఇప్పటికీ అభ్యంతరాలున్నాయి. మరోవైపు ముందస్తు ఓటేసిన అమెరికన్ల సంఖ్య 3.1 కోట్లు దాటింది.పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యంస్వింగ్ రాష్ట్రాల్లో అత్యంత ముఖ్యమైనది పెన్సిల్వేనియా. వాటిలో అత్యధికంగా 19 ఎలక్టోరల్ కాలేజీ ఓటు్లున్న రాష్ట్రం. ఇక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రకటనలపైనే రెండు పార్టీలు కోట్లు వెచ్చించాయి. ఇక్కడి ఓటర్లు ఆర్థిక వ్యవస్థపై చాలా ఆందోళన చెందుతున్నారు. వారు క్రమంగా ట్రంప్ వైపే మొగ్గుతున్నారు. వివాదాస్పద, కుంభకోణాల వ్యక్తిగా ట్రంప్‌పై విముఖత ఉన్నా ఆయన హయాంలో ఆహారం, పెట్రోల్ ధరలు తక్కువగా ఉండేవని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి మహిళలు మాత్రం హారిస్ పట్ల సానుకూలంగా ఉన్నారు. ‘‘ట్రంప్ వ్యాఖ్యలు, ఆయన ప్రవర్తన దారుణం. ఆయన్ను మరోసారి వైట్‌హౌస్‌కు పంపించేదే లేదు’’ అంటున్నారు. కాంగ్రెస్ మాజీ సభ్యురాలు, మాజీ ఉపాధ్యక్షుడు డిక్ షెనీ కూతురు లిజ్ షెనీ వంటివారి ప్రచారం కూడా హారిస్‌కు ఎంతో కొంత కలిసి రానుంది.‘అబార్షన్ హక్కులు’ ప్రభావం చూపేనా?హారిస్‌కు అమెరికావ్యాప్తంగా ఉన్న సానుకూలత మహిళా ఓటర్లలో బలమైన ఆధిక్యం. ఆమె అభ్యర్థిత్వమే చరిత్రాత్మకం. కానీ ఆమె దీనిపై ప్రచారం చేసుకోవడం లేదు. మహిళల అబార్షన్ హక్కులకు బలంగా మద్దతిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు ప్రవేశపెట్టిన అత్యంత కఠినమైన అబార్షన్ నిషేధం మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీన్ని రాజ్యాంగంలో చేర్చాలా వద్దా అనే అంశాన్ని పది రాష్ట్రాలు ఓటింగ్‌కు పెట్టాయి. అలాంటి రాష్ట్రాల్లో అరిజోనాలో హారిస్‌కు మెజారిటీ వచ్చే అవకాశముంది. అయితే అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగినప్పుడు సృష్టించిన వాతావరణాన్ని హారిస్ బలంగా కొనసాగించలేకపోయినట్టు పోల్స్ చెబుతున్నాయి.డెమొక్రాట్లకు ‘గాజా’ షాక్ట్రంప్కే అరబ్–అమెరికన్ల జయహోకీలక రాష్ట్రాల్లో ఒకటైన మిషిగన్‌లో అరబ్–అమెరికన్ ఓటర్లు అత్యధికంగా ఉంటారు. 2020లో బైడెన్ కేవలం అక్కడ 1.5 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు, ఇక్కడ అరబ్ అమెరికన్ల జనాభా 3 లక్షలు. గాజా, లెబనాన్లలో ఇజ్రాయెల్ దాడులను నియంత్రించడంలో బైడెన్ విఫలమయ్యారని వారంతా భావిస్తున్నారు. ఈ ప్రభావం నేరుగా డెమొక్రాట్ల అభ్యర్థి హారిస్‌పై పడేలా ఉంది. ఉపాధ్యక్షురాలిగా హారిస్ కూడా దీనికి బాధ్యురాలేనని వారు భావిస్తున్నారు. డెమొక్రాట్ల కంటే అధిక వామపక్ష భావాలున్న వారిలోనూ ఇదే ధోరణి కనబడుతోంది. ‘‘మేమంతా ట్రంప్‌కు ఓటేస్తాం. అంతేగాక ఆయనకే ఓటేయాలని ఇతరులకూ చెబుతాం’’ అని వారంటున్నారు. ‘‘మేం ట్రంప్‌కు ఓటేస్తామని ఏడాది కిందట ఊహించను కూడా లేదు. కానీ ఇప్పుడు డెమొక్రాట్లను క్షమించలేం. హారిస్‌కు ఓటేసేది లేదు’’ అని స్పష్టంగా చెబుతున్నారు. మిషిగన్‌లో కార్మికవర్గం, యూనియన్ల ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. తామెవరికీ మద్దతివ్వబోమని ఇప్పటికే కొన్ని యూనియన్లు ప్రకటించాయి. హారిస్‌పై కొన్ని అభ్యంతరాలున్నా ఆమె తప్ప ప్రత్యామ్నాయం లేదని కొందరు భావిస్తుండటం ఆమెకు కాస్త కలిసొచ్చే అంశం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కమలకు స్టీవీ ‘హ్యాపీ బర్త్‌డే’
జార్జియా: స్వింగ్ స్టేట్స్లో ఒకటైన జార్జియాలో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఆదివారం పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. న్యూ బర్త్ మిషనరీ బాప్టిస్ట్ చర్చితోపాటు, జోన్స్ బోరోలోని డివైన్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్‌లను సందర్శించారు ద్వేషం, విభజన రాజకీయాలు చేసేవారిని కాకుండా కరుణ, ప్రేమతో దేశాన్ని నడిపే నేతను ఎన్నుకోవాలని ప్రజలను హారిస్ కోరారు. ఈ ప్రచార కార్యక్రమాల్లోనే హారిస్ తన 60వ జన్మదినం జరుపుకున్నారు. లెజెండరీ సింగర్ స్టీవీ వండర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. బాబ్ మార్లే ‘రిడంప్షన్ సాంగ్’లోని పంక్తులతో పాటు నల్లజాతి ఉద్యమ దిగ్గజం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జయంతి సందర్భంగా తాను రాసిన ‘హ్యాపీ బర్త్ డే’ పాటను ఆలపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. హారిస్ చప్పట్లు తన ‘హ్యాపీ బర్త్ డే’పాటను ఆస్వాదించారు. అనంతరం ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వండర్ గతంలోనూ హారిస్ కోసం ప్రదర్శనలిచ్చారు. గత ఆగస్టులో డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లోనూ ఆయన ఆనూహ్యంగా మెరిశారు. హారిస్‌కు మద్దతుగా 1973 నాటి తన సూపర్ హిట్ సాంగ్ ‘హయ్యర్ గ్రౌండ్’ను ఆలపించి అలరించారు.శుభాకాంక్షల వెల్లువ ప్రచారంలో బిజీగా ఉన్న హారిస్ పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పెన్సిల్వేనియాలో ప్రచారంలో ఉన్న రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కూడా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడు జో బైడెన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను అసాధారణ నాయకురాలిగా అభివరి్ణంచారు. ఉపాధ్యక్ష అభ్యర్థి, మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ కూడా హారిస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అయితే హారిస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజల హక్కుల కోసం జీవితమంతా పోరాడుతున్న ఆమెను అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా హారిస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
అమెరికాలో భారతీయం
అమెరికా మొత్తం ఓటర్లు 16.1 కోట్ల పై చిలుకు. అందులో భారతీయ అమెరికన్ల సంఖ్య మహా అయితే 21 లక్షలు. కానీ ఆ దేశ రాజకీయాల్లో మనవాళ్లు నానాటికీ ప్రబల శక్తిగా ఎదుగుతున్నారు. ప్రధాన పార్టీలైన రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఇప్పుడు వారి రాజకీయ శక్తిని ఏ మాత్రమూ విస్మరించే పరిస్థితి లేదు. అందులోనూ భారత మూలాలున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈసారి ఏకంగా డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా దూసుకుపోతున్నారు. దాంతో భారతీయ అమెరికన్ల ఉత్సాహానికి పట్టపగ్గాల్లేకుండా పోతోంది. భారతీయ అమెరికన్లలో అత్యధికులు విద్యాధికులే. కేవలం ఓటర్లుగానే గాక అభ్యర్థులుగా, ఓటర్లను సమీకరించే శక్తిగా, నిధుల సేకర్తలుగా కొన్నేళ్లుగా వారి హవా బహుముఖంగా విస్తరిస్తోంది. దాంతో సహజంగానే అధికార సాధనలో వారి మద్దతు నానాటికీ కీలకంగా మారుతోంది.స్వింగ్ స్టేట్లలోనూ హవాఅధ్యక్ష ఎన్నికల్లో విజేతను తేల్చడంలో అతి కీలకంగా మారే మిషిగన్, జార్జియా వంటి స్వింగ్ స్టేట్లలో భారతీయుల జనాభా చాలా ఎక్కువ. దాంతో వారి ఓట్లు, మద్దతు రెండు పార్టీలకూ మరింత కీలకంగా మారాయి. 2020లో బైడెన్ విజయంలో జార్జియా ఫలితమే నిర్ణాయకంగా మారడం తెలిసిందే. అక్కడ భారతీయ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. గత రెండు మూడు అధ్యక్ష ఎన్నికలు అత్యంత హోరాహోరీగా జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హారిస్, ట్రంప్ భాగ్యరేఖలు స్వింగ్ స్టేట్లలోని ఇండియన్ ఓటర్ల మనోగతంపై గట్టిగానే ఆధారపడ్డాయంటే అతిశయోక్తి కాదంటారు డాక్టర్ మిశ్రా.→ స్వింగ్ స్టేట్లుగా పేరుబడ్డ 10 రాష్ట్రాల్లో ఉన్న దక్షిణాసియా ఓటర్లలో ఇండియన్లే మెజారిటీ.→ స్వింగ్ స్టేట్లలో పెన్సిల్వేనియాను అత్యంత కీలకమైనదిగా చెప్తారు. అలాంటి రాష్ట్రంలో అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తేల్చడంలో బక్స్ కౌంటీది నిర్ణయాక పాత్ర. అక్కడ ఆధిపత్యం పూర్తిగా ఇండియన్లదే!→ దక్షిణాసియాకు చెందిన 48 లక్షల మంది పై చిలుకు యువ ఓటర్లను ప్రభావితం చేయడంలో భారతీయులు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు మిశ్రా వివరించారు.→ గత రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో ఓటేశారు. 2020లో 71 శాతం మంది ఓటేశారు. తాజా ఆసియన్ అమెరికన్ ఓటర్ సర్వేలో ఏకంగా 91 శాతానికి పైగా ఈసారి ఓటేస్తామని చెప్పారు!పార్టీలకు నిధుల వెల్లువభారతీయ అమెరికన్ల సగటు వార్షిక ఆదాయం 1.45 లక్షల డాలర్లు. అమెరికన్లతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ. కొన్నేళ్లుగా ప్రధాన పార్టీలకు వారినుంచి నిధులు పోటెత్తుతున్నట్టు డెమొక్రటిక్ పార్టీ నేషనల్ ఫైనాన్స్ కమిటీ (డీఎన్ఎఫ్సీ) సభ్యుడు అజయ్ భుటోరియా చెబుతున్నారు. ‘‘నేను 20 ఏళ్లకు పైగా నిధుల సేకర్తగా వ్యవహరిస్తున్నా. మనవాళ్లు ఈ స్థాయిలో రాజకీయ విరాళా లివ్వడం గతంలో ఎన్నడూ లేదు’’ అంటూ విస్మయం వెలిబుచ్చారు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా బాగా పెరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. డీఎన్ఎఫ్సీలో 5 శాతానికి పైగా భారతీయులే ఉండటం విశేషం. భూరి విరాళాలిస్తున్న వారితో పాటు పార్టీలకు, వాటి ఎన్నికల ప్రచార కార్యకలాపాలకు చిన్న మొత్తాలు అందజేస్తున్న అమెరికన్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోందని ఆసియన్ అమెరికన్ డయాస్పొరాలో అతి పెద్దదైన రాజకీయ కార్యాచరణ కమిటీ ఏఏపీఐ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ చెప్పుకొచ్చారు. 2012 నుంచీ ఇండియన్ అమెరికన్లలో ఈ ధోరణి బాగా పెరుగుతోందని డ్రూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంగయ్ మిశ్రా వెల్లడించారు. అమెరికా అధ్యక్ష పీఠానికి దారి సిలికాన్ వ్యాలీ గుండా వెళ్తుందన్నది నానుడి. కీలకమైన ఆ టెక్ రాజధానిలో భారతీయులదే హవా. హారిస్‌కు కాలిఫోర్నియాలో ఇటీవల ఒక్క వారంలోనే ఏకంగా 5.5 కోట్ల డాలర్ల విరాళాలు పోగయ్యాయి! వాటిలో మనవారి నుంచి వసూలైనవే ఎక్కువ. డెమొక్రాట్ పార్టీకి భారీ విరాళాలిచ్చిన జాబితాలో 60 మందికి పైగా ఇండియన్ అమెరికన్లు న్నారు. వీరిలో పారిశ్రామిక దిగ్గజం ఇంద్రా నూయీ మొదలుకుని ఏఐ ఇన్వెస్టర్ వినోద్ ఖోస్లా దాకా పలువురి పేర్లున్నాయి.రిపబ్లికన్లకూ...రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. సంపత్ శివాంగి, హోటల్ పరిశ్రమ దిగ్గజం డానీ గైక్వాడ్ వంటి పలువురు ఎన్నారైలు ట్రంప్ ప్రచార కార్యకలాపాలకు భారీ విరాళాలిస్తున్నారు. అయితే 2020 నుంచీ ఇండియన్ అమెరికన్లు, ముఖ్యంగా హిందువులు రిపబ్లికన్ పార్టీకి క్రమంగా దూరమవుతున్న వైనం స్పష్టంగా కన్పిస్తోంది.అధికార పదవుల్లోనూ...అమెరికాలో అన్ని స్థాయిల్లోనూ అధికార పదవుల్లో కూడా భారతీయుల హవా సాగుతోంది. సెనేట్, ప్రతినిధుల సభతో పాటు రాష్ట్రాల సెనేట్లు, అసెంబ్లీలు మొదలుకుని సిటీ కౌన్సిళ్లు, స్కూలు బోర్డుల దాకా, జిల్లా అటార్నీలుగా నియమితులవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.→ యూఎస్ కాంగ్రెస్‌లో ఐదుగురు భారతీయ అమెరికన్లున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది ఏడుకు పెరుగుతుందని భావిస్తున్నారు.→ అమెరికా యువజనుల్లో భారతీయులు కేవలం 0.6 శాతమే. కానీ 4.4 శాతం మంది ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.→ బైడెన్–హారిస్ పాలన యంత్రాంగంలో 150 మందికి పైగా భారతీయ అమెరికన్లు కీలక స్థానాల్లో ఉన్నారు.→ హారిస్ అధ్యక్షురాలిగా నెగ్గితే ఈ సంఖ్య 200 దాటుతుందని అంచనా.→ అమెరికా జనాభాలో యూదులు 2 శాతమే అయినా కాంగ్రెస్‌లో వారి సంఖ్య 10 శాతం. కొన్నేళ్లలో భారతీయులు అమెరికా సమాజంపై ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారన్నది ఒక అంచనా.సగానికి పైగా డెమొక్రాట్లే!→ తాజా సర్వే ప్రకారం భారతీయ అమెరికన్లలో ఏకంగా 55 శాతం మంది డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులమని ప్రకటించుకున్నారు.→ 25 శాతం మంది రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్నారు.→ స్వతంత్రులు, తటస్థులు 15 శాతం మందిగా లెక్క తేలారు. మిగతావాళ్లు తమ రాజకీయ మొగ్గుదలపై మాట్లాడేందుకు ఇష్టపడలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
USA Presidential Elections 2024: స్వింగ్ స్టేట్స్లో కమల దూకుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ విజేతగా నిలిచే అవకాశాలు నానాటికీ మెరుగవుతున్నట్టు సీఎన్ఎన్ వార్తా సంస్థ తాజా సర్వేలో తేలింది. ఎన్నికల ఫలితాలను నిర్ణాయక రీతిలో ప్రభావితం చేసే అతి కీలకమైన ఆరు స్వింగ్ స్టేట్స్లో ఆమె హవా సాగుతోందని వెల్లడించింది. ఆ రాష్ట్రాల్లో విస్కాన్సిన్, మిషిగన్ల్లో ఉపాధ్యక్షురాలు స్పష్టంగా ముందంజలో ఉన్నారు. అరిజోనాలో మాత్రం ఆమె ప్రత్యరి్థ, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ది పైచేయిగా ఉంది. ఇక జార్జియా, నెవెడా, పెన్సిల్వేనియాల్లో ఇద్దరి మధ్యా హోరాహోరీ నెలకొంది. దాంతో ఈ మూడూ ఎవరివైపు మొగ్గితే వారే అధ్యక్ష పీఠమెక్కడం దాదాపుగా ఖాయమంటున్నారు. ఎందుకంటే ఆరు స్వింగ్ స్టేట్స్ మినహా అమెరికాలో మిగతా రాష్ట్రాలన్నీ సాంప్రదాయికంగా రిపబ్లికన్, డెమొక్రటిక్ పారీ్టల్లో ఏదో ఒకవైపు ఉండేవే. జార్జియా, నెవెడా, పెన్సిల్వేనియాల్లో ఏకంగా 15 శాతం ఓటర్లు తామెవరికి ఓటేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పడం విశేషం. కనుక హారిస్, ట్రంప్ భాగ్యరేఖలను వీరే నిర్దేశించవచ్చని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. దాంతో రానున్న రోజుల్లో జార్జియా, నెవెడా, పెన్సిల్వేనియాల్లో అభ్యర్థులిద్దరి ప్రచార హోరు మిన్నంటడం ఖాయంగా కని్పస్తోంది.‘స్వింగ్’ మహిళంతా హారిస్ వైపే... కొంతకాలంగా దాదాపుగా అన్ని సర్వేల్లోనూ హారిసే ముందంజలో కొనసాగుతుండటం తెలిసిందే. సీఎన్ఎన్ తాజా సర్వే కూడా అదే ధోరణిని ప్రతిబింబించింది. విస్కాన్సిన్లో 50 శాతం మంది హారిస్‌కు ఓటేస్తామని చెప్పగా ట్రంప్‌కు 44 శాతం మద్దతు దక్కింది. మిషిగన్‌లో 48 శాతం హారిస్‌కు, 43 శాతం ట్రంప్‌కు జైకొట్టారు. జార్జియా, నెవెడాల్లోనూ హారిసే స్వల్ప పై చేయి సాధించారు. ఆ రెండు రాష్ట్రాల్లో ఆమెకు 48 శాతం, ట్రంప్‌కు 47 శాతం ఓటర్లు మద్దతిచ్చారు. అరిజోనాలో మాత్రం ట్రంప్ 49 శాతం మద్దతు దక్కగా హారిస్ 44 శాతానికి పరిమితమయ్యారు. పెన్సిల్వేనియాలో ఇద్దరికీ చెరో 47 శాతం ఓట్లు దక్కాయి. ఆరు స్వింగ్ స్టేట్స్‌లోనూ ట్రంప్‌తో పోలిస్తే మహిళల్లో హారిస్ 27 శాతం అధిక ఓట్లు సాధించారు! ట్రంప్ విధానాలు అమెరికా భద్రతకే ముప్పు కలిగించేంత ప్రమాదకరమైనవని ఆరు రాష్ట్రాల ఓటర్లూ అభిప్రాయపడ్డారు.ఎకానమీ, వలసల్లో ట్రంప్ పైచేయి ఆర్థికాంశాలను డీల్ చేసే సామర్థ్యం విషయంలో ఎప్పట్లాగే తాజా సర్వేలోనూ ట్రంపే పైచేయి సాధించారు. ఈ విషయంలో ఆయనకు 8 శాతం ఎక్కువ ఓట్లొచ్చాయి. అక్రమ వలసలను అడ్డుకోవడంలో ట్రంప్‌కు, అబార్షన్ తదితరాలపై హారిస్‌కు ఓట్లరు జైకొట్టారు. దేశం ముందున్న అతి ముఖ్యమైన అంశం ఏదన్న ప్రశ్నకు 39 శాతం మంది ఎకానమీకే ఓటేశారు. -
Lok sabha elections 2024: ఆ మూడ్ స్వింగ్ ఎటో!
దేశంలో మోదీ మేనియా ఏమాత్రం తగ్గలేదని, ఫలితంగా వరుసగా మూడో ఘనవిజయంతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే కీలక రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, బిహార్, మహారాష్ట్రల్లో మాత్రం ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు. దాంతో వాటిని ఈసారి ఎన్నికల ఫలితాలను నిర్దేశించగల స్వింగ్ స్టేట్లుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఆ మూడు రాష్ట్రాలూ కలిపి ఏకంగా నాలుగో వంతు ఎంపీలను లోక్‌సభకు పంపుతున్నాయి! వాటిని నిర్ణాయక రాష్ట్రాలుగా మారుస్తున్న కారకాలేమిటి? అక్కడ ఫలితాలను ఊహించడం ఎందుకింత కష్టసాధ్యంగా మారింది...? అమెరికాలో 7 రాష్ట్రాలను స్వింగ్ స్టేట్స్‌గా పేర్కొంటారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రతిసారీ అవే నిర్ణయిస్తుంటాయి. ఎన్డీఏ 400 సీట్లు దాటాలన్న లక్ష్యాన్ని దాటుతుందో లేదో బెంగాల్, బిహార్, మహారాష్ట్ర ఫలితాలు నిర్ణయించనున్నాయి. బెంగాల్లో టీఎంసీ,బీజేపీ మధ్య పోరు నెలకొంది. బిహార్‌లో రాజకీయ పునరేకీకరణతో సమీకరణాలు మారాయి. మహారాష్ట్రలో రెండు పెద్ద పార్టీలు నిలువునా చీలి రెండో ఎన్డీఏలో, మరో రెండు విపక్ష ఇండియా కూటముల్లో చేరి ఎదురెదురుగా మోహరించాయి. దాంతో 130 ఎంపీ సీట్లున్న ఈ 3 రాష్ట్రాల్లో ఎవరికెన్ని సీట్లు వస్తాయన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. బెంగాల్లో బీజేపీ పాచిక పారేనా...? 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమబెంగాల్లో బీజేపీ పాగా వేసిన తీరు ఆసక్తికరం. మోదీ మేనియాకు పౌరసత్వ అంశం తదితరాలు తోడవడంతో 42 లోక్‌సభ స్థానాల్లో ఏకంగా 18 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకోగలిగింది. 2014లో 17 శాతమున్న ఓటు శాతాన్ని 40 శాతానికి పెంచుకోగలిగింది. ఈసారి పరిస్థితి ఎలా ఉండనందన్నది అంచనాలకు అందడం లేదు. కాకపోతే ప్రతి స్థానంలోనూ హోరాహోరీ పోరు ఖాయంగా కన్పిస్తోంది. ప్రధాని మోదీ ఇంకా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టలేదు. ఆయన ఏయే అంశాలను ప్రచారాస్త్రాలుగా సంధిస్తారన్నది కూడా ఆసక్తికరం. వాటిని బట్టి రాష్ట్రంలో ఓటర్ల మూడ్ మారిపోయే ఆస్కారముంది. అయితే బెంగాల్లో ఈసారి బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెబుతుండటం ఆసక్తికరం. మిగతా విశ్లేషకులు మాత్రం బీజేపీకి ఈసారి ఓట్లశాతం మరింత పెరగవచ్చంటూనే, అది సీట్ల సంఖ్యలో ప్రతిఫలిస్తుందో లేదో చూడాలని చెబుతుండటం విశేషం. పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడం తదితరాల నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా ఉన్న ముస్లింల ఓట్లు పూర్తిగా టీఎంసీ వైపు మళ్లినట్టేనని వారంటున్నారు. ఇది మా పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి అతి పెద్ద సానుకూలాంశంగా కన్పిస్తోంది. ‘‘దీనికి తోడు యూపీ వంటి రాష్ట్రాల మాదిరిగా బెంగాల్లో బీజేపీకి పటిష్టమైన సంస్థాగత నిర్మాణం లేదు. పైగా రాష్ట్ర పార్టీలో సువేందు అధికారి, దిలీప్ ఘోష్, సుకాంతో మజుందార్ మధ్య ఆధిపత్య పోరు పుట్టి ముంచేలా కన్పిస్తోంది’’ అని సీనియర్ జర్నలిస్టు జయంత ఘోషా అభిప్రాయపడ్డారు. తృణమూల్ తన 22 స్థానాలను నిలుపుకుంటుందని, బీజేపీకి ఒక సీటు పెరుగుతుందని, కాంగ్రెస్ ఒక్క స్థానానికి పడిపోతుందని ఇండియాటుడే సర్వే పేర్కొంది. రసకందాయంలో బిహార్ 2019లో ఎన్డీఏ క్లీన్‌స్వీప్ చేసిన రాష్ట్రాల్లో బిహార్ ముఖ్యమైనది. 40కి ఏకంగా 39 స్థానాలు అధికార కూటమి వశమయ్యాయి. కానీ ఇక్కడ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం ఎప్పుడూ కత్తిమీద సామే. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నల్లేరుపై నడకేనని అంతా భావించారు. తీరా చూస్తే ఆ అంచనాలన్నీ తప్పి జేడీ(ఎస్), ఆర్జేడీల మహాఘట్బంధన్ ఘనవిజయం సాధించింది. కానీ పల్టూ రామ్‌గా పేరుపడ్డ జేడీ(యూ) సారథి, సీఎం నితీశ్‌కుమార్ 2020 అసెంబ్లీ ఎన్నికల నుంచి వేస్తున్న పిల్లిమొగ్గలతో ఓటర్లలో తీవ్ర అయోమయం నెలకొన్నట్టు కన్పిస్తోందని పటా్నకు చెందిన సీనియర్ జర్నలిస్టు రోహిత్‌సింగ్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టిన నితీశ్ 2022లో దానికి కటీఫ్ చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమితో స్నేహం చేశారు. తాజాగా గత జనవరిలో మళ్లీ ఎన్డీఏ గూటికి చేరారు. దీన్ని జనం జీరి్ణంచుకోలేకపోతున్నారన్నది రోహిత్ విశ్లేషణ. అయితే కుల సమీకణాల కోణంలో బీజేపీ–జేడీ(యూ) భాగస్వామ్యం బలమైన జోడీగా కన్పిస్తుండటం విశేషం. కుర్మీ సామాజికవర్గానికి చెందిన నితీశ్‌కు రాష్ట్రంలో ఏకంగా 36 శాతమున్న అత్యంత వెనకబడ్డ వర్గాల్లో విశేష ఆదరణ ఉంది. పైగా గతేడాది బిహార్‌లో జరిపించిన కులగణన ఆయనకు మరిన్ని ఓట్లు కురిపించేలా కన్పిస్తోంది. 2005, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–జేడీ(యూ) జోడీ సూపర్‌హిట్టయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఏకంగా 39 సీట్లు కొల్లగొట్టింది. దీనికి తోడు ఎన్నికల వేళ ఇంటి పోరు ఆర్జేడీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో మోదీ–నితీశ్ జోడీ దూకుడును తేజస్వీ యాదవ్ ఏ మేరకు నిలువరిస్తారన్నది ఆసక్తికరం. ‘మహా’ గందరగోళం... 48 సీట్లున్న మహారాష్ట్ర యూపీ తర్వాత లోక్‌సభకు అత్యధిక ఎంపీలను పంపుతోంది. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. 2019లోనైతే బీజేపీ, శివసేన సంయుక్తంగా ఏకంగా 41 స్థానాలు ఒడిసిపట్టాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో రాజకీయాలతో పాటు ఏకంగా పార్టీలే మారిపోయాయి! తర్వాత ఏక్నాథ్ షిండే సారథ్యంలో శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలో మరో కీలక పార్టీ ఎన్సీపీ నిలువునా చీలిపోయాయి. చీలిక వర్గాలే అసలైన పార్టీలుగా గుర్తింపు పొందాయి. ఎన్డీఏలో చేరి బీజేపీతో జట్టు కట్టి ఎన్నికల బరిలో దిగాయి. దీన్ని ప్రజలు పెద్దగా జీర్ణించుకోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతో ఈసారి కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కూడిన విపక్ష ఇండియా కూటమిదే పైచేయి కావచ్చంటున్నారు. సర్వేలు కూడా ఇండియా కూటమి ఏకంగా 26 స్థానాలు గెలుస్తుందంటున్నాయి. అదే నిజమైతే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి 20 సీట్లకు పైగా గండి పడుతుంది! అదే సమయంలో ఎన్నికల వేళ ఎంఎన్ఎస్ నేత రాజ్ ఠాక్రే మద్దతు ఎన్డీఏకు కాస్త కలిసొచ్చేలా కన్పిస్తోంది. మరాఠా రిజర్వేషన్లది కూడా ఈసారి రాష్ట్రంలో కీలక పాత్ర కానుంది. విద్య, ఉద్యోగాల్లో వారికి అదనంగా 10 శాతం కోటా కలి్పస్తూ శివసేన చీఫ్, సీఎం ఏక్నాథ్ షిండే ఇటీవలే అసెంబ్లీలో బిల్లు పెట్టారు. సాంప్రదాయికంగా బీజేపీ ఓటర్లయిన ఇతర వెనకబడ్డ వర్గాలు దీనిపై గుర్రుగా ఉన్నారు. మరాఠా కోటా తమ వాటాకే ఎసరు పెడుతుందన్న భయం వారిలో పెరుగుతోంది. ఇన్ని సమీకరణాల మధ్య మహారాష్ట్రలో ఎవరికెన్ని సీట్లొస్తాయో అంచనా వేయడం కష్టంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పోరాటం ముగియలేదు: ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై తన పోరాటం ఇంకా ముగియలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. స్వింగ్ స్టేట్స్లో అక్రమాలకు సంబంధించి ట్రంప్ తరఫున వేసిన ఒక వ్యాజ్యాన్ని తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అందువల్లనే తాను ఓడిపోయానని ట్రంప్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియాల్లో తానే గెలిచానని ట్రంప్ వాదిస్తున్నారు. ‘అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిమయ ఎన్నికలు’ అని ఆదివారం ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. ‘ఇంత అవినీతి, ఇన్ని అక్రమాలు జరిగిన ఎన్నికల్లో ఫలితాలను ఎలా నిర్ధారిస్తారు?’ అని మరో ట్వీట్లో ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలను కోర్టుల్లో సవాలు చేసేందుకు వీలైన సమయం తన బృందానికి లభించలేదని ఒక ఇంటర్వ్యూలో ఆరోపించారు. ‘మాకు చాలా తక్కువ సమయం ఇచ్చారు. అయినా, మేం వదల్లేదు. చాలా అక్రమాలను వెలికితీసాం’ అని వ్యాఖ్యానించారు. చనిపోయిన వారి పేరుపై కూడా ఓట్లు వేశారని ఆరోపించారు. మరోవైపు ట్రంప్‌కు మద్దతుగా వారాంతంలో ఆయన మద్దతుదారులు వాషింగ్టన్లో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ట్రంప్ మద్దతుదారులకు, ట్రంప్‌ను వ్యతిరేకించేవారికి మధ్య శనివారం సాయంత్రం చెదురుముదురు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలకు సంబంధించి 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైట్‌హౌస్‌ని శానిటైజ్ చెయ్యండి.. వైట్‌హౌస్‌ను పరిశుభ్రంగా శానిటైజ్ చెయ్యాలని కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ తన వ్యక్తిగత సిబ్బందితో వైట్ హౌస్ వీడడానికి, బైడెన్ ప్రమాణ స్వీకారం చేశాక రావడానికి మధ్య అయిదు గంటల సమయం ఉంటుందని, ఆ సమయంలోనే వైట్‌హౌస్ అంతా పరిశుభ్రం చేయాలంటూ బైడెన్ ఆదేశించారని వైట్‌హౌస్ అధికారి కేట్ ఆండర్సన్ బ్రోయర్ వెల్లడించారు. -
అమెరికా ఎన్నికలు: మారుతున్న ఓటర్ల మూడ్
ప్రపంచానికి పెద్దన్న ఎవరు కాబోతున్నారో తేలే సమయం ఆసన్నమైంది. ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే నిర్ణయాధికారం ఎవరికి అప్పగించాలో తేల్చి చెప్పే అతి పెద్ద ఎన్నికలకి ముహూర్తం సమీపిస్తోంది. అమెరికా అధ్యక్ష బరిలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, మాజీ ఉపాధ్యక్షుడు డెమొక్రాటిక్ అ«భ్యర్థి జో బైడెన్ ఢీ అంటే ఢీ అంటున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కోట్లాది మంది ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ అసలు సిసలు సంగ్రామానికి తెరలేచే సమయం ఆసన్నమైంది. మంగళవారం నాడు జరిగే ఎన్నికల్లో ఎవరిది పై చేయి కాబోతోంది ? అమెరికన్ ఓటరు జాతీయవాదానికే మళ్లీ జై కొడతారా ? ట్రంప్ పాలనా వైఫల్యాలతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటారా ? అందరిలోనూ అదే ఉత్కంఠ... స్వింగ్ భళా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాల్లో ఓటరు ఎటు వైపు మొగ్గుతారన్నదే అత్యంత కీలకం. 2016 ఎన్నికల తరహాలో పాపులర్ ఓట్లు సాధించలేకపోయినా, స్వింగ్ రాష్ట్రాల ఎలక్టోరల్ కాలేజీ ఓట్లతో గట్టెక్కగలనన్న ధీమా అధ్యక్షుడు ట్రంప్‌లో కనిపిస్తోంది. ఎన్నో కీలక రాష్ట్రాల్లో బైడెన్‌కి స్వల్పంగానే ఆధిక్యమున్నట్టుగా పోల్ సర్వేలు చెబుతూ ఉండడంతో ఆఖరి నిముషంలో ఫలితం ఎలాగైనా మారే అవకాశం ఉంది. అందుకే ట్రంప్, బైడెన్లు స్వింగ్ రాష్ట్రాల్లో సుడిగాలి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ఉధృతంగా చేస్తున్నారు. నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, మిషిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ట్రంప్ ఆఖరి నిముషంలో ప్రచారం చేస్తున్నారు. ఇక బైడెన్ పెన్సిల్వేనియా రాష్ట్రంపై అత్యధికంగా దృష్టి సారిస్తున్నారు. పోలింగ్ రోజు రాత్రి ట్రంప్ మాత్రం శ్వేతసౌధంలోనే ఉంటూ ఎన్నికల ఫలితాల సరళి సమీక్షించనున్నట్టుగా తెలుస్తోంది. కౌంటింగ్‌ను సవాల్ చేస్తాం: ట్రంప్ ఫెయేట్‌విల్లే: అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తప్పదనుకున్నాడో ఏమోగానీ.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాటి పోలింగ్ తరువాత ఓట్ల లెక్కింపును సవాలు చేయనున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. మంగళవారం పోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ చాలామంది అంతకుముందే మెయిల్ ఇన్ బ్యాలెట్ల ద్వారా ఓట్లేశారు. 9కోట్ల 20 లక్షల మంది ఈ పద్ధతిలో ఓట్లు వేసేసిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో వీటిని లెక్కబెట్టేందుకు కొన్ని వారాల సమయం పడుతుందని అంచనా. ఫలితంగా కొత్త అధ్యక్షుడు ఎవరన్నది స్పష్టమయ్యేందుకు మరింత సమయం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపులో జరుగుతున్న జాప్యాన్ని తాము సవాలు చేసే అవకాశం ఉందని ట్రంప్ చెబుతున్నారు. కంప్యూటర్ల యుగంలోనూ ఎన్నికలు జరిగిన రోజు రాత్రికల్లా ఫలితాలు తేలకపోవడం ఘోరమైన విషయమన్నారు. మెయిల్–ఇన్ బ్యాలెట్ల పద్ధతిలో మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకవేళ అమెరికన్లు ఓట్లు వేయాలని అనుకుని ఉంటే చాలా ముందుగానే ఆ పని చేసి ఉండాల్సిందని అన్నారు. ‘అందరూ ఒకే రోజు ఓటేయాల్సిన అవసరం లేదు. నెల రోజుల క్రితం ఓటేసి ఉండవచ్చు’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. స్వింగ్ ఎలక్టోరల్ రాష్ట్రాలు కాలేజీ ఓట్లు అరిజోనా 11 విస్కాన్సిన్ 10 మిషిగాన్ 16 పెన్సిల్వేనియా 20 ఓహియో 18 నార్త్ కరోలినా 15 జార్జియా 16 ఫ్లోరిడా 29 -
ట్రంప్ వైపు ఇండియన్ అమెరికన్లు మొగ్గు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్లు డొనాల్డ్ ట్రంప్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ప్రధానంగా స్వింగ్ స్టేట్స్లో ఈ పరిస్థితి కనిపిస్తోందని ఆ పార్టీ అంతర్గత సర్వేలో వెల్లడైంది. ట్రంప్‌కి, ప్రధాని మోదీకి మధ్యనున్న స్నేహ బంధం వల్లే ప్రవాస భారతీయులు ట్రంప్‌కి మద్దతుగా నిలుస్తున్నట్టుగా ఆ సర్వే పేర్కొంది. ట్రంప్ విక్టరీ ఇండియన్ అమెరికన్ ఫైనాన్స్ కమిటీ నిర్వాహకుడు అల్ మసన్ ఈ సర్వే నిర్వహించారు. స్వింగ్ స్టేట్స్లోట్రంప్కే మద్దతు ఫ్లోరిడా, మిషిగావ్, పెన్సిల్వేనియా, జార్జియా, ఉత్తర కరోలినా వర్జీనియా వంటి స్వింగ్ స్టేట్స్లో భారతీయ అమెరికన్లు అధికంగా ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో సంప్రదాయంగా డెమొక్రాట్లకే మద్దతునిచ్చే ఇండియన్ అమెరికన్లు ఈసారి ట్రంప్‌వైపు మొగ్గు చూపిస్తున్నట్టుగా సర్వేలో తేలింది. ట్రంప్ చైనా పట్ల అత్యంత కఠినంగా ఉండడం వల్లే డ్రాగన్ దేశం భారత్‌పైకి యుద్ధానికి దిగలేదని ఇండియన్ అమెరికన్ల అభిప్రాయంగా ఉంది. ట్రంప్, మోదీ మధ్య స్నేహంతో ప్రపంచ పటంలో భారత్ స్థానం ఎదిగిందన్న అభిప్రాయమూ ఉంది. ముఖ్యంగా చైనాపై పూర్తిస్థాయిలో వ్యతిరేకత వల్ల ప్రవాస భారతీయులు ట్రంప్ వైపు తిరిగారని శ్రీధర్ చిట్యాల అనే పారిశ్రామికవేత్త తెలిపారు. ఇండియన్ అమెరికన్లు ట్రంప్‌కి భారీగా ఎన్నికల నిధులు ఇస్తున్నారని చెప్పారు. సీటు దిగుతారా? వచ్చే నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ ఓటమి సంభవిస్తే ట్రంప్ సీటు దిగేందుకు అడ్డం తిరుగుతాడా? అంటే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇందుకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలను ట్రంప్ దాటవేయడం, నర్మగర్భంగా సమాధానాలివ్వడం చూస్తే ఫలితాలు తేడాకొడితే ట్రంప్ సీటు దిగేందుకు ససేమిరా అనవచ్చని భావిస్తున్నారు. పోస్టల్ ఓటింగ్‌పై తనకు సందేహాలున్నాయని, ఈ సారి ఎన్నికల ఫలితాలు చివరకు సుప్రీంకోర్టులో తేలతాయని వ్యాఖ్యానించడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. నవంబర్ ఎన్నికల అనంతరం ఓటమి సంభవిస్తే ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా పదవి బాధ్యతలను ప్రత్యర్ధికి అప్పగిస్తారా? అని మీడియా సమావేశంలో ట్రంప్‌ను ప్రశ్నించారు. అయితే దీనికి ట్రంప్ ‘ ఏం జరుగుతుందో చూద్దాం’ అని అన్నారు. వాషింగ్టన్‌లోని సుప్రీంకోర్టు భవనంలో జస్టిస్ రూత్ బాడర్‌కు నివాళులర్పిస్తున్న అధ్యక్షుడు ట్రంప్ దంపతులు -
బైడెన్‌కే భారతీయుల బాసట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్‌కే ఇండియన్ అమెరికన్లు జై కొడతారని ఇండియాస్పొరా అండ్ ఏషియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐల్యాండర్స్ (ఏఏపీఐ) డేటా సర్వేలో తేలింది. 77 ఏళ్ల వయసున్న బైడెన్ ఇండియన్ అమెరికన్ ఓటర్లతో గత కొన్నేళ్లుగా మంచి సంబంధ బా«ంధవ్యాలు కలిగి ఉన్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను ఎంపిక చేయడం కూడా ఆయనకి కొంత వరకు కలిసి వచ్చినట్టుగా మంగళవారం విడుదలైన సర్వే నివేదిక పేర్కొంది. ఏఏపీఐ డేటా సర్వే ప్రకారం బైడెన్‌కు 66 శాతం మంది ఇండియన్ అమెరికన్లు మద్దతుగా ఉంటే, ట్రంప్‌కి 28శాతంఅనుకూలంగా ఉన్నారు. మరో 6 శాతం మంది ఎవరికి ఓటు వెయ్యాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. అయినప్పటికీ గత ఎన్నికలతో పోల్చి చూస్తే ట్రంప్ మద్దతుదారులు పెరగడం డెమోక్రాట్లలో ఆందోళన పెంచుతోంది. పట్టు పెంచుకుంటున్న ట్రంప్ ఏఏపీఐ డేటా సర్వేకి నేతృత్వం వహించిన డాక్టర్ కార్తీక్ రామకృష్ణన్ ఎన్నికల సమయానికి ఓటర్ల మూడ్ మారి ట్రంప్‌కి 30 శాతం మంది వరకు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. గత ఎన్నికల్లో ట్రంప్‌కి ఇండియన్ అమెరికన్లు 16శాతం మంది ఓటు వేశారు. ఈ సారి 30 శాతం మంది మద్దతిస్తే భారీ పెరుగుదలగానే చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రవాస భారతీయుల్ని ఆకర్షించే ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టడం లేదని కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, దక్షిణాసియా ప్రోగ్రామ్ డైరెక్టర్ మిలాన్ వైష్ణవ్ అన్నారు. జో బైడెన్‌కే ఇండియన్ అమెరికన్లు అత్యధికులు అండగా ఉన్నప్పటికీ ఆ పార్టీలో ఆందోళన నెలకొంది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో 77శాతం మంది హిల్లరీ క్లింటన్‌కి అనుకూలంగా ఓటు వేస్తే, అంతకు ముందు 2012 ఎన్నికల్లో బరాక్ ఒబామాకు 84శాతం మంది ఇండియన్ అమెరికన్లు ఓట్లు వేశారు. వారితో పోల్చి చూస్తే బైడెన్ వెనుకబడి ఉండడం డెమొక్రాట్లలో కాస్త ఆందోళన పెంచుతోంది. స్వింగ్ స్టేట్స్లో ప్రతీ ఓటు అత్యంత కీలకం కాబట్టి డెమొక్రాట్లు వివిధ ప్రవాస భారతీయ సంస్థల్ని తమ వైపు తిప్పుకునేలా చర్యలు చేపట్టాలని సర్వే నివేదిక రచయిత డా. కార్తీక్ రామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ఏ పార్టీకి మద్దతు ఇస్తారో చివరి నిముషం వరకు తేల్చుకోలేని స్వింగ్ స్టేట్స్ అయిన పెన్సిల్వేనియా, మిషిగావ్, ఫ్లోరిడా, నార్త్ కరోలినా వంటి రాష్ట్రాల్లో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంది. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ
వాషింగ్టన్: కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారి పీడ ఎప్పటికి విరగడ అవుతుంది? ఈ ప్ర«శ్నలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మరో ప్రశ్న అందరినీ వేధిస్తోంది. అదే ప్రపంచానికి పెద్దన్న ఎవరు కాబోతున్నారు? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది? రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. దీంతో స్వింగ్ స్టేట్స్ ఎటువైపు మొగ్గు చూపిస్తాయన్నది కీలకంగా మారింది. నవంబర్ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల పైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఎన్నికల ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో స్వింగ్ స్టేట్స్ (ఆఖరి నిమిషం వరకు ఏ పార్టీ వైపు ఉంటారో అంచనా వేయలేని రాష్ట్రాలు) ఎటు వైపు మొగ్గుతాయన్న ఉత్కంఠ రేగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రజాదరణ ఓట్లు సాధించిన వారే పీఠాన్ని దక్కించుకుంటారని చెప్పలేం. గత ఎన్నికల్లో ట్రంప్ కంటే పాపులర్ ఓట్లు 30 లక్షలు అధికంగా హిల్లరీ క్లింటన్ సాధించినప్పటికీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ట్రంప్‌కి ఎక్కువ రావడంతో ఆయన అ«ధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థి పార్టీకి ఓటు వేస్తారు. ఆ ఓటింగ్ రాష్ట్రాల స్థాయిలోనే ఉంటుంది. అక్కడ ఎన్నిౖకైన ప్రతినిధులంతా కలిసి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. దేశం మొత్తమ్మీద 50 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ కొలంబియాలో జనాభా ప్రాతిపదికన ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటాయి. దేశవ్యాప్తంగా 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకిగాను 270 ఓట్లు సాధించిన వారే అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. స్వింగ్ రాష్ట్రాలు ఇవే ఈసారి ఎన్నికల్లో మొత్తం 14 రాష్ట్రాల్లో ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతారో తెలీని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు అమెరికా ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో జనం నాడి తెలియకుండా ఎప్పుడూ లేదు. టెక్సాస్ (38 ఎలక్టోరల్ ఓట్లు), ఫ్లోరిడా (29 ), పెన్సిల్వేనియా (20), ఒహియో (18), మిషిగాన్ (16), జార్జియా (16 ), నార్త్ కరోలినా (15), వర్జీనియా (13), అరిజోనా (11), విస్కాన్సన్ (10), మిన్నెసోటా (10), నెవడా (6), అయోవా (6) న్యూ హ్యాంప్‌షైర్ (4) రాష్ట్రాల్లో ప్రతీ నెల జనం మూడ్ మారిపోతున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. తాజా సర్వేల్లో జార్జియా, అయోవా, టెక్సాస్ రాష్ట్రాల్లో ట్రంప్‌కి మొగ్గు కనిపిస్తూ ఉంటే, మిగిలిన స్వింగ్ స్టేట్స్లో బైడెన్ దూసుకుపోయే అవకాశాలున్నట్టుగా రియల్ క్లియర్ పాలిటిక్స్ సర్వే అంచనా వేస్తోంది. టెక్సాస్, జార్జియా రాష్ట్రాలు ఎప్పుడూ రిపబ్లికన్ల వైపు ఉంటాయి. ఈసారి కూడా ట్రంప్‌వైపే ఉన్నప్పటికీ మొగ్గు చాలా స్వల్పంగా ఉందని అంచనా. అందుకే టెక్సాస్, జార్జియా రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వెయ్యాలని బైడెన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో ప్రచారం కోసం డాలర్ల వరద పారిస్తున్నారు. జాతీయ స్థాయిలో చూసుకుంటే ట్రంప్ కంటే బైడెన్‌కు 10 పాయింట్లు అధికంగా ఉన్నాయి. ఫ్లోరిడా ఫ్యాక్టర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 1964 నుంచి ఫ్లోరిడాలో నెగ్గిన వారికే అధ్యక్ష పదవి దక్కుతూ వస్తోంది. 1992 ఎన్నికలు మాత్రం దీనికి మినహాయింపుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ట్రంప్‌కి 48.6% ఓట్లు వస్తే, హిల్లరీకి 47.4% ఓట్లు వచ్చాయి. అంతకు ముందు ఎన్నికల్లో బరాక్ ఒబామా 51% ఓట్లను సాధించి అవలీలగా అధ్యక్ష పదవిని అందుకున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల ఆలోచనా ధోరణి వినూత్నంగా ఉంటుంది. యువ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఓటర్లు అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగే డిబేట్లను విన్నాక ఓటుపై నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికలకి ముందు మూడు సార్లు సెప్టెంబర్ 29, అక్టోబర్ 7, అక్టోబర్ 15న అధ్యక్ష అభ్యర్థుల మధ్య బిగ్ డిబేట్స్ జరుగుతాయి. ఈ డిబేట్స్‌లో ట్రంప్, బైడెన్ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో వివరిస్తారు. ఆ డిబేట్స్ తర్వాత పరిస్థితులన్నీ మారే అవకాశాలైతే ఉన్నాయి. ఈ డిబేట్స్‌లో ట్రంప్ నెగ్గుతారని 47% మంది అమెరికన్లు భావిస్తూ ఉంటే, బైడెన్ వైపు 41% మంది మాత్రమే ఉన్నారు. కరోనా ఎఫెక్ట్ ఈసారి ఎన్నికల్లో కరోనా వైరస్ నంబర్ గేమ్‌ని మార్చేస్తుందని అంచనాలున్నాయి. కరోనా కట్టడిలో ట్రంప్ వైఫల్యంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అగ్రరాజ్యంలో ఎన్నికల నాటికి వైరస్ కారణంగా 2 లక్షల 60 వేల వరకు మరణాలు నమోదవుతాయని అంచనాలున్నాయి. ట్రంప్ చెబుతున్నట్టుగా అక్టోబర్ సర్ప్రైజ్ సాకారమై పోలింగ్ తేదీలోగా వ్యాక్సిన్ వస్తే ఆయనకి మళ్లీ అనుకూలంగా పరిస్థితులు మారే అవకాశాలున్నాయి. ఆర్థిక మాంద్యం, పెరిగిపోతున్న నిరుద్యోగం, జాతివివక్ష, వలసవిధానం, వాతావరణంలో మార్పులు వంటి అంశాలు కూడా ఎన్నికల్లో ప్రధాన అంశాలు కానున్నాయి. -
అమెరికా అధ్యక్షుడ్ని తేల్చేది..‘స్వింగ్’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో జరుగనున్న నేపథ్యంలో డెమోక్రట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లో ఎవరు విజయం సాధిస్తారన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అమెరికా ఎలక్టోరల్ కాలేజీలోని మొత్తం 538 ఓట్లలో 270 ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధిస్తారు. సాధారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు స్వింగయ్యే రాష్ట్రాలే విజేతను నిర్ణయిస్తాయి. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలకుగాను ప్రస్తుతం 11 స్వింగ్ రాష్ట్రాలు ఉన్నాయి. వీటిని బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాలని కూడా వ్యవహరిస్తారు. ఇటు డెమోక్రట్లకు, అటు రిపెబ్లికన్లకు సమానమైన ఓట్ల శాతం కలిగిన రాష్ట్రాలను స్వింగ్ రాష్ట్రాలని పిలుస్తారు. ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్క ఓటు అటు ఇటైనా ఫలితం మారిపోతుంది. స్వింగ్ రాష్ట్రాల సంఖ్య ఎప్పుడూ ఒకటే ఉండదు. మారుతూ ఉంటుంది. కానీ 2008 ఎన్నికల నాటి నుంచి ఈ స్వింగ్ రాష్ట్రాల సంఖ్య 11గానే ఉంది. 2008 ఎన్నికల్లో ఈ మొత్తం 11 స్వింగ్ రాష్ట్రాలు బరాక్ ఒబామాకే ఓటేశాయి. 2014 ఎన్నికల్లో 11కుగాను పది రాష్ట్రాలే ఆయనకు ఓటేశాయి. కొన్ని రాష్ట్రాలో ఆయనకు మెజారిటీ కూడా తగ్గింది. స్వింగ్ రాష్ట్రాలు ఇవే... కొలరాడో, ఫ్లోరిడా, ఐహోవా, మిచిగాన్, నేవడ, న్యూహాంప్‌షైర్, నార్త్ కరోలినా, ఓహాయో, పెన్సిల్వేనియా, వర్జీనియా, విస్కాన్సిన్‌లు స్వింగ్ రాష్ట్రాలు. సాధారణంగా ఎన్నికల్లో విజేతను ఈ రాష్ట్రాలే నిర్ణయిస్తాయి. మెజారిటీ రాష్ట్రాలు ఎవరి ఖాతాలో పడితే వారే విజయం సాధిస్తారు. ఒక అభ్యర్థికి ఐదు, ఒక అభ్యర్థికి ఆరు రాష్ట్రాలు ఓట్లు వస్తే అప్పుడు ఇతర రాష్ట్రాల ఫలితాలు సరళినే విజేతను నిర్ణయిస్తుంది. ఈ స్వింగ్ రాష్ల్రాల్లో మొదటి నుంచి మొన్నటి వరకు హిల్లరీ క్లింటన్ హవానే కొనసాగింది. అయితే ఆమె ఈమెయిళ్ల వ్యవహారంపై రెండోసారి ఎఫ్‌బీఐ దర్యాప్తు ప్రారంభం కావడం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందని, నాలుగు నుంచి ఎనిమిది రాష్ట్రాల వరకు ట్రంప్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉందని తాజా సర్వేలు తెలియజేస్తున్నాయి. కచ్చితంగా ఎనిమిది రాష్ట్రాల్లో తామే విజయం సాధిస్తామని ట్రంప్ కూటమి చెప్పుకుంటోంది. ఇతర జాతీయుల ఓట్లు కీలకమే.. ఈ స్వింగ్ రాష్ట్రాల్లో మెజారిటీ ప్రజలు శ్వేతజాతీయులే. వారిలో ఎక్కువ మంది ఈసారి ట్రంప్ వైపు మొగ్గు చూపిస్తున్నారని కూడా సర్వేలు చెబుతున్నాయి. వాస్తవానికి గత కొన్నేళ్లుగా శ్వేత జాతీయుల ఓటర్ల సంఖ్య ఈ రాష్ట్రాల్లో తగ్గుతూ వస్తోంది. నల్ల జాతీయులు ఎప్పుడూ డెమోక్రట్లకే ఓటు వేస్తారు. ఈసారి వారికి అధికార ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నందున ట్రంప్‌కు వేస్తారని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. ఈసారి స్వింగ్ రాష్ట్రాల్లో శ్వేత జాతీయులే కాకుండా మిగతా జాతీయులు ఎవరికి వేస్తారన్నది కూడా ముఖ్యమేనని ఎన్నికలు పరిశీలకులు చెబుతున్నారు. కొలరాడాలో 22 శాతం ఇతర జాతీయులు, ఫ్లోరిడాలో 33 శాతం, నేవడలో 36 శాతం, కరోలినాలో 30 శాతం, వర్జీనియాలో 30 శాతం ఇతర జాతీయులు ఉన్నారు. ఎవరి వైపు ‘స్వింగ్’ ఉందో కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నందున హిల్లరీ, ట్రంప్ మధ్య పోటీ పోటీగా సమరం సాగుతుందని పరిశీలకులు అంటున్నారు. నవంబర్ 8వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నప్పటీకీ అమెరికా రాజ్యాంగం కల్పిస్తున్న వెసులుబాటు ప్రకారం రెండు వారాల క్రితం ప్రజలు ఓట్లు వేయడం ప్రారంభమైంది. దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇప్పటికే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు మూడున్నర కోట్ల మంది ప్రజలు ఓటు వేశారు.