Helen Cyclone
-
సహాయక చర్యలపై తప్పుడు ప్రచారం: కమలా హారిస్
వాషింగ్టన్: మిల్టన్, హెలెన్ హరికేన్ల సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ట్రంప్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమలా హారిస్ మండిపడ్డారు. నార్త్ కరోలినాలో వారం రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజైన ఆదివారం ఆమె.. పలు చర్చిలకు వెళ్లి నల్లజాతీయులను కలిశారు. కోయినోనియా క్రిస్టియన్ సెంటర్లో ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలకు సహాయం చేస్తున్న వారు నిజమైన హీరోలని కొనియాడారు. కానీ ఒక కీలక వ్యక్తి సహాయం చేయకపోగా, సొంత ప్రయోజనాలకోసం తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేస్తున్నారని ట్రంప్‌ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలో రాజకీయ నాయకులు చేయాల్సింది అది కాదని హితవు పలికారు. హెలెన్ తుఫాను అనంతరం ఫ్లోరిడాలో పర్యటించిన ట్రంప్.. రిపబ్లికన్ల సహాయాన్ని ప్రభుత్వం కావాలనే నిలిపేస్తోందని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్న వలసదారుల కోసం ఖర్చు చేయడంతో ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీకి ఇవ్వడానికి నిధులు లేకుండా పోయాయయని విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యలపై హారిస్ పైవిధంగా స్పందించారు. కమలా హారిస్ ప్రసంగానికి ముందు బైడెన్ గల్ఫ్ తీరంలోని టంపా, సెయింట్ పీట్ బీచ్ మధ్య హెలికాప్టర్లో హరికేన్ నష్టాన్ని సర్వే చేశారు. మిల్టన్ ఊహించినంత నష్టం చేయలేదని, చాలామంది సర్వం కోల్పోయారని, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విపత్తు సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఫస్ట్ రెస్పాండర్లను బైడెన్ ప్రశంసించారు. ఇలాంటి సమయాల్లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లుగా కాకుండా అమెరికన్లుగా పరస్పరం సహాయం చేసుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులకోసం నిధులను మంజూరు చేశారు. పోలింగ్‌కు ఇంకా మూడు వారాల సమయమే ఉన్న నేపథ్యంలో వరుస తుఫానులు ఎన్నికలకు మరో కోణాన్ని జోడించాయి. -
USA: హెలెన్ విధ్వంసం
ఫ్లోరిడా: అమెరికాను తాకిన భీకర హెలెన్ తుపాను ఫ్లోరిడాతో పాటు ఆగ్నేయ అమెరికాలో అపారమైన విధ్వంసం సృష్టించింది. జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియాల్లో వరదలు, ఇళ్లు కూలిన ఘటనల్లో 72 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగేలా ఉంది. వరద నష్టం 15 నుంచి 26 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. టెన్నెసీలోని యునికోయ్ కౌంటీ హాస్పిటల్లోకి వరద చేరడంతో మొత్తం 54 మంది భవనంపైకి చేరారు. వారిని హెలికాప్టర్ ద్వారా కాపాడారు. న్యూపోర్టు సమీపంలో జలాశయం పొంగిపొర్లుతుండటంతో 7 వేల మందిని తరలించారు. నార్త్ కరోలినాలో వందేళ్లలోనే రికార్డు స్థాయిలో వరదలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. అట్లాంటాలో 48 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 28.24 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇక్కడ 1878 తర్వాత ఈ స్థాయి వర్షం ఇదే మొదటిసారని జార్జియా వాతావరణ విభాగం ప్రకటించింది. వరదల ధాటికి పార్కు చేసిన కార్లన్నీ మునిగిపోయాయి. ఈ ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఫ్లోరిడాలో పలు ప్రాంతాలకు చేరేందుకు పడవలే దిక్కయ్యాయి. ఫ్లోరిడా, జార్జియా, కరోలినాల్లో 30 లక్షల ఇళ్లు, వ్యాపారసంస్థలకు కరెంటు నిలిచిపోయింది. ఇటీవలి ఇడాలియా, డెబ్బీ తుపాన్లను మించిన నష్టం కలిగిందని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీ శాంటిస్ తెలిపారు. తుపాను తీవ్రత తగ్గినా కుండపోత కొనసాగుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. -
పకడ్బందీగా పంట నష్టాల గణన
కలెక్టర్లతో సీఎం కిరణ్ వీడియో కాన్ఫరెన్స్ అర్హుల్లో ఒక్కరికీ అన్యాయం జరగరాదని ఆదేశం పెట్టుబడి రాయితీ బకాయిలు రూ. 437 కోట్లు విడుదల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలవల్ల కలిగిన నష్టాలపై తప్పులకు ఏమాత్రం అవకాశం లేకుండా పకడ్బందీగా నష్టాల గణన చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పై-లీన్, హెలెన్ తుపానులతో నష్టాలు, సహాయ కార్యక్రమాలపై సీఎం శనివారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. వారం రోజుల్లోగా నష్టాల లెక్కింపు పూర్తి చేసి తుది నివేదిక పంపించాలని, పంట నష్టపోయిన ఒక్క రైతు పేరు కూడా జాబితా నుంచి తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ‘విపత్తుల వల్ల చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలు అన్నింటికీ పరిహారం ఇవ్వాలి. రైతుల వారీగా, పంటల వారీగా నష్టాల నివేదిక తయారీలో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వరాదు. బాధితుల పేర్లలో పది శాతాన్ని సీనియర్ అధికారులతో తనిఖీ చేయించండి. నివేదికలు రూపొందించిన వారు, తనిఖీ చేసిన అధికారుల పేర్లను కూడా పొందుపరచండి. ఎక్కడైనా తప్పు జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులనే బాధ్యులుగా చేసి కఠిన చర్యలు తీసుకోండి. మార్పు చేర్పులకు అవకాశం ఉండదు. ఒకేసారి పక్కాగా పరిశీలించి నష్టాలపై బాధితుల జాబితాతో నివేదికలు సమర్పించండి. మత్స్యకారులకు పరిహారం బకాయిలను తక్షణమే విడుదల చేస్తాం. నీలం తుపాను, కరువుకు సంబంధించి పెండింగులో ఉన్న పెట్టుబడి రాయితీ బకాయిలు రూ. 437 కోట్లు తక్షణమే తక్షణమే విడుదల చేస్తాం’ అని సీఎం పేర్కొన్నారు. కాగా, నష్టాల మదింపు త్వరగా పూర్తి చేసి రైతులకు కావాల్సిన విత్తనాలపై నివేదికలు ఇస్తే సరఫరాకు కార్యాచరణ రూపొందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. అటవీ దోపిడీపై కఠిన కేసులు: సీఎం కిరణ్ అమూల్యమైన అటవీసంపదను దోచేవారిపై, చెట్లను నరికేవారిపై హత్యకేసు(302 సెక్షన్) కన్నా పటిష్టమైన కేసులు పెట్టాలని, ఇందుకు అవసరమైతే చట్టాలు కూడా మార్చుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో రాష్ట్ర అటవీశాఖ అధికారుల రాష్ట్రస్థాయి సదస్సును ఆయన శనివారం ప్రారంభించారు. ‘అటవీ ప్రాంతాల్లోని అసాంఘిక శక్తులు, నేరగాళ్ల ముఠాలు, స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపండి. ప్రభుత్వం తగినంత సాయం చేస్తుంది’ అని ఆయన అధికారులకు హామీ ఇచ్చారు. అటవీ సంపద విధ్వంసాన్ని నివారించేందుకు అధికారులు స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించా రు. అడవుల్లో నివసించే వారికి, అధికారుల మధ్య, అటవీ ఉత్పత్తుల విషయమై ఏర్పడే వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. అటవీ నిర్వహణలో లోపాలను సరిదిద్దుకోవాలని, అవసరమైన మార్పులు తీసుకురావాలని అటవీశాఖ మంత్రి శత్రుచర్ల సూచించారు. -
వరుస తుపానులతో నష్టపోయిన రైతుల రుణాలు మాఫీ
* ప్రభుత్వానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ * మీరు చేయకుంటే మా ప్రభుత్వం రాగానే చేస్తాం * తూర్పుగోదావరి జిల్లాలో హెలెన్ ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన * తుపాన్లతో నష్టపోయిన రైతులను గాలికొదిలేశారంటూ ప్రభుత్వంపై ధ్వజం * నష్టపోయిన రైతులకు వడ్డీ లేకుండా కొత్త రుణాలివ్వాలి * ఎకరాకు రూ. 10 వేల పరిహారం ఇవ్వాలి * నీలం తుపాను బాధితులకు ఇప్పటికీ ఇన్పుట్ సబ్సిడీ ఎందుకివ్వలేదు? * మేం అధికారంలోకి వచ్చాక రైతులకు మంచిరోజులు వస్తాయి సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఇటీవల వరుస తుపానుల వల్ల నష్టపోయిన రైతుల రుణాలను మొత్తంగా మాఫీ చేసి, వడ్డీ లేకుండా కొత్త రుణాలు అందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపోయిన పంటకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతులకు పరిహారం అందించాలన్నారు. తుపానుతో నష్టపోయిన రైతుల రుణాలను రద్దు చేయకుంటే తాము అధికారంలోకి రాగానే వాటిని మాఫీ చేస్తామని ఉద్ఘాటించారు. ‘‘ఈ పాలకులకు మనసు లేదు.. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అని ప్రశ్నించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుసగా రెండు తుపానులొచ్చాయి.. మరో తుపాను వస్తుందంటున్నారు.. ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయారు.. మానవతా దృక్పథంతో వీరిని ఆదుకునే వారే కరువయ్యారు.. ఢిల్లీ రాజకీయాలపై చూపెడుతున్న శ్రద్ధ, రైతులపై చూపడం లేదు..’’ అంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ఏడాది నీలం తుపానులో నష్టపోయిన అన్నదాతలకు ఇప్పటికి కూడా ఇన్పుట్ సబ్సిడీ అందించలేదని దుయ్యబట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో హెలెన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం జగన్ పర్యటించారు. నేలకొరిగిన వరి పొలాలు, అరటి, కొబ్బరి తోటలను పరిశీలించారు. రైతులకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. కొత్తపేట మండలం వెలిశెట్టివారిపాలెం, ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లి, చెయ్యేరులలో రైతులతో మాట్లాడారు. ‘‘దేశానికి అన్నం పెట్టే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతును పట్టించుకోని రాష్ర్టం పరిస్థితి అధోగతే. వరుస విపత్తులతో రైతులు రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే పాలకులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఈ ప్రభుత్వంలో మనసున్న మనుషులే లేరు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తా. ఇటీవలే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌ను కలిశా. జరిగిన నష్టాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లా. ప్రధానమంత్రికి కూడా నష్టంపై చెబుతాం. మీకు అండగా నేనుంటా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీ తరఫున పోరాడుతుంది’’ అని అన్నారు. వర్షాలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుంటే వారిని ఒక్క అధికారిగానీ, ఒక్క నాయకుడుగానీ పట్టించుకోలేదని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘నీలం తుపాను వచ్చి ఏడాదైంది. ఇప్పటివరకు ఇన్పుట్ సబ్సిడీ అందించలేకపోయారు. పై-లీన్ తుపాను వచ్చింది. ఆ తర్వాత భారీ వర్షాలు ముంచేశాయి. బాధితులకు కేజీ బియ్యం కానీ, లీటరు కిరసనాయిల్ కానీ ఇవ్వలేదు. మళ్లీ హెలెన్ తుపాను విరుచుకుపడి ఐదు రోజులైంది. ఏ ఒక్క అధికారి, ప్రజాప్రతినిధి కానీ రైతులను పట్టించుకున్న పాపానపోలేదు’’ అంటూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రైతు రుణాలను మాఫీ చేయాల్సిందే..: తుపాను వల్ల నష్టపోయిన రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేసి, వడ్డీ లేకుండా కొత్త రుణాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘రైతులు ఎకరాకు రూ. 20 వేలు పెట్టుబడి పెట్టి సాగుచేశారు. ఇప్పుడు పంట కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. చేతికందే ధాన్యం మొలకొచ్చేసింది. వీరిని ఎవరు ఆదుకుంటారు? కేవలం నెల రోజుల్లో రెండు తుపాన్లు వచ్చాయి. మరో తుపాను ముంచుకొస్తుందంటున్నారు. ఆదుకోవాల్సిన పాలకులు మాత్రం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. తుపానుల వల్ల నష్టపోయిన రైతుల రుణాలను మొత్తంగా మాఫీ చేయాలి. కొత్త రుణాలు వడ్డీ లేకుండా అందించాలి. కోల్పోయిన పంటకు 75 శాతం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. నష్టపోయిన పంటకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందించాలి. హుడా కమిషన్ ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఆ సిఫార్సులను అస్సలు పట్టించుకోవడం లేదు’’ అని అన్నారు. తుపానుతో నష్టపోయిన రైతుల రుణాలు మాఫీ చేయకుంటే.. తాము అధికారంలోకి రాగానే వాటిని మాఫీ చేస్తామన్నారు. రాష్ట్రానికి ఎక్కువ పరిహారం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఏమాత్రం ఒత్తిడి తేవడం లేదని విమర్శించారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, రైతుల కష్టాలన్నీ తీరుతాయని భరోసా ఇచ్చారు. బురదలో దిగి.. పంటను పరిశీలించి... పర్యటనలో అడుగడుగునా రైతులు తమ కష్టాలను జగన్‌కు చెప్పుకున్నారు. తమకు జరిగిన నష్టాన్ని చెబుతూ రైతులు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి జగన్ చలించిపోయారు. వెలిశెట్టివారిపాలెంలో కౌలు రైతు మట్ల పట్టాభిరామారావు మాట్లాడుతూ.. ‘‘వైఎస్ ఉండి ఉంటే మా బతుకులు ఇలా ఉండేవి కావు. ఆ మహానుభావుడు ఎప్పుడూ మా కోసమే ఆలోచించేవాడు’’ అని విలపించారు. పంటకు అప్పులు చేసి రూ. 80 వేల వరకు పెట్టుబడి పెట్టాన ని, ఇప్పుడు అంతా నాశనమైపోయిందని కన్నీరుమున్నీరయ్యారు. జగన్ ఆ రైతును గుండెలకు హత్తుకొని ఓదార్చారు. ముమ్మిడివరం మండలం చెయ్యేరుగున్నేపల్లిలో మోకాలి లోతు బురదలో దిగి.. దెబ్బతిన్న వరిపంటను జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా గాలిదేవర పేరయ్యనాయుడు అనే రైతు పురుగుల మందు డబ్బా చేత్తో పట్టుకుని ‘మాకు చావుతప్ప మరో గత్యంతరం లేదు’ అని వాపోయాడు. పంట కోసం ఇల్లు, వాకిలితోపాటు భార్య పుస్తెలు కూడా తాకట్టు పెట్టానని, ఇప్పుడు వర్షాలతో పంటంతా పనికిరాకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. జగన్ ఆ రైతును ఓదారుస్తూ త్వరలోనే మంచి రోజులు వస్తాయని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. చెయ్యేరులో ఉండ్రు నాగరాజు అనే వికలాంగుడు జగన్‌ను కలిశాడు. వైఎస్ ఉన్నప్పుడు తమకు పింఛను వచ్చేదని, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని పేర్కొన్నాడు. అందుకు జగన్ మాట్లాడుతూ.. ‘‘మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వికలాంగులకు రూ.వెయ్యి పింఛను ఇచ్చే ఫైలుపై మొదటి సంతకం చేస్తాను. వృద్ధులకు రూ.750 పింఛను ఇస్తాం’’ అని ధైర్యం చెప్పారు. ఎన్.చినపాలెం వద్ద లక్ష్మీనరసమ్మ అనే వృద్ధురాలు తుపానులో ఇల్లు కూలిపోయిందని, నిలువనీడ లేదంటూ జగన్ ముందు గోడు వెళ్లబోసుకుంది. దీంతో ఆమెను ఆదుకోవాల్సిందిగా స్థానిక నాయకులకు జగన్ సూచించారు. అమలాపురం ఎర్రవంతెన వద్ద భట్నవిల్లి కొత్తచెర్వుకు చెందిన రాజ్‌కుమార్, ప్రశాంతి జగన్‌ను కలిసి.. తమ నాలుగేళ్ల కుమార్తె సాక్షికి పుట్టుకతోనే మాటలు రావడం లేదని, ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయలేమని వైద్యులు చెప్పారని ఆవేదన వ్యక్తంచేశారు. కోనసీమలో పలుచోట్ల పంట నష్టాన్ని పరిశీలించిన అనంతరం జగన్.. ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమంలో అసువులు బాసిన వైఎస్సార్ కాంగ్రెస్ కాట్రేనికోన మండల సేవాదళ్ కన్వీనర్ గిడ్డి దివాకర్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కాట్రేనికోన సెంటర్లో మాట్లాడాలంటూ మత్స్యకారులు జగన్‌ను పట్టుబట్టారు. దీంతో ఆయన మాట్లాడుతూ.. ‘‘నాలుగు నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వస్తుంది. ప్రతి రైతుకు, ప్రతి మత్స్యకారుడికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నా. ఈ ప్రాంతంలో రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. బోట్లు కొట్టుకుపోయినా.. పంటలు నాశనమైనా.. వలలు పోయినా పట్టించుకునే నాథుడే లేడు’’ అని అన్నారు. జగన్ వెంట పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, జక్కంపూడి విజయలక్ష్మి, గంపల వెంకటరమణ, పార్టీ మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, మాజీ ఎంపీలు ఏజేవీబీ మహేశ్వరరావు, గిరజాల వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, పెండెం దొరబాబు, పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు చలమలశెట్టి సునీల్, బొడ్డు వెంకటరమణ చౌదరి, పార్టీ సీఈసీ సభ్యురాలు వరుదు కల్యాణి తదితరులు ఉన్నారు. నేడు ‘పశ్చిమ’లో జగన్ పర్యటన ఏలూరు, న్యూస్‌లైన్: పశ్చిమగోదావరి జిల్లాలో హెలెన్ తుపానుతో నష్టపోయిన ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ బుధవారం పర్యటించనున్నారు. నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులను పరామర్శిస్తారని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. -
రైతన్నను ఆదుకోండి
=ఎకరాకు రూ.10 వేలు పరిహారమివ్వాలి =రుణాలు రద్దు చేయాలి =వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ భాను డిమాండ్ =పెడన, పామర్రు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటచేల పరిశీలన పెడన/ పామర్రు రూరల్, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. సోమవారం ఆయన పెడన నియోజకవర్గంలో గూడూరు, పెడన మండలాల్లో ముంపుబారిన పడిన పొలాలను పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్టీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్, రాములతో కలిసి పర్యటించారు. పామర్రు మండలంలో పార్టీ సమన్వయకర్త ఉప్పులేటి కల్పనతో కలసి దెబ్బతిన్న పంటచేలను పరిశీలించారు. ఈ సందర్భంగా పెడన, పామర్రులలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మూడేళ్ల పాలనలో నాలుగుసార్లు తుపానులు వచ్చాయన్నారు. జల్ తుపాను బాధిత రైతులకు నేటికీ ఇన్పుట్ సబ్సిడీ విడుదల కాలేదని విమర్శించారు. పై-లిన్ తుపాను అనంతరం కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, మిర్చి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారన్నారు. హెలెన్ తుపానుకు వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారని, రుణాలు మాఫీ చేయాలని, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో అధికారంలోకి వస్తే క్వింటా ధాన్యం మద్దతు ధర రూ.2 వేలు చేస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొందని, ఆంధ్రప్రదేశ్‌లో అదే ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించకపోవటం అన్యాయమని విమర్శించారు. రైతులకు పెద్దపీట వేసింది ఒక్క వైఎస్సారేనని చెప్పారు. హెలెన్ తుపాను వల్ల మృతిచెందిన వారికి రూ.5 లక్షల నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు పక్షాన పోరాడేది వైఎస్సార్సీపీ ఒక్కటే : నాగిరెడ్డి రైతన్నల పక్షాన పోరాడే ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. హెలెన్ తుపాను వల్ల సన్న, చిన్న కారు, కౌలు రైతులు సర్వం కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని, ఆత్మహత్యలే శరణ్యమంటూ విలపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా నిలిచి వారితో కలిసి పోరాటం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఉన్నారని భరోసా ఇచ్చారు. నవంబర్ వచ్చినా దాళ్వా ఉందో లేదో చెప్పలేదన్నారు. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరుందని, ఇటు అధికారులు, అటు మంత్రులు రైతులను విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. తుపాను వల్ల దెబ్బతిన్న రైతులకు రెండో పంటకు రుణం ఇచ్చే నాథుడే కరువయ్యాడని చెప్పారు. రైతుల రుణాలు వెంటనే రద్దుచేసి, నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రెండో పంటకు 75 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలని ఆయన కోరారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. క్వింటా ధాన్యానికి మద్దతు ధర రూ.2 వేలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. -
పొంచి ఉన్న తుపాన్ ముప్పు
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : కోస్తా ప్రాంతానికి మరో తుపాన్ ముప్పు పొంచి ఉంది. రెండు రోజుల క్రితమే తీరం దాటిన హెలెన్ తుపాన్‌తో ఉత్తర కోస్తా కకావికలమైంది. తాజాగా ‘లెహర్’ ముప్పు కోస్తాంధ్ర మీదకు దూసుకొస్తోండటంతో జిల్లా అధికార యంత్రాం గం అప్రమత్తమైంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఏర్పడిన అల్పపీడనం క్రమేపీ బలపడి తుపానుగా మారుతోంది. దీనికి లెహర్ అనే పేరు పెట్టారు. సూపర్‌సైక్లోన్‌గా మారే ఈ తుపాను వల్ల భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రస్తుతం అండమాన్ నికోబార్దీవులకు సుమారు 300 కిలో మీటర్ల దూరంలో ఉన్న అల్పపీడనం తుపానుగా మారి మచిలీపట్టణం, కళింగపట్నం నడుమ కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంటోంది. తీరం దాటే సమయంలో 100 నుంచి 150 కిలో మీటర్లు వేగంతో గాలులు వీచడంతో పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఆ శాఖ యంత్రాంగం హెచ్చరిస్తోంది. అయితే లెహర్ తీరం దరి చేరే సమయానికి దిశ మారితే జిల్లాకు ముప్పు వచ్చే పరిస్థితి ఉండటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. అప్రమత్తంగా ఉన్నాం :లక్ష్మీకాంతం, జేసీ అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందన్న సంకేతాలు అందాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తీరప్రాంతంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాం. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సమాచారం అందించాం. ప్రాణనష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఆస్తినష్టం కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాం. -
లెహర్ దడ
అమలాపురం, న్యూస్‌లైన్ :‘హెలెన్’ కొట్టిన దెబ్బ నుంచి ఇంకా తేరుకోని జిల్లాను మరో తుపాను గండం తరుముకొస్తోంది. అసలే కుదేలైన జిల్లావాసులను..‘లెహర్ ’ తుపాను విరుచుకుపడే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక పిడుగుపాటులా భయకంపితులను చేస్తోంది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన లెహర్ మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఈనెల 28న తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే హెలెన్ తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన తమకు మరో తుపాను ఎదుర్కొనే శక్తిలేదని జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. తాజా తుపాను మరింత బలపడితే తీరం వెంబడి 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది. తుపాను కనుక ఈప్రాంతంలో ప్రభావం చూపిస్తే ఈసారి నష్టం అంచనాలకు అందనంతగా ఉంటుందని అధికార యంత్రాంగం కలవరపడుతోంది. హెలెన్ తుపాను ప్రభావంతో 110 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులే కోనసీమ రూపురేఖలను, అన్నదాతల తలరాతలను మార్చివేశాయి. ఈ సమయంలో లెహర్ తుపాను దాడి చేస్తే జిల్లా మరింత అతలాకుతలమవుతుంది. తిప్పలు పడుతుండగానే.. హెలెన్ తుపాను కొట్టిన దెబ్బ నుంచి జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. గ్రామాల్లో రహదారులపై పడ్డ చెట్లను తొలగించడంతో అన్ని గ్రామాలకూ రెండు రోజుల తరువాత రాకపోకలు మొదలయ్యాయి. అయినప్పటికీ కోనసీమలోని అమలాపురం మున్సిపాలిటీ, రావులపాలెం, రాజోలుతో పాటు కొన్ని మండల కేంద్రాలకు మినహా మిగిలిన ప్రాంతాలకు ఇప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేకపోయారు. ఇప్పటికీ కోనసీమలో 275 గ్రామాలు చిమ్మచీకట్లో మగ్గుతున్నాయి. వరి రైతులు పంటపై ఆశలు వదులుకోగా, కొబ్బరి రైతులు తోటల్లో పడిపోయిన చెట్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ప్రభుత్వాధికారులు వచ్చి నష్టం నమోదు చేసుకునే అవకాశం ఉందని పడిపోయిన ఇళ్లను సరి చేసుకునేందుకు ప్రయత్నించని బాధితులు సామాన్లను మాత్రం మరోచోటకు తరలిస్తున్నారు. సతమతమవుతున్న అధికారులు మరోవైపు అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. తుపాను ప్రత్యేకాధికారి ఎం.రవిచంద్ర, కలెక్టర్ నీతూ ప్రసాద్‌తోపాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కోనసీమలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పంటనష్టం నమోదు, ఇళ్ల నష్టాల నమోదుకు తీసుకోవాల్సిన చర్యలనుపై సమీక్ష జరిపారు. ఇప్పటికీ ప్రాథమిక అంచనాలు సైతం పూర్తి చేయలేని పరిస్థితుల్లో మరో తుపాను ముప్పు పొంచి ఉండడం అధికార యంత్రాంగానికీ ముచ్చెమటలు పట్టిస్తోంది. హెలెన్ నష్టం నమోదును పక్కనబెట్టి, లెహర్ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టాల్సి రావడంతో సతమతమవుతున్నారు. మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లరాదని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొద్దిరోజులుగా వేటలేక పూట గడవని దుస్థితిలో అవస్థలు పడుతున్న మత్స్యకారులకు తాజా హెచ్చరికలు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. లెహర్ తుపాను ప్రభావంపై తీరప్రాంత మండలాల్లోని గ్రామాల్లో టాంటాం వేయించాలని ఆయా తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే ఆమె కాట్రేనికోన మండలం చిర్రయానాం, నీళ్లరేవు, పల్లంకుర్రు గ్రామాల్లో పర్యటించి హెలెన్ తుపాను నష్టాన్ని పరిశీలిస్తూనే రాబోయే లెహర్ తుపాను వల్ల నష్టపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ పరిణామాలతో జిల్లావాసులకు.. ముఖ్యంగా తీరప్రాంతాల వారిని కంటికి కునుకు పట్టనివ్వని భీతి వెన్నాడుతోంది. -
‘హెలెన్’ నష్టం రూ.1,630కోట్లు
సాక్షి, హైదరాబాద్: హెలెన్ తుపాను వల్ల కోస్తా జిల్లాల్లో రూ.1,630 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ పార్థసారథి తెలిపారు. తుపాను పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఆదివారం సమీక్ష నిర్వహించారు. అనంతరం పార్థసారథి మీడియాకు వివరాలు తెలిపారు. హెలెన్ తుపాను వల్ల తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధిక నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఐదు జిల్లాల్లో 11 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని చెప్పారు. 10,003 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. రహదారులు, భవనాలు దెబ్బతిని రూ.177 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 1,313 ఇళ్లు ధ్వంసమయ్యాయని, 24 పడవలు కొట్టుకుపోగా మరో 234 పడవలు దెబ్బతిన్నాయని తెలిపారు. విద్యుత్తు, మంచినీటి సరఫరా నిలిచిపోయిన 166 గ్రామాల్లో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. -
క్రికెట్ గెలిచింది!
=హెలెన్‌పై విశాఖ భారీ విక్టరీ = చివరి క్షణం వరకు మ్యాచ్ జరగడమే మిస్టరీ =అడ్డంకి లేని వన్డే.. అదో స్వీట్ మెమొరీ విశాఖపట్నం, న్యూస్‌లైన్ : కమ్ముకున్న కారు మబ్బులు.. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలు.. ఉధృతంగా వీచే ఈదురుగాలులు.. హెలెన్ తుఫాన్ భీకర స్వరూపమిది.. కోస్తాంధ్ర అంతటినీ చిగురుటాకులా వణికించిన పెనుతుఫాన్ తాకిడితో విశాఖ హడలెత్తిపోయింది. నిమిషం విరామం కూడా లేకుండా మూడు రోజులుగా కురిసిన వర్షాలతో నగరం నిలువెల్లా తడిసి ముద్దయింది. దాంతో.. విశాఖ క్రీడాభిమానుల గుండెల్లో భయం ఇంతింతై మొదలై, పెను వాయు‘గండం’లా రూపాంతరం చెందింది. రెండేళ్ల తర్వాత మళ్లీ జరగబోతున్న అంతర్జాతీయ మ్యాచ్ సాఫీగా సాగుతుందా? వర్షం కనికరిస్తుందా? మ్యాచ్ జరిగే రోజైనా వాన తెరిపిస్తుందా?.. శనివారం ఉదయం వరకు ఈ సవాలక్ష సందేహాలతో క్రికెట్ వీరాభిమానుల గుండె పీచుపీచుమంది.. ఓవంక సమైక్యాంధ్ర ఉద్యమకారుల హుంకారాలతో మొదటికే మోసమొస్తుందనుకుంటే.. ఆ అడ్డంకి దాటి మ్యాచ్ నిర్వహణకు అంతా అనుకూలిస్తే... వరుణుడు సైంధవుడిలా అడ్డు పడుతున్నాడన్న ఆందోళన అందరినీ బెంబేలెత్తించింది. పూర్తిగా టార్పాలిన్లతో కప్పేసిన అవుట్‌ఫీల్డ్ ఫొటోలు చూసిన క్రికెట్ అభిమానుల మనసు ఉసూరంది.. కానీ... అందరి ప్రార్థన ఫలించింది! వైఎస్సార్ స్టేడియం సిబ్బంది, మ్యాచ్ నిర్వాహకుల నిర్విరామ కృషి సఫలమైంది! వానదేవుడి అనుగ్రహం కలిసొచ్చింది! విశాఖలో భారత, వెస్టిండీస్ జట్ల మధ్య ఆదివారం వన్డే మ్యాచ్ నిర్విఘ్నంగా, నిరాఘాటంగా జరిగింది! గెలిచింది వెస్టిండీస్ అయినా, అసలు విజయం క్రికెట్‌దే అయింది! లక్షలాది మంది క్రీడాభిమానుల ఆకాంక్షతో తుఫాన్ అవాంతరం దూదిపింజెల్లా చెల్లాచెదురైపోయింది! భయం భయం నవంబర్ అంటేనే తుఫాన్ల మాసం.. పైగా గత ఏడాది ఇదే సమయంలో జరగాల్సిన టీ20 మ్యాచ్ వర్షం వల్లే రద్దయిన చేదు అనుభవం.. ఈనెల 20 నాటికి వర్ష బీభత్సం చూసిన క్రీడాభిమానుల గుండెల్లో ఈ భయం లీలామాత్రంగా కదిలింది. దాన్ని బలపరిచే విధంగా, 21 నాడు.. 22 నాడు నిర్విరామంగా వాన కురిసింది. దాంతో 24 నాటి మ్యాచ్ జరగడం కష్టమేనన్న అభిప్రాయం వినవచ్చింది. అయితే 22 సాయంత్రం హెలెన్ తీరం దాటడమే కాకుండా, తర్వాత వరుణుడు కరుణించడంతో ఆశ చిగురించింది. శనివారమంతా ఎంత కాయడంతో ఇక మ్యాచ్ ఖాయమని నిశ్చయమైపోయింది. దాంతో విశాఖ క్రికెట్ అభిమాని ఆనందానికి అవధేలేకుండా పోయింది. అందుకు తగ్గట్టే, మ్యాచ్ వీసమెత్తు సమస్య లేకుండా అమోఘంగా సాగింది. గ్రౌండ్ సిబ్బంది సామర్ధ్యమిది.. రెండు రోజులకు పైగా భారీ వర్షాలు వెంటాడిన పరిస్థితుల్లో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణ అంటే దాదాపు అసాధ్యమే. అది అసాధారణ కృత్యమే. కానీ వైఎస్సార్ స్టేడియంలోని అద్వితీయ డ్రైనేజ్ వ్యవస్థ చుక్క నీటి జాడ కూడా లేకుండా చేసింది. అంతకు మించి గ్రౌండ్ సిబ్బంది నిర్విరామ కృషి కారణంగా అసలు వర్షం కురిసిందా? అన్న తీరులో మైదానం తయారైంది. నిర్వాహకుల దీక్షతో మ్యాచ్ క్షణం జాప్యమైనా, అవాంతరమైనా లేకుండా సాగింది. స్టేడియం తీరు, సిబ్బంది తపన అంతర్జాతీయ వ్యాఖ్యాతల ప్రత్యేక ప్రశంసలకు పాత్రమైంది. -
రైతుపై విరుచుకుపడిన హెలెన్ తుపాను
అన్నదాతపై ప్రకృతి కక్ష కట్టినట్టే కనిపిస్తోంది.. ఒక దెబ్బ నుంచి కోలుకోక ముందే, మరో దెబ్బ పడుతోంది. ఆయకట్టు, ఆయకట్టేతర అన్న తేడా లేకుండా మొన్నటి పై-లీన్ తుపాను పంటలను నాశనం చేసింది. ఉన్న కొద్దో గొప్పో పంట చేతికి వస్తుందని ఆశిస్తే తాజా ‘హెలెన్’ తుపాను పూర్తిగా తుడిచి పెట్టేసింది. అసలింత వరకు ‘పై-లీన్’ నష్టం అంచనాలే పూర్తి కాలేదు.. ఈ లోగా ‘హెలెన్’ రూపంలో ప్రకృతి కన్నెర్ర చేసింది..!! సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఈ సారి తిండి గింజలకూ కొరత ఏర్పడేలా ఉంది. తుపానుల రూపంలో ఉన్న పంటంతా ఊడ్చి పెట్టుకు పోయింది. గత నెల జిల్లాను వణికించి తీవ్ర నష్టాన్ని మిగిల్చిన పై-లీన్ తుపాను దెబ్బకే పత్తి పంట పూర్తిగా కోల్పోయిన రైతులు, నాన్ ఆయకట్టులో బావుల, బోర్ల కింద సాగు చేసిన వరి పంటనూ నష్టపోయారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని వరి పంట చేతికి వస్తుందిలే అనుకున్న వారి ఆశలపై తాజా ‘హెలెన్’ వరద కుమ్మరిస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన తుపాను వర్షం కోదాడ, మిర్యాలగూడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో వరి పంటను పూర్తిగా దెబ్బతీసింది. జిల్లా వ్యాప్తంగా శనివారం 17.8మి.మీ సగటు వర్షపాతం నమోదు కాగా, అత్యధిక వర్షపాతం నమోదైన తొలి నాలుగు మండలాలు కోదాడ నియోజకవర్గం పరిధిలోని నడిగూడెం (72.6 మి.మీ), మునగాల (70.4మి.మీ), కోదాడ (68.3మి.మీ), చిలుకూరు (65.4మి.మీ) కావడం గమనార్హం. సహజంగానే ఈ మండలాల్లోనే వరి పంటకు ఎక్కువ నష్టం జరిగింది. మరోవైపు పత్తి చేలలో పత్తి విచ్చుకుని తెంపడానికి సిద్ధంగా ఉంది. ఈ దశలో ముసురు పడడంతో ఆయకట్టేతర ప్రాంతాల్లో ఇక పత్తి దిగుబడి నామమాత్రంగా కూడా దక్కే అవకాశం కనిపించడం లేదు. కాగా, బొమ్మలరామారం, మోత్కూరు, వలిగొండ, చింతపల్లి, పీఏపల్లి మండలాల్లో వర్షపాతం నమోదు కాలే దు. అత్యల్పంగా పెద్దవూర మండలంలో 2మి.మీ వర్షం కురిసింది. ఈ సారి వర్షానికి ఆయకట్టు మండలాలే ఎక్కువగా నష్టపోయాయి. మిగిల్చిన నష్టం లెక్కలతో అధికార యంత్రాంగం కుస్తీ పడుతున్న సమయంలోనే ‘హెలెన్’ దెబ్బకొట్టింది. నష్టం జరిగింది ఇలా... కోదాడ నియోజకవర్గంలోని ఆయకట్టు మండలాలైన చిలుకూరు, మునగాల, కోదాడ, నడిగూడెంలో పంట నష్టం ఎక్కువగానే ఉంది. కోతకు వచ్చిన వరి పైరుకు ఎక్కువ నష్టం జరిగింది. కోదాడ మండలంలో 600 ఎకరాల్లో పంట నేలకొరిగింది. చిమిర్యాలలో ఒక పెంకుటిల్లు కూలిపోయింది. చిలుకూరు, మునగాల మండలాల్లో రెండువేల ఎకరాల్లో , నడిగూడెం మండలంలో 500 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. సూర్యాపేట మండలంలో చేతికొచ్చిన వరి పొలాలు వర్షాలకు తడిచి ముద్దయ్యాయి. పలు గ్రామాల్లో వరిపొలాలు నీట మునిగాయి. ఆత్మకూర్.ఎస్ మండలంలో కోతకు వచ్చిన వరి నేలకొరిగింది. వరి మెదలు తడిసిపోయాయి. చివ్వెంల మండలంలో 100 ఎకరాల్లో కోసిన వరిమెద నీటి పాలయ్యింది. 300 ఎకరాల్లో పత్తి తడిసి పనికి రాకుండా అయ్యింది. వేరుశనగ పంట నీట మునిగింది. మండల పరిధిలోని వల్లభాపురంలో చర్చి పైకప్పు కూలిపోయింది. పెన్‌పహాడ్ మండలంలో నుర్జాహాన్పేట, అనంతారం. పొట్లపహాడ్ తదితర గ్రామాల్లో వడ్లరాసులు తడిచాయి. మెదలు నీట మునిగాయి. మిర్యాలగూడ నియోజవవర్గంలో వరి పంటలు బాగా తెబ్బతిన్నాయి. మిర్యాలగూడ మండలంలోని ప్రకాశ్‌నగర్, తుంగపాడు, మిర్యాలగూడ పరిసర పాంతాలలో వరి మెదలు వర్షపు నీటిలో తడిచిపోయాయి. దామరచర్ల మండల కేంద్రంతో పాటు బొత్తలపాలెం, తాళ్లవీరప్పగూడెం గ్రామాలలో వరి పంటలు నేలబారాయి. కొన్నిచోట్ల నీట మునిగాయి. దామరచర్ల మండలంలోనే వెయ్యి ఎకరాల్లో వరి పంటలు దెబ్బతినగా, పత్తి పూర్తిగా తడిసిపోయింది. వేములపల్లిలో గాలికి ఫ్లెక్సీ కూలి ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు చిరుజల్లులు కురిశాయి. ఏరడానికి సిద్ధంగా, చేనుపై ఉన్న పత్తి తడిసిపోయింది. తుంగతుర్తి నియోజకవర్గంలో 5వేల ఎకరాల్లో కోసిన వరి మెదలు నీటిలో మునిగాయి. 3వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురిసింది. పత్తిచేలలో పత్తి విచ్చుకోవడంతో పూర్తిగా తడిసింది. వందలాది ఎకరాల్లో పత్తి చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. భువనగిరి నియోజకవర్గంలోని మూసీ ఆయకట్టు మండలాల్లో రైతులు కోసిన వరిపంటను కాపాడుకోవడానికి అవస్థలు పడ్డారు. వలిగొండ, పోచంపల్లి, బీబీనగర్ మండలాల్లో రైతులకు ఇబ్బంది కలిగింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో వరి కోతలకు, పత్తి తీయటానికి ఆటంకం కలిగింది. వర్షం కారణంగా పెద్దవూర, గుర్రంపోడు మండలాల్లో రచ్చబండ కార్యక్రమాలు రద్దయ్యాయి. -
జిల్లాలో మళ్లీ వర్షాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పై-లీన్ చేసిన గాయం నుంచి తేరుకోకముందే హెలెన్ తుపాన్ అన్నదాతలను వణికిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా శనివారం వర్షం కురిసింది. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యంతోపాటు కల్లాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవడంతో రైతన్నకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఈ ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 1.75 లక్షల హెక్టార్లలో వరిపంట సాగయింది. ఇప్పటివరకు 45 శాతం కోతలు మాత్రమే పూర్తయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 20 లక్షల క్వింటాళ్ల ధాన్యం దెబ్బతిన్నది. అందులో ఆరబెట్టుకున్న ధాన్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. రైతులు నేరుగా మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలకే వచ్చి ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. జిల్లాలో ఇంకా 55 శాతం వరికోతలు జరగాల్సి ఉంది. ఆలస్యంగా నాటుకున్న దాదాపు 80వేల హెక్టార్లలో వరికోతలు జరగాలి. దాదాపు 47 లక్షల క్వింటాళ్ల ధాన్యం మార్కెట్‌కు రావాల్సి ఉంది. పొలాల్లో యంత్రాల హార్వెస్టర్లు తిరిగే పరిస్థితి లేదు. ఈ క్రమంలో చైన్ హార్వెస్టర్లకు డిమాండ్ పెరిగింది. అవి తక్కువగా ఉండడం.. కోతలకు ఆలస్యం కావడంతోపాటు ఖర్చులు పెరుగుతున్నాయి. కోతకు వచ్చిన వరిధాన్యం తడిసి రంగుమారే అవకాశముంది. 610 కేంద్రాలు ఎక్కడ? ఖరీఫ్‌లో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం జిల్లాలో 610 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు 345 ఐకేపీ కేంద్రాలు, 191 పీఏసీఎస్‌లు కేంద్రాలు.. మొత్తం 536 కేంద్రాలను ప్రారంభించారు. 9.40 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు రూ.39 కోట్లు చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నారుు. ప్రభుత్వ సంస్థల కంటే రెండురెట్లు ఎక్కువగా దళారులే కొనుగోలు చేశారు. మార్కెట్ యార్డులతోపాటు కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొనుగోలు చేస్తున్న ధాన్యం ఎగుమతికి నోచుకోకపోవడంతో ఎక్కడికక్కడే నిల్వలు పేరుకుపోతున్నాయి. తేమ ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెడుతున్నారు. ఈ క్రమంలో అవసరం మేరకు టార్పాలిన్లు లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికే ధాన్యం తడిసిపోతోంది. ఇదే అదునుగా వ్యాపారులు ధర తగ్గించి రైతులను దోచుకుంటున్నారు. మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం శనివారం కురిసిన వర్షాలకు కరీంనగర్ మార్కెట్ యార్డులో వరిధాన్యం తడిసింది. నాలుగు వేల క్వింటాళ్ల వరకు మార్కెట్ యార్డుకు ధాన్యం వచ్చింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండడంతో రైతులు ముందస్తుగా టార్పాలిన్లు తెచ్చుకుని కుప్పలపై కప్పుకున్నారు. పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులు ఇష్టారీతిన ధర నిర్ణయించారు. వర్షసూచన నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని కాపాడుకోలేని స్థితిలో వ్యాపారుల చెప్పిన ధరకే విక్రయించారు. వరి ధాన్యం మద్దతు ధర కంటే రూ.100-రూ.250వరకు కోతలు పెట్టారు. -
చివరికి కన్నీరే!
సాక్షి, గుంటూరు :అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్టుంది. జల్.. పై-లీన్.. హెలెన్ పేరేదైతేనేం వరుస తుపాన్లు చేతికందే దశలో పంటలను నీటిపాలు చేస్తున్నాయి. ఈ ఏడాది వరుసగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న జిల్లా రైతుకు హెలెన్ ధాటికి ఇప్పటి వరకు కాపాడుకొచ్చిన పంట కూడా దక్కలేదు. ఈదురుగాలులకు ప్రధానంగా డెల్టా ప్రాంతంలో వరిపంట నేలవాలింది. కోత కోసిన చేలల్లో వరి ఓదెలు నీటితో తేలియాడుతున్నాయి. గడచిన మూడేళ్లలో ఇంతటి దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కోలేదని డెల్టా రైతులు వాపోతున్నారు. పొలాల్లో పంట స్థితిని చూసి రైతన్న ఆందోళన చెందుతున్నాడు. జిల్లాలో మూడు రోజులుగా వీస్తున్న ఈదురుగాలులు, కురుస్తున్న వర్షాల ధాటికి 132.5 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదని వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా. మరో 2180 ఎకరాల్లో కాయదశకు వచ్చిన మినుము పంటకు నష్టం వాటిల్లినట్టు తేల్చారు. డెల్టాలోని తెనాలి, కొల్లిపర, కొల్లూరు, వేమూరు, చుండూరు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పొన్నూరు మండలాలు, పల్నాడులోని నరసరావుపేట, సత్తెనపల్లి కాగా మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండలాల్లో వరి రైతులు నష్టాన్ని చవిచూశారు. కొందరు రైతులు నేలవాలిన వరి దుబ్బులను నిలగట్టే పనిలో తలమునకలయ్యారు. వర్షం కొనసాగితే నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. పత్తి పంటతోపాటు పసుపు, తమలపాకుల తోటలు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆందోళనలో పత్తి రైతులు ఇటీవల కురిసిన వర్షాలకు కేవలం 65 వేల ఎకరాల్లోనే 50 శాతానికి మించి నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదిక పంపిన సంగతి తెలిసిందే. పల్నాడులో ఇప్పటికే తీసిన మైల(మొదటి) పత్తిని బోరాల్లో నిల్వ ఉంచారు. బోరాల్లోకి కూడా నీళ్లు చేరి తడిసిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే పత్తి దిగుబడుల్లో నాణ్యత లేదని సీసీఐ సైతం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ముందుకు రావడంలేదు. ప్రయివేటు వ్యాపారులు క్వింటా పత్తి రూ.1400కు ఇస్తారా..రూ.1500కు కొనుగోలు చేస్తామంటూ.. రైతును నిలువు దోపిడీ చేస్తున్నారు. కనీసం కూలీల ఖర్చులైనా వస్తాయనుకుంటే హెలెన్ ముసురు నిరాశే మిగిల్చింది. పట్టించుకునే నాథుడెవ్వడు.. వరుస తుపానుల ప్రభావానికి పంటలు నష్టపోయిన తమను అధికారులు ఇంతవరకు పట్టించుకోలేదని జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పైలీన్ తుపాను, అధికవర్షాల నేపథ్యంలో జిల్లాలో పర్యటించిన కేంద్ర కమిటీ ప్రతిపాదనలూ బుట్టదాఖలవుతాయనే ఆందోళన అందరిలోనూ ఉంది. వరుస తుపాన్లతో రైతులు నష్టాలపాలైనా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై నిరసనగా ఉద్యమాలు తప్పవని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. -
హెలెన్ తుపానునిండా ముంచింది
=తుపాను ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు =2.25 లక్షల ఎకరాల్లో వరి నీటమునక =అప్పులే మిగులుతాయని అన్నదాతల ఆవేదన =గుండె ఆగిన కౌలు రైతు =వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి =వాగుల్లో ఇద్దరి గల్లంతు హెలెన్ తుపాను అన్నదాతను కోలుకోలేని దెబ్బతీసింది. పంట చేతికందే తరుణంలో నీటమునగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లాలో 2.25 లక్షల ఎకరాల్లో వరి నీటమునిగినట్లు వ్యవసాయ అధికారుల అంచనాగా ఉంది. పంట దెబ్బతినడంతో తట్టుకోలేక కౌలురైతు గుండె ఆగి మృతిచెందాడు. విద్యుదాఘాతానికి ఇద్దరు, చలిగాలులకు ఇద్దరు వేర్వేరు చోట్ల చనిపోయారు. మరో ఇద్దరు వాగుల్లో గల్లంతయ్యారు. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను జిల్లా రైతును నిండా ముంచింది. శుక్ర, శనివారాల్లో జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, గాలుల ప్రభావానికి కోతకు సిద్ధమైన వరి చేలు నేలవాలి నీటమునిగాయి. జిల్లాలో ఖరీఫ్‌లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగగా హెలెన్ తుపాను ప్రభావంతో 2.25 లక్షల ఎకరాల్లోని వరి నీటమునిగిందని వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా. ఎకరానికి రూ.20 వేలు ఖర్చు చేశామని, పంట చేతికొచ్చే దశలో తుపాను ప్రభావంతో వీచిన బలమైన గాలులకు పంట నేలవాలటం, దానిపై నీరు చేరటంతో పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో సాగునీటి విడుదల ఆలస్యం కావడంతో తక్కువ వ్యవధిలో పంట చేతికొచ్చే బీపీటీ 5204 రకం విత్తనాన్ని జిల్లా రైతులు అత్యధికంగా సాగు చేశారు. ఈ రకం విత్తనం రెండు రోజులకు పైబడి నీటిలో నానితే గింజ కుళ్లిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను శుక్రవారమే తీరం దాటినా దీని ప్రభావంతో శనివారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. జిల్లాలో అత్యధికంగా పెదపారుపూడిలో 17.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం, అత్యల్పంగా చాట్రాయిలో 0.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 5.7 సెంటీమీటర్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో వీచిన బలమైన గాలులకు జిల్లాలోని 500 ఎకరాల్లో అరటితోటలు, 50 ఎకరాల్లో బొప్పాయి తోటలు, 200 ఎకరాల్లో దొండ, బీర పందిళ్లు దెబ్బతిన్నాయి. చినగొల్లపాలెం దీవిలో 200 కొబ్బరిచెట్లు విరిగిపడ్డాయి. పంట బీమా ఇప్పించాలి... ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో పంటలు కోల్పోతే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం సకాలంలో అందని దుస్థితి నెలకొంది. హెలెన్ తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు పంట బీమా ఇప్పించేందుకైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతోంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయం... కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 1.60 లక్షల మంది కౌలురైతులు 3.50 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. పంటబీమా, నష్టపరిహారం, కౌలురైతులకు అందే పరిస్థితి లేదు. హెలెన్ తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన కౌలు రైతులకు నష్టాలే మిగిలే పరిస్థితి దాపురించింది. పరిహారం అందేనా? గత నెల అక్టోబరులో కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టం ఇప్పించాలని రైతులు కోరిన మీదట నీలం తుపాను నష్టపరిహారం ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంతవరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈలోపే హెలెన్ తుపాను కారణంగా రైతులు మరోసారి నష్టపోయారు. ఈ పంట నష్టం అంచనాలు ఎప్పటికి పూర్తిచేస్తారో పరిహారం ఎప్పటికి అందిస్తారోనని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందించాలి : నాగిరెడ్డి వరుస దెబ్బలతో జిల్లా రైతాంగం తీవ్ర సంక్షోభంలో పడుతోందని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హెలెన్ తుపాను తాకిడికి నేలవాలిన పంటలు కుళ్లిపోతాయని, ఈ పంటను కోయకుండానే దమ్ము చేసి దాళ్వా పంట వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు పంట నష్టపరిహారాన్ని ఎకరానికి రూ.10 వేలు చొప్పున అందించాలని ఆయన డిమాండ్ చేశారు. నేడు వ్యవసాయాధికారుల సమావేశం తుపాను ప్రభావంతో ఏర్పడిన పంట నష్టం అంచనాలు, జాబితాల తయారీలో తీసుకోవాల్సిన విధివిధానాలపై జిల్లాలోని ఆయా మండలాల వ్యవసాయాధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం నుంచి ప్రత్యేక బృందాలు గ్రామాల్లో పర్యటించి పంట నష్టం అంచనాలను తయారుచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నలుగురి మృతి.. ఇద్దరి గల్లంతు తుపాను ప్రభావంతో జిల్లాలో శనివారం నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు వాగుల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు వద్ద తెగిన కరెంటు తీగ తగలడంతో బోత్సా వెంకటరమణ (23) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. హనుమాన్‌జంక్షన్‌లో ట్రినిటీ స్వచ్ఛంద సంస్థ పేరుతో నిర్వహిస్తున్న హాస్టల్లో మాదాసు ఆనందరాజు (7) అనే బాలుడు స్నానం చేసేందుకు వెళ్లి వర్షపు నీటిలో జారి మోటారుపై పడ్డాడు. షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. తుపాను ప్రభావంతో వీచిన చలిగాలులకు జిల్లాలో ఇద్దరు వృద్ధులు మృతిచెందారు. అవనిగడ్డ మండలం బందలాయిచెర్వు దళితవాడలో గొరుముచ్చు పురుషోత్తం (74) శుక్రవారం రాత్రి చనిపోయాడు. నందివాడ మండలం శంకరంపాడులో గుడుమోలు కమలమ్మ (65) శనివారం తెల్లవారుజామున చలిగాలులకు తాళలేక మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. జి.కొండూరు మండలం చెరువుమాధవరం తండా వద్ద పులివాగులో బూక్యా మోతి (35) అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. లోలెవెల్ చప్టా వద్ద వాగును దాటే ప్రయత్నం చేయగా నీటి ఉధృతికి కొట్టుకుపోయాడని స్థానికులు తెలిపారు. నందివాడ మండలం ఎల్‌ఎన్‌పురం శివారు ఇమ్మనివానిగూడేనికి చెందిన కోరం ఇస్రాయేలు (70) శనివారం ఉదయం బుడమేరు డ్రెయిన్ దాటుతుండగా వర్షంతో నేల నాని ఉండటంతో కాలుజారి నీళ్లలో పడి కొట్టుకుపోయాడు. -
హెలెన్..విలన్
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: చి‘వరి’ ఆశా చితికిపోయింది. ఖరీఫ్ కన్నీళ్లనే మిగిల్చింది. నెలరోజుల వ్యవధిలోనే మూడు విపత్తులు విరుచుకుపడడంతో అన్నదాత వెన్నువిరిగింది. కిందటి నెలలో పై-లీన్, భారీ వర్షాలకుతోడు ఇప్పుడు హెలెన్ దెబ్బకు పంటలన్నీ సర్వనాశనమయ్యాయి. ముఖ్యంగా కోస్తాంధ్రలో వరిపై ఆశలు పూర్తిగా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల రోజుల్లోనే లక్షల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. పై-లీన్, భారీ వర్షాల వల్ల అధికారిక లెక్కల ప్రకారమే 33 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు హెలెన్ తుపానువల్ల మరో 11.35 లక్షల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఇది వ్యవసాయ శాఖకు అందిన ప్రాథమిక సమాచారం మాత్రమే. వాస్తవానికి నీట మునిగిన వరి విస్తీర్ణం 15 లక్షల ఎకరాలుపైనే ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ నష్టం అధికంగా ఉంది. ఒక్క వరి పంటే కాదు.. కొబ్బరి, అరటి, మామిడి తోటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. ఉభ య గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోనే లక్షకు పైగా కొబ్బరి చెట్లు నేలకూలాయి. వేలాది ఎకరాల్లో అరటి, మామిడి దెబ్బతిన్నాయి. మిరప, బెండ, వంగ తదితర కూరగాయల పంటలూ పాడయ్యాయి. మినుము, పెసర పంటలు నీటిలో కుళ్లుతున్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే కోత కోసిన పంట, మరికొన్ని చోట్ల మరో వారం రోజుల్లో కోయాల్సిన వరి నీటిపాలు కావడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నెల రోజుల్లో వచ్చిన మూడో విపత్తుతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వర్షాభావ పరిస్థితుల్లో అష్టకష్టాలు పడి పెట్టిన పంటలు తీరా కోతకొచ్చే సమయంలో ఇలా నీటిపాలు కావడంతో రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటివరకు కోస్తా ప్రాంతంలో 25 వేల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. హెలెన్ బీభత్సంలో తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం ఏడుగురు మృతి చెందగా.. శనివారం మరో నలుగురు చనిపోయారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు వృద్ధులు చలిగాలుల తీవ్రతకు తట్టుకోలేక ప్రాణాలు వదిలారు. ఇదే జిల్లాలో పంటనష్టాన్ని తట్టుకోలేక నందివాడ మండలం తుమ్మపల్లి గ్రామానికి చెందిన కౌలురైతు మసిముక్కు శ్యామలరాజు (50) గుండెపోటుతో మృతిచెందారు. ఎంత కష్టం... ఎంత నష్టం హెలెన్ తుపాను ఉభయ గోదావరులకు ‘విలన్’గా మారింది. వరిపంటనే కాదు.. కోనసీమ కల్పవృక్షమైన కొబ్బరిని సైతం అమాంతం మింగేసింది. ఒక్క ఈ ప్రాంతంలో తుపాను దెబ్బకు 80 వేలకు పైన చెట్లు నేలకూలాయి. 40 వేల ఎకరాల్లో కొబ్బరి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుంది. మొవ్వు పూర్తిగా సుడులు తిరిగి పోవడంతో కొబ్బరి పూర్తిగా రాలిపోయింది. దీంతో ఈ ఏడాది దిగుబడి పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఒక్క తూర్పుగోదావరిలోనే వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు రూ.320 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. వరి రైతు బాధలు అయితే వర్ణనాతీతం. తీరప్రాంత మండలాల్లో కోతలు కూడా కోయించలేని పరిస్థితి ఏర్పడింది. సుమారు 91,220 ఎకరాల్లో పనల దశలో ఉన్న పంట రంగుమారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో మత్స్యకారులకు చెందిన 25కు పైగా బోట్లు కొట్టుకుపోయాయి. సుమారు 400 బోట్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి నుంచి 615 గ్రామాలు అంధకారంలో చిక్కుకోగా, శనివారం సాయంత్రానికి 140 గ్రామాల్లో అతి కష్టమ్మీద సరఫరాను పునరుద్ధరించగలిగారు. మిగిలిన 475 గ్రామాలకు పునరుద్ధరించాలంటే మరో వారం పైగా పడుతుందని చెబుతున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో 600 గ్రామాలకు తాగునీరందని పరిస్థితి నెలకొంది. పశ్చిమగోదావరిలో కూడా తుపాను పెను బీభత్సమే సృష్టించింది. రైతులకు రూ.500 కోట్ల మేర నష్టం మిగిల్చింది. దాదాపు 200పైగా కొబ్బరి చెట్లు విరిగిపోయాయి. గాలి వాన బీభత్సానికి 882 ఇళ్లు దెబ్బతిన్నాయి. 116 కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయి. చేపలు, రొయ్యల చెరువులు ఏకమైపోయాయి. జిల్లాలో మత్స్యకారులకు రూ.20 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. 312 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 100 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. 20 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు తెగిపోవడంతో ఇప్పటికీ 30 తీర గ్రామాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. కృష్ణా జిల్లాలో శనివారం కూడా భారీ వర్షాలు కురిశాయి. వరి, కొబ్బరి, అరటి, బొప్పాయితోపాటు దొండ, బీర తదితర కూరగాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. దాదాపు రెండువేల గృహాలు జలమయమయ్యాయి. గుంటూరు జిల్లాలో వరితోపాటు మినుము పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు : సీఎం తుపాను బాధితులకు యుద్ధప్రాతిపదికన సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హెలెన్ తుపాను నష్టాలు, సహాయ కార్యక్రమాలపై శనివారం ఆయన సమీక్షించారు. 31 మంది మత్స్యకారులు క్షేమం భీమవరం: పెను తుపాను కారణంగా నడి సముద్రంలో చిక్కుకుపోరుున కాకినాడ ప్రాంత మత్స్యకారులు శనివారం మధ్యాహ్నం క్షేమంగా తీరానికి చేరుకున్నారు. తుపాను తీరం దాటడంతో 31 మంది మత్స్యకారులు బోట్ల సాయంతో అంతర్వేదిలోని అన్నాచెల్లెళ్ల గట్టు (గోదావరి, సముద్రం కలిసే ప్రాంతం) మీదుగా నరసాపురంలోని రేవుకు చేరుకున్నారు. కాకినాడ ప్రాంతానికి చెందిన 31 మంది మత్స్యకారులు మూడు సోనా బోట్లు, ఒక ఫైబర్ బోటులో వేటకు బయల్దేరి సముద్రంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఏ జిల్లాలో ఎంత పంట నష్టం? తూర్పుగోదా‘వరి’పై ప్రకృతి పగ.. హెలెన్ దెబ్బకు 2.88 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. 80 వేలకు పైగా కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. 40 వేల ఎకరాల్లో కొబ్బరి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. 8,550 ఎకరాల్లో అరటి, 360 ఎకరాల్లో కూరగాయల పంటలు నీటమునిగాయి. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో వరి నీట మునిగింది. ఖరీఫ్‌లో మొత్తం 5.80 లక్షల ఎకరాల్లో వరి సాగవగా.. నెల రోజుల వ్యవధిలోనే అందులో 4.38 లక్షల ఎకరాలు దెబ్బతినడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పశ్చిమగోదావరి.. ఖరీఫ్ ఆశలు సమాధి జిల్లాలో 2.57 లక్షల ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. మొన్నటి వానలు, పై-లీన్ దెబ్బకు 1.36 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 6 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. వర్షాలతో దాదాపు 4 లక్షల ఎకరాలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం 2 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంట మిగిలింది. అది కూడా నీటిలో నానుతోంది. ఈ లెక్కన ఖరీఫ్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. ప్రస్తుత తుపానుతో 3 వేల ఎకరాల్లో అరటి, కూరగాయల పంటలు పనికిరాకుండా పోయాయి. 200కుపైగా కొబ్బరి చెట్లు నేలకూలాయి. హే ‘కృష్ణా’..! కృష్ణా జిల్లాలో హెలెన్ ధాటికి 2.25 లక్షల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. పొలాల్లో నీరు ఇంకా నిలిచే ఉంది. చేతికి రావాల్సిన పంటంతా చేనులోనే కుళ్లిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 200 కొబ్బరి చెట్లు కూలిపోయాయి. 500 ఎకరాల్లో అరటి, 400 ఎకరాల్లో కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి. గుంటూరు... గుండెకోత డెల్టా ఏరియాలో తుపానుతో 1.25 లక్షల ఎకరాల్లో వరిపంట నేలవాలింది. మరో 18 వేల ఎకరాల్లో మినుము కూడా దెబ్బతింది. తెనాలి, పొన్నూరు, కొల్లిపర్ల, కొల్లూరు, వేమూరు, చుండూరు, చెరుకుపల్లి, భట్టిప్రోలు మండలాల్లో వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. పలు విమానాలు రద్దు హెలెన్ తుపాను ప్రభావంతో శనివారం పలు విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉదయం 7 గంటలకు విజయవాడ బయలుదేరాల్సిన ఎస్జీ 1001, ఉదయం 8.55 గంటలకు రాజమండ్రి వెళ్లాల్సిన ఎస్జీ 1061 విమానం, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చెన్నై వెళ్లాల్సిన విమానాలను అధికారులు రద్దు చేశారు. చెన్నై, రాజమండ్రి, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన మరో మూడు విమానాలు కూడా రద్దయ్యాయి. కోస్తాకు వర్షసూచన సాక్షి, విశాఖపట్నం: హెలెన్ తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారినట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది ఉత్తర కర్ణాటక వద్ద స్థిరంగా ఉందన్నారు. దీని ప్రభావం పెద్దగా ఉండబోదని తెలిపారు. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల, ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల చెదురుమదురు వర్షాలు పడే అవకాశాలున్నట్టు చెప్పారు. వర్షపాతం వివరాలు.... గడచిన 24 గంటల్లో గుడివాడలో గరిష్టంగా 13 సెం.మీ. వర్షపాతం నమోదయింది. విజయవాడ, విశాఖపట్నంలో 10, మచిలీపట్నం 9, విశాఖపట్నం 7, భీమునిపట్నం, నూజివీడు 6, అవనిగడ్డ, అమలాపురం, రేపల్లె, కాకినాడలో 5, యలమంచిలి, అనకాపల్లి, పాడేరు, చోడవరం, అచ్చంపేట, నందిగామ 4, అనకాపల్లి, తణుకు, యలమంచిలి, మంచిర్యాల, శృంగవరపుకోట, నర్సాపురం, అరకులోయ, మంగళగిరి, న ర్సాపురం, పలాస, టెక్కలి, తుని, కైకలూరు, కోడేరు, గజపతినగరం 3, మందస, సాలూరు, విజయనగరం, రాజమండ్రి, రణస్థలం, పాతపట్నం, సోంపేట, కళింగపట్నం, పెద్దాపురం, చీపురుపల్లిలో 2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. మధిరలో 6 సెం.మీ., సూర్యాపేట, మిర్యాలగూడ 3, నల్గొండలో 2 సెం.మీ., రాయలసీమలోని పెరుమాళ్లపల్లి, చిత్తూరు, సత్యవేడులో ఒక్కో సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
మచిలీపట్నం వద్ద తప్పిన ముప్పు
= అయినా అప్రమత్తం = తీరప్రాంతాల్లోనే స్పెషల్ ఆఫీసర్లు = లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాకు హెలెన్ తుపాను ముప్పు తప్పింది. మచిలీపట్నం వద్ద శుక్రవారం తుపాను తీరం దాటిందని తెలుసుకోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తుపాను ముప్పు తప్పినప్పటికీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని సమాచారం రావడంతో లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పదకొండు తీర ప్రాంతాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. జిల్లాకు స్పెషల్ ఆఫీసర్‌గా వచ్చిన ఎంటీ కృష్ణబాబు, కలెక్టర్ విజయకుమార్‌లు పలు ప్రాంతాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యంగా చీరాల, వేటపాలెం, చినగంజాంల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని అవసరమైతే తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయా మండలాల అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్‌తోపాటు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లు అలాగే ఉంచారు. తుపాను తీవ్రత జిల్లాపై ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు రావడంతో జాతీయ విపత్తుల నివారణ సంస్థ నుంచి నలభై మంది ప్రత్యేక సిబ్బందిని జిల్లాకు పంపించారు. వారిని ఒంగోలు, సింగరాయకొండ ప్రాంతాల్లో ఉంచి పరిస్థితి సమీక్షించారు. అయితే తుపాను ముప్పు తప్పిందని తేలడంతో శుక్రవారం వారిని మచిలీపట్నం పంపించారు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కావడం, చల్లని గాలులు వీయడం, ఒకటి రెండుచోట్ల చినుకులు పడటంతో భారీ వర్షాలు కురుస్తాయేమోనని ప్రజలు భయాందోళనలు చెందారు. హై అలర్ట్ నుంచి రిలాక్స్.. హెలెన్ తుపాను తీవ్రత అంచనా వేయలేమంటూ రెండు రోజులుగా వస్తున్న హెచ్చరికలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పై-లీన్ ముప్పు తప్పినప్పటికీ ఆ తరువాత వచ్చిన భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. తొమ్మిది మందిని బలిగొనడంతోపాటు వందల కోట్ల రూపాయల నష్టం కలిగింది. రైతాంగాన్ని కోలుకోనీయకుండా చేసింది. భారీ వర్షాల బీభత్సం నుంచి క్రమంగా బయటపడుతున్న తరుణంలో హెలెన్ రూపంలో హెచ్చరికలు రావడంతో ప్రజలతోపాటు అధికారులు ఆందోళనకు గురయ్యారు. తుపాను ఒంగోలు వద్ద తీరం దాటుతుందని తొలిరోజు వాతావరణ కేంద్రం నుంచి హెచ్చరికలు రావడంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. జిల్లాలోని పదకొండు తీర ప్రాంతాల మండలాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించి యుద్ధప్రాతిపదికన అక్కడకు చేరుకొని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ విజయకుమార్ ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులను సకాలంలో రప్పించగలిగారు. అంతేగాకుండా వేటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న మత్స్యకారులను కూడా ఎక్కువ శాతం కట్టడి చేయగలిగారు. పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ స్తంభిస్తే ప్రజలు ఇబ్బందులు పడరాదన్న ఉద్దేశంతో బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను కూడా నిల్వ చేశారు. అధికారులు, సిబ్బంది అంతా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో సెలవులు పెట్టిన వారిని కూడా వెనక్కు రప్పించారు. ఒకవైపు వాతావరణ కేంద్రం హెచ్చరికలు, ఇంకోవైపు అధికారుల హడావుడి ఏర్పాట్లను చూసిన ప్రజలు ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందారు. ఎప్పటికప్పుడు తమ బంధువుల యోగక్షేమాలు తెలుసుకుంటూ గడిపారు. మచిలీపట్నం వద్ద తుపాను తీరం దాటిందని తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
మళ్లీ ముప్పు
=జిల్లాను వణికించిన తుపాను =ఖరీఫ్ వరికి అపార నష్టం =నేలకొరిగిన చోడి, అరటి =నిండుగా జలాశయాలు =అన్నదాతలు కన్నీరుమున్నీరు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : వరదల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రైతున్నను హెలెన్ తుపాను మరో సారి ముంచింది. సరిగ్గా పంట చేతికందుతుందన్న సమయంలో ఈదురుగాలులతో నేలమట్టం చేసింది. దానికి ఎడతెరిపిలేని వర్షాలు తోడవ్వడంతో అపార నష్టం వాటిల్లింది. కోసి పొలంలో ఉన్న వరిపనలు తడిసి ముద్దయ్యాయి. కంకులతో బరువుగా ఉన్న ఖరీఫ్ వరి నీట మునిగి కుళ్లిపోతోంది. చోడి, అరటి పంటలు నేలకొరిగాయి. కోతకు సిద్ధంగా ఉన్న చెరకు తోటలు చుట్టుకుపోయాయి. అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 3వేల హెక్టార్లలో వరి శతశాతం నష్టపోయినట్టు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. మరో 3వేల హెక్టార్లు వరద నీటిలో ఉండటంతో కాస్త నష్టం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే రైతులు మాత్రం నష్టం వేలాది ఎకరాల్లో ఉంటుందని అంటున్నారు. నెల రోజుల కిందటే సరిగ్గా నెల రోజుల కిందటే ఇదే సమయానికి అల్పపీడనం జిల్లాను అతలాకుతలం చేసింది. గ్రామాలను నీట ముంచి రూ.వందల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. రైతులు తేరుకోక ముందే హెలెన్ తుపాను ముంచుకొచ్చింది. దీని ప్రభావంతో రెండ్రోజులుగా వర్షాలతోపాటు గంటకు 50నుంచి 70కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులకు వరిలో పొడవు రకాలయినఆర్జేఎల్, సోనామసూరి, సాంభమసూరి వంటివి నేలకొరిగిపోయి నీటమునిగాయి. ఖండిపల్లి, దామునాపల్లి,చుక్కపల్లి,చోడవరం, పరిసరాల్లో వరిపంటపై నుంచి రైవాడ కాలువ నీరు పొంగి ప్రవహించడంతో సుమారు 400 ఎకరాలు పూర్తిగా నీటమునిగింది. వర్షం తీవ్రత లేనప్పటికీ గాలులు బలంగా వీయడంతో వరిచేలు నేరకొ రిగాయి. ఒరిగిన పంటను పైకి లేపి దుబ్బులుగా కట్టుకొంటూ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జలాశయాలు నిండుగా ఉన్నాయి. ఇన్‌ఫ్లో పెరిగితే ఏక్షణాన పొంగుతాయోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు. తుపాను తీరందాటినప్పటికీ దాని ప్రభావం మరో 48 గంటల పాటు ఉంటుంది. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాం గం అప్రమత్తమైంది. ఏజెన్సీ మండలాల్లోనూ తుపాను ప్రభావం కనిపిస్తోంది. ఏపుగా కోతకు సిద్ధంగా ఉన్న చోడి పంటంతా నేలమట్టమైంది. రోజుల తరబడి నీటి నిల్వ తో రాజ్మా పంట కుళ్లిపోతోంది. జిల్లాలో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 వరకు 2.81 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నగరంలో మాత్రం ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. గాజువాకలో 10.5 సెం.మీ., పెదగంట్యాడలో 10.46 సెం.మీ., విశాఖపట్నం అర్బన్‌లో 6.7 సెం.మీ., విశాఖ రూరల్‌లో 6.5 సెం.మీ, సబ్బవరంలో 5.4 సెం.మీ. వర్షం పడింది. మిగిలిన మండలాల్లో మూడు సెం.మీ. వరకు వర్షం పడినట్లు అధికారులు చెబుతున్నారు. విశాఖలో భారీ వర్షం కారణంగా మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ గెట్లు ఎత్తి 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చే స్తున్నారు. అధికారులు అప్రమత్తం హెలెన్ తుపాను కారణంగా జిల్లాలో వర్షాలు పడుతున్నప్పటికీ ఎటువంటి నష్టం లేదని, అధికారులు అప్రమత్తంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రత్యేకాధికారులు మండలాల్లోనే ఉంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. పునరావాస కేంద్రాలు సిద్ధం చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎవరినీ తరలించలేదన్నారు. భారీ వర్షాలు పడినప్పటికీ నష్ట శాతాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. -
‘హెలెన్’ బీభత్సం
=బందరు వద్ద తీరందాటిన తుపాను =జిల్లాలో ఇద్దరు మృతి =పలుచోట్ల నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు =విద్యుత్ సరఫరాకు అంతరాయం =ఈదురుగాలులకు నేలవాలిన వరిచేలు =24 గంటలపాటు వర్షాలు =తీరందాటే సమయంలో తీవ్రత తగ్గటంతో ఊపిరిపీల్చుకున్న జిల్లావాసులు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : గత మూడు రోజులుగా జిల్లాను వణికిస్తున్న హెలెన్ తుపాను శుక్రవారం మచిలీపట్నం వద్ద మధ్యాహ్నం 1.30 సమయంలో తీరం దాటింది. తుపాను ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి తుపాను తీవ్రత పెరిగింది. గంటకు 120 కిలోమీటర్ల వేగం కన్నా పైగా గాలులు వీయటంతో పాటు వర్షం కురిసింది. ఉదయం 11.30 గంటల సమయంలో నరసాపురం వైపు తుపాను తీరందాటే అవకాశముందని భావించినా.. ఆ తర్వాత దిశ మార్చుకుని మచిలీపట్నం వద్ద తీరం దాటింది. తుపాను తీరానికి చేరే సమయానికి తీవ్రత తగ్గటంతో ఉప్పునీరు గ్రామాల్లోకి చొచ్చుకురాలేదు. దీంతో అధికారులు, తీరప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరిని బలిగొన్న తుపాను... తుపాను కారణంగా బలమైన గాలులు వీయటంతో కొబ్బరిచెట్టు విరిగిపడి కృత్తివెన్ను మండలం శీతనపల్లికి చెందిన గరికిముక్కు కాంతారావు (60), బందరు మండలం వైఎస్సార్‌నగర్‌లో విద్యుత్ స్తంభం విరిగి మీదపడి కారే జగన్నాథం (42) మృతిచెందారు. జగన్నాథం స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ. మంత్రి రఘువీరా సందర్శన... మచిలీపట్నం హిందూ కళాశాలలో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరాన్ని కలెక్టర్ ఎం.రఘునందనరావుతో కలిసి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి పరిశీలించారు. పునరావాస శిబిరాల్లో ఖర్చుకు వెనుకాడకుండా సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. భీతావహ వాతావరణం... తుపాను తీరందాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మితిమీరిన వేగంతో వచ్చిన అలలకు గాలి, వర్షం తోడవటంతో సముద్రం సమీపంలో భయానక వాతావరణం నెలకొంది. సముద్రపు అలలు నాలుగు మీటర్ల కన్నా ఎత్తున లేచిపడ్డాయి. మంగినపూడి బీచ్‌లో 700 మీటర్ల మేర సముద్రపునీరు చొచ్చుకువచ్చింది. తుపాను తీరం దాటే సమయంలో తొలుత దక్షిణంవైపు నుంచి అనంతరం దిశ మారి తూర్పువైపు నుంచి బలమైన గాలులు వీచాయి. ఎప్పటికప్పుడు కలెక్టర్ సమీక్ష... తుపాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు కలెక్టర్ ఎం.రఘునందనరావు సమీక్షించి అధికారులకు సూచనలు అందజేశారు. జాయింట్ కలెక్టర్ చాంబర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తుపాను మచిలీపట్నం వద్ద తీరం దాటినట్లు కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. తుపాను ప్రభావంతో 24 గంటలపాటు వర్షాలు కురుస్తాయన్నారు. ఆరు నుంచి ఏడు గంటలపాటు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. తుపాను ప్రభావిత మండలాల్లో 22 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిలో 5,358 మందికి పునరావాసం కల్పించినట్లు వివరించారు. వర్షం తగ్గిన తరువాత క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంట నష్టం అంచనా వేస్తామన్నారు. చిగురుటాకుల్లా వణికిన గ్రామాలు... తుపాను ప్రభావంతో శుక్రవారం 11 గంటల వరకు వాతావరణం ప్రశాంతంగానే కనిపించినా ఆ తర్వాత ఒక్కసారిగా మార్పు కనిపించింది. దక్షిణ దిశ నుంచి వీచిన బలమైన గాలులతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. గాలులతో పాటే వర్షం ప్రారంభం కావటంతో సముద్రతీరంలోని గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. రైతుల ఆశలపై నీళ్లు... హెలెన్ తుపాను రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. కొద్దిరోజుల్లో ధాన్యం ఇంటికి చేరుతుందని ఆశిస్తున్న రైతులకు నిరాశ మిగిల్చింది. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. ప్రస్తుతం వరి పంట కోతకు సిద్ధమైంది. నాలుగు గంటల పాటు 120 కిలోమీటర్ల కన్నా వేగంతో గాలులు వీయటంతో అనేకచోట్ల కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలవాలింది. నేలవాలిన వరిపై వర్షం కురవటంతో ధాన్యం మొక్క మొలుస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖాధికారులు సూచించిన విధంగా 24 గంటల పాటు వర్షాలు కురిస్తే నేలవాలిన వరిపైకి వర్షపునీరు చేరి కంకులు మొలకెత్తే ప్రమాదముందని రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్ తదితరులు కృత్తివెన్నులో పర్యటించి నేలవాలిన వరిని పరిశీలించారు. పొలంలో ఉన్న నీటిని త్వరితగతిన బయటకు పంపాలని, ధాన్యం మొలకెత్తకుండా ఉప్పునీటి ద్రావణాన్ని కంకులపై పిచికారీ చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం... శుక్రవారం ఉదయం 11 గంటల సమయం నుంచి జిల్లా వ్యాప్తంగా బలమైన గాలులు వీచాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో తీగలు తెగిపడ్డాయి. దీంతో గంటలకొద్దీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖాధికారులు తెగిపోయిన విద్యుత్ వైర్లను సరిచేసే పనిలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కొంత ఆలస్యమైనా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. -
హెలెన్ తుపానుపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం హెలెన్ తుపానుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏకె మహంతితో పాటు ఉన్నతాధికారులుతో సమీక్ష జరిపారు. సముద్ర తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులును ఆదేశించారు. జాతీయ విపత్తు నివారణ సంస్థతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. అవసరం అయితే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తుర్పూ, పశ్చిమ, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. జిల్లా అధికార యంత్రాగం జాతీయ విపత్తు నివారణ సంస్థ బృందాలతో కలిసి పనిచేయాలన్నారు. కాగా తూర్పుగోదావరి జిల్లాలో సముద్రంలో చిక్కుకున్న 20మంది మత్స్యకారులను నేవీ సిబ్బంది రక్షించారు. హెలికాప్టర్ సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి -
మచిలీపట్నానికి చేరువలో హెలెన్ తుపాను
మచిలీపట్నం : తీరానికి మరింత చేరువైన హెలెన్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా...140 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయ్యింది. ఈరోజు మధ్యాహ్నం మచిలీపట్నం-నర్సాపురం మధ్య... తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ సమయంలో గంటకు 70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. దీంతో తుఫాను తీవ్రత తూర్పు తీరప్రాంతమంతా ఉండనుంది. తీరం వెంబడి సముద్రంలో అలలు భారీగా ఎగసి పడుతున్నాయి. మచిలీపట్నం, బంటుమిల్లి, బందర్, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలపై తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ మధ్యాహ్నం మచిలీపట్నం-నర్సాపురం మధ్య తుఫాను తీరందాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండడంతో తీరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు గజగజలాడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కాకినాడలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పాడ - కాకినాడ బీచ్ లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుపాను దృష్ట్యా ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో... 10వ నంబర్ , కాకినాడ ఓడరేవులో 9వ నెంబరు, విశాఖ, గంగవరం, భీమిలి, కళింగపట్నం ఓడరేవుల్లో... 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. ఇక తీరప్రాంతంలో ఉన్న పాఠశాలలకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ సెలవు ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.... సెలవులో ఉన్న సిబ్బంది తక్షణమే విధుల్లోకి చేరాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో హెలెన్ దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. జిల్లా అధికారులతో కలెక్టర్ సిద్దార్ధ జైన్ సమావేశమై పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఎనిమిది మండలాల పరిధిలో 37 గ్రామాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఇక గుంటూరు జిల్లా పైన కూడా తుపాన్ ప్రభావం నెలకొంది. 39 గ్రామాలకు తుపాన్ ప్రభావం ఉంది. సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అలాగే నెల్లూరు జిల్లాపై కూడా హెలెన్ తుపాను ప్రభావం చూపుతోంది. సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హెలెన్ తుపాను హెల్ప్‌లైను నంబర్లు కాకినాడ: 0884 - 2365506 ఏలూరు: 08812 - 230050 నరసాపురం: 08814 - 27699 కొవ్వూరు: 08813 - 231488 జంగారెడ్డిగూడెం: 08812 - 223660 మచిలీపట్నం: 08672 - 252572, 1077 విజయవాడ: 0866 - 2576217 విశాఖ: 1800 - 42500002 -
హడలెత్తిస్తున్న హెలెన్
సాక్షి, ఏలూరు :హెలెన్ తుపాను ‘పశ్చిమ’ ప్రజలను హడలెత్తిస్తోంది. దిశమార్చుకున్న తుపాను నరసాపురం-మచిలీపట్నం మధ్య కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బుధవారం రాత్రి వరకూ తుపాను ప్రభావం జిల్లాపై లేకపోవడంతో ప్రజలు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తుపాను ఉన్నట్టుండి దిశమార్చుకుందని, కృష్ణా-పశ్చిమగోదావరి జిల్లాల మధ్య శుక్రవారం మధ్యాహ్నానికి తీరందాటే అవకాశం ఉందని సమాచారం వెలువడింది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉం దని హెచ్చరికలు జారీ అయ్యూయి. తుపాను ప్రభావంతో గురువారం జిల్లావ్యాప్తంగా జల్లులు పడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం మేఘావృతమై ఉండగా, తీరప్రాంతం కల్లోలంగా మారింది. వరి కోతలు చేపట్టిన రైతులకు వణుకు పట్టుకుంది. ఏ క్షణాన భారీ వర్షాలు కురిసి పంటను మింగేస్తాయోనని కలవరపడుతున్నారు. పంటను దక్కించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తుపాను సమాచారం నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. నరసాపురం డివిజన్‌పై పెను ప్రభావం నరసాపురం-మచిలీపట్నం మధ్య కేంద్రీకృతమైన హెలెన్ శుక్రవారం మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం ఉంది. గురువారం సాయంత్రం నుంచి తీరం వెంబడి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. హెలెన్ తీవ్ర తుపానుగా మారే ప్రమాదం ఉంది. అలలు మీటరు నుంచి మీటరున్నర ఎత్తుకు ఎగసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం తీరానికి సమీపంలో గల నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి, భీమవరం మండలాలపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో బియ్యపుతిప్ప, మర్రితిప్ప, దర్భరేవు, పెదమైనవానిలంక, లక్ష్మణేశ్వరం, కేపీ పాలెం, లోసరి, దొంగపిండి, నాగిడిపాలెం, వెదుర్లంక, వేములదీవి, యర్రంశెట్టివారి పాలెం గ్రామాల ప్రజలను యుద్ధప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. ప్రజలు మొండిగా వ్యవహరించకుండా అధికారులకు సహకరించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ విజ్ఞప్తి చేశారు. నరసాపురం ప్రాంతానికి జాతీయ విపత్తుల నివారణ బృందాలను పంపించాలని ప్రభుత్వాన్ని కోరారు. రెవెన్యూ మంత్రి ప్రత్యేక దృష్టి తుపాను నేపథ్యంలో ప్రజలను, వారి ఆస్తులను రక్షించేందుకు అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సిద్ధార్థజైన్‌తో ఆయన మాట్లాడారు. అత్యవసరమైతే తీరప్రాంత ప్రజలను బలవంతంగానైనా సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణనష్టం జరగకుండా చూడాలని మంత్రి ఆదేశిం చారు. తుపాను బాధిత ప్రజలకు పునరావాస కార్యక్రమాలు అమలు చేయడంలో కొత్త సర్పంచ్‌లను భాగస్వాములను చేయాలన్నారు. సమాచార వ్యవస్థలకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. చేపల వేటకు వెళ్లిన వారిని వెనక్కి రప్పించేందుకు మత్స్య శాఖ అధికారులతో తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులెవరైనా సెలవులో ఉంటే వెనక్కి పిలిపించాలని ఆదేశించారు. నిధుల కోసం వెనకడుగు వేయవద్దని సూచించారు. భారీ వర్షం కురుస్తుంది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మాట్లాడుతూ తుపాను ప్రభావంతో 25 సెంటీమీటర్ల వరకూ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విపత్తుల నివారణ సంస్థ కమిషనర్ సి.పార్థసారథి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం డివిజన్లో అత్యంత అప్రమత్తతతో ఉండాలన్నారు. రైతుల గుండెల్లో ‘తుపాను’ ఖరీఫ్ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో హెలెన్ తుపాను ముంచుకొస్తుండటం రైతుల్ని కలవరపెడుతోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 6లక్షల ఎకరాల్లో వరి పండించగా, సుమారు లక్ష ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. వీటిలో 30 శాతం పంట పనలపై ఉంది. మెట్టలో 70 శాతం కోతలు పూర్తయ్యాయి. తుపాను తీవ్రమైతే డెల్టాలోని లక్షలాది ఎకరాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పంటను కాపాడుకోవడానికి, కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోవడానికి కర్షకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో కాలువలకు నీటి విడుదలను తగ్గించారు.