హెలెన్..విలన్
సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: చి‘వరి’ ఆశా చితికిపోయింది. ఖరీఫ్ కన్నీళ్లనే మిగిల్చింది. నెలరోజుల వ్యవధిలోనే మూడు విపత్తులు విరుచుకుపడడంతో అన్నదాత వెన్నువిరిగింది. కిందటి నెలలో పై-లీన్, భారీ వర్షాలకుతోడు ఇప్పుడు హెలెన్ దెబ్బకు పంటలన్నీ సర్వనాశనమయ్యాయి. ముఖ్యంగా కోస్తాంధ్రలో వరిపై ఆశలు పూర్తిగా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల రోజుల్లోనే లక్షల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. పై-లీన్, భారీ వర్షాల వల్ల అధికారిక లెక్కల ప్రకారమే 33 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు హెలెన్ తుపానువల్ల మరో 11.35 లక్షల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది.
ఇది వ్యవసాయ శాఖకు అందిన ప్రాథమిక సమాచారం మాత్రమే. వాస్తవానికి నీట మునిగిన వరి విస్తీర్ణం 15 లక్షల ఎకరాలుపైనే ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ నష్టం అధికంగా ఉంది. ఒక్క వరి పంటే కాదు.. కొబ్బరి, అరటి, మామిడి తోటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. ఉభ య గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోనే లక్షకు పైగా కొబ్బరి చెట్లు నేలకూలాయి. వేలాది ఎకరాల్లో అరటి, మామిడి దెబ్బతిన్నాయి. మిరప, బెండ, వంగ తదితర కూరగాయల పంటలూ పాడయ్యాయి. మినుము, పెసర పంటలు నీటిలో కుళ్లుతున్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే కోత కోసిన పంట, మరికొన్ని చోట్ల మరో వారం రోజుల్లో కోయాల్సిన వరి నీటిపాలు కావడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
నెల రోజుల్లో వచ్చిన మూడో విపత్తుతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వర్షాభావ పరిస్థితుల్లో అష్టకష్టాలు పడి పెట్టిన పంటలు తీరా కోతకొచ్చే సమయంలో ఇలా నీటిపాలు కావడంతో రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటివరకు కోస్తా ప్రాంతంలో 25 వేల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. హెలెన్ బీభత్సంలో తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం ఏడుగురు మృతి చెందగా.. శనివారం మరో నలుగురు చనిపోయారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు వృద్ధులు చలిగాలుల తీవ్రతకు తట్టుకోలేక ప్రాణాలు వదిలారు. ఇదే జిల్లాలో పంటనష్టాన్ని తట్టుకోలేక నందివాడ మండలం తుమ్మపల్లి గ్రామానికి చెందిన కౌలురైతు మసిముక్కు శ్యామలరాజు (50) గుండెపోటుతో మృతిచెందారు.
ఎంత కష్టం... ఎంత నష్టం
హెలెన్ తుపాను ఉభయ గోదావరులకు ‘విలన్’గా మారింది. వరిపంటనే కాదు.. కోనసీమ కల్పవృక్షమైన కొబ్బరిని సైతం అమాంతం మింగేసింది. ఒక్క ఈ ప్రాంతంలో తుపాను దెబ్బకు 80 వేలకు పైన చెట్లు నేలకూలాయి. 40 వేల ఎకరాల్లో కొబ్బరి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుంది. మొవ్వు పూర్తిగా సుడులు తిరిగి పోవడంతో కొబ్బరి పూర్తిగా రాలిపోయింది. దీంతో ఈ ఏడాది దిగుబడి పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఒక్క తూర్పుగోదావరిలోనే వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు రూ.320 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. వరి రైతు బాధలు అయితే వర్ణనాతీతం.
తీరప్రాంత మండలాల్లో కోతలు కూడా కోయించలేని పరిస్థితి ఏర్పడింది. సుమారు 91,220 ఎకరాల్లో పనల దశలో ఉన్న పంట రంగుమారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో మత్స్యకారులకు చెందిన 25కు పైగా బోట్లు కొట్టుకుపోయాయి. సుమారు 400 బోట్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి నుంచి 615 గ్రామాలు అంధకారంలో చిక్కుకోగా, శనివారం సాయంత్రానికి 140 గ్రామాల్లో అతి కష్టమ్మీద సరఫరాను పునరుద్ధరించగలిగారు.
మిగిలిన 475 గ్రామాలకు పునరుద్ధరించాలంటే మరో వారం పైగా పడుతుందని చెబుతున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో 600 గ్రామాలకు తాగునీరందని పరిస్థితి నెలకొంది. పశ్చిమగోదావరిలో కూడా తుపాను పెను బీభత్సమే సృష్టించింది. రైతులకు రూ.500 కోట్ల మేర నష్టం మిగిల్చింది. దాదాపు 200పైగా కొబ్బరి చెట్లు విరిగిపోయాయి. గాలి వాన బీభత్సానికి 882 ఇళ్లు దెబ్బతిన్నాయి. 116 కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయి. చేపలు, రొయ్యల చెరువులు ఏకమైపోయాయి. జిల్లాలో మత్స్యకారులకు రూ.20 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. 312 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 100 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. 20 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు తెగిపోవడంతో ఇప్పటికీ 30 తీర గ్రామాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. కృష్ణా జిల్లాలో శనివారం కూడా భారీ వర్షాలు కురిశాయి. వరి, కొబ్బరి, అరటి, బొప్పాయితోపాటు దొండ, బీర తదితర కూరగాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. దాదాపు రెండువేల గృహాలు జలమయమయ్యాయి. గుంటూరు జిల్లాలో వరితోపాటు మినుము పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు : సీఎం
తుపాను బాధితులకు యుద్ధప్రాతిపదికన సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హెలెన్ తుపాను నష్టాలు, సహాయ కార్యక్రమాలపై శనివారం ఆయన సమీక్షించారు.
31 మంది మత్స్యకారులు క్షేమం
భీమవరం: పెను తుపాను కారణంగా నడి సముద్రంలో చిక్కుకుపోరుున కాకినాడ ప్రాంత మత్స్యకారులు శనివారం మధ్యాహ్నం క్షేమంగా తీరానికి చేరుకున్నారు. తుపాను తీరం దాటడంతో 31 మంది మత్స్యకారులు బోట్ల సాయంతో అంతర్వేదిలోని అన్నాచెల్లెళ్ల గట్టు (గోదావరి, సముద్రం కలిసే ప్రాంతం) మీదుగా నరసాపురంలోని రేవుకు చేరుకున్నారు. కాకినాడ ప్రాంతానికి చెందిన 31 మంది మత్స్యకారులు మూడు సోనా బోట్లు, ఒక ఫైబర్ బోటులో వేటకు బయల్దేరి సముద్రంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.
ఏ జిల్లాలో ఎంత పంట నష్టం?
తూర్పుగోదా‘వరి’పై ప్రకృతి పగ..
హెలెన్ దెబ్బకు 2.88 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. 80 వేలకు పైగా కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. 40 వేల ఎకరాల్లో కొబ్బరి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. 8,550 ఎకరాల్లో అరటి, 360 ఎకరాల్లో కూరగాయల పంటలు నీటమునిగాయి. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో వరి నీట మునిగింది. ఖరీఫ్‌లో మొత్తం 5.80 లక్షల ఎకరాల్లో వరి సాగవగా.. నెల రోజుల వ్యవధిలోనే అందులో 4.38 లక్షల ఎకరాలు దెబ్బతినడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
పశ్చిమగోదావరి.. ఖరీఫ్ ఆశలు సమాధి
జిల్లాలో 2.57 లక్షల ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. మొన్నటి వానలు, పై-లీన్ దెబ్బకు 1.36 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 6 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. వర్షాలతో దాదాపు 4 లక్షల ఎకరాలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం 2 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంట మిగిలింది. అది కూడా నీటిలో నానుతోంది. ఈ లెక్కన ఖరీఫ్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. ప్రస్తుత తుపానుతో 3 వేల ఎకరాల్లో అరటి, కూరగాయల పంటలు పనికిరాకుండా పోయాయి. 200కుపైగా కొబ్బరి చెట్లు నేలకూలాయి.
హే ‘కృష్ణా’..!
కృష్ణా జిల్లాలో హెలెన్ ధాటికి 2.25 లక్షల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. పొలాల్లో నీరు ఇంకా నిలిచే ఉంది. చేతికి రావాల్సిన పంటంతా చేనులోనే కుళ్లిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 200 కొబ్బరి చెట్లు కూలిపోయాయి. 500 ఎకరాల్లో అరటి, 400 ఎకరాల్లో కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి.
గుంటూరు... గుండెకోత
డెల్టా ఏరియాలో తుపానుతో 1.25 లక్షల ఎకరాల్లో వరిపంట నేలవాలింది. మరో 18 వేల ఎకరాల్లో మినుము కూడా దెబ్బతింది. తెనాలి, పొన్నూరు, కొల్లిపర్ల, కొల్లూరు, వేమూరు, చుండూరు, చెరుకుపల్లి, భట్టిప్రోలు మండలాల్లో వరికి తీవ్ర నష్టం వాటిల్లింది.
పలు విమానాలు రద్దు
హెలెన్ తుపాను ప్రభావంతో శనివారం పలు విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉదయం 7 గంటలకు విజయవాడ బయలుదేరాల్సిన ఎస్‌జీ 1001, ఉదయం 8.55 గంటలకు రాజమండ్రి వెళ్లాల్సిన ఎస్‌జీ 1061 విమానం, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చెన్నై వెళ్లాల్సిన విమానాలను అధికారులు రద్దు చేశారు. చెన్నై, రాజమండ్రి, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన మరో మూడు విమానాలు కూడా రద్దయ్యాయి.
కోస్తాకు వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం: హెలెన్ తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారినట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది ఉత్తర కర్ణాటక వద్ద స్థిరంగా ఉందన్నారు. దీని ప్రభావం పెద్దగా ఉండబోదని తెలిపారు. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల, ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల చెదురుమదురు వర్షాలు పడే అవకాశాలున్నట్టు చెప్పారు.
వర్షపాతం వివరాలు....
గడచిన 24 గంటల్లో గుడివాడలో గరిష్టంగా 13 సెం.మీ. వర్షపాతం నమోదయింది. విజయవాడ, విశాఖపట్నంలో 10, మచిలీపట్నం 9, విశాఖపట్నం 7, భీమునిపట్నం, నూజివీడు 6, అవనిగడ్డ, అమలాపురం, రేపల్లె, కాకినాడలో 5, యలమంచిలి, అనకాపల్లి, పాడేరు, చోడవరం, అచ్చంపేట, నందిగామ 4, అనకాపల్లి, తణుకు, యలమంచిలి, మంచిర్యాల, శృంగవరపుకోట, నర్సాపురం, అరకులోయ, మంగళగిరి, న ర్సాపురం, పలాస, టెక్కలి, తుని, కైకలూరు, కోడేరు, గజపతినగరం 3, మందస, సాలూరు, విజయనగరం, రాజమండ్రి, రణస్థలం, పాతపట్నం, సోంపేట, కళింగపట్నం, పెద్దాపురం, చీపురుపల్లిలో 2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. మధిరలో 6 సెం.మీ., సూర్యాపేట, మిర్యాలగూడ 3, నల్గొండలో 2 సెం.మీ., రాయలసీమలోని పెరుమాళ్లపల్లి, చిత్తూరు, సత్యవేడులో ఒక్కో సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.