
న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పలు సర్వే నివేదికలు.. ఈసారి ట్రంప్, హారిస్ మధ్య హోరాహోరీ పోటీ తప్పదని వెల్లడించిన విషయం తెలిసిందే. ఓటింగ్ సరళి పరిశీలిస్తే కూడా ట్రంప్-హారిస్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ క్రమంలో ట్రంప్, హారిస్ ఇద్దరిలో ఎవరికీ మెజారిటీ వస్తుంది? గెలుపెవరిదో చెప్పటం కష్టంగా ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కనీసం 270 ఎలక్టోరల్ ఓట్లు రాని పక్షంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరికీ చెరో 269 ఓట్లు వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే అధ్యక్షున్ని ఎన్నుకునే బాధ్యత అమెరికా కాంగ్రెస్‌పై పడుతుంది. దిగువ సభ అయిన ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఇందుకోసం జనవరి 6న సమావేశమవుతుంది. ఒక్కో రాష్ట్రానికి ఒకటి చొప్పున 50 ఓట్లు కేటాయిస్తారు. 26, అంతకంటే ఎక్కువ ఓట్లు సాధించే వారే అధ్యక్షుడవుతారు.
అయితే.. చివరిసారిగా రెండు శతాబ్దాల కింద, అంటే 1800లో ఇటువంటి పరిస్థితి తలెత్తింది. అధ్యక్ష బరిలోకి దిగిన థామస్ జెఫర్సన్, ఆరన్ బ్లర్ ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దాంతో ప్రతినిధుల సభ ఓటింగ్ జరపగా.. జెఫర్సన్ విజేతగా నిలిచారు.
2020లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో 66 శాతమే మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే.. అమెరికాలో 24 కోట్ల పై చిలుకు అర్హులైన ఓటర్లున్నారు. కానీ ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు మాత్రం 16.14 కోట్ల మందే. ఇది 2020 కంటే కూడా తక్కువ. 2020లో 16.8 కోట్ల మంది నమోదైన ఓటర్లుండగా వారిలో ఆ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసింది 15.9 కోట్ల మంది మాత్రమే. ఈసారి ప్రచార సరళి ఆధారంగా పోటీ హోరాహోరీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment