ట్రంప్‌పై మండిపడ్డ కమలాహారిస్
వాషింగ్టన్: మిల్టన్, హెలెన్ హరికేన్ల సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ట్రంప్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమలా హారిస్ మండిపడ్డారు. నార్త్ కరోలినాలో వారం రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజైన ఆదివారం ఆమె.. పలు చర్చిలకు వెళ్లి నల్లజాతీయులను కలిశారు. కోయినోనియా క్రిస్టియన్ సెంటర్‌లో ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలకు సహాయం చేస్తున్న వారు నిజమైన హీరోలని కొనియాడారు.
కానీ ఒక కీలక వ్యక్తి సహాయం చేయకపోగా, సొంత ప్రయోజనాలకోసం తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేస్తున్నారని ట్రంప్‌ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలో రాజకీయ నాయకులు చేయాల్సింది అది కాదని హితవు పలికారు. హెలెన్ తుఫాను అనంతరం ఫ్లోరిడాలో పర్యటించిన ట్రంప్.. రిపబ్లికన్ల సహాయాన్ని ప్రభుత్వం కావాలనే నిలిపేస్తోందని ఆరోపించారు.
చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్న వలసదారుల కోసం ఖర్చు చేయడంతో ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీకి ఇవ్వడానికి నిధులు లేకుండా పోయాయయని విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యలపై హారిస్ పైవిధంగా స్పందించారు. కమలా హారిస్ ప్రసంగానికి ముందు బైడెన్ గల్ఫ్ తీరంలోని టంపా, సెయింట్ పీట్ బీచ్ మధ్య హెలికాప్టర్‌లో హరికేన్ నష్టాన్ని సర్వే చేశారు. మిల్టన్ ఊహించినంత నష్టం చేయలేదని, చాలామంది సర్వం కోల్పోయారని, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
విపత్తు సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఫస్ట్ రెస్పాండర్లను బైడెన్ ప్రశంసించారు. ఇలాంటి సమయాల్లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లుగా కాకుండా అమెరికన్లుగా పరస్పరం సహాయం చేసుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులకోసం నిధులను మంజూరు చేశారు. పోలింగ్‌కు ఇంకా మూడు వారాల సమయమే ఉన్న నేపథ్యంలో వరుస తుఫానులు ఎన్నికలకు మరో కోణాన్ని జోడించాయి.
Comments
Please login to add a commentAdd a comment