khareef
-
భళిభళిరా.. బలి
జయపురం(భువనేశ్వర్): సబ్ డివిజన్ పరిధిలోని కుంద్రా గ్రామంలో ఇసుక పండగ(బలి జాతర)ను సోమవారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో పరిసర గ్రామాలకు చెందిన గ్రామ దేవతల లాఠీలు పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మార్కెట్ వద్ద వివిధ రకాల వస్తువులు, ఆహార పదార్థాల కొనుగోలుకు జనం ఆసక్తి చూపారు. గ్రామీణ వ్యవసాయ రంగంలో బలి జాతరకు అధిక ప్రాధాన్యమిస్తారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఆదివాసీలు జరుపుకొనే ప్రధాన పండుగల్లో ఇది కూడా ఒకటి. వర్షాకాలం ప్రారంభానికి సూచికగా బలి జాతర చేపట్టడం విశేషం. ఖరీఫ్ కాలంలో ఏ పంటలు వేస్తే ఉత్తమ దిగుబడులు సాధించవచ్చో తెలుసుకొకనే సూచికగా బలిజాతర జరపడం ఆనవాయితీ. పండగ కోసం ఆదివాసీ దిసారి(పూజారులు) మంచి రోజు నిర్ణయిస్తారు. ఆ రోజు మిగతా గ్రామాల దేవతలకు పూజలు చేసి, ఆమె ప్రతినిధిగా లాఠీ(జెండా)లతో వెదురుబుట్ట పట్టుకుని సమీపంలోని నదికి వెళ్తారు. నదిలో ఇసుకను గ్రామానికి తీసుకు వచ్చి, గ్రామదేవత గుడి ప్రాంగణంలో ప్రతిష్టించి, ఇళ్ల నుంచి సేకరించిన వివిధ రకాల విత్తనాలను ఇసుక బుట్టలో వేస్తారు. మొలకెత్తిన విత్తనాలు పరిశీలించి, బాగా మొలకెత్తిన పంట విత్తనాలు ఖరీఫ్ కాలంలో వేస్తే అధిక దిగుబడి సాధించవచ్చని అభిప్రాయానికి వచ్చారు. ఈ ఇసుక పండగకు వివిధ గ్రామాల ప్రజలను ఆహ్వానించారు. చదవండి: భారత్‌కు మంకీపాక్స్ ముప్పు.. ఇలా అనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే! -
నీళ్లివ్వకపోతే ఆత్మహత్యలే
‘మా పొలాల వెంటే తెలుగుగంగ కాలువలో నీరు వెళుతోంది. కానీ ఏం ప్రయోజనం? మా పొలాలకు నీటిని వదలడం లేదు. వర్షాలు లేక కరువుతో అల్లాడుతున్నాం. తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా నీరు వదలాలి. లేకపోతే కార్యాలయం వద్దే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామ’నిశిరివెళ్ల మండల రైతులు నంద్యాలపట్టణంలోని తెలుగుగంగ కార్యాలయం వద్ద శుక్రవారం అందోళన చేపట్టారు. కర్నూలు, నంద్యాల: శిరివెళ్ల మండలం గోవిందపల్లె వద్ద తెలుగుగంగ కాలువ 13వబ్లాక్ కింద తొమ్మిది వేల ఎకరాల సాగుభూమి ఉంది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి వదిలిన నీటితో తెలుగుగంగ కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా ఈ సాగుభూమికి చుక్కనీరు వదలడం లేదు. పైగా ప్రస్తుత ఖరీఫ్‌లో వర్షాలు లేక రైతులు, ప్రజలు తాగు, సాగునీరుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగు గంగ కాలువలో నీరు పుష్కలంగా ప్రవహిస్తున్నా.. పొలాలకు ఇవ్వకపోవడంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. శుక్రవారం పురుగు మందు డబ్బాలతో తెలుగుగంగ కార్యాలయానికి చేరుకున్నారు. తమ గ్రామ పొలాలకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. పొలాలు ఎత్తులో ఉన్నందున నీళ్లురావడం కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్పడంతో రైతులు మండిపడ్డారు. కాలువలో నీళ్లు తక్కువగా ఉంటే మీరు చెప్పిన మాటలు నమ్ముతామని, ఇప్పుడు ఉధృతంగా ప్రవహిస్తున్నందున నీరు వదలాల్సిందేనని స్పష్టం చేశారు. లేనిపక్షంలో ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామంటూ వెంటతెచ్చుకున్న పురుగుల మందుల డబ్బాలను పైకెత్తారు. తెలుగుగంగ ఈఈ పురుషోత్తంరెడ్డి స్పందిస్తూ ఈ రాత్రికే బ్లాక్ కాలువను తాను పరిశీలిస్తానని హామీ ఇచ్చినా వారు వినలేదు. వరిపైరు ఎండుతోందని, తక్షణమే నీరివ్వాలని పట్టుబట్టారు. చివరకు పొలాలకు నీరందించే బాధ్యత తాను తీసుకుంటానని ఈఈ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
పంట ఎండి.. కడుపు మండి..
కర్నూలు, కృష్ణగిరి: ఈ ఖరీఫ్ అన్నదాతలను పూర్తిగా ముంచేసింది. ఏ గ్రామమెళ్లినా ఎండిన పంటలు.. అన్నదాతల కంట కన్నీళ్లే కనిపిస్తున్నాయి. కృష్ణగిరి మండలంలో ఈ ఖరీఫ్‌లో 12,162 హెక్టార్లలో వేరుశనగ, 4,092 హెక్టార్లలో పత్తి, 2,024హెక్టార్లలో ఆముదం, 4, 284 హెక్టార్లలో కంది పంటలను సాగు చేశారు. మొదటి నుంచి వర్షాభావ పరిస్థితులు వెంటాడుతుండడంతో వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో రైతులు ఆశలు వదిలేసుకున్నారు. కొందరు రైతులు పంటను తొలగించేస్తున్నారు. అమకతాడు గ్రామంలో శుక్రవారం కె.రామకృష్ణ, తలారి కుళ్లాయి అనే రైతులు తమ పొలాల్లో ఎండిన వేరుశనగ పంటను ఎద్దులతో తొలగించారు. ఇలా మండల వ్యాప్తంగా పంటను తొలగించేందుకు చాలామంది సిద్ధమయ్యారు. విత్తనాలు, సేద్యాలు, ఎరువులు, కూలీల ఖర్చుల కింద ఎకరాకు రూ.15 వేల వరకు ఖర్చు చేసినట్లు రైతులు తెలిపారు. మండలంలో ఇలాంటి పరిస్థితులు గత 60 ఏళ్లలో ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదని మా పెద్దలు కూడా అంటున్నారు. నాకు 18ఎకరాల భూమి ఉంది. నాలుగు ఎకరాల్లో వేరుశనగ, ఐదు ఎకరాల్లో పత్తి, మరో 9ఎకరాల్లో కంది పంటను జూన్ 10, 11తేదీల్లో సాగు చేశా. పంట సాగు చేసినప్పటి నుంచి ఇంతవరకు చిరుజల్లులే తప్పా భారీ వర్షం పడలేదు. వేరుశనగ, పత్తిసాగుకు ఎకరాకు రూ.15 వేల వరకు ఖర్చు పెట్టా. వర్షం లేక పంట ఎండిపోతుంటే గుండె తరుక్కుపోతోంది. అందువల్లే వేరుశనగ తొలగించేస్తున్నా. పత్తి ఎలాంటి ఎదుగుదల లేకపోవడంతో గొర్రెలకు మేపేశాం. వేరుశనగ పంటపై మందులు పిచికారీ చేయడంతో పశువుల మేతకు కూడా పనికి రాకుండా పోయింది. కష్టాల్లో ఉన్న మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.– రామకృష్ణ, అమకతాడు -
ఖాతాలో వద్దు.. చెక్ ముద్దు
సాక్షి, హైదరాబాద్ రైతులకు పెట్టుబడి పథకం కింద అందించే సొమ్మును చెక్కుల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కూలంకషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి ఎకరాకు రూ.4 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సీజన్‌కు రూ.4 వేల చొప్పున ఖరీఫ్, రబీలకు కలిపి రూ.8 వేలు ఇవ్వనుంది. దీంతో అక్రమార్కులు చొరబడకుండా ఆచితూచి వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు పెట్టుబడి సొమ్ము ఎలా అందజేయాలన్న అంశంపై సీఎం కార్యాలయం రెండ్రోజుల కింద వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించింది. ఇందులో రెండు మూడు రకాల సలహాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో 45 లక్షల మంది రైతులకు రూ.4 వేల చొప్పున ఒక్కో సీజన్‌కు రూ.1,800 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఒక్క పైసా కూడా పక్కదారి పట్టకూడదన్న ఉద్దేశంతో సీఎం కార్యాలయం కసరత్తు చేసినట్లు సమాచారం. చెక్‌ల వైపే మొగ్గు ఎందుకంటే..? పెట్టుబడి సొమ్మును నేరుగా రైతు ఖాతాల్లో జమ చేసే ప్రతిపాదనపై సమావేశంలో చర్చ జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రైతులు పంట రుణాలు తీసుకుంటారు. అయితే అనేక కారణాలతో వాటిని చెల్లించనివారు అనేక మంది ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతు ఖాతాల్లో పెట్టుబడి సొమ్ము జమ చేస్తే బ్యాంకులు వాటిని బకాయిల కింద జమ చేసుకుంటాయి. దీనివల్ల రైతులకు ఒరిగేదేమీ ఉండదు సరికదా లక్ష్యం కూడా నెరవేరకుండా పోతుందని, ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా పెరుగుతుందన్న చర్చ జరిగింది. ఇక నేరుగా నగదు ఇచ్చే ప్రతిపాదనపైనా చర్చించారు. కానీ ఇది అక్రమార్కులకు వరంగా మారుతుందని గత అనుభవాల ప్రకారం అంచనా వేశారు. చివరికి రైతుకు చెక్కుల ద్వారానే పెట్టుబడి సొమ్ము పంపిణీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇది కూడా బ్యాంకుతో ముడిపడిన అంశమే అయినా.. రైతు ఖాతాలో వేయకుండా నేరుగా చెక్‌ను క్లియర్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తారని తెలిసింది. కరువు కాటకాల సమయంలో రైతులకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం సొమ్మును ఇలాగే ఇస్తారు. స్థానిక ఎమ్మార్వో ఖాతా ద్వారా రైతులు తీసుకునే ఏర్పా టు చేస్తారు. అందుకు రైతు పేరిటే చెక్ జారీ చేస్తారు. ఆ చెక్‌లను రైతు తన ఆధార్ కార్డు లేదా పట్టాదారు పాస్‌పుస్తకాన్ని తీసుకెళ్లి బ్యాంకులో చూపిస్తే నేరుగా రూ.4 వేలు ఇస్తారు. ఈ పద్ధతి ద్వారా రూ.20 వేల వరకు విత్‌డ్రా చేసుకునే వీలుందని ఎస్బీఐ సీనియర్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. చెక్కుల్లోనూ అవకతవకలు జరగకుండా వాటిని గ్రామసభల్లో రైతులకు పంపిణీ చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
‘భూమి’ మీదే భారం!
సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్ణీత లక్ష్యాల మేరకు పూర్తి చేయడంలో భూసేకరణ అంశమే కీలకంగా మారనుంది. వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీరు అందించాలంటే పలు ప్రాజెక్టుల కింద భూసేకరణను వేగంగా పూర్తిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో ఎక్కువ శాతం భూసేకరణ అవసరాలకే వినియోగించాల్సి రావడం ఒకవైపు.. ఆ స్థాయిలో శాఖకు నిధులు అందకపోవడం మరోవైపు ప్రాజెక్టుల పనులపై ప్రభావం చూపే అవకాశముంది. తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టుల కింద భూసేకరణ వేగిరం చేయాలని అధికారులు భావిస్తున్నా.. నిధుల సమస్యే గుదిబండగా మారుతోంది. సేకరణ జరిగితేనే నీళ్లు పారేది.. రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ఇంతవరకు భూసేకరణ అడ్డంకిగా మారుతూ వచ్చింది. ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం జీవో 123ను తెచ్చినా.. నిర్వాసితులు, ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకత, హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆగిపోయింది. తర్వాత రాష్ట్రం తెచ్చిన భూసేకరణ బిల్లుకు ఆమోదం దక్కడంతో మిగతా భూసేకరణ కొంత సులభతరమైంది. కానీ ఇప్పుడు సేకరిస్తున్న భూములకు పరిహారం నిధులు లేకపోవడంతో పరిస్థితి మొదటికి వస్తోంది. ఇంకా భారీగా భూముల అవసరం రాష్ట్రంలో భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు కలిపి మొత్తంగా 3.61 లక్షల ఎకరాల భూసేకరణ అవసరంకాగా... ఇప్పటివరకు 2.88 లక్షల ఎకరాలు సేకరించారు. మరో 73 వేల ఎకరాల మేర సేకరించాల్సి ఉంది. ప్రధాన ప్రాజెక్టులపరంగా చూస్తే కాళేశ్వరం పరిధిలో 28 వేల ఎకరాలు, పాలమూరు పరిధిలో 9 వేలు, సీతారామలో 3 వేల ఎకరాలతోపాటు తక్షణం ఆయకట్టునిచ్చే కల్వకుర్తి పరిధిలో 3,471 ఎకరాలు, భీమాలో 542, నెట్టెంపాడులో 833, కొమురం భీమ్‌లో 394, ఎస్సారెస్పీ–2లో 336, కోయిల్‌సాగర్ పరిధిలో 82 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇందులో వచ్చే ఏడాది జూన్ నాటికి నీళ్లిచ్చే ప్రాజెక్టుల కింద 7,600 ఎకరాల సేకరణ అవసరం. ఇందుకోసం రూ.3,800 కోట్లు కావాలని అంచనా. పరిహారం బకాయిలూ భారీగానే.. ఇక వివిధ ప్రాజెక్టుల కింద సేకరించిన భూములకు సంబంధించి రూ.1,597 కోట్ల మేర పరిహారం బకాయిలు ఉన్నాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించే రూ.894 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా.. పాలమూరు–రంగారెడ్డిలో రూ.175 కోట్లు, డిండిలో రూ.116 కోట్లు, నెట్టెంపాడులో రూ.20 కోట్లు, కల్వకుర్తిలో రూ.15 కోట్లు, వరద కాల్వలో రూ.80 కోట్లు, ప్రాణహితలో రూ.100 కోట్లు, ఎల్లంపల్లి పరిధిలో రూ.38 కోట్ల మేర పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ సొమ్ము చెల్లించడంతో పాటు జూన్ నాటికి మరో రూ.1,500 కోట్లు సమకూర్చితేనే భూసేకరణ పూర్తయి ప్రాజెక్టుల కింద నీళ్లు పారే అవకాశముందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు కొత్తగా సేకరిస్తున్న భూములకు పరిహారం చెల్లించాకే స్వాధీనం చేసుకోవాలన్న హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. నేడు సీఎం సమీక్ష! ప్రాజెక్టుల కింద భూసేకరణకు నిధుల సమస్య అవరోధంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) రంగంలోకి దిగింది. నిధుల సమీకరణపై ఇప్పటికే సీఎం కేసీఆర్ సూచనల మేరకు సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్‌లు అధికారులతో ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు. గత బుధవారం ప్రభుత్వ సెలవు దినమైనా కూడా.. నీటి పారుదల శాఖ అధికారులతో నర్సింగ్‌రావు మూడు గంటల పాటు చర్చించారు. ఆయన సూచనల మేరకు అదే రోజు మధ్యాహ్నం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు జలసౌధలో నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్‌లతో చర్చలు జరిపారు. వివిధ ప్రాజెక్టుల సీఈలు సైతం అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూన్ వరకు కనిష్టంగా రూ.16 వేల కోట్లయినా ఇవ్వాలని నీటిపారుదల శాఖ కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ నిధుల అవసరాలపై గురువారం సీఎం కేసీఆర్ స్వయంగా సమీక్షించనున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. -
వరి.. సగానికే సరి
వ్యవసాయ శాఖ నివేదికలో వెల్లడి.. నేటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు ఇప్పటివరకు నాట్లు వేసిన విస్తీర్ణం 53% లోటు వర్షపాతం నమోదైన మండలాలు 235 సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో వరి నాట్లు పుంజుకోవడంలేదు. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 12.35 లక్షల ఎకరాల్లో (53%) మాత్రమే నాట్లు పడినట్లు వ్యవసాయ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వర్షాధార పంటలకే ప్రయోజనం కలిగిస్తున్నాయని, వరి నాట్లు వేయడానికి ఏమాత్రం సహకరించే పరిస్థితి కనిపించడంలేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 86.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగయ్యాయి. అందులో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.90 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 44.72 లక్షల ఎకరాల్లో (107%) సాగు కావడం విశేషం. అన్ని పంటల సాగు విస్తీర్ణంలో సగానికిపైగా పత్తి సాగు కావడం గమనార్హం. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.55 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8.85 లక్షల ఎకరాల్లో (84%) సాగయ్యాయి. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 5.8 లక్షల ఎకరాలు కాగా, 4.02 లక్షల ఎకరాల్లో (69%) సాగైంది. మిర్చి సాగు మాత్రం పుంజుకోలేదు. మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 1.70 లక్షల ఎకరాలు కాగా, 12,500 ఎకరాల్లో మాత్రమే సాగైంది. కేవలం 8 శాతమే మిర్చి సాగు చేశారు. గతేడాది మిర్చి ధర భారీగా పతనమవడంతో ఈసారి రైతులు అటువైపుగా ఆసక్తి కనబర్చడంలేదు. రెండు జిల్లాల్లోనే అధికం.. రుతుపవనాలు అనుకున్నంత స్థాయిలో చురుగ్గా లేకపోవడంతో వర్షపాతం లోటు కనిపిస్తోంది. జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 486.4 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 410.6 మి.మీ. కురిసింది. 15.6 శాతం లోటు నమోదైంది. జులైలో 40 శాతం లోటు నమోదైంది. రాష్ట్రంలోని జోగులాంబ, హైదరాబాద్ జిల్లాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది. 17 జిల్లాల్లో సాధారణం, 12 జిల్లాల్లో లోటు వర్షపాతం రికార్డయింది. మండలాల వారీగా చూస్తే 78 మండలాల్లో అధికం, 269 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 235 మండలాల్లో లోటు వర్షపాతం రికార్డయింది. 2 మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. నేటి నుంచి మూడు రోజులు భారీ వర్షాలు రుతుపవనాలు ఊపందుకోవడంతో గురువారం నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత 24 గంటల్లో ములుగులో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్‌కు ప్రయోజనం: పార్థసారథి సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ పంటలను బలోపేతం చేశాయని, రైతుల్లో ఉత్సాహాన్ని నింపాయని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో ఎరువుల అవసరాలు, అందుబాటులో ఉన్న ఎరువుల స్థితిగతులపై బుధవారం వ్యవసాయ కమిషనర్ జగన్ మోహన్, హాకా, మార్క్ ఫెడ్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. యాసంగి పంటలకు విత్తనాలు, ఎరువుల అవసరాలు, క్షేత్రస్థాయిలో వాటి అందుబాటుకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఆదేశించారు. -
ఖరీఫ్ రైతులకు తాగునీటి కష్టాలు
-
31న వ్యవసాయ ప్రణాళిక తయారీపై సమావేశం
కర్నూలు(అగ్రికల్చర్): గ్రామ స్థాయి నుంచి మండలస్థాయి, జిల్లా స్థాయి వరకు ఖరీప్ సీజన్‌కు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. శనివారం జేడీఏ విలేకర్లతో మాట్లాడుతూ... ఖరీప్‌లో సాగు అయ్యే ప్రధాన పంటలు, వాటిల్లో ఉత్పాదకతను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర వాటిపై ఈ నెల 31న ఏడీఏలు, ఆర్ఎఆర్ఎస్, ఏరువాక, కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు వివరించారు. సమావేశానికి ఏడీఏలు గ్రామ స్థాయి నుంచి ప్రణాళికలతో రావాలని సూచించారు. జిల్లా వ్యవసాయ ప్రణాళిక ఖరారు అయిన తర్వాత ఫిబ్రవరి 4న గుంటూరు వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో ఖరీప్ పంటల ఉత్పాదకత పెంపు అంశాలపై సమావేశం ఉంటుందని వివరించారు. ప్రధాన పంటల్లో ఉత్పాదకత పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు జేడీఏ స్పష్టం చేశారు. -
ఏపీకి 18.5, తెలంగాణకు 17.5
-ఇరు రాష్ట్రాల ఖరీఫ్ అవసరాల దృష్ట్యా నీటి విడుదలకు బోర్డు నిర్ణయం -ఎడమ కాల్వ కింద లెలంగాణకు 15 టీఎంసీ, హైదరాబాద్, నల్లగొండ తాగునీటికి 2.5టీఎంసీ -పోతిరెడ్డిపాడు కింది అవసరాలకు 11 టీఎంసీ -ఇందులో చెన్నై తాగునీటికి 3 టీఎంసీ -ఇరు రాష్ట్రాలకు బోర్డు లేఖలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సాగు, తాగు అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో లభ్యతగా ఉన్న జలాలను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయం చేసింది. అక్టోబర్ అవసరాలకు గానూ తెలంగాణకు 17.5 టీఎంసీలు, ఏపీకి 18.5 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం చేసింది. ఈ మేరకు నీటి కేటాయింపులపై తన నిర్ణయాన్ని తెలియజేస్తూ బుధవారం ఇరు రాష్ట్రాలకు బోర్డు లేఖలు రాసింది. సాగర్ ఎడమ కాల్వ కింద ఖరీఫ్ కోసం 30.20 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 6టీఎంసీలు, నల్లగొండ తాగునీటికి 4.10టీఎంసీలు కలిపి మొత్తంగా 40.30టీఎంసీలు అవసరం ఉంటాయని ఆగస్టు నెలలో తెలంగాణ బోర్డును కోరింది. ఇందులో 15 టీఎంసీల నీటి విడుదలకు బోర్డు గతంలోనే అనుమతులిచ్చింది. అనంతరం మళ్లీ తెలంగాణ సాగర్ ఎడమ కాల్వ కింద జోన్-1, జోన్-2లోని ఖరీఫ్ సాగు అవసరాలకు 15 టీఎంసీలు కేటాయించాలని మరో లేఖ రాసింది. ఇదే సమయంలో టగత 28, 30 తేదీల్లో ఏపీ తనకు పోతిరెడ్డిపాడు కింద 11 టీఎంసీలు, హంద్రీనీవా కింద 5 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వ కింద మరో 2.50 టీఎంసీలు కావాలని విన్నవించింది. ఈ వినతులను పరిశీలించిన బోర్డు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుధ్దంగా ఇరు రాష్ట్రాలు నీటిని విడుదల చేశారో తెలుపుతూనే, ప్రస్తుత కేటాయింపులు జరిపింది. మూడు చోట్ల వాటాకు మించి వినియోగం.. కృష్ణా బేసిన్లో ఇప్పటివరకు తెలంగాణ ఏఎంఆర్పీ కింద 10.21టీఎంసీ, ఎడమ కాల్వ కింద 5.131టీఎంసీ, కల్వకుర్తి కింద 1.745 టీఎంసీలు కలిపి మొత్తంగా 17.087టీఎంసీ వినియోగించుకోగా, ఏపీ పోతిరెడ్డిపాడు కింద 23.79టీఎంసీ, సాగర్ కుడి కాల్వ కింద 9.989, కృష్ణా డెల్టా సిస్టమ్ కింద 20.413, హంద్రీనీవా కింద 9.33టీఎంసీలు కలిపి మొత్తంగా 63.524 టీఎంసీలు వినియోగించారని బోర్డు లేఖలో వివరించింది. గత ఆగస్టులో ఇచ్చిన ఆదేశాలకు విరుధ్దంగా పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ఏఎంఆర్పీ కింద వాటాకు మించి వినియోగం చేశారని లేఖలో పేర్కొంది. అధికం వాడుంటే వీటిని వాడరాదు.. ప్రస్తుత రాష్ట్రాల వినతులను దృష్టిలో పెట్టుకొని హంద్రీనీవాకు 5 టీఎంసీ, చెన్నై తాగునీటికి 3, ఎస్ఆర్బీసీ 3, తెలుగుగంగ ప్రాజెక్టు 5, సాగర్ ఎడమ కాల్వ కింద 2.50 టీఎంసీలు కలిపి మొత్తంగా ఏపీకి 18.50 టీఎంసీలు విడుదలకు బోర్డు అంగీకారం తెలిపింది. ఇక తెలంగాణకు సాగర్ ఎడమ కాల్వ కింద 15 టీఎంసీ, హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు 2.50టీఎంసీలు కలిపి 17.50 టీఎంసీల వినియోగానికి అంగీకారం తెలిపింది. ప్రస్తుతం జరిపిన కేటాయింపులు గత ఆగస్టు నెలలో పేర్కొన్న నీటి కేటాయింపులకు అదనమని, అప్పటి ఆదేశాల్లో పేర్కొన్న దాని కంటే అధికంగా వినియోగం చేసుంటే ప్రస్తుత నీటిని వాడటానికి అవసకాశం ఉండదని, తక్కువగా వినియోగించి ఉంటే మిగిలిన నీటిని వినియోగించుకోవచ్చని లేఖలో స్పష్టం చేసింది. ఏ రాష్ట్రమైనా అధికంగా నీటిని వాడుకొని ఉంటే ఆ రాష్ట్రం త్రిసభ్య కమిటీకి ఆ విషయాన్ని తెలియజేయాలని సూచించింది. ప్రస్తుతం చేసిన కేటాయింపులను ఆయా రాష్ట్రాలు అదే అవసరాలకు వాడుతున్నాయా? లేక ఇతర ప్రాధాన్యాత అవసరాలకు వాడకుంటున్నాయా? అన్నది ఆయా రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు గమనిస్తూ ఉండాలని తెలిపింది. -
మొక్కుబడి
పంటనష్టం కొండంత.. గుర్తించింది గోరంత ముసురు వర్షాలకు దెబ్బతిన్న ఖరీఫ్ పంటలు అంచనా సేకరణకు కదలని అధికారులు 6మండలాలు.. 998హెక్టార్లలో మాత్రమే పంటలు నష్టపోయినట్లు గుర్తింపు మహబూబ్‌నగర్ వ్యవసాయం: ఎన్నో అంచనాలతో సాగుచేసిన పంటలు ముసురువర్షాలకు దెబ్బతిన్నాయి. జిల్లాలో వారం పదిరోజులుగా కురుస్తున్న వానలకు ఖరీఫ్‌లో సాగుచేసిన జొన్న, మొక్కజొన్న, పత్తి, ఆముదం, వరి, వేరుశనగ పంటలు చాలాచోట్ల నీటిలోనే కలిసిపోయాయి. వేలకు వేల పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. ఈ పరిస్థితుల్లో పంటనష్టాన్ని గుర్తించేందుకు వ్యవసాయశాఖ అధికారులు ముందుకు కదలడం లేదు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సగటు వర్షపాతం 446.8మి.మీ కాగా ఇప్పటివరకు 513.2మి.మీ వర్షపాతం కురిసింది. సగటుకంటే 14.9శాతం అధికంగా నమోదైంది. ఇదిలాఉండగా జూన్‌లో 91.9శాతం అధికవర్షాలు కురవగా జూలై, ఆగస్టులో లోటు వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లాలో 7.13లక్షల హెక్టార్లలో పంటలు సాగుకాగా వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటికే 1.25లక్షల హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించారు. అధికవర్షాలకు సుమారు 4లక్షల హెక్టార్ల మేర పంటనష్టం కలిగిందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. పంటలకు నష్టం ముసురువర్షాలకు జిల్లాలో చాలాచోట్ల జొన్న పంట నల్లగా మారనుంది. జూన్‌లో సాగుచేసిన వరిపైరు దిగుబడికి సిద్ధంగా ఉండగా చాలాప్రాంతాల్లో నీటమునిగింది. మరికొన్ని ప్రాంతాల్లో పంటంతా నేలవాలి గింజలు మొలకెత్తాయి. జూలై, ఆగస్టు మాసాల్లో లోటువర్షపాతం కురవడం, ఈ నెలలో ఎక్కువవర్షం పడడంతో వాతావరణంలో భారీ మార్పుల కారణంగా పత్తి, కంది, ఆముదం పంట ఎండుతెగులు బారినపడ్డాయి. ఇది పంటల దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొక్కుబడిగా నష్టం సేకరణ జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలకు పంటలకు పంటనష్టాన్ని గుర్తించే ప్రక్రియ మొక్కుబడిగా సాగుతోందని రైతు సంఘాలు, రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు 998.50 హెక్టార్లలో మాత్రమే పంటలకు నష్టం వాటిల్లినట్లు 8 మండలాల నుంచి వ్యవసాయశాఖ జిల్లా అధికారులకు నివేదిక అందించింది. ఇందులో కొందుర్గు మండలంలో 8 హెక్టార్లలో వరి, 4.20హెక్టార్లలో జొన్న, పెబ్బేరు మండలంలో 30హెక్టార్లలో మొక్కజొన్న, 45హెక్టార్లలో ఉలువ, 20హెక్టార్లలో పెసర, 25హెక్టార్లలో కంది, 350హెక్టార్లలో వేరుశనగ, గద్వాల మండలంలో రెండు హెక్టార్లలో పత్తి, తాడూరు మండలంలో 16 హెక్టార్లలో వరి, 48 హెక్టార్లలో పత్తి, మల్దకల్ మండలంలోని 94హెక్టార్లో వరి, 40హెక్టార్లలో వేరుశనగ, 88హెక్టార్లలో కంది, 144హెక్టార్లలో పత్తి, 56హెక్టార్లలో ఆముదం పంట,ధరూర్ మండలంలో 58.45హెక్టార్లలో వరి, పత్తి, ఆముదం, చెరుకు పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. పల్లెలు ఎరుగని అధికారులు వర్షాలకు నష్టపోయిన పంటల వివరాలను పరిశీలనకు క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు వ్యవసాయాధికారులు ఆసక్తిచూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఇటిక్యాల, కొడంగల్, కోస్గి, బొంరాస్‌పేట, దేవరకద్ర, అలంపూర్, భూత్పూర్, నర్వ, మక్తల్, మాగనూర్, ఆత్మకూర్, తలకొండపల్లి, మాడ్గుల, వెల్దండ, కల్వకుర్తి, కొత్తకోట, పాన్‌గల్, వనపర్తి, కొల్లాపూర్ మండలాల్లో సాధారణం కన్నా ఎక్కువగా వర్షాలు కురవడంతో పంటలకు నష్టంవాటిల్లింది. కానీ మండల వ్యవసాయశాఖ అధికారులు మాత్రం ఆయా మండలాల్లో పంటన ష్టాన్ని గుర్తించేందుకు మొగ్గుచూపడం లేదు. దీంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. మండలం పంటనష్టం(హెక్టార్లలో..) కొందుర్గు 12.05 పెబ్బేరు 440 గద్వాల 02 తాడూరు 64 మల్దకల్ 422 ధరూర్ 58.45 -
వేరు‘శని’గ..
దేవనకొండ మండలంలోని లక్కందిన్నె గ్రామానికి చెందిన రైతు మల్లేష్ ఈ ఏడాది తనకున్న ఐదెకరాల్లో వేరుశనగ సాగు చేపట్టాడు. వర్షాభావంతో పంట ఎండిపోగా మంగళవారం సాగు చేసిన చేతులతోనే దున్నేశాడు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ముందస్తు వర్షాలకు 22,236 హెక్టార్లలో వేరుశనగ పంట సాగయింది. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో రైతుల కంట్లో కన్నీటి సుడి తిరిగింది. ఈ రోజు.. రేపు.. అని ఎదురుచూడటంతోనే పంటంతా ఎండిపోయింది. ఆదుకుంటుందనుకున్న ప్రభుత్వం రెయిన్గన్ల పేరిట హడావుడి చేయడం తప్పిస్తే.. ఒక్క ఎకరానూ తడపలేకపోయింది. చేసేది లేక దాదాపు 836 హెక్టార్లలో పంటను దున్నేశారు. కనీసం పశువులకు మేతగానైనా ఉపయోగపడుతుందనే ఆశతో ఆశలను వదిలేసుకుంటున్నారు. – దేవనకొండ -
ఖరీఫ్‌పై నీలినీడలు!
– వర్షాలు కనుమరుగవడంతో రైతుల్లో కలవరం – జూలైలో కురువాల్సిన వర్షపాతం 117.2 మి.మీ – ఇప్పటి వరకు నమోదైంది 13.9 మి.మీ మాత్రమే – ఎండుతున్న పంటలు..మట్టిపాలవుతున్న పెట్టుబడి కర్నూలు (అగ్రికల్చర్): మొదట్లో మురిపించిన వర్షాలు ఆ తరువాత మొండికేశాయి. ఖరీఫ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో రైతుల్లో కలవరం రేగుతోంది. జూలై నెల సాధారణ వర్షపాతం 117.2 మి.మీ. ఉండగా ఇప్పటి వరకు 13.9మి.మీ. మాత్రమే నమో దైంది. వానలు లేకపోవడంతో మొక్కజొన్న, వేరుశనగ, పత్తి వంటి పంటలు వాడుపడుతున్నాయి. వరస కరువులతో ఇప్పటికే రైతులు అల్లాడుతున్నారు. ఈ ఏడాది అదే పరిస్థితులు కనిపిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఆశాజనకంగా పంటల సాగు.. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 6.21 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 2.10 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. పత్తి 75 వేల హెక్టార్లు, వేరుశనగ 58 వేల హెక్టార్లు, కంది 45వేల హెక్టార్లు, మొక్కజొన్న 25 వేల హెక్టార్లలో సాగు చేశారు. బ్యాంకులుపంట రుణాలు ఇవ్వకపోయినా రైతులు అప్పులు తెచ్చి విత్తనాలు.. ఎరువులు తదితర వాటికి ఎకరాకు సగటున రూ.10వేల వరకు పెట్టుబడి పెట్టారు. మరో నాలుగైదు రోజుల్లో వర్షాలు కురువకపోతే ఇదంతా మట్టి పాలు అయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంటలకు జూలై నెల కీలకమైంది. ఈ నెలలో జిల్లా మొత్తం మీద రోజుకు సగటున 3.9 మిమీ వర్షం కురువాల్సి ఉంది. అపుడే వ్యవసాయం అశాజనకంగా ఉంటుంది. అయితే ఈ నెలలో వర్షపాతం చాలా తక్కువగా ఉంది. జూన్ నెలలో అన్ని ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు వెనక్కి వెళ్లి పోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. మొక్కజొన్న పంట 15 రోజుల కంటే ఎక్కువ రోజులను బెట్టకు తట్టుకోలేదు. అయితే 18 రోజులుగా వర్షాలు లేకపోవడంతో మొక్కజొన్న పంట దెబ్బతింటుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. కూరగాయలు తదితర పంటలను కాపాడుకోవడంలో రైతులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇటీవలి వరకు విత్తనం పనులు ముమ్మరంగా జరిగినా వర్షాలు లేకపోవడం వల్ల విత్తనం పనులు కూడా నిలిచిపోయాయి. ఉష్ణోగ్రతలు 37 నుంచి 38 డిగ్రీల వరకు ఉండటం, గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పంటలు దెబ్బతింటున్నాయి. జూన్ నెలలో సాధారణ వర్షపాతం కంటే 98 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. దీంతో ఖరీప్ ఆశాజనకంగా ఉంటుందని ఆశించిన రైతులకు జూలై నెలలో వర్షాలు కనుమరుగు కావడంతో రైతులు ఆందోళనకు గురువుతున్నారు. అధిక డ్రై స్పెల్ ఇది.. వర్షానికి, వర్షానికి ఉన్న వ్యత్యాసాన్ని డ్రై స్పెల్‌గా భావిస్తారు. డ్రై స్పెల్ పది రోజులు వరకు ఉంటే ఇబ్బంది లేదు. నల్లరేగడి నేలల్లో వేసిన పంటలు అయితే కొన్ని రోజులు బెట్టను తట్టుకుంటాయి, జిల్లాలోని ఆదోని, కర్నూలు రెవెన్యూ డివిజన్లలో ఎర్ర నేలలు ఎక్కువగా ఉండటం వల్ల పది రోజులు వర్షాలు లేకపోతే పంటలు తట్టుకోలేవు. ప్రస్తుతం వర్షానికి, వర్షానికి వ్యత్యాసం దాదాపు 20 రోజలు ఉండటంతో ఖరీఫ్ గట్టెక్కేనా... అనే అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి. -
సాగుకు ముందే చావు డప్పు
► 22 రోజుల్లో 12 మంది ఆత్మహత్య ► అనుమానాస్పద స్థితిలో మరో నలుగురు మృతి ► బ్యాంకు అప్పు పుట్టదు.. ప్రైవేట్ రుణాలే దిక్కు ► వచ్చేనెల 31తో ముగియనున్న ఖరీఫ్ రుణాల గడువు ► పట్టిసీమ నుంచి డెల్టాకు చుక్క లేదు.. పులి‘చింత’లే ► ఇప్పటికే పంట విరామాన్ని ప్రకటించిన కోనసీమ.. ► లక్షన్నర ఎకరాలు సాగుకు దూరమయ్యే ప్రమాదం ► రైతు చావుల నివారణకు చర్యలు తీసుకోవాలన్న కోర్టు ఆదేశాలను పట్టించుకోని పాలకులు ► సగటున ప్రతి 40 గంటలకు ఒక రైతు బలిదానం సాక్షి, హైదరాబాద్: ఆశల మోసులతో సాగుకు సన్నద్ధమైన అన్నదాతకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సాగుకు ముందే రాష్ట్రంలో అన్నదాతల ఇంట చావుడప్పు మోగుతోంది. వ్యవసాయ శాఖ లెక్క ప్రకారం జూన్ ఒకటిన ప్రారంభమైన ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 16 మంది రైతులు విభిన్న కారణాలతో చనిపోయారు. తెచ్చిన అప్పులు తీరక కొందరు, బ్యాంకుల నుంచి కొత్త అప్పులు పుట్టక మరికొందరు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వేధింపులతో ఇంకొందరు తనువు చాలించారు. సగటున ప్రతి 40 గంటలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తేలింది. అన్నదాతల ఆత్మహత్యలపై స్పందించాలని, నివారణకు చర్యలు చేపట్టాలని న్యాయస్థానాలు పాలకులకు పదేపదే మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదు. గిట్టుబాటు కాని సాగు చేయలేమని కోనసీమకు చెందిన అనంతవరం రైతులు ఇప్పటికే ‘క్రాప్ హాలీడే’ ప్రకటించారు. ఈ పిలుపు ప్రభావం సుమారు లక్షన్నర ఎకరాలపై ఉంటుందని అంచనా. కాలువల్లో నీరు పారుతుందో లేదో తేలకుండా పంటల్ని వేయలేమని మరికొన్ని ప్రాంతాల రైతులు చెబుతున్నారు. ఖరీఫ్‌కు ముందే సిద్ధం కావాల్సిన పులిచింతల ఇంకా చింతల్లోనే ఉంది. ఎంతో ఆర్భాటం చేసిన పట్టిసీమ ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు చుక్కనీరు రాలేదు. ఫలితంగా ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. బుధవారం అనంతపురం జిల్లా బొమ్మిరెడ్డిపల్లికి చెందిన వెంకటరమణారెడ్డి (55) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖరీఫ్‌లో ఇవ్వాల్సిన వ్యవసాయ రుణాలు... ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రు.36 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికి 25 శాతానికి మించలేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ ఉపశమనం కలిగించకపోగా తలకు మించిన భారంగా తయారైంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు), ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీలు), గ్రామీణ బ్యాంకులు మాత్రమే రైతుల పట్ల కాస్తంత ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. పాత అప్పులపై వడ్డీ చెల్లిస్తే కొత్త రుణాలు ఇస్తున్నాయి. మిగతా బ్యాంకులేవీ ఇందుకు సుముఖంగా లేవు. లీడ్ బ్యాంకులు ఆదేశించినా జాతీయ బ్యాంకులు పట్టించుకోవడం లేదు. అసలుతోపాటు వడ్డీని కూడా జమ చేస్తేనే రుణాలు ఇస్తామంటూ రైతుల్ని ఇబ్బందుల పాల్జేస్తున్నాయి. దీంతో రైతులు అనివార్యంగానే గ్రామాల్లో ఉండే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. వాస్తవసాగుదార్లుగా ఉన్న కౌలు రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం ఏప్రిల్ ఒకటి నుంచి జూలై 31లోగా రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలి. ఇప్పటికి మూడు నెలలు గడిచినా ఇచ్చింది 25 శాతమే అయితే ఇంకా మిగిలిన 40 రోజుల్లో ఎంతమందికి ఇస్తారనేది ప్రశ్నార్థకమే. ఇవ్వాల్సిన ఖరీఫ్ రుణాలు జిల్లా ఖరీఫ్ రుణం(కోట్లలో) శ్రీకాకుళం 1,446 విజయనగరం 1,048 విశాఖ 1,268 తూర్పుగోదావరి 4,250 పశ్చిమ గోదావరి 3,951 కృష్ణా 2,912 గుంటూరు 5,437 ప్రకాశం 2,876 నెల్లూరు 2,149 చిత్తూరు 2,869 వైఎస్సార్ 2,164 అనంతపురం 3,130 కర్నూలు 2,500 22 రోజులు... 12 మంది.. ఖరీఫ్ ప్రారంభమైన 22 రోజుల వ్యవధిలో 12 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో నలుగురు వేర్వేరు కారణాలతో చనిపోయారు. అన్నదాతల ఆత్మహత్యల్లో అనంతపురం జిల్లా అగ్రస్థానంలో ఉండగా వైఎస్సార్ కడప, కర్నూలు, గుంటూరు జిల్లాలు తర్వాతి స్థానాలలో ఉన్నాయి. విశాఖ జిల్లాలోనూ రైతు ఆత్మహత్యలు చోటుచేసుకోవడం గమనార్హం. లెక్కల్లోకి రాని ఆత్మహత్యలు మరెన్నో ఉన్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన మరో ఇద్దరు రైతులు- రమణారెడ్డి (పొడ్రాళ్లపల్లి), శ్రీనివాసరెడ్డి (చాకర్లపల్లి) అనుమానాస్పద స్థితిలో పొలంలో చనిపోయారు. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు- కాల్‌మనీ ముఠా వేధింపులతో మరణించారు. ఇవన్నీ మీడియాలో వచ్చినవే. పత్రికల్లో, టీవీల్లో రానివి మరెన్నో. మహిళా రైతుల ఆత్మహత్యల్ని మీడియా సైతం నివేదించడం లేదు. ఈ లెక్క చూస్తుంటే ప్రతి నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక మూల ఎవరో ఒక రైతు మరణిస్తూనే ఉన్నట్టు స్పష్టమవుతోంది. గత 22 రోజుల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు జిల్లా మండలం గ్రామం రైతు పేరు అనంతపురం నల్లచెరువు బొమ్మిరెడ్డిపల్లి వెంకట రమణారెడ్డి (55) తాడిమర్రి చిల్లకొండయ్యపల్లి ఆర్వేటి నడిపి నాగప్ప(50) పెద్దవడుగూరు జి.కొత్తపల్లి దమ్మర హనుమంతు(50) యాడికి వెంగన్నపల్లి కొట్టి కొండారెడ్డి(65) పెనుకొండ మరువపల్లి గొల్ల లక్ష్మీనారాయణ(50) వైఎస్సార్ పులివెందుల చంద్రగిరి(ఇ.కొత్తపల్లె) షామీర్ (28) బి.మఠం చెంచయ్యగారిపల్లె వేమరెడ్డి జయరామిరెడ్డి(44) కర్నూలు గోనెగండ్ల గాజులదిన్నే కె.రాముడు(60) గూడూరు గూడూరు గొల్ల రాముడు(52) గుంటూరు ఈపూరు ఇనిమెళ్ల మందపాటి శ్రీనివాసరావు (40) ఈపూరు ఈపూరు దురిశాల వెంకటేశ్వర్లు(55) విశాఖపట్నం చోడవరం దండోరిపాలెం వబలరెడ్డి అప్పలనాయుడు (52) -
ఖరీఫ్‌లో 4.60 లక్షల ఎకరాలకు సాగునీరు: హరీష్‌రావు
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా 4.60 లక్షల ఎకరాలకు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి నీరందించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. జులై1 నాటికి కల్వకుర్తి నుంచి 1.50లక్షల ఎకరాలకు, నెట్టెంపాడు నుంచి 1.50లక్షల ఎకరాలకు, భీమా ప్రాజెక్టు నుంచి 1.40 లక్షల ఎకరాలకు, కోయిల్ సాగర్ కింద 20వేల ఎకరాలకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తయ్యేట్లు చూడాలని అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు విషయంలో కచ్చితంగా ఉండాలని జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున చెరువుల సామర్ధ్యంపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో వర్షాలకు చెరువులు నిండుకుండాల్లా ఉన్నాయని తెలిపారు. చెరువుల నీటి మట్టాన్ని ప్రతిరోజూ నమోదు చేసుకోవాలని నీటి ఒరవడికి చెరువులకు గండీ పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
సంక్షోభంలో గోదావరి డెల్టా!: నాగిరెడ్డి
రాజమండ్రి: వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు నాయకుడు నాగిరెడ్డి మండిపడ్డారు. ఖరీఫ్‌లో దిగుబడి 80లక్షల నుంచి 50లక్షలకు పడిపోయిందని తెలిపారు. 'ప్రభుత్వ తీరుతో గోదావరి డెల్టా సంక్షోభంలో పడుతుంది. పోలవరం రాకుంటే ఖరీఫ్‌లో ఒక్క ఎకరాకు నీరిచ్చే పరిస్థితి లేదు. రైతు సంఘాలతో చంద్రబాబు మాట్లాడలేదు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు ఇప్పటి వరకు అమలు చేయలేదు. 2009లో గోదావరి డెల్టాకు దారుణమైన పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్ చాకచక్యంగా వ్యవహరించి ఒక్క ఎకరా ఎండిపోకుండా నీరిచ్చారు. అదే విధానాన్ని బాబు ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు' అని నాగిరెడ్డి అన్నారు. -
ఖరీఫ్ నాటికి సాగు నీరందించేలా ప్రణాళిక
ఎల్లంపల్లి, మిడ్‌మానేరుపై మంత్రి హరీశ్ సమీక్ష భూ సేకరణ సమస్యలను పరిష్కరించేలా ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల పరిధిలో వచ్చే ఏడా ది జూన్‌లో ఖరీఫ్ నాటికి సాగు నీరు అం దించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ, సహాయ, పునరావాస సమస్యలపై హరీశ్ శనివారం హైదరాబాద్‌లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్, బొడిగె శోభ, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్ సీ మురళీధర్‌రావు, కరీంనగర్ సీఈ అనిల్‌కుమార్, ఎస్ఈ ఎన్.వెంకటేశ్వర్లు సమీక్షలో పాల్గొన్నారు. వచ్చే ఖరీఫ్‌లో చొప్పదండి, వేములవాడ, ధర్మపురి నియోజకవర్గాల పరిధిలో లక్ష చొప్పునఎకరాలకు సాగు నీరు అందించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వేములవా డ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్, మేడిపల్లి మండలాల పరిధిలో 44 వేల ఎకరాలకు రూ. 230 కోట్లతో సాగు నీరు అందించేలా పూర్తి స్థాయి నివేదిక(డీపీఆర్) సిద్ధం చేయాలన్నారు. చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల పరిధిలో భూ సేకరణ సందర్భంగా ఎదురవుతున్న సమస్యలపై సమీక్ష నిర్వహించి.. అవసరమైన చోట జీవో123 నిబంధనల మేరకు సేకరణ జరపాలన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని చర్లపల్లి, గుండెనపల్లి, కోనాపూర్ గ్రామాలను ముంపు నుంచి తప్పించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయాలను అన్వేషించాలన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు ముంపు సమస్యపై మంత్రికి విన్నవించారు. మిగ తా గ్రామాల్లో భూ సేకరణ ధరపై రైతుల తో ప్రాథమికంగా చర్చ జరిగిందని, త్వర లో జిల్లా అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పారు. కాగా.. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజక్టు ముంపు గ్రామాల్లో ఇళ్లు, ఇతర కట్టడాల విలువను వేగంగా మదింపు జరపాలన్నారు. వేములవాడ నియోజకవర్గంలో... వేములవాడ నియోజకవర్గంలో చందుర్తి మండలంలో సేకరించిన 314ఎకరాల భూ మికి వెంటనే చెల్లింపులు జరపాలన్నారు. భూ సేకరణ వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్, సంబంధిత తహశీల్దార్లతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. మిడ్‌మానేరులో ముంపునకు గురవుతున్న సం కేపల్లి సమస్యలను పరిశీలించడానికి కమి టీ ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు చేపట్టి న కాంట్రాక్టు సంస్థలతో సమావేశం కావాలని నిర్ణయించామన్నారు. -
ఖరీఫ్ కు 9 గంటల విద్యుత్తు
కామారెడ్డి: వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి వ్యవసాయ రంగానికి రోజుకు 9 గంటల విద్యుత్తు ఇస్తామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు. అక్కడ జరిగిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చురుగ్గా కొనసాగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఖరీఫ్‌కు విత్తనాలేవీ?
ముంచుకొస్తున్న సీజన్ ధరలు, టెండర్ల ప్రక్రియపై ఖరారు కాని విధానం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయు సీజన్ ముంచుకు వస్తున్నా...అధికారుల్లో కదలిక కనిపించడం లేదు. తొలకరి వర్షాలు రావడానికి ఇంక ఎంతో దూరం లేదు. ఆలోపే రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి. అయితే, ఈ ఏడాది అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ సబ్సిడీ విత్తనాలకు సంబంధించిన ధరలనే ఖరారు చేయలేదు. ఇందుకు కావాల్సిన నిధులను కూడా విడుదల చేయలేదు. దీంతో విత్తనాల సరఫరాలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది. ఒక పక్క రాష్ర్ట విభజన ప్రక్రియ కొనసాగుతుండడం, మరో పక్క ఎన్నికలు జరుగుతుండడంతో దీనిపై సకాలంలో నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాతే దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ఫైలు అనుమతి కోసం ఉన్నతాధికారుల వద్ద ఉంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో మొత్తం 12.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం సుమారు రూ. 255 కోట్లతో వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీనిపై ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. దాంతో విత్తనాల సరఫరాకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాలేదు. ఈ విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థతో పాటు ఆయిల్ ఫెడ్, మార్క్‌ఫెడ్, హాకా వంటి సంస్థలు అందిస్తున్నాయి. అయితే ఈ సంస్థలు కూడా ప్రైవేట్‌లోనే విత్తనాలను కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేక టెండర్లను ఆహ్వానిస్తారు. ఇలా కొనుగోలు చేసిన విత్తనాలను అవసరాన్ని బట్టి ఆయా జిల్లాలకు చేరవేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ముగియడానికి కొంత సమయం పట్టనుండగా, ఇప్పటి వరకు విత్తనాల సరఫరాకు సంబంధించి ప్రభుత్వం విధానాన్నే ప్రకటించలేదు. రాష్ట్రంలోకి రుతుపవనాలు ముందుగా ఆదిలాబాద్, నిజామాబాద్‌లోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రాంతంలో సోయాబీన్ విత్తనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాలకు డిమాండ్ ఉంటుంది. జూన్ మొదటి వారంలోనే ఆయా ప్రాంతాల్లో విత్తనాలను నాటుతారు. అంటే ఈ నెలఖరులోగా విత్తనాలను రైతులకు చేరవేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తే గడువులోపు విత్తనాల సరఫరా జరిగే అవకాశం కనిపించడం లేదు. గతంలోనూ సోయాబీన్ విత్తనాల సరఫరా సకాలంలో జరగకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఇదే అదునుగా ప్రైవేట్ వ్యాపారులు విత్తనాల ధరలను భారీగా పెంచే ప్రమాదం ఉంది. ఈసారి నూనె గింజలకు సంబంధించిన విత్తనాలను 33 శాతం సబ్సిడీపై, పప్పుధాన్య రకాల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందించాలని నిర్ణయించారు. ఇంకా తుది ధరలను ఖరారు చేయకపోవడంతో రైతులు ఎంత చెల్లించాలనే విషయంలో స్పష్టత లేదు. -
నట్టేట ముంచిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: కరువు బారిన పడిన లక్షలాది రైతులను రాష్ట్ర ప్రభుత్వం నట్టేట ముంచింది. గత ఏడాది ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల ఏడు జిల్లాల్లోని 127 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం సభ్యులు సమైక్య ముసుగులో ప్రజలను మభ్యపెట్టడంపైనే దృష్టి సారించి కరువు రైతులను పట్టించుకోవడం మరిచిపోయారు. దీనిపై ‘కరువు రైతులను గాలికి వదిలేసిన సర్కారు’ అంటూ ‘సాక్షి’ ప్రచురించడంతో... ఖరీఫ్ సీజన్ ముగిసిపోయిన ఆరు నెలల తర్వాత ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గత నెలలో కరువు మండలాలను ప్రకటిస్తూ జీవో జారీ చేసింది. దీనివల్ల బ్యాంకులు కరువు మండలాల్లోని రైతుల రుణాలను రీషెడ్యూల్ చేస్తాయని భావించారు. అయితే ఖరీఫ్ సీజన్ ముగిసిన ఆరు నెలల తరువాత ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించడంతో బ్యాంకులు రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయడానికి ప్రతిబంధకంగా మారింది. ఖరీఫ్ సీజన్ ముగిసిన 90 రోజుల్లోగానే ఆర్బీఐ మార్గదర్శక సూత్రాల మేరకు రుణాలను రీ షెడ్యూల్ చేయడానికి అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలు తరువాత గానీ కరువు మండలాలను ప్రకటించకపోవడంతో ఇప్పుడు బ్యాంకులు రుణాల రీషెడ్యూల్ చేయలేని పరిస్థితి నెలకొంది. 90 రోజుల నిబంధనలను సడలించి కరువు రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయాల్సిందిగా ఆర్బీఐని కోరేందుకు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాజీనామా చేయడానికి వారం రోజుల ముందు నుంచి వందల సంఖ్యలో ఫైళ్లను పరిష్కరించడంపైన దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కరువు రైతుల విషయాన్ని విస్మరించారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల మంత్రులు కూడా కరువు రైతుల విషయాన్ని పట్టించుకోలేదు. డిసెంబర్‌లోగా కరువు మండలాలను ప్రకటించి ఉంటే రుణాలు రీ షెడ్యూల్‌కు సమస్య వచ్చేది కాదని, జనవరిలో ప్రకటించడంవల్ల ఇప్పుడు సమస్య వచ్చిందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇప్పుడు అధికార యంత్రాంగం కూడా పూర్తిగా విభజనపని, ఎన్నికల పనిలో నిమగ్నమైందని, కరువు రైతుల గురించి ఆలోచించే పనిలో ఎవరూ లేరని ఉన్నతాధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. -
హెలెన్..విలన్
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: చి‘వరి’ ఆశా చితికిపోయింది. ఖరీఫ్ కన్నీళ్లనే మిగిల్చింది. నెలరోజుల వ్యవధిలోనే మూడు విపత్తులు విరుచుకుపడడంతో అన్నదాత వెన్నువిరిగింది. కిందటి నెలలో పై-లీన్, భారీ వర్షాలకుతోడు ఇప్పుడు హెలెన్ దెబ్బకు పంటలన్నీ సర్వనాశనమయ్యాయి. ముఖ్యంగా కోస్తాంధ్రలో వరిపై ఆశలు పూర్తిగా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల రోజుల్లోనే లక్షల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. పై-లీన్, భారీ వర్షాల వల్ల అధికారిక లెక్కల ప్రకారమే 33 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు హెలెన్ తుపానువల్ల మరో 11.35 లక్షల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఇది వ్యవసాయ శాఖకు అందిన ప్రాథమిక సమాచారం మాత్రమే. వాస్తవానికి నీట మునిగిన వరి విస్తీర్ణం 15 లక్షల ఎకరాలుపైనే ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ నష్టం అధికంగా ఉంది. ఒక్క వరి పంటే కాదు.. కొబ్బరి, అరటి, మామిడి తోటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. ఉభ య గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోనే లక్షకు పైగా కొబ్బరి చెట్లు నేలకూలాయి. వేలాది ఎకరాల్లో అరటి, మామిడి దెబ్బతిన్నాయి. మిరప, బెండ, వంగ తదితర కూరగాయల పంటలూ పాడయ్యాయి. మినుము, పెసర పంటలు నీటిలో కుళ్లుతున్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే కోత కోసిన పంట, మరికొన్ని చోట్ల మరో వారం రోజుల్లో కోయాల్సిన వరి నీటిపాలు కావడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నెల రోజుల్లో వచ్చిన మూడో విపత్తుతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వర్షాభావ పరిస్థితుల్లో అష్టకష్టాలు పడి పెట్టిన పంటలు తీరా కోతకొచ్చే సమయంలో ఇలా నీటిపాలు కావడంతో రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటివరకు కోస్తా ప్రాంతంలో 25 వేల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. హెలెన్ బీభత్సంలో తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం ఏడుగురు మృతి చెందగా.. శనివారం మరో నలుగురు చనిపోయారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు వృద్ధులు చలిగాలుల తీవ్రతకు తట్టుకోలేక ప్రాణాలు వదిలారు. ఇదే జిల్లాలో పంటనష్టాన్ని తట్టుకోలేక నందివాడ మండలం తుమ్మపల్లి గ్రామానికి చెందిన కౌలురైతు మసిముక్కు శ్యామలరాజు (50) గుండెపోటుతో మృతిచెందారు. ఎంత కష్టం... ఎంత నష్టం హెలెన్ తుపాను ఉభయ గోదావరులకు ‘విలన్’గా మారింది. వరిపంటనే కాదు.. కోనసీమ కల్పవృక్షమైన కొబ్బరిని సైతం అమాంతం మింగేసింది. ఒక్క ఈ ప్రాంతంలో తుపాను దెబ్బకు 80 వేలకు పైన చెట్లు నేలకూలాయి. 40 వేల ఎకరాల్లో కొబ్బరి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుంది. మొవ్వు పూర్తిగా సుడులు తిరిగి పోవడంతో కొబ్బరి పూర్తిగా రాలిపోయింది. దీంతో ఈ ఏడాది దిగుబడి పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఒక్క తూర్పుగోదావరిలోనే వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు రూ.320 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. వరి రైతు బాధలు అయితే వర్ణనాతీతం. తీరప్రాంత మండలాల్లో కోతలు కూడా కోయించలేని పరిస్థితి ఏర్పడింది. సుమారు 91,220 ఎకరాల్లో పనల దశలో ఉన్న పంట రంగుమారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో మత్స్యకారులకు చెందిన 25కు పైగా బోట్లు కొట్టుకుపోయాయి. సుమారు 400 బోట్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి నుంచి 615 గ్రామాలు అంధకారంలో చిక్కుకోగా, శనివారం సాయంత్రానికి 140 గ్రామాల్లో అతి కష్టమ్మీద సరఫరాను పునరుద్ధరించగలిగారు. మిగిలిన 475 గ్రామాలకు పునరుద్ధరించాలంటే మరో వారం పైగా పడుతుందని చెబుతున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో 600 గ్రామాలకు తాగునీరందని పరిస్థితి నెలకొంది. పశ్చిమగోదావరిలో కూడా తుపాను పెను బీభత్సమే సృష్టించింది. రైతులకు రూ.500 కోట్ల మేర నష్టం మిగిల్చింది. దాదాపు 200పైగా కొబ్బరి చెట్లు విరిగిపోయాయి. గాలి వాన బీభత్సానికి 882 ఇళ్లు దెబ్బతిన్నాయి. 116 కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయి. చేపలు, రొయ్యల చెరువులు ఏకమైపోయాయి. జిల్లాలో మత్స్యకారులకు రూ.20 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. 312 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 100 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. 20 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు తెగిపోవడంతో ఇప్పటికీ 30 తీర గ్రామాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. కృష్ణా జిల్లాలో శనివారం కూడా భారీ వర్షాలు కురిశాయి. వరి, కొబ్బరి, అరటి, బొప్పాయితోపాటు దొండ, బీర తదితర కూరగాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. దాదాపు రెండువేల గృహాలు జలమయమయ్యాయి. గుంటూరు జిల్లాలో వరితోపాటు మినుము పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు : సీఎం తుపాను బాధితులకు యుద్ధప్రాతిపదికన సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హెలెన్ తుపాను నష్టాలు, సహాయ కార్యక్రమాలపై శనివారం ఆయన సమీక్షించారు. 31 మంది మత్స్యకారులు క్షేమం భీమవరం: పెను తుపాను కారణంగా నడి సముద్రంలో చిక్కుకుపోరుున కాకినాడ ప్రాంత మత్స్యకారులు శనివారం మధ్యాహ్నం క్షేమంగా తీరానికి చేరుకున్నారు. తుపాను తీరం దాటడంతో 31 మంది మత్స్యకారులు బోట్ల సాయంతో అంతర్వేదిలోని అన్నాచెల్లెళ్ల గట్టు (గోదావరి, సముద్రం కలిసే ప్రాంతం) మీదుగా నరసాపురంలోని రేవుకు చేరుకున్నారు. కాకినాడ ప్రాంతానికి చెందిన 31 మంది మత్స్యకారులు మూడు సోనా బోట్లు, ఒక ఫైబర్ బోటులో వేటకు బయల్దేరి సముద్రంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఏ జిల్లాలో ఎంత పంట నష్టం? తూర్పుగోదా‘వరి’పై ప్రకృతి పగ.. హెలెన్ దెబ్బకు 2.88 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. 80 వేలకు పైగా కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. 40 వేల ఎకరాల్లో కొబ్బరి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. 8,550 ఎకరాల్లో అరటి, 360 ఎకరాల్లో కూరగాయల పంటలు నీటమునిగాయి. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో వరి నీట మునిగింది. ఖరీఫ్‌లో మొత్తం 5.80 లక్షల ఎకరాల్లో వరి సాగవగా.. నెల రోజుల వ్యవధిలోనే అందులో 4.38 లక్షల ఎకరాలు దెబ్బతినడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పశ్చిమగోదావరి.. ఖరీఫ్ ఆశలు సమాధి జిల్లాలో 2.57 లక్షల ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. మొన్నటి వానలు, పై-లీన్ దెబ్బకు 1.36 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 6 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. వర్షాలతో దాదాపు 4 లక్షల ఎకరాలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం 2 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంట మిగిలింది. అది కూడా నీటిలో నానుతోంది. ఈ లెక్కన ఖరీఫ్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. ప్రస్తుత తుపానుతో 3 వేల ఎకరాల్లో అరటి, కూరగాయల పంటలు పనికిరాకుండా పోయాయి. 200కుపైగా కొబ్బరి చెట్లు నేలకూలాయి. హే ‘కృష్ణా’..! కృష్ణా జిల్లాలో హెలెన్ ధాటికి 2.25 లక్షల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. పొలాల్లో నీరు ఇంకా నిలిచే ఉంది. చేతికి రావాల్సిన పంటంతా చేనులోనే కుళ్లిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 200 కొబ్బరి చెట్లు కూలిపోయాయి. 500 ఎకరాల్లో అరటి, 400 ఎకరాల్లో కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి. గుంటూరు... గుండెకోత డెల్టా ఏరియాలో తుపానుతో 1.25 లక్షల ఎకరాల్లో వరిపంట నేలవాలింది. మరో 18 వేల ఎకరాల్లో మినుము కూడా దెబ్బతింది. తెనాలి, పొన్నూరు, కొల్లిపర్ల, కొల్లూరు, వేమూరు, చుండూరు, చెరుకుపల్లి, భట్టిప్రోలు మండలాల్లో వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. పలు విమానాలు రద్దు హెలెన్ తుపాను ప్రభావంతో శనివారం పలు విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉదయం 7 గంటలకు విజయవాడ బయలుదేరాల్సిన ఎస్జీ 1001, ఉదయం 8.55 గంటలకు రాజమండ్రి వెళ్లాల్సిన ఎస్జీ 1061 విమానం, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చెన్నై వెళ్లాల్సిన విమానాలను అధికారులు రద్దు చేశారు. చెన్నై, రాజమండ్రి, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన మరో మూడు విమానాలు కూడా రద్దయ్యాయి. కోస్తాకు వర్షసూచన సాక్షి, విశాఖపట్నం: హెలెన్ తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారినట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది ఉత్తర కర్ణాటక వద్ద స్థిరంగా ఉందన్నారు. దీని ప్రభావం పెద్దగా ఉండబోదని తెలిపారు. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల, ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల చెదురుమదురు వర్షాలు పడే అవకాశాలున్నట్టు చెప్పారు. వర్షపాతం వివరాలు.... గడచిన 24 గంటల్లో గుడివాడలో గరిష్టంగా 13 సెం.మీ. వర్షపాతం నమోదయింది. విజయవాడ, విశాఖపట్నంలో 10, మచిలీపట్నం 9, విశాఖపట్నం 7, భీమునిపట్నం, నూజివీడు 6, అవనిగడ్డ, అమలాపురం, రేపల్లె, కాకినాడలో 5, యలమంచిలి, అనకాపల్లి, పాడేరు, చోడవరం, అచ్చంపేట, నందిగామ 4, అనకాపల్లి, తణుకు, యలమంచిలి, మంచిర్యాల, శృంగవరపుకోట, నర్సాపురం, అరకులోయ, మంగళగిరి, న ర్సాపురం, పలాస, టెక్కలి, తుని, కైకలూరు, కోడేరు, గజపతినగరం 3, మందస, సాలూరు, విజయనగరం, రాజమండ్రి, రణస్థలం, పాతపట్నం, సోంపేట, కళింగపట్నం, పెద్దాపురం, చీపురుపల్లిలో 2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. మధిరలో 6 సెం.మీ., సూర్యాపేట, మిర్యాలగూడ 3, నల్గొండలో 2 సెం.మీ., రాయలసీమలోని పెరుమాళ్లపల్లి, చిత్తూరు, సత్యవేడులో ఒక్కో సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.