7 స్వింగ్ స్టేట్లే కీలకం
హారిస్ విజయానికి మూడు చాలు
ట్రంప్ దాదాపు క్లీన్‌స్వీప్ చేయాల్సిందే
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది. అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పోలింగ్ ప్రక్రియ మంగళవారం జరగనుంది. డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అత్యంత హోరాహోరీగా తలపడుతున్నారు. దాంతో వారిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి! అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల్లో ఏదో ఒకదానికి స్పష్టంగా మద్దతిచ్చేవే.
వీటిని సేఫ్ స్టేట్స్‌గా పిలుస్తారు. ప్రతి అధ్యక్ష ఎన్నికల్లోనూ సదరు రాష్ట్రాలను ఆయా పార్టీలే గెలుచుకుంటాయి. కనుక ఎటూ తేల్చుకోని ఓటర్లు ఎక్కువగా ఉండే కొన్ని రాష్ట్రాల్లోనే పోటీ ప్రధానంగా కేంద్రీకృతం అవుతుంటుంది. వాటిని స్వింగ్ స్టేట్స్‌గా పిలుస్తుంటారు. ఈసారి అలాంటి రాష్ట్రాలు ఏడున్నాయి. అవే పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా, జార్జియా, నెవడా, అరిజోనా. 93 ఎలక్టోరల్ ఓట్లు వీటి సొంతం. వాటిలో మెజారిటీ ఓట్లను ఒడిసిపట్టే వారే అధ్యక్ష పీఠమెక్కుతారు.
ట్రంప్‌కు 51, హారిస్‌కు 44
అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. విజయా నికి కనీసం 270 ఓట్లు రావాలి. 48 రాష్ట్రాల్లో మెజారిటీ ఓ ట్లు సాధించిన అభ్యర్థి తాలూకు పార్టీకే ఆ రాష్ట్రంలోని మొ త్తం ఎలక్టోరల్ ఓట్లు దఖలు పడే (విన్నర్ టేక్స్ ఆల్) విధా నం అమల్లో ఉంది. ఆ లెక్కన సేఫ్ స్టేట్లన్నీ ఈసారి ఆయా పార్టీల ఖాతాలోనే పడే పక్షంలో హారిస్ 226 ఓట్లు సాధిస్తారు. ట్రంప్‌కు మాత్రం 219 ఓట్లే వస్తాయి. స్వింగ్ స్టేట్లలో ని 93 ఓట్లు అత్యంత కీలకంగా మారడానికి కారణమిదే. ట్రంప్ గెలవాలంటే వాటిలో కనీసం 51 ఓట్లు సాధించాలి. హారిస్‌కు మాత్రం 44 ఓట్లు చాలు. గత కొద్ది ఎన్నికలుగా ఈ ఏడు స్వింగ్ స్టేట్ల ఓటింగ్ ధోరణి, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా వాటిలో ఈసారి ఫలితాలు ఎలా ఉండవచ్చన్న దానిపై జోరుగా అంచనాలు, విశ్లేషణలు సాగుతున్నాయి.
పెన్సిల్వేనియా కీలకం
19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియా ఈసారి మొత్తం అమెరికా దృష్టినీ ఆకర్షిస్తోంది. అక్కడ నెగ్గిన అభ్యర్థే అధ్యక్షుడయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. జనాభా వైవిధ్యం విషయంలో కూడా ఆ రాష్ట్రం అచ్చం అమెరికాకు నకలులా ఉంటుంది. డెమొక్రాట్ల ఆధిపత్యం సాగే పెద్ద నగరాలు, రిపబ్లికన్ కంచుకోటలైన గ్రామీణ ప్రాంతాలు పెన్సిల్వేనియా సొంతం. దాంతో హారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీ నెలకొంది.
రస్ట్ బెల్ట్–సన్ బెల్ట్
అమెరికా నిర్మాణ రంగంలో ప్రముఖ పాత్ర పోషించే విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాలను రస్ట్ బెల్ట్ రాష్ట్రాలుగా పిలుస్తారు. ఈ మూడింట్లో కలిపి 44 ఓట్లున్నాయి. మిగతా దేశంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే నెవడా, అరిజోనా, నార్త్ కరోలినా, జార్జియాలను సన్ బెల్ట్ రాష్ట్రాలంటారు. వీటిలో మొత్తం 49 ఓట్లున్నాయి.
→ రస్ట్ బెల్ట్ నిర్మాణ రంగానికి నిలయం. దాంతో విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటర్లపై కారి్మక సంఘాల ప్రభావం ఎక్కువే.
→ ఈ రాష్ట్రాలపై దశాబ్దాలుగా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగుతూ వస్తోంది. ఎంతగా అంటే, గత ఎనిమిది అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఏడుసార్లు ఈ మూడు రాష్ట్రాలూ ఆ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ఒక్క 2016లో మాత్రం వాటిలో పూర్తిగా ట్రంప్ హవా నడిచింది.
→ ఈసారి కూడా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగితే 44 ఓట్లూ కమల ఖాతాలోనే పడతాయి. అదే జరిగితే తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ఆమె చరిత్ర సృష్టిస్తారు.
→ అలాగాక 2016లో మాదిరిగా ట్రంప్ మరోసారి ఈ మూ డు రాష్ట్రాలనూ నెగ్గినా విజయానికి ఏడు ఓట్ల దూరంలో నిలుస్తారు. అప్పుడాయన విజయం కోసం కనీసం మరో స్వింగ్ స్టేట్‌ను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది.
→ ఒకవేళ హారిస్ రస్ట్ బెల్ట్ రాష్ట్రాల్లో కీలకమైన పెన్సిల్వేనియాతో పాటు మరోదాన్ని దక్కించుకున్నా ఆమె విజయావకాశాలు మెరుగ్గానే ఉంటాయి. మిగతా నాలుగు స్వింగ్ స్టేట్లలో ఏ ఒక్కదాన్ని నెగ్గినా ఆమె గెలిచినట్టే. ట్రంప్ గెలవాలంటే ఆ నాలుగింటినీ స్వీప్ చేయాల్సి ఉంటుంది.
→ హారిస్ రస్ట్ బెల్ట్‌లో సున్నా చుట్టినా నాలుగు సన్ బెల్ట్ రాష్ట్రాలను స్వీప్ చేస్తే విజయం ఆమెదే.
→ అయితే ఇందుకు అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే 1948 తర్వాత డెమొక్రాట్లు సన్ బెల్ట్‌ను క్లీన్‌స్వీప్ చేయలేదు.
→ రిపబ్లికన్లకు మాత్రం సన్ బెల్ట్‌ను పలుమార్లు క్లీన్‌స్వీప్ చేసిన చరిత్ర ఉంది. ఈసారీ అలా జరిగినా ట్రంప్ విజయానికి అది చాలదు. రస్ట్ బెల్ట్ నుంచి కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా ఆయన చేజిక్కించుకోవాలి. లేదంటే 269 ఓట్లకు పరిమితమై ఓటమి పాలవుతారు.
రస్ట్ బెల్ట్‌లో విజయావకాశాలు
→ రస్ట్ బెల్ట్‌లో హారిస్ గెలవాలంటే పట్టణ ఓటర్లు భారీగా ఓటేయాల్సి ఉంటుంది. నల్లజాతీయులు, మైనారిటీలు, విద్యాధికులు, మధ్య తరగతి ఓట్లు, ముఖ్యంగా మహిళలు పోలింగ్ బూత్‌లకు తరలడం తప్పనిసరి.
→ అలాగాక గ్రామీణ ఓటర్లు భారీగా ఓటేస్తే 2016లో మాదిరిగా మరోసారి రస్ట్ బెల్ట్ ట్రంప్‌దే అవుతుంది.
→ ఈసారి గ్రామీణులతో పాటు యువ ఓటర్లు కూడా తనకే జైకొడతారని ఆయన ధీమాగా ఉన్నారు.
సన్ బెల్ట్‌లో విజయావకాశాలు
→ ఇక్కడ విజయావకాశాలను అమితంగా ప్రభావితం చేసేది నల్లజాతీయులు, లాటిన్ అమెరికన్ ఓటర్లే.
→ జార్జియా, నార్త్ కరోలినాల్లో నల్లజాతి ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. అరిజోనా, నెవడాల్లో లాటిన్ అమెరికన్ జనాభా నానాటికీ పెరుగుతోంది.
→ హారిస్ జమైకన్ మూలాల దృష్ట్యా నల్లజాతీయులు ఆమెవైపే మొగ్గుతారని భావిస్తున్నారు. ఇక ట్రంప్ ర్యాలీలో ప్యూర్టోరీకన్లు, లాటిన్ అమెరికన్లపై వెలువడ్డ వ్యంగ్య వ్యాఖ్యలపై ఆగ్రహంతో వారు కూడా హారిస్‌కే ఓటేస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment