ఏడు రాష్ట్రాల్లో ఆరింట మొగ్గు
అట్లాస్ ఇంటెల్ తాజా పోల్ వెల్లడి
ఎన్‌వై పోల్‌లోనూ పుంజుకున్న ట్రంప్
నాలుగింట హారిస్, ఒక్కచోట ట్రంప్
పెన్సిల్వేనియా, మిషిగన్‌లో పోటాపోటీ
వాషింగ్టన్: ఫలితాలను తేల్చే కీలక స్వింగ్ స్టేట్స్ అయిన పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియా, నార్త్ కరోలినా, నెవడా, అరిజోనా, విస్కాన్సిన్ అనూహ్యంగా ట్రంప్ వైపు మొగ్గుతున్నాయి. మొత్తం ఏడు రాష్ట్రాల్లోనూ ఆయనే ఆధిక్యంలోకి వచ్చినట్టు అట్లాస్ ఇంటెల్ తాజా పోల్‌లో తేలడం విశేషం. నవంబర్ 1, 2 తేదీల్లో జరిగిన ఈ పోల్‌లో ట్రంప్‌కు ఓటేస్తామని 49 శాతం చెప్పారు.
హారిస్‌కు జైకొట్టిన వాళ్లకంటే ఇది ఏకంగా 1.8 శాతం అధికం! అరిజోనాలోనైతే ట్రంప్ ఏకంగా 6.5 శాతం ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఆయనకు 52.3, హారిస్ 45.8 శాతం మంది జైకొట్టారు. నెవడాలో కూడా ట్రంప్ 5.2 శాతం ఆధిక్యంలో ఉన్నారు. ఆయన నార్త్ కరోలినాలో 3.2, జార్జియాలో 2.5, పెన్సిల్వేనియాలో 1.9, మిషిగన్‌లో 1.5, విస్కాన్సిన్‌లో 1.1 శాతం ఆధిక్యంలో ఉన్నట్టు సర్వే తేల్చింది. మరో సర్వే సైతం ఏడు స్వింగ్ స్టేట్స్‌లోనూ ట్రంపే గెలిచే అవకాశముందని తెలిపింది.
అక్టోబర్ 24– నవంబర్ 2 మధ్య జరిగిన న్యూయార్క్ టైమ్స్/ సియానా కాలేజ్ పోల్ సర్వే స్వింగ్ స్టేట్స్‌లో హోరాహోరీయే సాగుతోందని పేర్కొంది. అయితే వాటిలో ఇప్పటిదాకా న్యూయార్క్ టైమ్స్ జరిపిన అన్ని పోల్స్‌లోనూ హారిస్ కనీసం 4 శాతం, అంతకుమించి స్పష్టమైన ఆధిక్యంలో ఉండగా తాజా సర్వేలో ట్రంప్ మెరుగవడం విశేషం. హారిస్ 49 శాతం ఓట్లతో ట్రంప్ కంటే కేవలం ఒక పాయింట్ ఆధిక్యంలో ఉన్నట్టు సర్వే తేల్చింది.
నార్త్ కరోలినా, విస్కాన్సిన్, నెవడాల్లో హారిస్‌కు ఆధిక్యం కనబడగా అరిజోనాలో ట్రంప్ స్పష్టంగా ముందంజలో ఉన్నారు. హారిస్ నెవడాలో 3 శాతం, విస్కాన్సిన్, నార్త్ కరోలినాల్లో 2 శాతం, జార్జియాలో ఒక శాతం ఆధిక్యంలో ఉన్నారు. ఇద్దరికీ పెన్సిల్వేనియాలో 48 శాతం, మిషిగాన్‌లో 47 శాతం చొప్పున వచ్చాయి. అరిజోనాలో మాత్రం ట్రంప్ ఏకంగా 4 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎన్‌బీసీ న్యూస్ తాజా సర్వేలో ట్రంప్, హారిస్ ఇద్దరూ చెరో 49 శాతం ఓట్లు సాధించారు. ఎవరికి ఓటేయాలో ఇంకా తేల్చుకోలేదని సర్వేలో పాల్గొన్న వారిలో 2 శాతం మంది చెప్పారు. పోల్ ఆఫ్ పోల్స్‌లో ట్రంప్ 0.1 శాతం అతి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.
ఓటేసిన వారిలో హారిస్‌కు 8 శాతం ఆధిక్యం
ఏడు స్వింగ్ స్టేట్లలో ఇప్పటికే 40 శాతం మంది ఓటేశారు. వారిలో హారిస్ 8 శాతం ఆధిక్యంలో ఉన్నట్టు న్యూయార్క్ టైమ్స్ సర్వే తెలిపింది. కాకపోతే ఓటేయాల్సి ఉన్న వారిలో మాత్రం ట్రంప్ ముందంజలో ఉన్నట్టు వెల్లడించింది. పెన్సిల్వేనియాలో గట్టి పోటీ నెలకొంది. అమెరికాలో ఏడు స్వింగ్ స్టేట్స్‌ను మినహాయిస్తే మిగతావన్నీ సేఫ్ స్టేట్లే. వాటిలో ఏదో ఒక పార్టీయే నిలకడగా గెలుస్తూ వస్తోంది. వాటిని రెడ్ (రిపబ్లికన్), బ్లూ (డెమొక్రటిక్) రాష్ట్రాలుగా పేర్కొంటారు. రెడ్ స్టేట్స్ 1980 నుంచి రిపబ్లికన్లకు, బ్లూ స్టేట్స్ 1992 నుంచి డెమొక్రాట్లకు జై కొడుతూ వస్తున్నాయి. దాంతో ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో పై చేయి సాధించే వారే గద్దెనెక్కడం పరిపాటి. వాటిలో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు హోరాహోరీగా తలపడుతుంటారు. ఈ రాష్ట్రాల్లో సాధారణంగా గెలుపోటముల మధ్య తేడా స్వల్పంగానే ఉంటుంది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ అరిజోనాలో కేవలం 10,000 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు.
హారిస్‌వైపు అయోవా!
పోలింగ్ తేదీ ముంచుకొచ్చిన వేళ రిపబ్లికన్లకు అనూహ్య షాక్ తగిలింది. వారికి అత్యంత సేఫ్ స్టేట్స్‌లో ఒకటైన అయోవా అనూహ్యంగా హారిస్‌వైపు మొగ్గుతున్నట్టు తాజా సర్వే ఒకటి తేల్చింది. అందులో హారిస్‌కు 47 శాతం ఓట్లు రాగా ట్రంప్‌కు 44 శాతమే దక్కాయి. మహిళలతో పాటు తటస్థ ఓటర్లు భారీగా ఆమె వైపు మొగ్గడమే ఇందుకు కారణమని దెస్ మొయినెస్ రిజిస్టర్ వార్తా పత్రిక కోసం ఈ సర్వేను నిర్వహించిన సెల్జర్ పోల్ సంస్థ వివరించింది. అమెరికాలో పోల్స్ నిర్వహణలో అత్యధిక రేటింగులున్నది ఈ సంస్థకే కావడం విశేషం. అమెరికావ్యాప్తంగా మహిళల్లో ఇదే ధోరణి ప్రతిఫలిస్తే హారిస్ భారీ మెజారిటీతో నెగ్గినా ఆశ్చర్యం లేదంటున్నారు. సెప్టెంబర్ పోల్‌లో అయోవాలో ట్రంప్ 4 శాతం ఆధిక్యంలో ఉన్నారు. జూన్‌లో బైడెన్‌పై 18 పాయింట్ల ఆధిక్యం కనబరిచారు. అయోవా పోల్ తాజా ఫలితాలను తప్పుడువంటూ
ట్రంప్ కొట్టిపారేశారు.
Comments
Please login to add a commentAdd a comment