అమెరికా ఎన్నికల్లో గమ్మత్తు
విజేతను తేల్చేది ఎలక్టోరల్ ఓట్లే
అత్యధిక ఓట్లొచి్చనా ఓటమి సాధ్యమే
ఎలక్టోరల్ కాలేజీ విధానమే కారణం
అగ్రరాజ్యమైనా సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ
అధ్యక్ష తరహా పాలన ఉన్న చాలా దేశాల్లో ఆ పదవికి ప్రత్యక్ష ఎన్నిక జరుగుతుంది. ప్రజలు తమ ప్రెసిడెంట్‌ను నేరుగా ఎన్నుకుంటారు. అత్యధిక ఓట్లు సాధించే వారే విజేతగా నిలుస్తారు. కానీ అగ్రరాజ్యమైన అమెరికాలో మాత్రం గమ్మత్తైన పరోక్ష ఎన్నిక విధానం అమల్లో ఉంది. అక్కడ అధ్యక్షున్ని ఎన్నుకునేది ఎలక్టోరల్ కాలేజీ. మరి పోలింగ్ తేదీన ప్రజలు ఓటేసేది ఎవరికంటారా? ఎలక్టర్లుగా పిలిచే ఈ ఎలక్టోరల్ కాలేజీ సభ్యులకు. అనంతరం వారంతా కలిసి అధ్యక్షున్ని, ఉపాధ్యక్షున్ని నేరుగా ఎన్నుకుంటారు.
విన్నర్ టేక్స్ ఆల్!
అధ్యక్ష ఎన్నిక విషయంలో అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 48 రాష్ట్రాలు విన్నర్ టేక్స్ ఆల్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దానిప్రకారం ఒక రాష్ట్ర ఎలక్టోరల్ ఓట్లన్నీ ఆ రాష్ట్రంలో మెజారిటీ ఓట్లు సాధించే అభ్యరి్థకే దక్కుతాయి (మెయిన్, నెబ్రాస్కా మాత్రం అభ్యర్థులు సాధించే ఓట్ల ప్రకారం నైష్పత్తిక పద్ధతిలో వారికి ఎలక్టర్లను కేటాయిస్తాయి). దీనివల్ల దేశవ్యాప్తంగా కలిపి అత్యధిక ఓట్లు (పాపులర్ ఓట్) సాధించే అభ్యర్థి కూడా ఓటమి పాలయ్యే ఆస్కారం పుష్కలంగా ఉంది. గతంలో ఇలా జరిగింది కూడా.
2016లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే ఏకంగా 28 లక్షల పై చిలుకు ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయినా ఆమె ఏకంగా 74 ఎలక్టోరల్ ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు! 2000లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అల్ గోర్ కూడా తన రిపబ్లికన్ ప్రత్యర్థి జార్జి డబ్లు్య.బుష్ కంటే 5.5 లక్షల ఎక్కువ ఓట్లు సాధించారు. అయినా 271 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించిన బుష్‌కే పీఠం దక్కింది. 1876, 1888ల్లో కూడా పాపులర్ ఓట్ సాధించిన అభ్యర్థులు ఓటమి చవిచూశారు. కాకపోతే ఇప్పటిదాకా జరిగిన 59 అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా 54సార్లు పాపులర్ ఓట్ సాధించిన అభ్యర్థే విజేతగా నిలిచారు.
ఎందుకీ ‘కాలేజీ’...?
ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థ వల్ల చిన్న రాష్ట్రాలకు కూడా అధ్యక్షుని ఎన్నికలో తగిన ప్రాధాన్యం దక్కుతుంది. అంతేగాక అభ్యర్థులు దేశమంతటా కాలికి బలపం కట్టుకుని తిరిగే అవసరముండదు. గెలుపోటములను నిర్దేశించి ఆరేడు స్వింగ్ స్టేట్స్‌పై గట్టిగా దృష్టి పెడితే సరిపోతుంది. కాకపోతే ఈ విధానంలో లోపాలూ లేకపోలేదు. పాపులర్ ఓట్ సాధించిన వాళ్లు కూడా ఓడే ఆస్కారముండటం వాటిలో ప్రధానమైనది. తమ ఓట్లకు ప్రాధాన్యం లేదనే భావనతో జనం ఓటింగ్‌కు దూరమయ్యే ఆస్కారమూ ఉంటుంది.
జనాభాకు తగ్గట్టు...
ప్రతి రాష్ట్రానికి జనాభాకు అనుగుణంగా ఎలక్టర్ల సంఖ్యను కేటాయిస్తారు. ఇది ఆ రాష్ట్రానికి కేటాయించిన ప్రతినిధుల సభ, సెనేట్ సభ్యుల సంఖ్యకు సమానంగా ఉంటుంది. ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల సంఖ్య 538. అధ్యక్ష ఎన్నికలో నెగ్గాలంటే వీటిలో కనీసం 270 ఓట్లు అవసరం. కాలిఫోర్నియాలో అత్యధికంగా 54 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లుంటే వ్యోమింగ్, నార్త్ డకోటా, అలస్కా వంటి రాష్ట్రాల్లో కేవలం మూడే ఉన్నాయి.
అమెరికాలోనూ అప్పుడప్పుడూ గోడదూకుళ్లు!
ఎలక్టర్లు తమ పార్టీ అభ్యరి్థకే ఓటేయాలన్న రాజ్యాంగ నిర్బంధమేమీ అమెరికాలో లేదు! 2016లో ఏడుగురు ఎలక్టర్లు ప్రత్యర్థులకు ఓటేశారు. వీరిలో ఐదుగురు డెమొక్రాట్లు కాగా ఇద్దరు రిపబ్లికన్లు. అయితే వారి చర్య తుది ఫలితంపై ప్రభావం చూపలేదు. హిల్లరీ క్లింటన్‌కు 232 ఎలక్టర్ ఓట్లు రాగా 306 ఓట్లతో ట్రంప్ సునాయాసంగా విజయం సాధించారు. ఇలాంటి గోడదూకుడు ఎలక్టర్లకు సంబంధిత పారీ్టలు జరిమానా విధించడమే గాక వారిపై అనర్హత వేటు కూడా వేయొచ్చు. వారిపై చట్టప్రకారం చర్యలు కూడా చేపట్టమే గాక వారి స్థానంలో వేరేవాళ్లను ఎలక్టర్లుగా నియమించుకునేందుకు వీలు కల్పిస్తూ 32 రాష్ట్రాలు చట్టాలు చేశాయి.
సుదీర్ఘ ప్రక్రియ
అమెరికాలో అధ్యక్ష ఎన్నిక సుదీర్ఘ ప్రక్రియ. ముందుగా ప్రధాన పార్టీలు తమ అధ్యక్ష అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుడతాయి. ఇది పోలింగ్‌కు దాదాపు 9 నెలల ముందుగానే మొదలవుతుంది...
-అధ్యక్ష అభ్యర్థులపై కాకస్‌లు, ప్రైమరీల ద్వారా పార్టీ సభ్యులు, ప్రతినిధులు తమ అభిప్రాయం వెలిబుచ్చుతారు.
-అనంతరం ఆగస్టు/సెప్టెంబర్ నెల్లలో పార్టీ జాతీయ సదస్సులో అభ్యరి్థని అధికారికంగా ప్రకటిస్తారు. అక్కడినుంచి ఎన్నికల పోరు ఊపందుకుంటుంది.
-ప్రచారం, ప్రధాన అభ్యర్థుల డిబేట్లతో పోరు పతాక స్థాయికి చేరుకుంటుంది.
-నవంబర్‌లో తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం పోలింగ్ ఉంటుంది.
-విజేత ఎవరో పోలింగ్ ముగియగానే ఆ రాత్రే దాదాపుగా తేలిపోతుంది.
-అయితే అంతకు కొద్ది నెలల నుంచే ముందస్తు ఓటింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ఈసారి ఇప్పటికే 3.5 కోట్ల మందికి పైగా అమెరికన్లు ముందుగానే ఓటేయడం విశేషం.
జనవరి 6న ఫలితం
జనవరి 6న అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం జరుగుతుంది. ఎలక్టోరల్ ఓట్ల లెక్కింపు జరిపి అధ్యక్ష, ఉపాధ్యక్షులను అధికారికంగా ప్రకటిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు ఈ ప్రక్రియను సెనేట్ అధ్యక్షుని హోదాలో పర్యవేక్షిస్తారు. నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షుల పేర్లను కూడా ప్రకటిస్తారు.
→ ఎలక్టోరల్ ఓట్లలో ఏ అభ్యరి్థకీ మెజారిటీ రాకపోతే అధ్యక్షున్ని ఎన్నుకునే బాధ్యత ప్రతినిధుల సభపై పడుతుంది. దాని సభ్యులంతా కలిసి అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు సాధించిన తొలి ముగ్గురు అభ్యర్థుల్లో నుంచి మెజారిటీ ఓటు ద్వారా ఒకరిని అధ్యక్షునిగా ఎన్నుకుంటారు.
→ ఉపాధ్యక్ష పదవికి కూడా అంతే. ఎవరికీ మెజారిటీ రాకపోతే అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు సాధించిన తొలి ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిని సెనేట్ సభ్యులు మెజారిటీ ఓటు ద్వారా ఉపాధ్యక్షునిగా ఎన్నుకుంటారు.
→ దాంతో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ కొలిక్కి వచి్చనట్టే. చివరగా జనవరి 20న ప్రమాణస్వీకారం ఉంటుంది. ముందుగా ఉపాధ్యక్షుడు, అనంతరం అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ రోజు ఆదివారమైతే కార్యక్రమాన్ని జనవరి 21న నిర్వహిస్తారు.
→ 1933 దాకా కొత్త అధ్యక్షుడు మార్చి 4న ప్రమాణస్వీకారం చేసేవారు. 1937 నుంచి జనవరి 20కి మార్చారు.
అసలు ఎన్నిక డిసెంబర్ 16న!
ఓటింగ్ ముగిశాక కూడా అమెరికా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఏకంగా మరో రెండు నెలల పాటు సాగుతుంది!
→ రాష్ట్రాల స్థాయిలో ఎలక్టర్ల ఎన్నిక ప్రక్రియ దాదాపు నెల పాటు జరుగుతుంది. మెయిన్, నెబ్రాస్కా మినహా మిగతా 48 రాష్ట్రాల్లోనూ మెజారిటీ ఓట్లు సాధించిన పారీ్టకే ఆ రాష్ట్రంలోని మొత్తం ఎలక్టోరల్ ఓట్లూ దక్కుతాయి.
→ అనంతరం తమ ఎలక్టర్లుగా ఎవరుండాలో సదరు పార్టీ తాలూకు రాష్ట్ర శాఖ నిర్ణయిస్తుంది.
→ ఎలక్టర్లుగా ఎన్నికైన వారంతా డిసెంబర్‌లో రెండో బుధవారం తర్వాత వచ్చే సోమవారం ఆయా రాష్ట్రాల రాజధానుల్లో భేటీ అవుతారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులకు విడివిడిగా ఓటేస్తారు. ఒకవిధంగా అధ్యక్షున్ని వాస్తవంగా ఎన్నుకునేది ఈ రోజే! ఈసారి ఎలక్టర్ల భేటీ డిసెంబర్ 16న జరగనుంది.
→ అనంతరం డిసెంబర్ నెల నాలుగో బుధవారం లోగా, అంటే ఎలక్టర్ల భేటీ జరిగిన 9 రోజుల్లోపు వారి ఓట్లన్నీ సెనేట్ అధ్యక్షునికి చేరాల్సి ఉంటుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment